మండపేట (డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ): ఆ గేదె వయసు నాలుగేళ్లు. పాలదిగుబడిలో తన తల్లిని మించిపోయింది. రోజుకు 26.59 లీటర్లు పాలు ఇస్తూ రికార్డు సృష్టించింది. ఆ గేదె తల్లి రోజుకు 26.58 లీటర్లు పాలు ఇస్తూ రాష్ట్రస్థాయి పాల దిగుబడి పోటీల్లో రెండుసార్లు మొదటి స్థానంలో నిలిచింది. తల్లి గేదె ఆరో ఈతలో అత్యధిక దిగుబడి ఇస్తే... నాలుగేళ్ల వయసు కలిగిన పిల్ల గేదె రెండో ఈతలోనే తల్లిని మించి రికార్డు స్థాయిలో రోజుకు 26.59 లీటర్ల పాల దిగుబడిని నమోదు చేసింది.
ఈ విషయాన్ని కేంద్రీయ పశు నమోదు పథకం ప్రతినిధి డి.రాజేశ్వరరావు ఆదివారం నిర్ధారించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణానికి చెందిన పాడి రైతు ముత్యాల సత్యనారాయణ (అబ్బు) మేలుజాతి పశు పోషణ చేస్తున్నారు. ఎనిమిదేళ్ల కిందట ఆయన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ముర్రా జాతి పాడి గేదెను కొనుగోలు చేశారు.
ఆ గేదె గతంలో విజయవాడ, మండపేటల్లో జరిగిన రాష్ట్రస్థాయి పాల దిగుబడి పోటీల్లో రెండుసార్లు మొదటి స్థానంలో నిలిచింది. ఈ గేదె సాధించిన అత్యధిక దిగుబడి 26.58 లీటర్లు. ఇప్పటివరకూ ఆ గేదె తమ వద్ద ఆరు ఈతలు ఈనగా, నాలుగు దున్నపోతులు, రెండు పెయ్యదూడలు పుట్టాయని అబ్బు చెప్పారు.
దున్నపోతుల్లో రెండింటిని సెమన్ సేకరణ కేంద్రాల వారు తీసుకువెళ్లగా, మరో రెండు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం రికార్డు స్థాయిలో పాలదిగుబడిని ఇస్తున్న పెయ్య ఆరో ఈతలో పుట్టిందని వివరించారు. వీటికి దాణాగా రోజుకు రూ.500 ఖర్చుతో పశుగ్రాసాలు, మొక్కజొన్న, ఉలవలు, తవుడు అందిస్తున్నామని ఆయన చెప్పారు.
అధికారికంగా పాలదిగుబడి లెక్కింపు
ప్రస్తుతం కేంద్రీయ పశు నమోదు పథకం కింద మండపేట, పరిసర ప్రాంతాల్లో అత్యధిక పాల దిగుబడి ఇచ్చే పాడి పశువుల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది. కేంద్రీయ పశు నమోదు పథకం ప్రతినిధి డి.రాజేశ్వరరావు పశువుల వద్దకు వెళ్లి మేలుజాతి పాడి గేదెల పాల దిగుబడిని లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా అబ్బుకు చెందిన గేదె ఒక రోజు 26.59 లీటర్ల పాల దిగుబడిని ఇచ్చిందని రాజేశ్వరరావు తెలిపారు.
రెండో ఈతలోనే ఈస్థాయిలో దిగుబడి వస్తే మున్ముందు మరింత పెరుగుతుందని ఆయన చెప్పారు. అత్యధిక దిగుబడినిచ్చే పాడి పశువుల వివరాలను సెమన్ సేకరణ కేంద్రాలకు పంపుతామని, వీటి ద్వారా మేలుజాతి పాడి పశువుల పునరుత్పత్తికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాజేశ్వరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment