సౌతాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్ 7) జరుగుతున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌లో సెంచరీల మోత మోగింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు సౌతాఫ్రికా ఆటగాళ్లు శతక్కొట్టారు.
క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), రస్సీ వాన్ డెర్ డస్సెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాల మోత మోగించడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 428 పరుగులు చేసింది. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఇదే అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది.
కాగా, ఈ మ్యాచ్‌లు అత్యధిక టీమ్ స్కోర్ నమోదు కావడంతో పాటు పలు ఇతర రికార్డులు కూడా నమోదయ్యాయి. వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ హండ్రెడ్ (మార్క్రమ్- 49 బంతుల్లో), వరల్డ్‌కప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు శతక్కొట్టడం.. ఇలా సౌతాఫ్రికా, ఆ జట్టు ఆటగాళ్లు పలు రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు.
ఈ రికార్డులతో పాటు డికాక్, డస్సెన్‌లు మూడు వేర్వేరు ఘనతలను సాధించి, రికార్డుపుటల్లోకెక్కారు. అవేంటంటే.. ఈ మ్యాచ్‌లో డికాక్ చేసిన సెంచరీ వన్డేల్లో వికెట్‌కీపర్‌లు చేసిన 200వ సెంచరీగా రికార్డైంది.
ఈ సెంచరీ వన్డేల్లో సౌతాఫ్రికా తరఫున కూడా 200వ సెంచరీ కావడం విశేషం.
ఇదే మ్యాచ్‌లో డస్సెన్ చేసిన సెంచరీ వన్డే వరల్డ్‌కప్ టోర్నీల్లో 200వ శతకంగా నమోదైంది. ఇలా డికాక్, డస్సెన్ చేసిన సెంచరీలతో డబుల్ సెంచరీని మార్కును తాకారు.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా నిర్ధేశించిన కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. 21 ఓవర్లలో 154 పరుగులు చేసి సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. షకన (3), అసలంక (28) క్రీజ్‌లో ఉన్నారు. లంక ఇన్నింగ్స్‌లో నిస్సంక (0), కుశాల్ పెరీరా (7), ధనంజయ డిసిల్వ (11), సమరవిక్రమ (23) విఫలం కాగా.. కుశాల్ మెండిస్ క్రీజ్‌లో ఉన్నంతసేపు విధ్వంసం (42 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) సృష్టించాడు.
Comments
Please login to add a commentAdd a comment