![Talasani Srinivas Yadav Slams Veterinary Officers In Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/24/talasani.jpg.webp?itok=howoWExO)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తొలిసారి తన సొంత శాఖ అధికారులపైనే తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో పూర్తి అలక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారని చుర్రుమన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు లబ్ధిదారుల వద్ద ఉన్నాయా? లేదా? అనే అంశంపై సర్వే నిర్వహించాలని గత సమావేశంలో ఆదేశించినప్పటికీ, ఆ దిశగా చేసిన ప్రయత్నాలేమీ కనిపించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెంచాలని సూచించినా ఆ దిశగా కార్యాచరణ లేకపోవడంపై ఒంటికాలిపై లేచారు. శనివారం మాసాబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో అన్ని జిల్లాల పశు వైద్యాధికారులతో మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. తలసాని మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో మందులు, పరికరాలు ఉన్నప్పటికీ జీవాలకు వైద్యం అందించడంలో కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు వచ్చిన విషయాన్ని ప్రస్తావించి, ఇకపై అలసత్వంగా వ్యవహరించే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
బాధ్యత మీదే..
పాల ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో పాడిగేదెలు పంపిణీ చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఆశించినస్థాయిలో పాల ఉత్పత్తి పెరగడంలేదని, ఇందుకు గల కారణాలను సమీక్షించుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. ప్రభుత్వ పథకాల అమలు పట్ల అలసత్వం వహిస్తే చూస్తు సహించేదిలేదని హెచ్చరించారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, టీఎస్‌ఎల్‌డీఏ సీఈవో మంజువాణి, విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావు, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, వివిధ జిల్లాల పశువైద్యాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment