న్యూఢిల్లీ: దేశంలో పాల ఉత్పత్తి మందగమనం నేపథ్యంలో కేంద్రం డెయిరీ ప్రొడక్టుల దిగుమతుల అవకాశాలను పరిశీలిస్తోంది. పశుసంవర్ధక, డెయిరీ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన అందించిన అధికారిక సమాచారం ప్రకారం, దేశంలో పాల ఉత్పత్తి 2021–22లో 221 మిలియన్ టన్నులు. ఇది అంతకు ముందు సంవత్సరం (2020–21)తో పోల్చితే (208 మిలియన్ టన్నులు) కేవలం 6.25 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయన వెల్లడించిన అంశాలు క్లుప్తంగా...
► ప్రస్తుతం ఫ్లషింగ్ (పీక్ ప్రొడక్షన్) సీజన్ ప్రారంభమైన దక్షిణాది రాష్ట్రాల్లో పాల నిల్వలను అంచనా వేసిన తర్వాత అవసరమైతే వెన్న, నెయ్యి వంటి పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది.
► పశువులలో గడ్డలు ఏర్పడడానికి సంబంధించిన చర్మవ్యాధి కారణంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలోనూ దేశ పాల ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ వ్యాధి వల్ల గత ఏడాది దాదాపు 1.89 లక్షల పశువులు చనిపోయాయి. అదే సమయంలో దేశీయ డిమాండ్ 8–10% పెరిగింది. కరోనా మహమ్మారి అనంతరం డిమాండ్ పుంజుకుంది.
► పశువుల చర్మవ్యాధి ప్రభావం వల్ల 2022–23లో పాల ఉత్పత్తి కేవలం 1 నుంచి 2 శాతమే పెరిగింది. సాధారణంగా ఈ ఉత్పత్తి వృద్ధి ఏటా 6 శాతంగా ఉంటుంది. 2023–24పైనా అంచనాలు బలహీనంగానే ఉన్నాయి.
► దేశంలో పాల సరఫరాలో ఎటువంటి అడ్డంకు లు లేవు. స్కిమ్డ్ మిల్క్ పౌడర్ (ఎస్‌ఎంపీ) నిల్వ లు తగినంతగా ఉన్నాయి. కానీ పాల ఉత్పత్తులు ముఖ్యంగా కొవ్వులు, వెన్న, నెయ్యి మొదలైన వాటి విషయంలో నిల్వలు తక్కువగా ఉన్నాయి.
► అయితే ఇప్పుడు డెయిరీ ప్రొడక్టుల దిగుమతులు కూడా ఖరీదయిన వ్యవహారమే. ఇది దేశీయ దిగుమతుల బిల్లును పెంచుతుంది. అంతర్జాతీయ ధరలు ఇటీవల పెరగడం దీనికి కారణం. అందువల్లే ప్రస్తుతం ఫ్లషింగ్ (పీక్ ప్రొడక్షన్) సీజన్ ప్రారంభమైన దక్షిణాది రాష్ట్రాల్లో పాల నిల్వలను అంచనా వేయడానికి తొలుత ప్రాధాన్యత ఇస్తున్నాం.
► 20 రోజులుగా అకాల వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వాతావరణ పరిస్థితులు కొంత అనుకూలించడంతో ఉత్తర భారతదేశంలో పాల కొరత కొంత తక్కువగానే ఉంటుందని భావిస్తున్నాం.
► పశుగ్రాసం ధరల పెరుగుదల డెయిరీ రంగంలో ద్రవ్యోల్బణానికీ దారితీస్తుంది. గత నాలుగేళ్లలో పశుగ్రాసం పంట విస్తీర్ణం భారీగా పెరగలేదు.
సహకార రంగమే ప్రాతిపదిక...
అయితే ఇక్కడ ఒక విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వం మొత్తం ప్రైవేట్, అసంఘటిత రంగాన్ని కాకుండా సహకార రంగం నుంచి వచ్చే పాల ఉత్పత్తి డేటాను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రభుత్వ అంచనాలు సహకార రంగం నుంచి అందే గణాంకాల ప్రాతిపదికనే ఉంటుంది. భారత్ 2011లో డెయిరీ ప్రొడక్టులను దిగుమతి చేసుకుంది. అటు తర్వాత ఈ పరిస్థితి రాలేదు.
పాల ఉత్పత్తుల దిగుమతులపై కేంద్రం దృష్టి!
Published Thu, Apr 6 2023 5:10 AM | Last Updated on Thu, Apr 6 2023 5:10 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment