స్ఫూర్తి
చదువులో ‘శభాష్’ అనిపించుకున్న లహరి చదువే ప్రపంచం అనుకోలేదు. సమకాలీన సమాజం నుంచి కూడా ఎన్నో విషయాలను పాఠాలుగా నేర్చుకుంటోంది. విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహతో ముందడుగు వేస్తోంది.
‘మన కోసం మనమే కాదు ఇతరుల కోసం మనం’ అనే స్పృహతో రకరకాల సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగం అవుతున్న సిద్దిపేట జిల్లా తడకపల్లికి చెందిన బండోజీ లహరి బ్యాంకాక్‌లో జరిగిన ‘ఏషియా యూత్ ఇంటర్నేషనల్ మోడల్ యునైటెడ్ నేషన్స్’ సదస్సులో ప్రసంగించింది...
‘ఇది ఆడవాళ్లకు సాధ్యం కాదు’ అనే మాట ఎన్నోచోట్ల విన్నది లహరి. ‘ఎందుకు సాధ్యం కాదు?’ అని ధైర్యంగా అడిగే వయసు కాదు. అయితే చిన్న వయసులోనే రకరకాల సందర్భాలలో శక్తిమంతమైన మహిళల గురించి విన్న లహరికి ‘మహిళలకు సాధ్యం కానిది లేదు’ అనే సత్యం బోధపడింది.
‘ప్రతిభావంతులతో పోటీ పడితే మనలోని ప్రతిభ కూడా మెరుగుపడుతుంది’ అనే పీటీ ఉష మాట ప్రభావంతో ఆటలపై ఆసక్తి పెంచుకుంది. ఎన్నో ఆటల్లో భాగం అయింది.
మదర్ థెరెసా గురించి విన్నప్పుడల్లా ఆమె చేసిన అపారమైన సేవా కార్యక్రమాలలో ఏ కొంచెం చేసినా జీవితం ధన్యం అయినట్లే అనుకునేది. ‘ఇతరుల కోసం జీవించని జీవితం జీవితం కాదు’ అనే మదర్ మాట లహరి మనసులో నాటుకుపోవడమే కాదు సామాజికసేవా కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకునేలా చేసింది.
కరాటే...కిక్ బాక్సింగ్
బాసర ట్రిపుల్‌ఐటీలో ఆర్జీయూకేటీలో ఈసీఈ ఫైనలియర్ చదువుతోంది లహరి. ఎప్పుడూ ఏదో నేర్చుకోవాలనే తపనతో ఉండే లహరి కరాటేలో బ్లాక్‌బెల్ట్ సాధించింది. కిక్ బాక్సింగ్‌లో ప్రాపావీణ్యం సాధించింది. ‘ఖేలో ఇండియా’లో ఉషూ ప్లేయర్‌గా సత్తా చాటింది.
అత్యవసరంగా రక్తం అవసరమున్నవారికి సహాయం అందించేందుకు సిద్ధిపేటలో ‘లహరి బ్లడ్ ఫౌండేషన్ ’ ఏర్పాటు చేసింది. మిత్రులతో కలిసి రక్తదానాలు చేయడం, చేయించేలా ప్రోత్సహించడం చేస్తోంది. కోవిడ్ టైమ్‌లోనూ రిస్క్ తీసుకుని సేవలందించింది. తాను నేర్చుకున్న ఆత్మరక్షణ విద్యలను విద్యార్థినులకు నేర్పిస్తోంది. బాసర ఆర్జీయూకేటీలోనూ స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ (ఎస్‌జీసీ) కౌన్సిల్ మెంబర్‌గా ఉంది. ట్రిపుల్ ఐటీలో ఆపదలో ఉన్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన ఈ ‘హోప్‌హౌజ్ ఫౌండేషన్’’ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటోంది.
ఇటీవల బ్యాంకాక్‌లో నిర్వహించిన ‘ఏషియా యూత్ ఇంటర్నేషనల్ మోడల్ యునైటెడ్ నేషన్స్’ సదస్సుల్లో పాల్గొంది. 36 దేశాల నుంచి 699 మంది పాల్గొన్న ఈ సదస్సుకు మన దేశం నుంచి హాజరైన అయిదుగురిలో లహరి ఒకరు. ఈ సదస్సులో ‘ఉమెన్ ట్రాఫికింగ్ అండ్ మైగ్రేషన్ స్మగ్లింగ్’ అనే అంశంపై మాట్లాడిందామె.
నాన్నలాగే సైన్యంలో చేరి దేశసేవ చేయాలనేది లహరి లక్ష్యం. ఆమె లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం.
లెట్స్ షేప్ ఏ బెటర్ వరల్డ్
కొత్త ప్రదేశం అంటే భౌగోళిక విషయాల పరిచయం మాత్రమే కాదు. ఎన్నో విషయాలను తెలుసుకునే పుస్తక సముద్రం. ‘యూత్ సమ్మిట్’లో పాల్గొనడానికి బ్యాంకాక్‌కు వెళ్లిన లహరి ‘ఇక్కడ ప్రసంగించి వెళ్లిపోతే తన బాధ్యత పూర్తయిపోతుంది’ అనుకోలేదు. ఇటీవల థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ‘లెట్స్ షేప్ ఏ బెటర్ వరల్డ్’ నినాదంతో మొదలైన అంతర్జాతీయ యువ సమ్మేళనంలో వివిధ దేశాల నుంచి వైబ్రెంట్ డెలిగేట్స్ పాల్గొన్నారు. పర్యావరణ సంక్షోభం నుంచి సాంస్కృతిక విశేషాల వరకు ఎన్నో అంశాలపై ఎంతోమంది డెలిగేట్స్‌తో లహరి మాట్లాడింది. ఉద్యమ ప్రయాణంలో వారి అనుభవాలతో స్ఫూర్తి పొందింది. ‘బ్యాంకాక్ సమ్మిట్‌లో పాల్గొనడం గొప్ప అనుభవం’ అంటుంది లహరి.
– రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment