భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 2023లో సెంచరీల మోత మోగుతుంది. ఈ టోర్నీలో ఇప్పటికే నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డెవాన్ కాన్వే (152 నాటౌట్), రచిన్ రవీంద్ర (123 నాటౌట్) శతక్కొట్టగా.. ఢిల్లీ వేదికగా శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 7) జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాళ్లు క్వింటన్ డికాక్ (100), రస్సీ వాన్ డర్ డస్సెన్ సెంచరీలతో కదంతొక్కారు.
84 బంతులు ఎదుర్కొన్న డికాక్ 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ చేసి, ఆ వెంటనే పతిరణ బౌలింగ్‌లో ధనంజయ డిసిల్వకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 103బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన డస్సెన్ క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. 34.4 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 244/2గా ఉంది. డస్సెస్, మార్క్రమ్ (24 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి శ్రీలంక సౌతాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. రెండో ఓవర్‌లోనే సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను (8) దిల్షన్ మధషంక ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు ఆడుతున్న తీరు చూస్తుంటే 400 స్కోర్ నమోదవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.
కాగా, ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా ఆటగాడు మెహిది హసన్ మీరజ్ ఆల్‌రౌండ్ షోతో (9-3-25-3, 57) ఆదరగొట్టి బంగ్లాదేశ్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. ఆఫ్ఘనిస్తాన్‌ను 156 పరుగులకే (37.2 ఓవర్లలో) మట్టికరిపించగా.. స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది.
కలిస్‌ను అధిగమించిన డికాక్..
ఈ వరల్డ్‌కప్ తర్వాత వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెబుతానని ఇదివరకే ప్రకటించిన డికాక్.. తన ఆఖరి ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో కదంతొక్కాడు. ఈ సెంచరీతో డికాక్ సౌతాఫ్రికా దిగ్గజం జాక్ కలిస్‌ను (17 వన్డే సెంచరీలు) అధిగమించాడు. సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో డికాక్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో హషీమ్ ఆమ్లా (27) టాప్‌లో ఉండగా.. ఏబీ డివిలియర్స్ (25), హెర్షల్ గిబ్స్ (21) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment