తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో భారీగా పెరిగిన పశుసంపద
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పశుసంపద గణనీయంగా వృద్ధి చెందిందని, వాటి విలువ దాదాపు రూ.2 వేల కోట్లు పెరిగిందని కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ వెల్లడించింది. మాంసం, గుడ్లు, పాలు ఉత్పత్తుల్లోనూ రాష్ట్రం వృద్ధి సాధించిందని తెలిపింది. ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. పశుసంపద, గుడ్లు, పాలు, మాంస ఉత్పత్తులకు సంబంధించిన గణాంకాలను ఇందులో పొందుపరిచింది.
ఈ గణాంకాల ప్రకారం.. 2022–23 నాటికి తెలంగాణలో పశు సంపద విలువ రూ.4,789.09 కోట్లుగా నమోదైంది. అయితే రాష్ట్రం ఏర్పాటైన 2014–15లో ఇది రూ.2,824.57 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. కాగా గుడ్ల ఉత్పత్తిలోనూ రాష్ట్రం మంచి ఫలితాలను సాధించింది. 2014–15లో రూ. 228.97 కోట్ల విలువైన గుడ్లను తెలంగాణ ఉత్పత్తి చేస్తుండగా, 2022–23 నాటికి అది రూ.381.04 కోట్లకు చేరింది. ఇక మాంసం ఉత్పత్తుల విలువ పదేళ్ల కాలంలో గణనీయ వృద్ధి సాధించింది.
2014–15లో అన్ని రకాల మాంసం ఉత్పత్తుల విలువ రూ.1,484.05 కోట్లు కాగా, 2022–23 నాటికి అది ఏకంగా రూ.5,531.85 కోట్లకు చేరింది. పశుసంపద గణనీయంగా పెరిగినప్పటికీ పాల ఉత్పత్తిలో మరింత వృద్ధి నమోదు కావలసి ఉందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. 2014–15లో రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి తెలంగాణలో పాల ఉత్పత్తి విలువ రూ.1,350.69 కోట్లు కాగా, 2022–23లో అది రూ.1,874.28 కోట్లకు మాత్రమే పెరిగినట్టు వెల్లడిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment