దాదాపు నిర్మానుష్యంగా ఉన్న జపాన్‌లోని నరిటా ఎయిర్‌పోర్ట్
జోహెన్నెస్‌బర్గ్/లండన్: దక్షిణాఫ్రికాలో తొలిసారిగా నవంబర్ 24న బయటపడిన ఒమిక్రాన్ వేరియెంట్ తొమ్మిది రోజుల్లోనే భారత్‌సహా 30 దేశాలకు వ్యాప్తి చెందింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 375 ఒమిక్రాన్ కేసుల్ని గుర్తించారు. డెల్టా కంటే అయిదు రెట్ల వేగంతో ఈ వేరియెంట్ వ్యాపిస్తూ ఉండడం దడ పుట్టిస్తోంది. దక్షిణాఫ్రికాలో అత్యధికంగా 183 కేసులు బయటపడితే, ఆ తర్వాత స్థానాల్లో 50కి పైగా కేసులతో నార్వే, 33 కేసులతో ఘనా, 32 కేసులతో బ్రిటన్ ఉన్నాయి. నార్వేలో క్రిస్మస్ పార్టీకి వెళ్లిన వారికి ఈ వైరస్ సోకినట్టుగా అధికారులు వెల్లడించారు.
దీని వ్యాప్తి చాలా విస్తృతంగా ఉండడంతో వేరియెంట్ ఆఫ్ కన్సర్న్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్‌తో పాటు ఫ్రాన్స్‌లో ఈ కొత్త వేరియెంట్ గురువారమే బయటపడింది. మరికొద్ది వారాల్లో కేసుల తీవ్రత అత్యధిక స్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నట్టుగా ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. దక్షిణాఫ్రికా తర్వాత యూరప్ దేశాల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. వచ్చే కొద్ది నెలల్లో యూరప్‌లో నమోదయ్యే కేసుల్లో సగానికి పైగా ఒమిక్రాన్ వేరియెంట్‌వే ఉంటాయని యూరోపియన్ యూనియన్ హెల్త్ ఏజెన్సీ ఈసీడీసీ అంచనా వేస్తోంది.
యువతకే అధికంగా..
ఒమిక్రాన్ తీవ్రత ఎలా ఉంటుందన్న దానిపై శాస్త్రవేత్తలు నిర్ధిష్టమైన అంచనాకు రాలేకపోతున్నారు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో యువతకే అత్యధికంగా ఈ వేరియెంట్ సోకుతూ ఉందని, వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల ప్రస్తుతానికి స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు వెల్లడించారు.
వివిధ దేశాల కఠిన నిబంధనలు
ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి చెందుతూ ఉండడంతో వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం, ఇతర నిబంధనల్ని కఠినతరం చేయడంపై వివిధ దేశాలు దృష్టి సారించాయి. లాక్‌డౌన్, మార్కెట్లు మూసేయడం కంటే వ్యాక్సినేషన్, మాస్కులు సహా కోవిడ్–19 నిబంధనలు పాటించడం ద్వారా ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని వివిధ దేశాలు నిర్ణయించాయి.
► వ్యాక్సిన్ తీసుకోని వారి కదలికలను జర్మనీ పరిమితం చేసింది. నిత్యావసరాల దుకాణాలకు తప్పితే అలాంటి వారిని మరే ఇతర స్టోర్లు, మాల్స్, పబ్బులు, క్లబ్బులు, సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతించబోమని జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ గురువారం ప్రకటించారు. దేశంలో పరిస్థితి సీరియస్‌గా ఉందని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడాన్ని తప్పనసరి చేయడాన్ని పార్లమెంటు పరిశీలిస్తుందని తెలిపారు. గత 24 గంటల్లో 70 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
► 60 ఏళ్లకు పైబడిన వారు టీకా తీసుకోవడానికి నిరాకరిస్తే వారి నెలవారీ పెన్షన్ నాలుగో వంతు కోత వేసే యోచనలో గ్రీస్ ప్రభుత్వం ఉంది.పెన్షన్‌లో నెలకు 100 యూరోల(రూ.8,471) కోత పడనుంది. 60 ఏళ్లు పైబడిన వారిలో ఇంకా 17 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో ప్రభుత్వం ఈ జరిమానా అస్త్రం ప్రయోగించింది.
► స్లోవేకియా మాత్రం 60 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సినేషన్ పూర్తిచేసుకుంటే 500 యూరోలు (రూ.42,355) బోనస్‌గా ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది.
► లాక్‌డౌన్‌లకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్న నెదర్లాండ్స్‌లో నిరసన ప్రదర్శనల్ని ప్రభుత్వం కఠినంగా అణచివేస్తోంది.
► అమెరికా బూస్టర్ డోసుల్ని కూడా ఇస్తోంది. రెండు డోసులు పూర్తయినప్పటికీ కరోనా నుంచి మరింత రక్షణ కోసం బూస్టర్ డోసులు ఇస్తోంది.
► ఒమిక్రాన్ సోకిన వ్యక్తులతో ఎవరు సన్నిహితంగా మెలిగారనేది సదరు రోగుల ఫోన్లపై నిఘా పెట్టడం ద్వారా ఇజ్రాయెల్ తెలసుకుంటోంది. గోప్యత హక్కుకు ఇది భంగకరమని హక్కుల సంఘాలు ధ్వజమెత్తడంతో గురువారం దీన్ని ఆపివేసింది.
► 18 ఏళ్లు పైబడిన వారు ఆరునెలలకు ఒకసారి బూస్టర్ డోస్‌ను తీసుకోవడాన్ని చిలీ తప్పనసరి చేసింది. అప్పుడే పాస్ రెన్యువల్ అవుతుంది. ఈ పాస్ లేకపోతే రెస్టారెంట్లు, హోటళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్లలేరు.
Comments
Please login to add a commentAdd a comment