
‘కొత్త’ సంబరం.. రూ.35 కోట్లు
ఉమ్మడి జిల్లాలో రూ.20 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు
దసరాను మరిపించిన మాంసం విక్రయాలు
జోరుగా కేక్‌లు, మిఠాయిల అమ్మకాలు
కనిపించని నోట్ల రద్దు ప్రభావం
మంచిర్యాల రూరల్(హాజీపూర్) కొత్త ఏడాది సంబరం అంబరాన్నంటింది. ఉమ్మడి జిల్లాలో ప్రజలు సుమారు రూ.35 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 31 శనివారానికి తోడు ఆదివారం సెలవు దినం కలిసి రావడంతో కావడంతో జోష్ పెంచింది. మద్యం, మాంసం, కేక్‌లు, మిఠాయిల విక్రయాలు జోరుగా సాగాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని హాజీపూర్ మండలం గుడిపేట లిక్కర్ డిపో పరిధిలో 140 వరకు మద్యం దుకాణాలు, బార్లు, ఉట్నూర్ లిక్కర్ డిపో పరిధిలో 90 మద్యం దుకాణాలు, బార్లు ఉన్నాయి. ఆయా దుకాణాలకు శుక్ర, శని, ఆదివారాల్లో సుమారు రూ.20 కోట్ల విలువైన మద్యం సరఫరా జరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాది అమ్మకాల కన్నా ఈ ఏడాది 25 శాతం ఎక్కువగా అమ్మకాలు జరిగిట్లు అంచనా. మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మద్యంతోపాటు మాంసం, కేక్‌లు, మిఠాయిల, శీతల పానీయాల విక్రయాలు జోరుగా సాగాయి. పలువురు మిఠాయిలు పంచుతూ స్నేహితులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. యువకులు గ్రీటింగ్‌లు, మొబైల్స్‌లో ఇంటర్నెట్ డాటా, ఎస్సెమ్మెస్‌లు, మహిళలు ఇళ్ల ముందు ముగ్గులు వేయడానికి రంగుల కొనుగోలుకు డబ్బులు ఖర్చు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు స్థాయిలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మాంసం, మద్యం విక్రయాలు దసరా పండుగను మరిపించాయి. అన్ని వర్గాల ప్రజలు నూతన సంవత్సర వేడుకలు చేసుకోవడంతో కొనుగోలు పెరిగినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. మంచిర్యాలలో మాంసం దుకాణాలు 50, చికెన్‌సెంటర్లు 30 వరకు ఉన్నాయి. మొత్తంగా జిల్లాలో రూ.60 లక్షల వరకు వ్యాపారం సాగినట్లు తెలుస్తోంది. మంచిర్యాల, సింగరేణి ప్రాంతంలో చికెన్, మటన్ విక్రయాలు శని, ఆదివారాల్లో భారీగా సాగాయి.
కేక్‌లు.. మిఠాయిలు..
నూతన సంవత్సర వేడుకలతో బేకరీలు, మిఠాయి దుకాణాలు కిటకిటలాడాయి. ఒక్క మంచిర్యాల పట్టణంలోనే రూ.70 లక్షల వరకు కేక్‌లు, కూల్‌డ్రింక్స్ అమ్మకాలు జరిగాయి. ఈ లెక్కన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.2 కోట్లపై వరకు అమ్మకాలు జరిగినట్లు అంచనా. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి ఇంటి లోగిళ్ల ముందు రంగులతో ముగ్గులు వేయడానికి మంచిర్యాల పట్టణంలోనే రూ.12 లక్షల విలువైన రంగులు వాడారని వ్యాపారులు తెలిపారు. నాలుగు జిల్లాల వ్యాప్తంగా రూ.కోటి వరకు రంగుల అమ్మకాలు జరిగినట్లు అంచనా. వీటితోపాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి పూలు, బొకెలు, బాణాసంచా తదితర వాటికి పెద్ద మొత్తంలోనే ఖర్చు జరిగినట్లు తెలుస్తుంది. ఏదేమైనా కొత్త సంవత్సరం ప్రజలకు ఆనందాన్ని పంచడానికి భారీగా ఖర్చు పెట్టించింది. నోట్ల రద్దు ప్రభావం ఎక్కడా మచ్చుకు కూడా కనిపించకపోవడం కొసమెరుపు.