![ICC Moves Mens U19 World Cup From Sri Lanka To South Africa - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/22/Untitled-3.jpg.webp?itok=mWxzPwRR)
శ్రీలంక క్రికెట్ బోర్డుకు మరో షాక్ తగిలింది. ఆ దేశ క్రికెట్ బోర్డుపై నిషేధం అమలవుతుండగానే ఐసీసీ మరో ఝలక్ ఇచ్చింది. లంక బోర్డుపై నిషేధాన్ని కారణంగా చూపుతూ అక్కడ జరగాల్సిన ఈవెంట్‌ను ఐసీసీ మరో దేశానికి మార్చింది. వచ్చే ఏడాది (2024) జనవరిలో లంకలో జరగాల్సిన అండర్–19 పురుషుల ప్రపంచకప్ టోర్నీని ఐసీసీ దక్షిణాఫ్రికాకు తరలించింది.
అహ్మదాబాద్‌లో నిన్న (నవంబర్ 21) జరిగిన బోర్డు సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ సభ్యుడు ఒకరు వెల్లడించారు. గతంలో (2020) సౌతాఫ్రికా అండర్–19 వరల్డ్‌కప్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు మరోసారి ఆ దేశానికి అవకాశం ఇచ్చినట్లు తెలిపాడు. వేదిక మార్పు అంశాన్ని టోర్నీలో పాల్గొనే జట్లకు ఇదివరకే తెలియజేసినట్లు పేర్కొన్నాడు.
కాగా, భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్ 2023లో ఘోర వైఫల్యాలను ఎదుర్కొని, లీగ్ దశలోనే ఇంటిబాట పటిన శ్రీలంక క్రికెట్ జట్టును ఆ దేశ క్రీడా మంత్రి రోషన్ రణసింఘే రద్దు చేసిన విషయం తెలిసిందే. బోర్డు అంతర్గత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శ్రీలంక క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ వేటు వేసింది.
Comments
Please login to add a commentAdd a comment