పప్పుధాన్యాల ఎగుమతికి ఓకే | Government removes restrictions on export of all types of pulses | Sakshi
Sakshi News home page

పప్పుధాన్యాల ఎగుమతికి ఓకే

Published Fri, Nov 17 2017 1:26 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

Government removes restrictions on export of all types of pulses - Sakshi - Sakshi

రైతులకు మేలు చేకూర్చేలా అన్ని రకాల పప్పుధాన్యాల ఎగుమతులకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీలో ఆ మేరకు ఎగుమతులపై నిషేధం ఎత్తివేతకు ఆమోదం తెలిపారు.

సాక్షి, న్యూఢిల్లీ:
రైతులకు మేలు చేకూర్చేలా అన్ని రకాల పప్పుధాన్యాల ఎగుమతులకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీలో ఆ మేరకు ఎగుమతులపై నిషేధం ఎత్తివేతకు ఆమోదం తెలిపారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన–అర్బన్‌ పథకంలో ఇళ్ల నిర్మాణాల కార్పెట్‌ ఏరియాను పెంచేందుకు కూడా కేబినెట్‌ అనుమతించింది. కేబినెట్‌ సమావేశం అనంతరం కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘రైతులు తమ ఉత్పత్తుల్ని మంచి ధరకు అమ్ముకునేందుకు పప్పు ధాన్యాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేత నిర్ణయం దోహదం చేస్తుంది.

అలాగే పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగేందుకు రైతులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది’ అని చెప్పారు.  మన అవసరాలకు మించి అధికంగా పండే పప్పుధాన్యాలకు ప్రత్యామ్నాయ మార్కెట్‌గా ఈ ఎగుమతులు ఉపయోగపడతాయని కేంద్రం భావిస్తోంది. కాగా పప్పు దినుసులపై ఎగుమతి, దిగుమతి విధానాన్ని సమీక్షించేందుకు కేంద్ర ఆహార, పౌర సరఫరా కార్యదర్శి నేతృత్వంలోని కమిటీకి అధికారం కల్పిస్తూ ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) నిర్ణయం తీసుకుంది. పప్పు ధాన్యాల నిల్వల పరిమాణం, ఉత్పత్తికి అనుగుణంగా దిగుమతి సుంకాల్లో మార్పులు, డిమాండ్, స్థానిక, అంతర్జాతీయ ధరలు తదితర అంశాల్ని కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది. 2016–17లో ప్రభుత్వం 20 లక్షల టన్నుల పప్పుధాన్యాల్ని మద్దతు ధర చెల్లించి సేకరించింది. అంత భారీ మొత్తంలో పప్పుధాన్యాల్ని సేకరించడం ఇదే తొలిసారి.   

యాంటీ–ప్రాఫిటీరింగ్‌ అథారిటీకి...
జీఎస్టీలో భాగంగా నేషనల్‌ యాంటీ–ప్రాఫిటీరింగ్‌ అథారిటీ ఏర్పాటుకూ కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. జీఎస్టీలో పన్ను తగ్గింపు లాభం వినియోగదారుడికి అందకపోతే.. ఈ అథారిటీకి ఫిర్యాదు చేయొచ్చని కేంద్ర మంత్రి రవిశంకర్‌ తెలిపారు. ఈ కమిటీ ఏర్పాటుకు ఇప్పటికే జీఎస్టీ మండలి ఆమోదం తెలిపింది. ఐదుగురు సభ్యుల ఈ కమిటీకి కేబినెట్‌ కార్యదర్శి పీకే సిన్హా నేతృత్వం వహిస్తారు. రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్‌ అధియా, సీబీఈసీ చైర్మన్‌ వనజా సర్నా, రెండు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. చైర్మన్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండేళ్ల పాటు కమిటీ కొనసాగుతుంది. 

ఐసీడీఎస్‌లో నాలుగు పథకాల్ని నవం బర్‌ 2018 వరకూ కొనసాగించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఇందులో అంగన్‌వాడీ సేవలు, సబల, బాలల పరిరక్షణ సేవలు, జాతీయ శిశు సంరక్షణ పథకాలు ఉన్నాయి. కింది కోర్టుల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అమలు చేస్తున్న ‘నేషనల్‌ మిషన్‌ ఫర్‌ జస్టిస్‌ డెలివరీ అండ్‌ లీగల్‌ రిఫార్మ్స్‌’ పథకాన్ని మార్చి 31, 2020 వరకూ పొడిగించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ పథకంలో 3 వేల కోర్టు గదులు, కింది కోర్టుల్లోని న్యాయాధికారుల కోసం 1800 గృహ సముదాయాలకు రూ. 3,320 కోట్లు వెచ్చిస్తున్నారు.     

కార్పెట్‌ ఏరియా పరిమితి పెంపు
పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై–అర్బన్‌) లో మధ్య తరగతి ఆదాయ వర్గాల(ఎంఐజీ) ఇళ్ల నిర్మాణాలకు కార్పెట్‌ ఏరియా పెంపునకు కేబినెట్‌ ఆమోదించింది. ఎంఐజీ–1 కేటగిరీలో (రూ.6 లక్షలు–12 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు) కార్పెట్‌ ఏరియాను 90 చ.మీ.ల(968 చ.అడుగులు) నుంచి 120 చ.మీ.(1291 చ.అ.)లకు, ఎంఐజీ–2 కేటగిరీ(రూ. 12 లక్షలు– 18 లక్షల ఆదాయం)లో పరిమితిని 110 చ.మీ.ల (1184 చ.అ.) నుంచి 150 చ.మీ.లకు(1614 చ.అ.) పెంచారు. ఈ మార్పు జనవరి 1, 2017 నుంచే వర్తించేలా సవరించారు. ఎంఐజీ–1లో 9 లక్షల వరకూ రుణంపై 4% వడ్డీ రాయితీ, ఎంఐజీ–2లో రూ.12 లక్షల వరకూ రుణంపై 3% వడ్డీ రాయితీ అమల్లో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement