అమెరికాలోని అలాస్కాలో ఆంక్షలు సడలించడంతో దుకాణంలో ఆభరణాలు కొనుగోలు చేస్తున్న యువత
వాషింగ్టన్: ప్రపంచ దేశాల్లో కోవిడ్–19 మరణమృదంగం ఇంకా కొనసాగుతూనే ఉంది. వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 2 లక్షలు దాటేసింది. అందులో నాలుగో వంతు కంటే ఎక్కువ మంది అమెరికాలో మరణించగా మూడో వంతు కేసులు అక్కడే నమోదయ్యాయి. అమెరికాలో కేసులు 9 లక్షలు దాటితే, మృతుల సంఖ్య 52 వేలు దాటేసింది. ఇక యూరప్ లక్షా 20 వేలకు పైగా మరణాలతో మొదటి స్థానంలో ఉంది. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్లో ఎక్కువగా మరణాలు నమోదయ్యాయి.
అమెరికాలో ఆంక్షల సడలింపు
ఆరోగ్యం, ఆర్థికం ఈ రెండింటి మధ్య సమతుల్యం పాటిస్తూ ప్రపంచ దేశాలు లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలిస్తున్నాయి. కోవిడ్‌తో అతలాకుతలమైన అమెరికా నెమ్మది నెమ్మదిగా ఆంక్షల్ని ఎత్తివేయడానికి సన్నాహాలు చేస్తోంది. జార్జియా, ఒక్లహోమా, అలాస్కా రాష్ట్రాల్లో ఆంక్షల్ని సడలించారు. అగ్రరాజ్యంలో కోవిడ్ స్వైరవిహారం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆంక్షల్ని ఎత్తివేయడం సరికాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలంటే వీలైనంత త్వరగా అందరూ పనుల్లోకి రావాలని ట్రంప్ సర్కార్ అంటోంది. జార్జియా, ఒక్లహోమా సెలూన్లు, స్పాలకి అనుమతులిస్తే, అలాస్కా రాష్ట్రం రెస్టారెంట్లు, రిటైల్ షాపులు తెరవడానికి అనుమతించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రువారం వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని, భౌతిక దూరాన్ని పాటించాలని స్పష్టం చేశారు. 18 రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని అన్నారు.
కనిపించని రంజాన్ శోభ
రంజాన్ మాసం మొదలైనా ఎక్కడా సందడి కనిపించడం లేదు. కోవిడ్ భయాందోళనల నేపథ్యంలో ముస్లిం దేశాలన్నీ రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులపై నిషేధం విధించాయి. ఎవరింట్లో వారే ప్రార్థనలు చేసుకోవాలని సూచించాయి. లక్షలాది మంది ముస్లిం సోదరులతో నిండిపోయే సౌదీ అరేబియాలో మక్కా మసీదు ఎవరూ లేక బోసిపోతోంది. పవిత్రమైన మక్కాలో జన సందోహం లేకుండా చూస్తే చెప్పలేని బాధ కలుగుతోందని మతాధికారి అలీముల్లా వ్యాఖ్యానించారు.
► స్పెయిన్ ప్రజలకి ఆదివారం నుంచి సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తోంది. కోవిడ్ నియంత్రణలోకి రావడంతో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ ఎత్తేస్తోంది. చిన్నారుల్ని స్కూళ్లకి పంపడంపై తల్లిదండ్రుల ఇష్టానికే విడిచిపెట్టింది.
► డెన్మార్క్ కళాశాలలను మాత్రమే తెరిచింది.
► ఫ్రాన్స్ మే 11 నుంచి లాక్‌డౌన్ సంపూర్ణంగా ఎత్తేయాలని నిర్ణయించింది.
► బెల్జియం మే 3 నుంచి రిటైల్ దుకాణాల్ని ప్రారంభించడానికి అనుమతినిచ్చింది
► బ్రిటన్ మాత్రం ఆంక్షల్ని కొనసాగిస్తోంది.
► శ్రీలంక సోమవారం నుంచి లాక్‌డౌన్‌ను ఎత్తివేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment