ban lifted
-
డేవిడ్ వార్నర్‌పై నిషేధం ఎత్తివేత
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌పై ఉన్న జీవితకాల కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేశారు. 2018లో సాండ్ పేపర్ వివాదంలో (కేప్‌టౌన్ టెస్ట్‌లో) వార్నర్‌పై జీవితకాల కెప్టెన్సీ నిషేధం విధించబడింది. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్‌పై కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. సాండ్ పేపర్ వివాదంలో వార్నర్ ఏడాది పాటు ఆటకు కూడా దూరయ్యాడు. క్రికెట్ ఆస్ట్రేలియా తాజా నిర్ణయంతో వార్నర్ బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది. నిషేధం కారణంగా వార్నర్ ఆస్ట్రేలియా కెప్టెన్‌గా పని చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 37 ఏళ్ల వార్నర్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే జట్టుకు అవసరమైతే భారత్‌తో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తిరిగి బరిలోకి దిగుతానని ప్రకటించాడు.వార్నర్ ఆసీస్ తరఫున 112 టెస్ట్‌లు ఆడి 8786 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 37 అర్ద సెంచరీలు ఉన్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. -
భారత్‌పై ‘ఫిఫా’ నిషేధం ఎత్తివేత
భారత ఫుట్‌బాల్‌కు ఊరట లభించింది. భారత్‌పై విధించిన నిషే«ధాన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ఎత్తివేసింది. నిషేధాన్ని తొలగించాలని ‘ఫిఫా’ కౌన్సిల్ బ్యూరో శుక్రవారం నిర్ణయించింది. భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ కమిటీని రద్దు చేసి రోజూవారీ కార్యకలాపాలపై సమాఖ్య పరిపాలనా వర్గం పూర్తిగా పట్టు చేజిక్కించుకున్నట్లు తెలియడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ‘ఫిఫా’ ప్రకటించింది. భారత్‌లో పరిస్థితిని సమీక్షిస్తూ ఉంటామని, ఎన్నికలను సరైన రీతిలో నిర్వహించేందుకు సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. దీంతో అక్టోబర్ 11నుంచి భారత్‌లో జరగాల్సిన అండర్–17 మహిళల ప్రపంచ కప్‌ను యథావిధిగా నిర్వహించేందుకు అనుమతిచ్చింది. -
ఇక కొత్త పథకాల జోరు.. ముగిసిన మూడు నెలల నిషేధం
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాలు ఇక మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. కొత్త పథకాల ఆరంభంపై సెబీ విధించిన మూడు నెలల నిషేధం ముగిసిపోయింది. దీంతో అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఫండ్స్ సంస్థలు) కొత్త పథకాలను (ఎన్‌ఎఫ్‌వోలు) ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒక్క జూలైలోనే 28 పథకాలను కంపెనీలు ప్రారంభించాయి. ఈక్విటీ, డెట్, ఇండెక్స్, ఈటీఎఫ్‌ల విభాగాల్లో వీటిని తీసుకొచ్చాయి. ఇన్వెస్టర్ల నిధుల పూలింగ్ విషయంలో తాను తీసుకొచ్చిన నిబంధనలను జూలై 1 నాటికి అమలు చేయాలని ఆదేశిస్తూ.. అప్పటి వరకు కొత్త పథకాలు ప్రారంభిచొద్దని ఈ ఏడాది ఏప్రిల్‌లో సెబీ ఆదేశించింది. జూలై 1తో నిషేధం ముగిసిపోయింది. పెట్టుబడుల ఉపసంహరణ సమయంలో డ్యుయల్ అథెంటికేషన్, ఖాతా మూలాలను గుర్తించాలని కూడా సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు కొత్త నిబంధనలు తెచ్చింది. జూలైలో 28 ఎన్‌ఎఫ్‌వోలు జూలైలో 18 ఏఎంసీలు కలసి 28 కొత్త పథకాలను ప్రారంభించాయి. ఇందులో నాలుగు పథకాలు ముగిసిపోగా, 24 పథకాలు ఇంకా పెట్టుబడుల స్వీకరణలో ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్, బరోడా బీఎన్పీ పారిబాస్, కెనరా రొబెకో, డీఎస్పీ, మోతీలాల్ ఓస్వాల్, ఐడీఎఫ్సీ, మిరే అస్సెట్ నుంచి ఈ పథకాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ప్రారంభమైన పథకాల్లో చాలా వరకు సెబీ విధించిన మూడు నెలల నిషేధానికి ముందే అనుమతి పొందినవిగా ఆనంద్‌రాఠి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ హెడ్ అమర్ రాను తెలిపారు. ప్యాసివ్ విభాగంలో పథకాలు లేకపోతే వాటా కోల్పోతామన్న ఉద్దేశ్యంతో.. ఏఎంసీలు ప్యాసివ్ ఇండెక్స్ పథకాలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పారు. యాక్టివ్ నిర్వహణతో కూడిన ఈక్విటీ పథకాల్లో మంచి రాబడులు లేకపోవడంతో.. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కొంత పెట్టుబడులను ప్యాసివ్ పథకాలకు మళ్లిస్తున్నట్టు అమర్‌రాను వెల్లడించారు. ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నుంచి ఈటీఎఫ్‌లకు ఆసక్తి పెరిగినట్టు మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. 176 కొత్త పథకాలు.. 2021–22లో ఏఎంసీలు 176 కొత్త పథకాలను ఆవిష్కరించి, వీటి రూపంలో రూ.1.08 లక్షల కోట్లను ఇన్వెస్టర్ల నుంచి సమీకరించాయి. అంటే సగటున ఒక్కో నెలలో 15 పథకాలు ప్రారంభమయ్యాయి. 2020–21లో 84 కొత్త పథకాలు రాగా, అవి రూ.42,038 కోట్లను ఆకర్షించాయి. రానున్న రోజుల్లో మరిన్ని నూతన పథకాలు ఇన్వెస్టర్ల ముందుకు వస్తాయని, వీటిల్లో డెట్, ఈక్విటీ విభాగం నుంచి ప్యాసివ్ (ఇండెక్స్‌ల్లో) స్ట్రాటజీతో ఉంటాయని ఎపిస్లాన్ మనీ మార్ట్ ప్రొడక్ట్స్ హెడ్ నితిన్‌రావు చెప్పారు. -
ఇక స్వేచ్ఛగా ఊపిరి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టడంతో గత రెండేళ్లుగా అమల్లో ఉన్న కోవిడ్ నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కరోనా కట్టడికి విధించిన ఆంక్షల్ని ఎత్తివేస్తున్నట్టుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. కానీ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. రెండేళ్ల క్రితం కరోనా వైరస్ కలకలం సృష్టించినప్పుడు 2020 మార్చి 24న కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా కోవిడ్ నిబంధనల్ని తెచ్చింది. కరోనా కట్టడికి ఈ రెండేళ్లలో పలుమార్లు నిబంధనల్ని మార్చింది. గత ఏడు వారాలుగా దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య బాగా తగ్గిపోతూ ఉండడంతో మార్చి 31 నుంచి ఈ నిబంధనలన్నింటినీ ఎత్తివేస్తున్నట్టుగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకి లేఖ రాశారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 23,913గా ఉంది. రోజు వారీ పాజిటివిటీ రేటు 0.26 శాతానికి పడిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషితో 181.89 కోట్ల టీకా డోసుల్ని ఇచ్చారు. అందుకే ప్రస్తుతానికి విపత్తు నిర్వహణ చట్టం కింద అమల్లో ఉన్న కరోనా కట్టడి ఆంక్షల్ని ఎత్తేస్తున్నట్టు అజయ్ భల్లా ఆ లేఖలో వివరించారు. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ సూచించిన విధంగా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటివన్నీ అమల్లోనే ఉంటాయి. కరోనా వైరస్ ఎప్పుడు ఎలా రూపాంతరం చెందుతుందో తెలీని పరిస్థితి కాబట్టి ప్రభుత్వాలు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అజయ్ భల్లా ఆ లేఖలో హెచ్చరించారు. ఒకవేళ ఎక్కడైనా కేసులు పెరిగితే వెంటనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిబంధనలు అమల్లోకి తేవచ్చు. కేంద్ర హోంశాఖ చేసిన సూచనల్ని కూడా పాటించాల్సి ఉంటుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1778 కరోనా కేసులు నమోదయ్యాయి. -
భారత విమానాలపై కెనడా నిషేధం ఎత్తివేత
టొరంటో: నేరుగా భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు కెనడా ప్రకటించింది. ఏప్రిల్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో భారత్ నుంచి నేరుగా వచ్చే విమానాలపై కెనడా నిషేధం విధించింది. సెప్టెంబర్ 27వ తేదీ అర్ధరాత్రి నుంచి భారత్ నుంచి నేరుగా విమానాల రాకపోకలకు అనుమతిస్తున్నట్లు కెనడా ప్రభుత్వం ఆదివారం తెలిపింది. ప్రయాణానికి 18 గంటలకు ముందుగా ప్రయాణికులు ఢిల్లీ విమానాశ్రయంలోని అధీకృత ల్యాబ్ నుంచి చేయించుకున్న కోవిడ్–19 నెగెటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపింది. ఈ నిర్ణయంపై కెనడాలోని భారత్ హై కమిషనర్ అజయ్ బిసారియా హర్షం వ్యక్తం చేశారు. 27వ తేదీ నుంచి ఢిల్లీ–టొరంటో/వాంకోవర్‌ల మధ్య రోజువారీ సర్వీసులు మొదలవుతాయని వెల్లడించారు. వేరే దేశం మీదుగా కెనడాకు వెళ్లే భారత ప్రయాణికులు కూడా మూడో దేశంలో పొందిన కోవిడ్–19 నెగెటివ్ సర్టిఫికెట్‌ను ముందుగా చూపించాల్సి ఉంటుంది. -
క్రికెటర్ అంకిత్ చవాన్‌కు ఊరట.. నిషేధం ఎత్తివేత
ఢిల్లీ: 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌లో దోషిగా తేలి జీవితకాలం నిషేధం ఎదుర్కొంటున్న క్రికెటర్ అంకిత్ చవాన్‌కు ఊరట కలిగింది. ఈ ముంబై మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ పై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసింది. బీసీసీఐ బ్యాన్ ఎత్తివేయడంతో ఇకపై ప్రొఫెషనల్ క్రికెట్ ఆడేందుకు అంకిత్ చవాన్‌కు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడడంపై తాను పశ్చాత్తాపం చెందుతున్నానని.. అంకిత్ చవాన్ ముంబై క్రికెట్ అసోసియేషన్‌ను కోరగా.. వారి సలహా మేరకు బీసీసీఐకి తనకు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ మే నెలలో ఒక లేఖను రాశాడు. తాజాగా బీసీసీఐ అంకిత్ చవాన్‌పై నిషేధం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా అంకిత్ చవాన్ తన కెరీర్లో 7 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 15 లిస్ట్ ఏ మ్యాచ్‌లు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కాగా 2013 ఐపీఎల్ సీజన్లో శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాలు బూకీలతో సంప్రదింపులు జరిపి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు నిజమని తేలడంతో బీసీసీఐ వారిని జీవితకాలం క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. కాగా తాను నిర్దోషినంటూ శ్రీశాంత్ గతేడాది సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. దోషిగానే గుర్తించిన సుప్రీం.. జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్‌మన్ డీకే జైన్ 2019లో నిర్ణయం తీసుకున్నాడు. దాంతో గతేడా ఏడాది సెప్టెంబర్‌తో శ్రీశాంత్ శిక్షాకాలం పూర్తయింది. అనంతరం కేరళ తరపున శ్రీశాంత్ ముస్తాక్ అలీ ట్రోపీలో పాల్గొన్నాడు. చదవండి: 8 ఏళ్ల తర్వాత కూడా అదే తీరు PSL: ఆటగాళ్ల బూతు పురాణం.. వీడియో -
భారతీయ టెక్కీలకు భారీ ఊరట
వాషింగ్టన్: డాలర్ డ్రీమ్స్ కలలుకంటున్న భారతీయ టెక్కీలకు భారీ ఊరట లభించింది. హెచ్1బీ సహా విదేశీ వర్కర్స్ వీసాలపై నిషేధం విధిస్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వుల గడువు మార్చి 31తో ముగిసింది. అధ్యక్షుడు అధ్యక్షుడు బైడెన్ ఆ నిషేధాన్ని మళ్లీ పొడిగిస్తూ ఎలాంటి ఉత్వర్వులు జారీ చేయకపోవడంతో అమెరికాకు వెళ్లాలనుకునే వివిధ దేశాలకు చెందిన టెక్కీలు ఊపిరిపీల్చుకున్నారు. గత ఏడాది కరోనా సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకొని ప్రపంచ మార్కెట్లు మూతపడిన సమయంలో ట్రంప్ హెచ్–1బీ సహా వలసేతర వీసాలపై తాత్కాలిక నిషేధాన్ని విధించారు. తొలుత డిసెంబర్ 31వరకు నిషేధం విధించారు. ఆ తర్వాత ఆ నిషేధాన్ని మార్చి 31 వరకు పొడిగించారు. తాను అధికారంలోకి వస్తే వీసాలపై నిషేధాన్ని ఎత్తివేస్తానని బైడెన్ హామీ ఇచ్చారు. అమెరికాలో దీనిపై పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపించాయి. హెచ్1బీపై నిషేధం కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టమని, నిపుణులైన పనివారు దొరకరని కొందరు వాదిస్తే, తక్కువ వేతనాలకే విదేశీ ఉద్యోగులు దొరకడం వల్ల స్థానికులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. వీసాలపై నిషేధాన్ని కొనసాగించాలంటూ కొందరు రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు బైడెన్‌కు లేఖలు కూడా రాశారు. కరోనా సంక్షోభంతో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, దాదాపుగా కోటి మంది అమెరికన్లు ఉద్యోగాల్లేకుండా ఉన్నారని అందుకే హెచ్–1బీలపై నిషేధం పొడిగించాల్సిందేనంటూ మిసౌరీ సెనేటర్ జోష్ హాలీ ఆ లేఖలో పేర్కొన్నారు. -
షకీబుల్ హసన్‌కు ఊరట
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెట్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్‌కు నేటితో ఊరట దక్కనుంది. అతనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విధించిన నిషేధం గురువారంతో ముగియనుంది. దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. అతనితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకునేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు బంగ్లాదేశ్ టి20 కెప్టెన్ మహ్ముదుల్లా పేర్కొన్నాడు. ప్రస్తుతం 33 ఏళ్ల షకీబ్ తన కుటుంబంతో కలిసి అమెరికాలో ఉన్నాడు. బుకీల గురించి బోర్డుకు సరైన సమయంలో సమాచారం ఇవ్వని కారణంగా గతేడాది అక్టోబర్ 29న ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్ షకీబ్‌పై రెండేళ్ల నిషేధం విధించింది. రెండు సంవత్సరాలలో ఒక ఏడాది క్రికెట్ ఆడకుండా నిషేధం విధించగా... మరో ఏడాదిపాటు సస్పెన్షన్ అమలులో ఉంటుందని పేర్కొంది. నేటితో ఏడాది నిషేధం ముగియనుండటంతో దేశవాళీ టోర్నీలతో షకీబ్ మళ్లీ క్రికెట్ మొదలుపెట్టే చాన్స్ ఉంది. -
లాక్డౌన్ ఎత్తివేతకు పంచతంత్రం!
ఆరోగ్యం, ఆర్థికం.. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించాలి. ఇప్పుడు చాలా దేశాలు ఎదుర్కొంటోన్న అగ్ని పరీక్ష ఇది. లాక్డౌన్ ఎక్కువ కాలం కొనసాగించే పరిస్థితి ఏ దేశానికి లేదు మార్కెట్లు తెరవడానికి దక్షిణాఫ్రికా రూపొందించిన అయిదు అంచెల వ్యూహం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జోహన్నెస్‌బర్గ్/ న్యూఢిల్లీ: కోవిడ్–19ను నియంత్రించడంలో దక్షిణాఫ్రికా ఎవరూ ఊహించని విధంగా అద్భుతంగా రాణించింది. ఏప్రిల్ 25 నాటికి 4,300 కేసులు నమోదైతే, 85 మంది ప్రాణాలు కోల్పోయారు. మార్చి 26 నుంచి దక్షిణాఫ్రికాలో లాక్డౌన్ అమల్లో ఉంది. ప్రజల ప్రాణాల్ని కాపాడుకుంటూనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆ దేశం రూపొందించిన రిస్క్ ఎడ్జెస్టెడ్ వ్యూహం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. మే 1 నుంచి దశలవారీగా లాక్డౌన్ ఎత్తేయాలని నిర్ణయించిన దక్షిణాఫ్రికా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్యూబా నుంచి వైద్యుల్ని రప్పించింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రావిన్స్‌లలో క్యూబా వైద్యుల్ని మోహరించాక ఈ వ్యూహాన్ని అమలు చేయనుంది. మే 3 తర్వాత మన దేశంలో కూడా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలనే డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. ‘భారత్ మాదిరిగానే దక్షిణాఫ్రికా కూడా కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొంది. లాక్‌డౌన్‌ను దశల వారీగా ఎత్తివేయడానికి ఆరోగ్యం, ఆర్థికం మధ్య సమతుల్యత సాధించడానికి ఆ దేశం రచించిన వ్యూహం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్రం కూడా ఈ వ్యూహాన్ని అమలు చేయాలి’ అని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కె.శ్రీకాంత్ రెడ్డి అంటున్నారు. ఆంక్షల్ని సడలించడానికి వివిధ ప్రణాళికలను రచిస్తున్న కేంద్ర ప్రభుత్వం వివిధ దేశాలు అనుసరించిన విధానాల్ని కూడా పరిశీలిస్తోందని కోవిడ్‌ను ఎదుర్కోవడంలో కేంద్రప్రభుత్వాన్ని దిశానిర్దేశం చేయడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు కూడా అయిన శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. అందులో దక్షిణాఫ్రికా వ్యూహం అత్యుత్తమంగా ఉందని కేంద్ర అధికార యంత్రాంగం భావిస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఆ వ్యూహం ఇదే.. కరోనా వైరస్ వ్యాప్తి, ఆయా ప్రాంతాల్లో దానిని ఎదుర్కోవడానికి ఆరోగ్య రంగంలో ఉన్న సన్నద్ధత ఆధారంగా దేశాన్ని అయిదు జోన్లుగా విభజించారు. ఒక్కో జోన్లో ఒక్కో విధమైన ఆంక్షలు ఉంటాయి. అయితే సినిమా థియేటర్లు, హోటళ్లు, పర్యాటకం, క్రీడల నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలపై పూర్తిస్థాయి నిషేధం కొనసాగుతుంది. బయటకు వచ్చినప్పుడు మాస్కులు తప్పనిసరి. భౌతిక దూరం కచ్చితంగా పాటించాలి. 60 ఏళ్ల పైబడిన వారు, శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారికి ఇంటి నుంచి పని చేసుకోవడానికి అనుమతినిస్తారు. 1. వైరస్ తక్కువ వ్యాప్తి, పూర్తిస్థాయి సన్నద్ధత ► అన్ని రంగాలు పూర్తి స్థాయిలో పనులు ప్రారంభిస్తాయి. ► పూర్తి స్థాయిలో శానిటైజ్ చేస్తూ అన్ని రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి ► ప్రావిన్స్‌ల మధ్య రవాణాకు అనుమతిస్తారు, అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతాయి. 2. మధ్యస్థంగా వైరస్ వ్యాప్తి, పూర్తి స్థాయి సన్నద్ధత ► నిర్మాణం, తయారీ, మైనింగ్, రిటైల్, పారిశుద్ధ్యం, ఐటీ, ప్రభుత్వ రంగాలన్నింటికీ అనుమతి ► విమాన ప్రయాణాలు, కారు ప్రయాణాలు పునరుద్ధరణ ► 1, 2 జోన్లలో ప్రావిన్స్‌ల మధ్య ప్రయాణాలకు అనుమతి 3. వైరస్ వ్యాప్తి మధ్యస్థం, సన్నద్ధత కూడా మధ్యస్థం ► నిత్యావసరాలు, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్, విద్యారంగం, రిటైల్‌తో పాటు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, టేక్ ఎవే రెస్టారెంట్లు, ఇ–కామర్స్ కార్యకలాపాలకు మాత్రమే అనుమతి ► పరిమితమైన ప్రయాణికులతో రవాణా సేవలు ► ప్రావిన్స్‌ల మధ్య ప్రయాణాలపై నిషేధం 4. మధ్యస్థం నుంచి వైరస్ తీవ్రత ఎక్కువ, ఓ మోస్తరు సన్నద్ధత ► నిత్యావసరాలు, వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలు, కాగితం, మైనింగ్ రంగాలకు, టెలికం, ఐటీ రంగాలకు అనుమతి ► భౌతిక దూరం పాటించేలా అతి తక్కువ మందితో ప్రయాణాలకు అనుమతి ► ప్రావిన్స్‌ల మధ్య ప్రయాణాలపై నిషేధం 5 వైరస్ వ్యాప్తి అధికం, తక్కువ స్థాయి సన్నద్దత ► కేవలం నిత్యావసరాలకు మాత్రమే అనుమతి ► బస్సులు, ట్యాక్సీలు పరిమిత వేళల్లో తక్కువ మందితో తిరగడానికి అనుమతి ► ప్రావిన్స్‌ల మధ్య ప్రయాణాలు ఉండవు -
కోవిడ్ మృతులు 2 లక్షలు
వాషింగ్టన్: ప్రపంచ దేశాల్లో కోవిడ్–19 మరణమృదంగం ఇంకా కొనసాగుతూనే ఉంది. వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 2 లక్షలు దాటేసింది. అందులో నాలుగో వంతు కంటే ఎక్కువ మంది అమెరికాలో మరణించగా మూడో వంతు కేసులు అక్కడే నమోదయ్యాయి. అమెరికాలో కేసులు 9 లక్షలు దాటితే, మృతుల సంఖ్య 52 వేలు దాటేసింది. ఇక యూరప్ లక్షా 20 వేలకు పైగా మరణాలతో మొదటి స్థానంలో ఉంది. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్లో ఎక్కువగా మరణాలు నమోదయ్యాయి. అమెరికాలో ఆంక్షల సడలింపు ఆరోగ్యం, ఆర్థికం ఈ రెండింటి మధ్య సమతుల్యం పాటిస్తూ ప్రపంచ దేశాలు లాక్డౌన్ ఆంక్షల్ని సడలిస్తున్నాయి. కోవిడ్‌తో అతలాకుతలమైన అమెరికా నెమ్మది నెమ్మదిగా ఆంక్షల్ని ఎత్తివేయడానికి సన్నాహాలు చేస్తోంది. జార్జియా, ఒక్లహోమా, అలాస్కా రాష్ట్రాల్లో ఆంక్షల్ని సడలించారు. అగ్రరాజ్యంలో కోవిడ్ స్వైరవిహారం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆంక్షల్ని ఎత్తివేయడం సరికాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలంటే వీలైనంత త్వరగా అందరూ పనుల్లోకి రావాలని ట్రంప్ సర్కార్ అంటోంది. జార్జియా, ఒక్లహోమా సెలూన్లు, స్పాలకి అనుమతులిస్తే, అలాస్కా రాష్ట్రం రెస్టారెంట్లు, రిటైల్ షాపులు తెరవడానికి అనుమతించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రువారం వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని, భౌతిక దూరాన్ని పాటించాలని స్పష్టం చేశారు. 18 రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని అన్నారు. కనిపించని రంజాన్ శోభ రంజాన్ మాసం మొదలైనా ఎక్కడా సందడి కనిపించడం లేదు. కోవిడ్ భయాందోళనల నేపథ్యంలో ముస్లిం దేశాలన్నీ రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులపై నిషేధం విధించాయి. ఎవరింట్లో వారే ప్రార్థనలు చేసుకోవాలని సూచించాయి. లక్షలాది మంది ముస్లిం సోదరులతో నిండిపోయే సౌదీ అరేబియాలో మక్కా మసీదు ఎవరూ లేక బోసిపోతోంది. పవిత్రమైన మక్కాలో జన సందోహం లేకుండా చూస్తే చెప్పలేని బాధ కలుగుతోందని మతాధికారి అలీముల్లా వ్యాఖ్యానించారు. ► స్పెయిన్ ప్రజలకి ఆదివారం నుంచి సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తోంది. కోవిడ్ నియంత్రణలోకి రావడంతో పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఎత్తేస్తోంది. చిన్నారుల్ని స్కూళ్లకి పంపడంపై తల్లిదండ్రుల ఇష్టానికే విడిచిపెట్టింది. ► డెన్మార్క్ కళాశాలలను మాత్రమే తెరిచింది. ► ఫ్రాన్స్ మే 11 నుంచి లాక్డౌన్ సంపూర్ణంగా ఎత్తేయాలని నిర్ణయించింది. ► బెల్జియం మే 3 నుంచి రిటైల్ దుకాణాల్ని ప్రారంభించడానికి అనుమతినిచ్చింది ► బ్రిటన్ మాత్రం ఆంక్షల్ని కొనసాగిస్తోంది. ► శ్రీలంక సోమవారం నుంచి లాక్‌డౌన్‌ను ఎత్తివేయనుంది. -
దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేయాలి
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేయాలని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ప్రతిపాదించింది. ఎకానమీని మళ్లీ పట్టాలెక్కించే దిశగా.. ముందుగా 22–39 ఏళ్ల మధ్య ఆరోగ్యంగా ఉన్నవారు విధులకు హాజరయ్యేలా అనుమతించాలని సూచించింది. అలాగే, చిన్న.. మధ్య స్థాయి సంస్థలకు తోడ్పాటునివ్వాలని, వైరస్ పరీక్షా కేంద్రాలను మరింతగా పెంచాలని పేర్కొంది. లాక్డౌన్ నుంచి బైటపడాల్సిన వ్యూహానికి సంబంధించి రూపొందించిన నోట్లో ఫిక్కీ ఈ అంశాలు ప్రస్తావించింది. అటు లాక్డౌన్ ఉపసంహరణపై కర్ణాటక ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ కూడా దాదాపు ఇటువంటి సూచనలే చేసింది. దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేయాలని సూచించింది. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మరో 2 వారాలు లాక్డౌన్ కొనసాగించాలని పేర్కొంది. సంఘటితరంగ పరిశ్రమలను 50% సామర్థ్యంతో పనిచేయించి, వారం మార్చి వారం ఉపా«ధి కల్పిస్తే కార్మికులందరికీ పూర్తి వేతనాలు చెల్లించవచ్చని తెలిపింది. ఏప్రిల్ 30 దాకా దేశీవిదేశీ విమానాలు, రైళ్ళు, ఇంటర్సిటీ బస్సులు, మెట్రోరైళ్ళు నడపకూడదని, 50% సామర్థ్యంతో ప్రజారవాణా కోసం బస్సులను అనుమతించవచ్చని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కమిటీ సూచించింది. -
వూహాన్లో లాక్డౌన్ ఎత్తివేత
బీజింగ్/వూహాన్: హమ్మయ్యా.. ఎట్టకేలకు కరోనా వైరస్ విషయంలో ఒక శుభవార్త వినిపించింది. వైరస్ పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలోని వూహాన్ నగరంలో 73 రోజుల లాక్‌డౌన్‌కు ప్రభుత్వం బుధవారం ముగింపు పలికింది. చైనా మొత్తమ్మీద మంగళవారం 62 కొత్త కేసులు నమోదయ్యాయని, షాంఘై, హుబే ప్రావిన్సుల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారని చైనా ఆరోగ్య కమిషన్ అధికారులు బుధవారం తెలిపారు. కొత్త కేసుల్లో 59 మంది మంది విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు కాగా, మిగిలిన మూడు కేసులు స్థానికమైనవని చెప్పారు. దీంతో విదేశాల నుంచి తిరిగి వచ్చిన కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 1,042కు చేరుకుంది. అంతేకాకుండావైరస్ సోకినప్పటికీ లక్షణాలేవీ కనిపించని 1,095 మందిపై వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపింది. చైనాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ సుమాఉ 3,333 మంది కోవిడ్‌కు బలైనట్లు గణాంకాలు చెబుతున్నాయి మొత్తం 81,802 మంది కోవిడ్ బారిన పడగా, 77,279 మంది చికిత్స తరువాత జబ్బు నయమైన ఇళ్లకు చేరారు. వూహాన్ బయటకు లక్షల మంది.. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వూహాన్లో జనవరి 23వ తేదీ నుంచి లాక్డౌన్ ప్రకటించారు. తాజాగా బుధవారం లాక్‌డౌన్‌పై ఉన్న అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయడంతో వూహాన్ ప్రజలు బయట ప్రాంతాలకు వెళ్లడం మొదలుపెట్టారు. దాదాపు 1.10 కోట్ల మంది వూహాన్ నగరం నుంచి బయటకు వెళ్లినట్లు అంచనా. ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు ఉన్న వారందరూ స్వేచ్ఛగా తిరిగే అవకాశం లభించడంతో ఎక్స్‌ప్రెస్‌వేలపై టోల్‌గేట్లపై కిలోమీటర్ల పొడవైన క్యూలు కనిపించాయి. కొన్ని ఫ్యాక్టరీలు, కార్యాలయాలు పనిచేయడం మొదలుపెట్టడంతో రోడ్లపై తిరుగుతున్న వాహనాలు కనీసం నాలుగు లక్షల వరకూ ఎక్కువ అయ్యాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. వూఛాంగ్ రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయమే సుమారు 442 మంది గువాంగ్డాంగ్ ప్రావిన్సుకు రైల్లో ప్రయాణం కాగా, రోజు ముగిసేసరికి 55 వేల మంది రైల్వే సర్వీసులు ఉపయోగించుకుంటారన్న అంచనాలు వెలువడ్డాయి. ఈ అంకెలు బుధవారం రాత్రి 11 గంటలకు.. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు: 14,85,535 మరణాలు : 87,291 కోలుకున్న వారు : 3,18,875 -
ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
న్యూఢిల్లీ: దాదాపు ఆరు నెలలుగా ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రబీ సీజన్ నేపథ్యంలో ఉల్లి ధర పడిపోయే అవకాశముంది. దీంతో రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఉల్లి ధరను స్థిరీకరించినప్పటి నుంచి ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది మార్చిలో 40 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉల్లి పండే అవకాశముంది’ అని ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ట్వీట్లో పేర్కొన్నారు. -
టిక్‌టాక్ యాప్‌పై నిషేధం ఎత్తివేత
సాక్షి, చెన్నై : టిక్‌టాక్ యూజర్లకు గుడ్ న్యూస్. కొన్ని పరిమితులతో టిక్‌టాక్ మొబైల్ యాప్‌పై నిషేధాన్ని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ బుధవారం ఎత్తివేసింది. యువత, చిన్నారుల్లో ఆదరణ పొందిన టిక్‌టాక్ మొబైల్ యాప్‌తో అశ్లీల కంటెంట్ వ్యాప్తి అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ నెల 3వ తేదీన కోర్టు యాప్‌ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. చైనాకు చెందిన ఈ వీడియో షేరింగ్ మొబైల్ యాప్ డౌన్లోడ్పై నిషేధం విధించాలని ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ ఎన్ కురుబకరన్, జస్టిస్ ఎస్ ఎస్ సుందర్‌లతో కూడిన మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. టిక్‌టాక్ అశ్లీలతను పెంపొందించడమే కాకుండా.. ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందంటూ మదురైకి చెందిన సీనియర్ న్యాయవాది, సామాజిక కార్యకర్త ముత్తుకుమార్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. టిక్‌టాక్‌పై నిషేధం విధించాలని కేంద్రానికి సూచించింది. ఏకపక్షంగా వ్యవహరిస్తూ మద్రాస్ హైకోర్టు విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ టిక్‌టాక్ సంస్థ సుప్రీం కోర్టుకు వెళ్లింది. దీనిపై ఇరువాదనలు విన్న సుప్రీంకోర్టు టిక్‌టాక్ యాప్‌పై మాద్రాస్ హైకోర్టు విధించిన నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసిన విషయం తెలిసిందే. కాగా చైనాలో ఈ యాప్ 2016లో ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది వినియోగదారులతో 75 భాషల్లో ఈ అప్లికేషన్ టాప్ సోషల్ యాప్‌లలో ఒకటిగా ట్రెండ్ అవుతోంది. ఎలాంటి ప్రత్యేకమైన సెటప్ లేకుండా ఫోన్‌ని చేతిలో పట్టుకొని 15 సెకండ్ల వ్యవధితో రెడీమేడ్‌గా ఉండే డైలాగ్స్, పాటలకు తగ్గట్లు పెదాలను సింక్ చేస్తూ చాలా వేగంగా షార్ట్ వీడియోలు తీయగలగడం దీని ప్రత్యేకత. టిక్‌టాక్‌ని ఎంతమంది వారి ప్రతిభను ప్రదర్శించడానికి ఉపయోగిస్తున్నారో, అంతకుమించి దుర్వినియోగం కూడా చేస్తున్నారు. కొందరు అడల్ట్ కంటెంట్‌ని కూడా అప్లోడ్ చేస్తున్నారు. అశ్లీల దృశ్యాలతో కొందరు యువతీ, యువకులు వీడియోలు తీయడం, మరికొంతమంది వికృత చేష్టలు, పిచ్చి పనులుచేస్తూ ఆ వీడియోలను కూడా పోస్ట్ చేయడంతో వివాదం కూడా అవుతోంది. ఇటీవల చెన్నై ముగప్పేర్ ప్రాంతానికి చెందిన ఒక బాలిక స్థానికంగా ఓ సంస్థలో నటనలో శిక్షణ పొందుతోంది. టిక్‌టాక్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి 15 ఏళ్ల బాలికకు సినిమా చాన్స్ ఇప్పిస్తానని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే రాష్ట్రం సేలం జిల్లా కలెక్టర్ రోహిణి ఫొటోలను పెట్టి ఒక టిక్ టాక్ వీడియో తయారు చేసి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దానిని వైరల్ చేశారు. సినిమా పాటలతో లింక్ చేసి టిక్‌టాక్ యాప్‌లో పోస్ట్ చేశారు. వీటిని గమనించిన కలెక్టర్ దిగ్భ్రాంతి చెంది, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మహారాష్ట్రలో మళ్లీ డాన్స్ బార్లు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో డాన్స్ బార్లు తిరిగి తెరుచుకునేందుకు మార్గం సుగమమైంది. వాటి పని విధానం, లైసెన్సుల మంజూరుపై కఠిన ఆంక్షలు విధిస్తూ 2016లో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని పలు నిబంధనల్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. కొన్ని షరతులతో డాన్స్ బార్లు తెరుచుకునేందుకు గురువారం అనుమతిచ్చింది. డాన్స్ బార్లపై నియంత్రణలు ఉండొచ్చు కానీ పూర్తి నిషేధం అమలుచేయొద్దని జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. విద్యా సంస్థలు, ప్రార్థనా స్థలాలకు కిలోమీటరు దూరంలోపు డాన్స్ బార్లు ఏర్పాటుచేయొద్దన్న నిబంధనను కోర్టు తోసిపుచ్చింది. ముంబై లాంటి మహానగరాల్లో అనువైన చోట్ల స్థలం దొరకడం కష్టమేనని, కిలోమీటర్ నిబంధనను అమలుచేయలేమని స్పష్టతనిచ్చింది. పార్టీకి వచ్చిన వారు డాన్సర్లకు టిప్పులు ఇచ్చేందుకు అంగీకరించిన కోర్టు..వారిపై కరెన్సీ నోట్లు చల్లేందుకు నిరాకరించింది. డాన్స్ బార్లలో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు అమర్చాలన్న నిబంధనను కొట్టివేస్తూ..అలాంటి ఏర్పాట్ల వల్ల డాన్సర్ల వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుందని పేర్కొంది. సంపూర్ణ నిషేధం వద్దు.. ‘2005 నుంచి మహారాష్ట్రలో ఒక్క డాన్స్ బార్‌కు కూడా లైసెన్స్ ఇవ్వలేదు. అలా జరగకూడదు. ఈ విషయంలో నియంత్రణలు ఉండొచ్చు కానీ సంపూర్ణ నిషేధం సరికాదు’ అని ధర్మాసనం పేర్కొంది. నైతిక ప్రమాణాలు కాలంతో పాటే మారతాయని, నైతికత పేరిట ప్రభుత్వం సామాజిక నియంత్రణ చెలాయించకూడదని సూచించింది. ఇకపై డాన్స్ బార్ల కోసం వచ్చే దరఖాస్తులను ప్రభుత్వం ఓపెన్ మైండ్‌తో అంగీకరిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొంది. 2016 నాటి చట్టాన్ని సవాలుచేస్తూ హోటల్, రెస్టారెంట్ యజమానులు దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టును తన తీర్పును గతేడాది ఆగస్టులోనే రిజర్వు చేసింది. గతంలో సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల్ని బేఖాతరు చేసేందుకే మహారాష్ట్ర ప్రభుత్వం..డాన్స్ బార్ల లైసెన్సింగ్‌కు కఠిన ఆంక్షలు విధిస్తూ చట్టం తెచ్చిందని పిటిషన్‌దారులు ఆరోపించారు. ప్రభుత్వ వాదన బలహీనం: ఎన్సీపీ బార్ యాజమాన్యాల అసోసియేషన్‌తో మహారాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కయిందని ప్రతిపక్ష నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఆరోపించింది. అందుకే కేసులో ప్రభుత్వ వాదన చాలా బలహీనంగా ఉందని దుయ్యబట్టింది. రాష్ట్రంలో డాన్స్ బార్లు తిరిగి తెరుచుకోకుండా సీఎం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బార్ల నియంత్రణ చట్టాన్ని లోపరహితంగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం విఫలమైందని శివసేన మండిపడింది. సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర హోం మంత్రి రంజిత్ పాటిల్ స్పందిస్తూ..డాన్స్ బార్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరగనీయమని హెచ్చరించారు. షరతులతో డాన్స్ బార్లు తిరిగి తెరుచుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతివ్వడం పట్ల సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. బార్ డాన్సర్ల హక్కుల కోసం పోరాడుతున్న భారతీయ బార్ గరŠల్స్ యూనియన్ అధ్యక్షురాలు వర్ష కాలె..సుప్రీంకోర్టు తీర్పును గొప్ప విజయంగా అభివర్ణించారు. తాజా తీర్పు ప్రగతిశీలమైనదని మాజీ బ్యూరోక్రాట్, హక్కుల కార్యకర్త అభా సింగ్ అన్నారు. కోర్టు మొదటి నుంచీ నృత్యాన్ని ఒక వృత్తిగానే పరిగణించిందని, కానీ రాష్ట్ర సర్కారు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో ఇలాంటి మహిళల జీవించే హక్కుకు భంగం వాటిల్లిందన్నారు. తీర్పు ముఖ్యాంశాలు ► డాన్సర్లకు టిప్పులు ఇవ్వొచ్చు కానీ నోట్లు వెదజల్లరాదు ► బార్ రూమ్, డాన్స్ ఫ్లోర్ మధ్య అడ్డుతెర తప్పనిసరి కాదు ► డాన్స్ బార్లలో సీసీటీవీలు అమర్చొద్దు ► సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11.30 గంటల మధ్యే పనిచేయాలి ► విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలకు కిలోమీటరు దూరంలో బార్ డాన్స్‌లు ఉండొద్దన్న నిబంధన అమలు అసాధ్యం ► చివరి పదేళ్లుగా నేరచరిత్ర లేని వారికే లైసెన్స్ మంజూరు చేయాలని పేర్కొనడం నిర్దిష్టంగా లేదు. అది అధికారుల విచక్షణకు వదిలేసినట్లుగా ఉంది. నైట్ ‘లైఫ్’... డాన్స్ బార్స్! మెట్రో నైట్ లైఫ్‌లో డాన్స్ బార్స్ విడదీయలేని ఓ భాగం. ముంబై మహానగర సంస్కృతిలోకి చేరిన ఈ డాన్స్ బార్లు, వాటిలో చిందులు వేసే డాన్సర్ల చుట్టూ ఎన్నో విమర్శలు, మరెన్నో విషాదాలు ఉన్నాయి. మహారాష్ట్రలో 1980 తొలినాళ్లలో ముంబైకి 75 కి.మీ. దూరంలో ఉన్న ఖలాల్పూర్లో బేవాచ్ అన్న పేరుతో మొట్టమొదటిసారిగా ఈ డాన్స్బార్ ప్రారంభమైంది. ఇక్కడ డాన్స్ చేసేందుకు 500–600 మంది డాన్సర్లను ముంబై, థానేల నుంచి బస్సుల్లో తీసుకొని వచ్చేవారు. రాత్రంతా తాగుతూ, అమ్మాయిలు డ్యాన్స్‌లు చేస్తుంటే వారిపై కరెన్సీ నోట్లు విసురుతూ ఎంజాయ్ చేసే ఈ కల్చర్ కార్చిచ్చులా మహారాష్ట్ర అంతటా వ్యాపించింది. కొన్ని బార్లను అధికారికంగా నిర్వహిస్తే, అనధికారికంగా నిర్వహించే వాటికి లెక్కే లేదు. ఈ బార్లలో చిందులేసే డాన్సర్లు కొందరు కోటికి పడగలెత్తారు. మరికొందరు గౌరవప్రద జీవితాన్ని కూడా నోచుకోక పూట గడవడానికి ఇబ్బంది పడ్డవారూ ఉన్నారు. తరన్నూమ్ అనే డాన్సర్ ఎంత సంపాదించారంటే, ఆదాయ పన్ను శాఖ ఆమె ఇంటిపై దాడులు కూడా చేసింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మాధుర్ బండార్కర్ టబూ ప్రధాన పాత్రధారిగా చాందినీబార్ అనే సినిమాను బార్ డాన్సర్ ఇతివృత్తంతో రూపొందించారు. టబూ ఈ చిత్రానికిగాను జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని సైతం కైవసం చేసుకున్నారు. 14 ఏళ్లుగా వివాదం డాన్స్ బార్లతో యువత నాశనమవుతున్నారని, ఆ బార్ల మాటున చీకటి వ్యాపారం జరుగుతోందని, అమ్మాయిలు బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి వెళ్తున్నారనే∙కారణాలతో 2005లో డాన్స్ బార్లను మహారాష్ట్ర సర్కారు నిషేధించింది. దీంతో కొన్ని వేలమంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. డాన్స్ బార్ల యజమానులు, డాన్స్ గర్ల్స్ కోర్టుకెక్కారు. 2006లో బొంబాయి హైకోర్టు ఆ నిషేధాన్ని ఎత్తేసింది. అప్పట్లో సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిషేధాన్ని కొనసాగించింది. 2013లో డాన్స్ బార్లపై నిషేధాన్ని కొట్టేసింది. దాంతో, 2014 జూన్‌లో తిరిగి మహారాష్ట్ర ప్రభుత్వం డాన్స్ బార్లపై కొన్ని ఆంక్షలు విధిస్తూ చట్టానికి సవరణలు చేసింది. దానిపై బార్ల యజమానులు, డాన్స్ గర్ల్స్ మళ్లీ కోర్టుకు ఎక్కడంతో సుప్రీంకోర్టు బార్ల నిషేధంపై 2015, అక్టోబర్ 15న స్టే విధించింది. ఇప్పుడు ఆ ఆంక్షలలో కొన్నింటిని సమర్థిస్తూ, మరికొన్నింటిని వ్యతిరేకిస్తూ తీర్పు చెప్పింది. -
సౌదీ మహిళకు స్టీరింగ్
రియాద్: సౌదీ అరేబియాలో మహిళలు ఆదివారం వాహనాలతో రోడ్లెక్కారు. కార్లతో రోడ్లపై సందడి చేస్తూ, కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. సౌదీలో దశాబ్దాలుగా మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని ఆ దేశ యువరాజు బిన్ సల్మాన్ ఇటీవల ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులు 2018, జూన్ 24 నుంచి అమల్లోకి వస్తాయని అప్పట్లో పేర్కొన్నారు. మహిళల డ్రైవింగ్‌పై నిషేధాన్ని ఎత్తివేయడంతో ఆదివారం తెల్లవారుజామున మహిళలు కార్లతో రోడ్లపైకి చేరి సంబరాలు చేసుకున్నారు. తొలిసారి డ్రైవింగ్‌కు బయలుదేరినవారికి కొందరు మహిళలు పూలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. చాలా మంది మహిళలు తమ తొలి కారు డ్రైవింగ్ మధుర క్షణాలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తాము కుటుంబ సభ్యులను కారులో కాఫీ షాప్‌కు, ఐస్‌క్రీమ్‌కు తీసుకెళ్తామని వెల్లడించారు. తండ్రి, సోదరులు, ప్రైవేటు పురుష డ్రైవర్ల అవసరం లేకుండా తొలిసారి కారును నడపడంపై మహిళా యాంకర్, రచయిత సమర్ అల్మోగ్రెన్ స్పందిస్తూ.. ‘నాకు పక్షి అంత స్వేచ్ఛ లభించినట్లు అనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. సౌదీ యువరాజు, కోటీశ్వరుడు అల్వలీద్ బిన్ తలాల్ ‘మహిళలకు ఇది గొప్ప విజయం. ఎట్టకేలకు మహిళలకు స్వేచ్ఛ లభించింది’ అని అన్నారు. తన కుమార్తె ఎస్యూవీ కారును డ్రైవింగ్ చేస్తుండగా, అదే కారులో ఆయన మనుమరాళ్లతో కలసి సంబరాలు చేసుకున్న వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ విషయమై ఓ నిర్మాణ సంస్థ హెచ్ఆర్ మేనేజర్ హలా మాట్లాడుతూ..‘డ్రైవింగ్ అనుమతి లేకపోవడంతో కంపెనీల్లో పనిచేసే మహిళలకు చాలా కష్టసాధ్యంగా ఉండేది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడు మహిళలందరూ స్వేచ్ఛగా వాహనాలు నడుపుకుంటూ విధులకు హాజరయ్యే వెసులుబాటు ఏర్పడింది. త్వరలోనే మేనేజర్ స్థాయి ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగనుంది’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 12 ఏళ్లలో రూ.6.1 లక్షల కోట్లు మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఎత్తివేయడం ద్వారా సౌదీ అరేబియా ఆర్థికంగా పురోగమించనుందా? కొత్త ఉద్యోగాల సృష్టి జరగడంతో పాటు మహిళల జీవనప్రమాణాలు మెరుగు కానున్నాయా? అంటే నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. డ్రైవింగ్‌కు మహిళల్ని అనుమతించడంపై గల్ఫ్ టాలెంట్ అనే ఆన్లైన్ రిక్రూట్మెంట్ సంస్థ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ అనుమతి తర్వాత డ్రైవింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 82 శాతం మంది మహిళలు తెలిపారు. తాజా నిర్ణయంతో ఇన్నాళ్లు పురుషులు ఆధిపత్యం చెలాయిస్తున్న ఉన్నతస్థాయి ఉద్యోగాలకు తాము దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడిందని పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. యువరాజు సల్మాన్ నిర్ణయంతో మరో 12 ఏళ్లలో సౌదీ ఆర్థిక వ్యవస్థకు రూ.6.1 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూరనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మహిళా సాధికారతే లక్ష్యం మహిళలకు సాధికారత కల్పించడంలో భాగంగా 2030 నాటికి మొత్తం ఉద్యోగుల్లో 22 నుంచి 30 శాతం మహిళలు ఉండాలని సౌదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం చేపట్టిన సంస్కరణలో భాగంగా తొలుత మహిళల డ్రైవింగ్‌పై నిషేధాన్ని తొలగించింది. దీనిద్వారా వాళ్లు మంచి ఉద్యోగాలు, ఆకర్షణీయమైన జీతం పొందేందుకు వీలవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. తాజా నిర్ణయంతో మహిళలు దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకునే వెలుసుబాటు లభించింది. మహిళల డ్రైవింగ్‌పై ప్రభుత్వం నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో మరింత మంది మహిళా ఉద్యోగుల్ని తీసుకునేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో పురుషులతో సమానంగా మహిళలు కూడా ఆకర్షణీయమైన వేతనాలకు అందుకోనున్నారు. కార్ల మార్కెట్ కూడా గణనీయంగా అభివృద్ధి చెందనుంది. 2020కి 30 లక్షల మహిళలు డ్రైవింగ్ చేస్తారని అంచనా. -
ఐఐటీ బాంబేలో నాన్‌వెజ్‌పై నిషేధం తొలగింపు
సాక్షి, ముంబయి : విద్యార్ధులు, ఫ్యాకల్టీల నుంచి తీవ్ర నిరసన ఎదురవడంతో క్యాంపస్‌లోని కేఫ్‌లో మాంసాహార వంటకాలపై నిషేదాన్ని ఐఐటీ బాంబే ఉపసంహరించింది. నాన్ వెజ్ ఐటెమ్స్ విక్రయంపై ఎలాంటి నియంత్రణలు లేవని..క్యాంపస్‌లోని సివిల్ కేఫ్‌లో తాజా ఆహారం అందుబాటులో ఉండాలని, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే తొలుత ఈ ఉత్తర్వులు జారీ చేశామని ఐఐటీ బాంబే ఓ ప్రకటనలో పేర్కొంది. ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ప్రాధాన్యత, వివక్ష చూపడం సంస్థ చేయబోదని స్పష్టం చేసింది. మరోవైపు కేవలం నాన్ వెజ్ వంటకాలనే నిషేధించడం పట్ల పలువురు విద్యార్దులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవే కారణాలపై శాఖాహార వంటకాలను ఎందుకు నిషేదించలేదని వారు నిలదీశారు. ఇక క్యాంపస్‌లో నాన్‌వెజ్ ఐటెమ్స్‌కు పేరొందిన సివిల్ కేఫ్‌లో నిషేధం ఎత్తివేసిన క్రమంలో మాంసాహార వంటకాలు తిరిగి అందుబాటులోకి వస్తాయని విద్యార్థులు పేర్కొన్నారు. జనవరి 20న క్యాంటిన్ కమిటీ సంబంధిత కేఫ్ కాంట్రాక్టర్‌కు నాన్ వెజ్ ఐటెమ్‌లు అందించరాదని కోరుతూ నోటీసులు ఇచ్చింది. -
సౌదీలో సినిమాలపై నిషేధం ఎత్తివేత
రియాద్: సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ సామాజిక సంస్కరణలను కొనసాగిస్తున్నారు. దేశంలో నాలుగు దశాబ్దాల కిందట సినిమా ప్రదర్శనలపై విధించిన నిషేధాన్ని సోమవారం ఎత్తివేశారు. దీంతో చలన చిత్రాలకు అనుమతుల మంజూరు తక్షణం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘గత 35 ఏళ్లుగా ఉన్న నిషేధం తొలగడంతో తొలిసారిగా 2018లో వాణిజ్య సినిమాల ప్రదర్శన ప్రారంభం కానుంది. దేశ సాంస్కృతిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఇది మేలిమలుపు కానుంది’ అని సౌదీ సాంస్కృతిక, సమాచార శాఖ మంత్రి అవ్వాద్ అలవ్వాద్ చెప్పారు. దీనిపై సౌదీ చలన చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్న సినీ పరిశ్రమకు సర్కారు నిర్ణయం మరింత ఊపునిస్తుందని అభిప్రాయపడింది. సినిమాలు నైతిక విలువలను మంటగలుపుతాయని, సాంస్కృతిక, మత విశ్వాసాలకు విఘాతం కలిగిస్తాయన్న ఛాందసవాదుల ఆందోళనల నేపథ్యంలో 1980ల్లో వీటిపై నిషేధం విధించారు. -
పప్పుధాన్యాల ఎగుమతికి ఓకే
రైతులకు మేలు చేకూర్చేలా అన్ని రకాల పప్పుధాన్యాల ఎగుమతులకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఆ మేరకు ఎగుమతులపై నిషేధం ఎత్తివేతకు ఆమోదం తెలిపారు. సాక్షి, న్యూఢిల్లీ: రైతులకు మేలు చేకూర్చేలా అన్ని రకాల పప్పుధాన్యాల ఎగుమతులకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఆ మేరకు ఎగుమతులపై నిషేధం ఎత్తివేతకు ఆమోదం తెలిపారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన–అర్బన్ పథకంలో ఇళ్ల నిర్మాణాల కార్పెట్ ఏరియాను పెంచేందుకు కూడా కేబినెట్ అనుమతించింది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘రైతులు తమ ఉత్పత్తుల్ని మంచి ధరకు అమ్ముకునేందుకు పప్పు ధాన్యాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేత నిర్ణయం దోహదం చేస్తుంది. అలాగే పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగేందుకు రైతులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది’ అని చెప్పారు. మన అవసరాలకు మించి అధికంగా పండే పప్పుధాన్యాలకు ప్రత్యామ్నాయ మార్కెట్‌గా ఈ ఎగుమతులు ఉపయోగపడతాయని కేంద్రం భావిస్తోంది. కాగా పప్పు దినుసులపై ఎగుమతి, దిగుమతి విధానాన్ని సమీక్షించేందుకు కేంద్ర ఆహార, పౌర సరఫరా కార్యదర్శి నేతృత్వంలోని కమిటీకి అధికారం కల్పిస్తూ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) నిర్ణయం తీసుకుంది. పప్పు ధాన్యాల నిల్వల పరిమాణం, ఉత్పత్తికి అనుగుణంగా దిగుమతి సుంకాల్లో మార్పులు, డిమాండ్, స్థానిక, అంతర్జాతీయ ధరలు తదితర అంశాల్ని కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది. 2016–17లో ప్రభుత్వం 20 లక్షల టన్నుల పప్పుధాన్యాల్ని మద్దతు ధర చెల్లించి సేకరించింది. అంత భారీ మొత్తంలో పప్పుధాన్యాల్ని సేకరించడం ఇదే తొలిసారి. యాంటీ–ప్రాఫిటీరింగ్ అథారిటీకి... జీఎస్టీలో భాగంగా నేషనల్ యాంటీ–ప్రాఫిటీరింగ్ అథారిటీ ఏర్పాటుకూ కేబినెట్ పచ్చజెండా ఊపింది. జీఎస్టీలో పన్ను తగ్గింపు లాభం వినియోగదారుడికి అందకపోతే.. ఈ అథారిటీకి ఫిర్యాదు చేయొచ్చని కేంద్ర మంత్రి రవిశంకర్ తెలిపారు. ఈ కమిటీ ఏర్పాటుకు ఇప్పటికే జీఎస్టీ మండలి ఆమోదం తెలిపింది. ఐదుగురు సభ్యుల ఈ కమిటీకి కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా నేతృత్వం వహిస్తారు. రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా, సీబీఈసీ చైర్మన్ వనజా సర్నా, రెండు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. చైర్మన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండేళ్ల పాటు కమిటీ కొనసాగుతుంది. ఐసీడీఎస్‌లో నాలుగు పథకాల్ని నవం బర్ 2018 వరకూ కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందులో అంగన్వాడీ సేవలు, సబల, బాలల పరిరక్షణ సేవలు, జాతీయ శిశు సంరక్షణ పథకాలు ఉన్నాయి. కింది కోర్టుల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అమలు చేస్తున్న ‘నేషనల్ మిషన్ ఫర్ జస్టిస్ డెలివరీ అండ్ లీగల్ రిఫార్మ్స్’ పథకాన్ని మార్చి 31, 2020 వరకూ పొడిగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ పథకంలో 3 వేల కోర్టు గదులు, కింది కోర్టుల్లోని న్యాయాధికారుల కోసం 1800 గృహ సముదాయాలకు రూ. 3,320 కోట్లు వెచ్చిస్తున్నారు. కార్పెట్ ఏరియా పరిమితి పెంపు పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై–అర్బన్) లో మధ్య తరగతి ఆదాయ వర్గాల(ఎంఐజీ) ఇళ్ల నిర్మాణాలకు కార్పెట్ ఏరియా పెంపునకు కేబినెట్ ఆమోదించింది. ఎంఐజీ–1 కేటగిరీలో (రూ.6 లక్షలు–12 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు) కార్పెట్ ఏరియాను 90 చ.మీ.ల(968 చ.అడుగులు) నుంచి 120 చ.మీ.(1291 చ.అ.)లకు, ఎంఐజీ–2 కేటగిరీ(రూ. 12 లక్షలు– 18 లక్షల ఆదాయం)లో పరిమితిని 110 చ.మీ.ల (1184 చ.అ.) నుంచి 150 చ.మీ.లకు(1614 చ.అ.) పెంచారు. ఈ మార్పు జనవరి 1, 2017 నుంచే వర్తించేలా సవరించారు. ఎంఐజీ–1లో 9 లక్షల వరకూ రుణంపై 4% వడ్డీ రాయితీ, ఎంఐజీ–2లో రూ.12 లక్షల వరకూ రుణంపై 3% వడ్డీ రాయితీ అమల్లో ఉంది. -
ఏకైక దేశం కూడా ఎత్తేసిందిగా...
సాక్షి : మహిళలపై ఆంక్షలను ఒక్కోక్కటిగా ఎత్తేస్తూ వస్తున్న సౌదీ అరేబియా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ చేసేందుకు మహిళలకు అనుమతిస్తూ మంగళవారం రాచరిక ఉత్తర్వులను జారీచేసింది . సౌదీలో మహిళలపై అన్ని రంగాల్లో కఠిన అంక్షలు కొనసాగేవి. వీటిని ఎత్తివేయాలంటూ 1990 నుంచి మహిళా సంఘాలు పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు డ్రైవింగ్ చేస్తే అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు. అది ముమ్మాటికీ హక్కుల ఉల్లంఘేనన్న వాదనతో సౌదీ రాజు ఏకీభవించారు. చివరకు ఆ నిబంధనను ఎత్తేస్తున్నట్లు ప్రకటించారు. తాజా నిర్ణయంతో మహిళంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల పోరాటానికి ప్రతిఫలం దక్కిందని ఫవ్జియా అల్ బక్ర్ అనే ఉద్యమ నేత చెప్పారు. మరోవైపు సౌదీ నిర్ణయంపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ‘సరైన మార్గంలో గొప్ప ముందడుగు’ వేసిందంటూ సౌదీ అరేబియాను ప్రశంసించింది. ప్రస్తుతం మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఉన్న దేశం ప్రపంచంలో ఇదొక్కటే. కొత్త నిబంధనలు వచ్చే ఏడాది జూన్ నుంచి అమల్లోకి వస్తాయి. కాగా, అక్కడి మహిళలను స్టేడియంలోకి అనుమతించకపోవటం అన్నది ఇంతకాలంగా ఉండేది. అయితే ఈ నెల 24న దేశ 87వ వార్షికోత్సవం సందర్భంగా తొలిసారి మహిళలను స్టేడియంలోకి అనుమతిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. -
‘విభజన’ బదిలీలపై నిషేధం ఎత్తివేత
సాధారణ బదిలీలపై నిషేధం యథాతథం కారుణ్య నియామకాల అంశంపై స్పష్టత సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన నిమిత్తం బది లీలు, ప్రమోషన్లపై విధించిన నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. 2014 మేలో విధించిన ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ‘విభజన’ నాటి నిషేధం ఎత్తివేతకే వర్తిస్తాయి. రాష్ట్రంలో సాధారణ బదిలీలపై ఉన్న నిషేధం యథాతథంగా కొనసాగనుంది. ‘విభజన’ పూర్తికావడంతో..: ఇరు రాష్ట్రాల మధ్య కమల్‌నాథన్ కమిటీ చేపట్టిన ఉద్యోగుల విభజన ప్రక్రియ దాదాపు అన్ని శాఖల్లో పూర్తయింది. తాత్కాలిక కేటాయింపు జాబితాలు కూడా వెల్లడయ్యాయి. కొన్ని శాఖలకు సంబంధించి తుది జాబితాలను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంతో ఏ రాష్ట్రానికి కేటాయించిన ఉద్యోగులు అక్కడ చేరిపోయారు. ఈ నేపథ్యంలో బదిలీలు, ప్రమోషన్లపై ‘విభజన’ నాటి నిషేధాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక కేటాయింపులపై అభ్యంతరాలున్న ఉద్యోగులు మినహా... స్టేట్ కేడర్, సెక్రటేరియట్‌లోని పోస్టులు, హెచ్వోడీలు, రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో తుది లేదా తాత్కాలిక కేటాయింపుల ప్రక్రియ పూర్తయిన ఉద్యోగులందరికీ ఈ నిషేధం ఎత్తివేత వర్తిస్తుంది. ఇక విభజనతో ముడిపడి ఉన్న కారుణ్య నియామకాల విషయంలోనూ ఈ జీవోలో స్పష్టత ఇచ్చారు. 2014 జూన్ 2 తర్వాత మరణించిన/అనారోగ్య కారణాలతో రిటైరైన ఉద్యోగులు తుది కేటాయింపులో తెలంగాణ రాష్టానికి చెందినట్లయితే... జూన్ 2 కంటే ముందు మరణించిన/అనారోగ్యంతో రిటైరైన ఉద్యోగులకు సంబంధించిన పోస్టు తెలంగాణకు కేటాయించి ఉంటే... ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి తెలంగాణ స్థానికుడై ఉంటే కారుణ్య నియామకానికి అర్హులుగా పరిగణించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిషేధం ఎత్తివేతకు సాధారణ బదిలీలపై నిషేధానికి సంబంధం లేదు. సాధారణ బదిలీలపై నిషేధం యథాతథంగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కారుణ్య నియామకాల కమిటీ చైర్మన్‌గా ఎంజీ గోపాల్ కారుణ్య నియామకాల రాష్ట్ర స్థాయి కమిటీకి మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎంజీ గోపాల్‌ను చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనారోగ్యంతో రిటైరైన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ఉద్యోగం ఇచ్చే ప్రక్రియను ఈ కమిటీ పరిశీలిస్తుంది. నిబంధనల ప్రకారం మెడికల్ బోర్డులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలు, ఆయా విభాగాల నుంచి అందిన ప్రతిపాదనలను పరిశీలించే బాధ్యతను చేపడుతుంది. -
క్రికెటర్ కు గుడ్ న్యూస్.. నిషేధం ఎత్తివేత
కొలంబో: డోపింగ్ చేశాడన్న ఆరోపణలతో నిషేధానికి గురైన శ్రీలంక ఆటగాడు కుశాల్ పెరీరాకు ఊరట లభించింది. అతడిపై ఉన్న నాలుగేళ్ల నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రకటించింది. గతేడాది డిసెంబర్ లో న్యూజీలాండ్ తో పర్యటనకు వెళ్లిన కుశాల్, గత జూలైలో చేసిన డోపింగ్ పరీక్షల్లో ఫెయిలయ్యాడన్న కారణంగా స్వదేశానికి పంపించారు. నిషేధిత పదార్థాలను తీసుకున్నాడని యూఏఈలో పాకిస్తాన్ తో టెస్ట్ సిరీస్ సందర్భంగా చేసిన డోపింగ్ టెస్టుల్లో పాజిటివ్ రావడంతో డిసెంబర్ లో అతడిపై నాలుగేళ్ల నిషేధం పడిన విషయం తెలిసిందే. ఖతార్ కు చెందిన ల్యాబొరేటరీలో చేసిన డోపింగ్ టెస్టుల్లో నెగటివ్ రావడంతో ప్రాథమిక చర్యగా కుశాల్ పై నిషేధం ఎత్తివేసినట్లు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్ సన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే కుశాల్ విషయంలో తప్పు జరగడంపై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా)ను వివరణ కోరనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం శ్రీలంక జట్టు ఇంగ్లండ్ టూర్ కోసం సిద్ధమవుతోంది. కుశాల్ పెరీరా భవిష్యత్తు మెరుగ్గా ఉండాలని, అతడిపై వచ్చిన ఆరోపణల్లో నిజంలేదని అందుకే నిషేధాన్ని ఎత్తివేత్తిస్తున్నట్లు రిచర్డ్ సన్ వివరించారు. -
మ్యాగీ నూడుల్స్ పై నిషేధం ఎత్తివేత!
న్యూఢిల్లీ: గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలలో మ్యాగీ నూడుల్స్ పై నిషేధం ఎత్తివేసినట్టు తెలుస్తున్నది. మ్యాగీ నూడుల్స్ నమూనాలను ఇటీవల పరీక్షించి.. సురక్షితమని తేల్చిన నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మ్యాగీ నూడుల్స్ లో ప్రమాదకరమైన, సురక్షితం కాని పదర్థాలు ఉన్నాయని పరీక్షల్లో తేలడంతో వాటిపై భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) నిషేధం విధించింది. దీంతో గత జూన్‌లో నెస్ట్లే ఇండియా సంస్థ మ్యాగీకి చెందిన అన్ని రకాల నూడుల్స్ ను మార్కెట్ నుంచి వెనుక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో ముంబై హైకోర్టు ఆదేశాల మేరకు మూడు ప్రయోగశాలల్లో మ్యాగీ నూడుల్స్ శాంపిల్స్ పరీక్షించామని, ఈ పరీక్షల్లో అవి సురక్షితమని తేలిందని నెస్ట్లే ఇండియా గత శుక్రవారం ప్రకటించింది. దీంతో గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో మ్యాగీ నూడుల్స్ పై నిషేధం ఎత్తివేసినట్టు వార్తలు వస్తున్నాయి.