సాక్షి : మహిళలపై ఆంక్షలను ఒక్కోక్కటిగా ఎత్తేస్తూ వస్తున్న సౌదీ అరేబియా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ చేసేందుకు మహిళలకు అనుమతిస్తూ మంగళవారం రాచరిక ఉత్తర్వులను జారీచేసింది .
సౌదీలో మహిళలపై అన్ని రంగాల్లో కఠిన అంక్షలు కొనసాగేవి. వీటిని ఎత్తివేయాలంటూ 1990 నుంచి మహిళా సంఘాలు పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు డ్రైవింగ్ చేస్తే అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు. అది ముమ్మాటికీ హక్కుల ఉల్లంఘేనన్న వాదనతో సౌదీ రాజు ఏకీభవించారు. చివరకు ఆ నిబంధనను ఎత్తేస్తున్నట్లు ప్రకటించారు. తాజా నిర్ణయంతో మహిళంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల పోరాటానికి ప్రతిఫలం దక్కిందని ఫవ్జియా అల్ బక్ర్ అనే ఉద్యమ నేత చెప్పారు.
మరోవైపు సౌదీ నిర్ణయంపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ‘సరైన మార్గంలో గొప్ప ముందడుగు’ వేసిందంటూ సౌదీ అరేబియాను ప్రశంసించింది. ప్రస్తుతం మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఉన్న దేశం ప్రపంచంలో ఇదొక్కటే. కొత్త నిబంధనలు వచ్చే ఏడాది జూన్ నుంచి అమల్లోకి వస్తాయి. కాగా, అక్కడి మహిళలను స్టేడియంలోకి అనుమతించకపోవటం అన్నది ఇంతకాలంగా ఉండేది. అయితే ఈ నెల 24న దేశ 87వ వార్షికోత్సవం సందర్భంగా తొలిసారి మహిళలను స్టేడియంలోకి అనుమతిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.