క్రికెటర్ కు గుడ్ న్యూస్.. నిషేధం ఎత్తివేత
కొలంబో: డోపింగ్ చేశాడన్న ఆరోపణలతో నిషేధానికి గురైన శ్రీలంక ఆటగాడు కుశాల్ పెరీరాకు ఊరట లభించింది. అతడిపై ఉన్న నాలుగేళ్ల నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రకటించింది. గతేడాది డిసెంబర్ లో న్యూజీలాండ్ తో పర్యటనకు వెళ్లిన కుశాల్, గత జూలైలో చేసిన డోపింగ్ పరీక్షల్లో ఫెయిలయ్యాడన్న కారణంగా స్వదేశానికి పంపించారు. నిషేధిత పదార్థాలను తీసుకున్నాడని యూఏఈలో పాకిస్తాన్ తో టెస్ట్ సిరీస్ సందర్భంగా చేసిన డోపింగ్ టెస్టుల్లో పాజిటివ్ రావడంతో డిసెంబర్ లో అతడిపై నాలుగేళ్ల నిషేధం పడిన విషయం తెలిసిందే.
ఖతార్ కు చెందిన ల్యాబొరేటరీలో చేసిన డోపింగ్ టెస్టుల్లో నెగటివ్ రావడంతో ప్రాథమిక చర్యగా కుశాల్ పై నిషేధం ఎత్తివేసినట్లు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్ సన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే కుశాల్ విషయంలో తప్పు జరగడంపై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా)ను వివరణ కోరనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం శ్రీలంక జట్టు ఇంగ్లండ్ టూర్ కోసం సిద్ధమవుతోంది. కుశాల్ పెరీరా భవిష్యత్తు మెరుగ్గా ఉండాలని, అతడిపై వచ్చిన ఆరోపణల్లో నిజంలేదని అందుకే నిషేధాన్ని ఎత్తివేత్తిస్తున్నట్లు రిచర్డ్ సన్ వివరించారు.