ఉమెన్‌ పవర్‌ 2024: కాలాన్ని కట్టడి చేశారు | Sakshi Special Story About Successful womans In India | Sakshi
Sakshi News home page

ఉమెన్‌ పవర్‌ 2024: కాలాన్ని కట్టడి చేశారు

Dec 26 2024 2:00 AM | Updated on Dec 26 2024 8:38 AM

Sakshi Special Story About Successful womans In India

కాలం..  మరో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది.  జారిపోతున్న కాలపు క్షణాలను  అపురూపంగా ఒడిసిపట్టుకొని ఉన్నతంగా ఎదిగినవారు కొందరు...  ఉదాత్తంగా జీవనాన్ని మలుచుకున్నవారు ఇంకొందరు ఆర్థిక స్థితి గతులు ఎలా ఉన్నా  వెనక్కి లాగే పరిస్థితులు ఏవైనా కాలానికి ఎదురు నిలిచి అవకాశాలను అందిపుచ్చుకుంటూ  అత్యున్నతంగా ఎదిగిన కొందరు మహిళా మణుల కృషిని ఈ ఏడాది ‘సాక్షి ఫ్యామిలీ’  ఆవిష్కరించింది.  ఆ గాథలను మరోమారు గుర్తుచేసుకుందాం. ఎదనిండా స్ఫూర్తిని నింపుకుందాం.

డాక్టరమ్మ క్రీడా శిక్షణ
నిజామాబాద్‌ పట్టణంలో బాలికల క్రీడానైపుణ్యాలను చూసి, వారి కోసం తన పేరుతోనే 2019లో ఫుట్‌బాల్‌ అకాడమినీ ఏర్పాటు చేశారు డాక్టర్‌ శీలం కవితారెడ్డి. ఈ అకాడమీలో 41 మంది బాలికలకు కోచ్‌ పర్యవేక్షణలో శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్, డిగ్రీ చదువుతున్న గ్రామీణ విద్యార్థులకు ఈ అకాడమీ లో ఉచిత వసతి, ఆహారం, దుస్తులు, వైద్యసేవలను అందిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో జరిగే టోర్నమెంట్లలో పాల్గొనే క్రీడాకారులకు అవసరమైన ఖర్చులన్నీ భరిస్తున్నారు. ఈ అకాడమీ నుంచి జాతీయ–అంతార్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులు ఉన్నారు.

అమ్మాయిలను కాపాడుకుందాం..
గ్రామీణ మహిళలను నిత్యం కలుస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తూ పరిష్కారాలను సూచిస్తూ మహిళా రైతుల అభివృద్ధికి చేయూతనిస్తున్నారు డాక్టర్‌ రుక్మిణారావు. హైదరాబాద్‌ వాసి అయిన ఈ సామాజిక కార్యకర్త డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ డైరెక్టర్‌గానూ, వందకు పైగా మహిళా రైతు సంఘాలతో కూడిన జాతీయ వేదిక ‘మకాం’ సహ వ్యవస్థాపకురాలిగానూ ఉన్నారు. నారీశక్తి పురస్కార గ్రహీత అయిన రుక్మిణీరావు ముప్పై ఏళ్లుగా ‘గ్రామ్య రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ ఉమెన్‌’ ద్వారా తెలంగాణలోని ఆరు మండలాలో 800 మంది మహిళలు తమ జీవనోపాధిని మెరుగుపరుచుకోవడానికి, అలాగే ఆడపిల్లల పెంపంకం పట్ల వారి వైఖరిని పునరాలోచించడానికి కృషి చేస్తున్నారు.

అమ్మలాంటి అన్నదాత కోసం
సాయి ప్రియాంక చదువుకున్నది హైదరాబాద్‌లో. పోషకాహారం దాని ప్రభావిత అంశాల గురించి చర్చించడానికి 600 మంది ప్రతినిధులతో కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్తులో పాల్గొనే అవకాశాన్ని పొందింది. ఖమ్మంవాసి అయిన పగడాల సాయి ప్రియాంక తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. కూతురికి వ్యవసాయ రంగంపై ఉన్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు. తెలంగాణలోని రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న  గ్రామాలలో రైతులను కలిసి సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను పరీక్షించింది. ఢిల్లీలోని ఐఏఆర్‌ఐ (ఇండియన్‌అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌)లో పీహెచ్‌డి చేస్తోంది. ప్రస్తుతం జహీరాబాద్‌ ‘కృషి విజ్ఞాన కేంద్రం’లో అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ సైంటిస్ట్‌గా పనిచేస్తోంది. విభిన్న ఆలోచనలు గల సాయి ప్రియాంక కొత్త దారిలో ప్రయాణించడమే కాదు, తన తోటివారి స్ఫూర్తిగా నిలుస్తోంది.

సవాళ్లే పట్టాలెక్కించేది
దక్షిణ మధ్య రైల్వేలో ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ (పిసిసిఎమ్‌)గా భారతీయ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌ సీనియర్‌ అధికారిగా కె.పద్మజ ఈ ఏడాది ఆగస్టులో నియమితులయ్యారు. 1991 ఐఆర్‌సిఆర్‌లో మొట్టమొదటి మహిళా పిసిసిఎమ్‌. ఉద్యోగంలో మహిళగా ఎదుర్కొన్న వివక్షను వివరించారు. ‘సమస్యలు వచ్చేదే మనల్ని ధైర్యంగా ఉంచడానికి. మనకు ఏం కావాలో స్పష్టత ఉంటే ఆ పని కూడా సులువు అవుతుంది’ అని తెలిపారు

‘మారతాను’ అనుకుంటే మారథాన్‌ గెలిచినట్టే!
జీవనశైలిని మార్చుకోవాలన్న ఒకే ఒక ఆలోచనతో ఇండియా ఫాసెస్ట్‌ మారథాన్‌ రన్నర్‌గా తనకై తాను ఓ గుర్తింపును సాధించారు కవితారెడ్డి. 50 ఏళ్ల వయసులో ఆరు ప్రపంచ మారథాన్‌లను పూర్తి చేసి, స్టార్‌ మెడల్స్‌ను సొంతం చేసుకున్నారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో మారథాన్‌ రన్స్‌లో పాల్గొంటున్న కవితారెడ్డి పదేళ్ల క్రితం వరకు గృహిణిగా బాధ్యతల నిర్వహణలో ఉన్నారు. ఆరోగ్యకరమైన జీవనం కోసం జిమ్‌లో చేరి, అటు నుంచి మారథాన్‌ రన్నర్‌గా దేశ విదేశాల్లో మహిళల్లో క్రీడాస్ఫూర్తిని నింపుతున్నారు.

అన్నీ తానై... తానే నాన్నయి
వ్యవసాయం చేసే తండ్రి అనారోగ్యంతో చనిపోతే డిగ్రీ చదువుతున్న అతని చిన్న కూతురు అఖిల రైతుగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నర్సాపురం గ్రామ వాసి అఖిల ఉన్న రెండెకరల భూమిని సాగు చేస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న తల్లినీ, నాయినమ్మనూ సంరక్షిస్తోంది. ΄÷లం పనులకు ట్రాక్టర్‌ నడుపుతూ, వ్యవసాయం చేసుకుంటూ, పోటీ పరీక్షలకు సిద్ధపడుతోంది. తండ్రిలేని లోటును తీర్చుతూ కుటుంబానికి అండగా నిలబడింది. 

నానమ్మ గురించి రాస్తా!
పన్నెండేళ్ల అమ్మాయి పదహారేళ్ల అమ్మాయి గురించి కథలుగా రాసి, దానిని బుక్‌గా అందరికి ముందుకు తీసుకువచ్చింది ఏడవ తరగతి చదువుతున్న అక్షయినీ రెడ్డి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనవరాలైన అక్షయినీ తాతయ్యలా ‘లా’ చేస్తాను, సమాజంలో ఉన్న గాధలను కథలుగా పరిచయం చేస్తాను, నానమ్మ గురించి రాస్తాను.. అంటూ తన భవిష్యత్తు లక్ష్యాలను మన ముందుంచింది. ఆటపాటలతో రోజులు గడిపేసే ఎంతో మంది పిల్లల మధ్య ఉంటూనే ప్రపంచంలో పేరొందిన రచయితల పుస్తకాలు చదువుతూ, క్రీడల్లో రాణిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్గాన్ని రూపొందించుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. చిన్నపిల్లలైనా పెద్ద కలలు కనవచ్చు అంటూ తన పుస్తకాన్ని చూపుతూ భావితరానికి చెబుతోంది.

నీ ఆటే బంగారం శ్రీవల్లి
కరీంనగర్‌ వాసి శ్రీవల్లికి క్రికెట్‌ అంటే ఇష్టం. ఐదవ తరగతి చదువుతున్న రోజుల్లోనే హై స్కూల్‌ అబ్బాయిలతో కలిసి క్రెకెట్‌ ఆడటానికి వెళ్లింది. అందరూ ఆమెను  చూసి వెటకారం గా నవ్వారు. వారి నవ్వులకు వెనకడుగు వేయకుండా విషయం పీటీటీ సర్‌కు చెప్పింది. శ్రీవల్లి ఇష్టం చూసిన పీఈటీ రహీం శ్రీవల్లి ఉత్సాహానికి మద్దతుగా నిలిచారు. తల్లిదండ్రులూ తమ ఆమోదం తెలిపారు. హైదరాబాద్‌లోని స్పోర్ట్స్‌ అకాడమీలో చేరి, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. జాతీయ స్థాయి మహిళా క్రికెట్‌ జట్టులో తన సత్తా చాటుతోంది. 

చైతన్య లహరి 
బాసర ట్రిపుల్‌ ఐటీ ఆర్జీయూకేటీలో ఈసీఈ ఫైనలియర్‌ చదువుతోంది లహరి. కరాటేలో బ్లాక్‌బెల్ట్, కిక్‌ బాక్సింగ్‌లో ప్రావీణ్యం సాధించింది. ‘ఖేలో ఇండియా’లో ఉషూ ప్లేయర్‌గా సత్తా చాటింది. అత్యవసరంగా రక్తం అవసరం ఉన్నవారికి అందించేందుకు సిద్ధిపేటలో ‘లహరి బ్లడ్‌ ఫౌండేషన్‌’  ఏర్పాటు చేసింది. నేర్చుకున్న ఆత్మరక్షణ విద్యలను విద్యార్థినులకు నేర్పిస్తోంది. తోటి విద్యార్థులకు అండగా నిలిచేందుకు ‘హోప్‌ హౌజ్‌ ఫౌండేషన్‌’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇటీవల బ్యాంకాక్‌లో నిర్వహించిన ‘ఏషియా యూత్‌ ఇంటర్నేషనల్‌ మోడల్‌ యునైటెడ్‌ నేషన్స్‌’ సదస్సుల్లో పాల్గొంది. తండ్రిలాగే సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనేది లహరి లక్ష్యం.

బస్తీ దొరసాని
చెత్తను సేకరించే అమ్మాయి బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ హోదాలో ఒక రోజు అధికారిణిగా పలు శాఖల విధులను స్వయంగా సందర్శించి, తెలుసుకుంది. హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని పిల్లిగుడెసెల బస్తీ వాసి అరిపిన జయలక్ష్మి. బస్తీల పిల్లల బాగు కోసం కృషి చేస్తోంది. తల్లిదండ్రులతో పాటు చేత్త సేకరణ పనిచేస్తూ, కాలేజీ చదువులు చదువుతూ, బస్తీ పిల్లలకు చదువులు చెబుతుంటుంది. కోవిడ్‌ సమయంలో యునిసెఫ్‌ నుంచి వాలెంటీర్‌గా పనిచేసింది. ఢిల్లీలో ఛేంజ్‌ మేకర్‌ అవార్డ్‌ తీసుకుంది. గాంధీ కింగ్‌ స్కాలర్‌షిప్‌కి దేశం మొత్తంలో పది మంది సెలక్ట్‌ అయితే వారిలో జయలక్ష్మి ఒకరు. ఇందులో భాగంగా కిందటేడాది అమెరికా వెళ్లి వచ్చింది. ఇప్పుడు డిగ్రీ చేస్తూ యుపీఎస్సీ సాధించాలని 
కృషి చేస్తోంది.

టీచర్‌ కొలువిచ్చిన సి‘విల్‌’ పవర్‌
వనపర్తి వాసి అయిన హుమేరా బేగం తండ్రి రోజువారీ కూలీగా హైదరాబాద్‌లో ఒక మదర్సాలో పనిచేసేవాడు. అమ్మ ఉర్దూ టీచర్‌గా కొంత కాలం పనిచేసింది. హుమేరా ఏడో తరగతిలో ఉన్నప్పుడు తండ్రి పక్షవాతం బారిన పడ్డాడు. తండ్రి అనారోగ్య ప్రభావం హుమేరా చదువుపై పడింది. పదవ తరగతి లో ఉండగా తండ్రి ఆరోగ్యం క్షీణించి మరణించాడు. హుమేరాకు సివిల్స్‌ సాధించాలన్నది కల. ఆర్థిక స్థితి లేక చదువును వదిలేయాల్సిన స్థితి. హుమేరాకు చదువుపై ఉండే ఆసక్తి, పట్టుదల ‘సేవ్‌ ద గర్ల్‌ చైల్డ్‌’ సంస్థ దృష్టికి చేరింది. ఆ సంస్థ ఆమె చదువుకు అండగా నిలబడింది. డీఎడ్‌పూర్తి చేసి ఎస్‌జీటీ ఉర్దూ టీచర్‌గా ఎంపిక అయ్యింది. దయనీయమైన పరిస్థితుల నుంచి టీచర్‌గా ఎదిగిన హుమేరా కృషి ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement