శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న గంటల వ్యవధిలోనే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్‌తో మూడో వన్డే సందర్భంగా ఐసీసీ కోడ్ ఉల్లంఘించినందుకు గాను హసరంగపై రెండు టెస్ట్ మ్యాచ్‌ల నిషేధం పడింది. నిషేధంతో పాటు హసరంగ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. హసరంగ ఖాతాలో మూడు డీ మెరిట్ పాయింట్లు కూడా చేరాయి.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా హసరంగ ఫీల్డ్ అంపైర్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఓవర్ పూర్తి చేసిన అనంతరం అంపైర్ చేతి నుంచి క్యాప్‌ను బలవంతంగా లాక్కున్నాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ఉల్లంఘన కింద దీన్ని నేరంగా పరిగణిస్తారు. ప్రస్తుత బంగ్లాదేశ్ సిరీస్‌లో హసరంగపై ఐసీసీ నిషేధం పడటం ఇది రెండోసారి. టీ20 సిరీస్ సందర్భంగా కూడా గత సిరీస్‌లో (ఆఫ్ఘనిస్తాన్) చేసిన తప్పిదాల కారణంగా అతను సస్పెండయ్యాడు.
26 ఏళ్ల హసరంగ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను 2021లో ఆడాడు. అతను కేవలం నాలుగు టెస్ట్‌ల్లోనే శ్రీలంకకు ప్రాతినిథ్యం వహించాడు. టెస్ట్‌ల్లో హసరంగకు మంచి ట్రాక్ రికార్డు లేదు. ఈ ఫార్మాట్‌లో అతను కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు కోరిక మేరకు హసరంగా తన టెస్టు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. ఇదిలా ఉంటే, మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం శ్రీలంక జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో శ్రీలంక టీ20 సిరీస్ గెలువగా.. బంగ్లాదేశ్ వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. టెస్ట్ సిరీస్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment