2023 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక-సౌతాఫ్రికా జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌లో పలు ప్రపంచకప్ రికార్డులు బద్దలయ్యాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేస్తూ వరల్డ్‌కప్ హయ్యెస్ట్ టీమ్ స్కోర్ (428) నమోదు చేసింది. దీంతో పాటు వరల్డ్‌కప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు సెంచరీలు చేయడం (వాన్ డర్ డసెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎయిడెన్ మార్క్‌రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), క్వింటన్ డి కాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు)) లాంటి అత్యంత అరుదైన రికార్డు కూడా ఈ మ్యాచ్‌లోనే నమోదైంది.
అలాగే ఈ మ్యాచ్‌లో సుడిగాలి వేగంతో శతక్కొట్టిన ఎయిడెన్ మార్క్రమ్.. వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ (49 బంతుల్లో) రికార్డును నమోదు చేశాడు. ఈ మూడు రికార్డులతో పాటు ఈ మ్యాచ్‌లో మరో వరల్డ్‌కప్ రికార్డు కూడా నమోదైంది. 429 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. దీంతో సౌతాఫ్రికా 102 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. లంక ఇన్నింగ్స్‌లో చరిత్ అసలంక (65 బంతుల్లో 79; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), కుశాల్ మెండిస్ (42 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), దసున్ షనక (62 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు.
భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక.. సౌతాఫ్రికాకు అంత సునయాసంగా విజయాన్ని దక్కనీయలేదు. లంకేయులు ఓడిపోతామని తెలిసి, ఎదురుదాడి చేశారు. వికెట్లు ఉండి ఉంటే వారు కూడా 400 మార్కును రీచ్ అయ్యేవారు. లంకన్లు సైతం భారీ స్కోర్ చేయడంతో ఈ మ్యాచ్‌లో వరల్డ్‌కప్ హైయెస్ట్ మ్యాచ్ స్కోర్ రికార్డు బద్దలైంది. ఈ మ్యాచ్‌లో సఫారీలు, లంకేయులు కలిపి 754 పరుగులు చేశారు. ప్రపంచకప్ టోర్నీల్లో ఇదే అత్యధిక మ్యాచ్ స్కోర్. 2019లో ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 714 పరుగులు చేశాయి. ఈ మ్యాచ్‌కు ముందు వరకు వరల్డ్‌కప్‌లో ఇదే అత్యధిక మ్యాచ్ స్కోర్‌గా చలామణి అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment