
మరో 50 కొత్త పాల కేంద్రాలు
బడేవారిపాలెం(కోడూరు) : మరింత పాల ఉత్పత్తి పెంచేందుకుగానూ కృష్ణామిల్క్ యూనియన్ పరిధిలో కొత్తగా మరో 50 పాలకేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని కృష్ణామిల్క్ యూనియన్ అధ్యక్షుడు మండవ జానకిరామయ్య చెప్పారు. మండల పరిధిలోని బడేవారిపాలెంలో కొత్తగా నిర్మించిన పాలకేంద్రం నూతన భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మండవ మాట్లాడుతూ కృష్ణామిల్క్ యూనియన్ రోజుకు 2.50లక్షల లీటర్లు పాలసేకరణ లక్ష్యంగా ముందుకు వెళుతుందన్నారు.
దేశంలోనే పాల ఉత్పత్తిదారులకు అత్యధికంగా రూ.47కోట్ల బోనస్ ఇస్తున్న ఘనత కృష్ణామిల్క్ యూనియన్‌కే దక్కిందన్నారు. బడేవారిపాలెంలో నూతన భవన నిర్మాణం కోసం రూ.30వేలు సాయమందించిన బడే నారాయణరావు, రూ.50 వేలతో భవన నిర్మాణానికి తోడ్పడిన అధ్యక్షుడు మలిశెట్టి వీరబ్రహ్మవెంకటేశ్వరరావును జానకిరామయ్య అభినందించారు. మండవ జానకిరామయ్యతో పాటు అతిథులను పాలకేంద్రం పాలకవర్గం ఘనంగా సత్కరించింది.
జిల్లాలో మరో 12బీఎంసీలు...
అవనిగడ్డ : జిల్లాలో మరో 12మిల్క్‌బల్క్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని మండవ జానకిరామయ్య తెలిపారు. జిల్లాలోని పడమటిపాలెం, పెడనలో ఇప్పటికే స్థల సేకరణ చేశామని, మోపిదేవి, శ్రీకాకుళం, గరికిపర్రులో ఈ కేంద్రాల ఏర్పాటుకు కృషిచేస్తున్నామని ఆయన చెప్పారు. స్థానిక మిల్క్‌బల్క్ సెంటర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2013-14 ఆర్థిక సంవత్సరంలో రెండు దఫాలుగా లీటరుకు రూ.6 చొప్పున రూ.27కోట్లు పాల ఉత్పత్తిదారులకు బోనస్‌గా చెల్లించామన్నారు.
ప్రస్తుతం పాలసేకరణ ధరను లీటరురూ.55కు పెంచామని తెలిపారు. యూనియన్ మేనేజర్ ఎం.జగన్మోహనరావు, సంఘం డెరైక్టర్లు జాస్తి రాధాకృష్ణ, వేమూరి రత్నగిరి, పామర్రు పాలశీతల కేంద్రం మేనేజర్ గరికపాటి శ్రీధర్, పీఏసీఎస్ అధ్యక్షుడు బడే వెంకటరమణ, ప్రముఖులు బడే నాగరాజు, గుత్తి ప్రసాద్, మారుబోయిన పులేంద్రరావు , బీఎంసీ సూపర్‌వైజర్ బీవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మిల్క్‌యూనియన్ డెరైక్టర్ జాస్తిని మండవ ఘనంగా సత్కరించారు.