
ఉపవాసముంటే ఆయుష్షు పెరుగుతుందని ఇప్పటికే చాలా ప్రయోగాలు రుజువు చేశాయి. అయితే మనలో చాలామందికి తిండి లేకుండా ఉండటమన్న ఆలోచనే చికాకు కలిగిస్తూంటుంది. ఇలాంటి వారికోసమే అన్నట్లు కొలరాడో బౌల్డర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఒక శుభవార్త తీసుకొచ్చారు. పాలతో పాటు కొన్ని ఇతర ఆహార ఉత్పత్తుల్లో ఉండే ఒక పదార్థం ఉపవాసం చేయకపోయినా.. దాంతో వచ్చే ఫలితాలన్నింటినీ ఇస్తుందట. అదెలా? అన్న డౌట్ వస్తోందా? చూసేద్దాం మరి. ఈ పదార్థం పేరు నికొటినోమైడ్ రైబోసైడ్. క్లుప్తంగా ఎన్‌ఆర్. మార్కెట్‌లో వాణిజ్య స్థాయిలోనూ లభ్యమయ్యే ఎన్‌ఆర్‌ను రోజుకు వెయ్యి మిల్లీగ్రాముల చొప్పున కొంతమందికి అందించారు. ఆరు వారాలపాటు ఉత్పత్తి మాత్రలు ఇచ్చిన తరువాత ఎన్‌ఆర్‌ను ఇవ్వగా.. ఇంకొంతమందికి ముందు ఎన్‌ఆర్.. ఆ తరువాత ఉత్తుత్తి మాత్రలు ఇచ్చారు.
ఆ తరువాత వారి రక్తాన్ని పరిశీలించినప్పుడు ఉపవాసం చేసినప్పుడు జరిగే మార్పులు చాలావరకూ కనిపించినట్లు స్పష్టమైంది. ఎన్‌ఆర్ తీసుకున్న వారిలో నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ 60 శాతం ఎక్కువగా ఉత్పత్తి అయిందని ఈ రసాయనం సిర్టూయిన్స్ అనే ఎంజైమ్ ఉత్పత్తికి దోహదపడుతుందని తెలిసింది. అంతేకాకుండా ఎన్‌ఆర్ తీసుకున్న వారిలో కొంతమందికి రక్తపోటు కూడా గణనీయంగా తగ్గినట్లు స్పష్టమైంది. మరిన్ని పరిశోధనలు చేసిన తరువాత తాము ఈ పదార్థం ప్రభావాన్ని మరింత కచ్చితంగా మదింపు చేయవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మార్టెన్స్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment