
సాక్షి, అమరావతి : సహకార చక్కెర కర్మాగారాలు, సహకార డెయిరీలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సహకార చక్కెర కర్మాగారాల పునర్ వైభవానికి సమగ్ర ప్రణాళిక తయారుచేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం పనిచేస్తున్న కర్మాగారాలు, తిరిగి తెరవాల్సిన కర్మాగారాల విషయంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇప్పుడున్న పోటీని తట్టుకోవడానికి, లాభదాయకంగా నడపడానికి అవసరమైన చర్యలను అందులో పొందుపరచాలన్నారు.
కర్మాగారాలను తాజా సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధిచేయడంతో పాటు ఉప ఉత్పత్తులు ద్వారా అవి సొంతకాళ్లమీద నిలబడ్డానికి అవసరమైన అన్ని ఆలోచనలు చేయాలని నిర్దేశించారు. చక్కెర సరఫరా చేసినందుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వీలైనంత త్వరలో చెల్లించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రణాళికలో నిర్దేశించిన విధంగా సహకార డెయిరీలకు పాలు పోస్తున్నందుకు ప్రతి లీటరుకూ రూ.4ల బోనస్ అమలుపైనా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సహకార డెయిరీల బలోపేతం, రైతులకు మరింత లబ్ధి చేకూర్చే అన్నిరకాల చర్యలపైనా వీలైనంత త్వరగా ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సీఎం ఆదేశించారు.