లాక్‌డౌన్‌ ఎత్తివేతకు పంచతంత్రం! | South Africa announces 5-phase plan for easing Covid-19 lockdown | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ ఎత్తివేతకు పంచతంత్రం!

Published Mon, Apr 27 2020 4:21 AM | Last Updated on Mon, Apr 27 2020 7:33 AM

South Africa announces 5-phase plan for easing Covid-19 lockdown - Sakshi

ఆరోగ్యం, ఆర్థికం.. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించాలి. ఇప్పుడు చాలా దేశాలు ఎదుర్కొంటోన్న అగ్ని పరీక్ష ఇది.  లాక్‌డౌన్‌ ఎక్కువ కాలం కొనసాగించే పరిస్థితి ఏ దేశానికి లేదు మార్కెట్లు తెరవడానికి దక్షిణాఫ్రికా రూపొందించిన  అయిదు అంచెల వ్యూహం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.  

జోహన్నెస్‌బర్గ్‌/ న్యూఢిల్లీ: కోవిడ్‌–19ను నియంత్రించడంలో దక్షిణాఫ్రికా ఎవరూ ఊహించని విధంగా అద్భుతంగా రాణించింది. ఏప్రిల్‌ 25 నాటికి 4,300 కేసులు నమోదైతే, 85 మంది ప్రాణాలు కోల్పోయారు. మార్చి 26 నుంచి దక్షిణాఫ్రికాలో లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. ప్రజల ప్రాణాల్ని కాపాడుకుంటూనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆ దేశం రూపొందించిన రిస్క్‌ ఎడ్జెస్టెడ్‌ వ్యూహం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. మే 1 నుంచి దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తేయాలని నిర్ణయించిన దక్షిణాఫ్రికా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్యూబా నుంచి వైద్యుల్ని రప్పించింది.

దేశవ్యాప్తంగా అన్ని ప్రావిన్స్‌లలో క్యూబా వైద్యుల్ని మోహరించాక ఈ వ్యూహాన్ని అమలు చేయనుంది. మే 3 తర్వాత మన దేశంలో కూడా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలనే డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. ‘భారత్‌ మాదిరిగానే దక్షిణాఫ్రికా కూడా కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొంది. లాక్‌డౌన్‌ను దశల వారీగా ఎత్తివేయడానికి ఆరోగ్యం, ఆర్థికం మధ్య సమతుల్యత సాధించడానికి ఆ దేశం రచించిన వ్యూహం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్రం కూడా ఈ వ్యూహాన్ని అమలు చేయాలి’ అని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు కె.శ్రీకాంత్‌ రెడ్డి అంటున్నారు.

ఆంక్షల్ని సడలించడానికి వివిధ ప్రణాళికలను రచిస్తున్న కేంద్ర ప్రభుత్వం వివిధ దేశాలు అనుసరించిన విధానాల్ని కూడా పరిశీలిస్తోందని కోవిడ్‌ను ఎదుర్కోవడంలో కేంద్రప్రభుత్వాన్ని దిశానిర్దేశం చేయడానికి ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఏర్పాటు చేసిన నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు కూడా అయిన శ్రీకాంత్‌ రెడ్డి చెప్పారు. అందులో దక్షిణాఫ్రికా వ్యూహం అత్యుత్తమంగా ఉందని కేంద్ర అధికార యంత్రాంగం భావిస్తున్నట్టుగా పేర్కొన్నారు.  

ఆ వ్యూహం ఇదే..  
కరోనా వైరస్‌ వ్యాప్తి, ఆయా ప్రాంతాల్లో దానిని ఎదుర్కోవడానికి ఆరోగ్య రంగంలో ఉన్న సన్నద్ధత ఆధారంగా దేశాన్ని అయిదు జోన్లుగా విభజించారు. ఒక్కో జోన్‌లో ఒక్కో విధమైన ఆంక్షలు ఉంటాయి. అయితే సినిమా థియేటర్లు, హోటళ్లు, పర్యాటకం, క్రీడల నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలపై పూర్తిస్థాయి నిషేధం కొనసాగుతుంది. బయటకు వచ్చినప్పుడు మాస్కులు తప్పనిసరి. భౌతిక దూరం కచ్చితంగా పాటించాలి. 60 ఏళ్ల పైబడిన వారు, శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారికి ఇంటి నుంచి పని చేసుకోవడానికి అనుమతినిస్తారు.  

1. వైరస్‌ తక్కువ వ్యాప్తి, పూర్తిస్థాయి సన్నద్ధత
► అన్ని రంగాలు పూర్తి స్థాయిలో పనులు ప్రారంభిస్తాయి.
► పూర్తి స్థాయిలో శానిటైజ్‌ చేస్తూ అన్ని రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి
► ప్రావిన్స్‌ల మధ్య రవాణాకు అనుమతిస్తారు, అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతాయి.  

2. మధ్యస్థంగా వైరస్‌ వ్యాప్తి, పూర్తి స్థాయి సన్నద్ధత
► నిర్మాణం, తయారీ, మైనింగ్, రిటైల్, పారిశుద్ధ్యం, ఐటీ, ప్రభుత్వ రంగాలన్నింటికీ అనుమతి
► విమాన ప్రయాణాలు, కారు ప్రయాణాలు పునరుద్ధరణ
► 1, 2 జోన్లలో ప్రావిన్స్‌ల మధ్య ప్రయాణాలకు అనుమతి

3. వైరస్‌ వ్యాప్తి మధ్యస్థం, సన్నద్ధత కూడా మధ్యస్థం
► నిత్యావసరాలు, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్, విద్యారంగం, రిటైల్‌తో పాటు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ, టేక్‌ ఎవే రెస్టారెంట్లు, ఇ–కామర్స్‌ కార్యకలాపాలకు మాత్రమే అనుమతి  
► పరిమితమైన ప్రయాణికులతో రవాణా సేవలు
► ప్రావిన్స్‌ల మధ్య ప్రయాణాలపై నిషేధం  

4. మధ్యస్థం నుంచి వైరస్‌ తీవ్రత ఎక్కువ, ఓ మోస్తరు సన్నద్ధత
► నిత్యావసరాలు, వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలు, కాగితం, మైనింగ్‌ రంగాలకు, టెలికం, ఐటీ రంగాలకు అనుమతి
► భౌతిక దూరం పాటించేలా అతి తక్కువ మందితో ప్రయాణాలకు అనుమతి
► ప్రావిన్స్‌ల మధ్య ప్రయాణాలపై నిషేధం

5 వైరస్‌ వ్యాప్తి అధికం, తక్కువ స్థాయి సన్నద్దత
► కేవలం నిత్యావసరాలకు మాత్రమే అనుమతి
► బస్సులు, ట్యాక్సీలు పరిమిత వేళల్లో తక్కువ మందితో తిరగడానికి అనుమతి
► ప్రావిన్స్‌ల మధ్య ప్రయాణాలు ఉండవు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement