లంక బౌలర్ల తుక్కు రేగ్గొట్టిన సౌతాఫ్రికా బ్యాటర్లు.. 3 శతకాలు.. వరల్డ్‌కప్‌లో అత్యధిక స్కోర్ | CWC 2023, SA VS SL: South Africa Made Record Score In ODI World Cup History | Sakshi
Sakshi News home page

CWC 2023: లంక బౌలర్ల తుక్కు రేగ్గొట్టిన సౌతాఫ్రికా బ్యాటర్లు.. 3 శతకాలు.. వరల్డ్‌కప్‌ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌

Published Sat, Oct 7 2023 6:25 PM | Last Updated on Sat, Oct 7 2023 6:28 PM

 CWC 2023 SA VS SL: South Africa Made Record Score In World Cup History - Sakshi

న్యూఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్‌ 7) జరుగుతున్న వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడినప్పటికీ ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీలు రికార్డు స్థాయిలో 400కి పైగా పరుగులు స్కోర్‌ చేశారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు సఫారీ బ్యాటర్లు సెంచరీలతో కదంతొక్కారు. తొలుత క్వింటన్‌ డికాక్‌ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆతర్వాత రస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆఖర్లో ఎయిడెన్‌ మార్క్రమ్‌  (106) సెంచరీలతో విరుచుకుపడ్డారు. ఈ ముగ్గురు శతక వీరుల్లో మార్క్రమ్‌ సృష్టించిన విధ్వంసం ఓ రేంజ్‌లో ఉండింది.

మార్క్రమ్‌ కేవలం 49 బంతుల్లోనే 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో శతక్కొట్టాడు. అతను తన సెంచరీ మార్కును సిక్సర్‌తో అందుకున్నాడు. ఆఖర్లో డేవిడ్‌ మిల్లర్‌ (21 బంతుల్లో 39 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (20 బంతుల్లో 32; ఫోర్‌, 3 సిక్సర్లు), మార్కో జన్సెన్‌ (7 బంతుల్లో 12 నాటౌట్‌; సిక్స్‌)  కూడా మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 428 పరుగులు చేసింది.

వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది. గత రికార్డు ఆసీస్‌ పేరిట ఉండింది. 2015 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా.. బంగ్లాదేశ్‌పై 417/6 స్కోర్‌ చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు వరల్డ్‌కప్‌లో ఇదే అత్యధిక టీమ్‌ స్కోర్‌. మొత్తంగా వరల్డ్‌కప్‌లో 400కు పైగా స్కోర్‌ ఐదుసార్లు నమోదు కాగా.. అందులో మూడుసార్లు సౌతాఫ్రికానే ఈ మార్కును దాటింది. వరల్డ్‌కప్‌లో భారత్‌ ఓసారి 400 ప్లస్‌ స్కోర్‌ నమోదు చేసింది. 2007 వరల్డ్‌కప్‌లో బెర్ముడాపై భారత్‌ 413/5 స్కోర్‌ చేసింది.

కాగా, సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ బవుమా (8) ఒక్కడే విఫలమయ్యాడు. సఫారీ బ్యాటర్ల విధ్వంసం ధాటికి లంక బౌలర్లు విలవిలలాడిపోయారు. దాదాపుగా అందరూ దాదాపు 9 రన్‌రేట్‌తో పరుగులు సమర్పించకున్నారు. రజిత 10 ఓవర్లలో వికెట్‌ తీసి 90 పరుగులు, దిల్షన్‌ మధుషంక 10 ఓవర్లలో 2 వికెట్లు తీసి 89 పరుగులు, దసున్‌ షనక 6 ఓవర్లలో 36 పరుగులు, ధనంజయ డిసిల్వ 4 ఓవర్లలో 39, మతీష పతిరణ 10 ఓవర్లలో ఒక్క వికెట్‌ తీసి అత్యధికంగా 95 పరుగులు, దునిత్‌ వెల్లలగే 10 ఓవర్లలో వికెట్‌ పడగొట్టి 81 పరుగులు సమర్పించుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement