మరింత అభివృద్ధి సాధిద్దాం
పాల ఉత్పత్తిలో అగ్రస్థానం మనదే
అక్షరాస్యతలో ఐదో స్థానం
మామిడి, టమాట ఉత్పత్తుల్లోనూ మనమే కీలకం
గణతంత్ర దిన వేడుకల్లో కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్
చిత్తూరు : జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తోందని, అన్ని విభాగాలు సమర్థవంతంగా పనిచేసి మరింత అభివృద్ధిని సాధించాల్సి ఉందని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ అకాంక్షించారు. పాల ఉత్పత్తిలో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. సోమవారం పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన గణతంత్రదిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ రోజుకు 22 నుంచి 24లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోందన్నారు. మామిడి, టమాట ఉత్పత్తుల్లోనూ కీలక స్థానం ఈ జిల్లాదేనన్నారు. 85 వేల హెక్టార్లల్లో మామిడి, 16వేల హెక్టార్లల్లో టమాట సాగువుతోందని తెలిపారు. ఈ పంటలను విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం కల్పిస్తే రైతులకు గిట్టుబాటు ధర వస్తుందన్నారు. అక్షరాస్యతలో రాష్ట్రంలో ఐదో స్థానంలో ఉండగా, మహిళా అక్షరాస్యతలో ముందంజలో ఉన్నామని తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం మరిన్ని పరిశ్రమలు రావాల్సి ఉందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలన్నారు. జిల్లాలో ప్రధాన పంటలైన వరి, చెరకుతో పాటు పండ్ల తోటల పెంపకానికి పట్టు, పాడి పరిశ్రమ అభివృద్ధికి అవకాశం ఉందన్నారు. ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేసి రైతన్నలు అభివృద్ధి సాధించాలని కోరారు. వ్యవసాయంలో యాంత్రీకరణ తప్పనిసరి అన్నారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో నాణ్యత కోసం రైతులు మూడు సర్వీసులకు ఒక ట్రాన్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. తక్కువ నీటితో పంటల సాగుకు డ్రిప్ ఇరిగేషన్ శ్రేయస్కరమని తెలిపారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలన్నారు. పారిశ్రామిక వేత్తలు జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఆవశ్యకత గుర్తించి వాటి నిర్మాణానికి ప్రజలు ముందుకు రావాలన్నారు. స్వైన్‌ఫ్లూ లాంటి ప్రాణంతక వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. పసిపిల్లలకు వ్యాధుల నివారణలో బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గర్భిణులు పూర్తి స్థాయిలో వైద్యసౌకర్యం ఉన్న ఆస్పత్రిలోనే కాన్పులు చేసుకోవాలన్నారు. స్త్రీలకు సముచిత స్థానం కల్పించాలన్నారు. ప్రతి అమ్మాయి ఆడపిల్లగా పుట్టినందుకు గర్వపడాలన్నారు. సమాజంలో పరివర్తన వస్తేనే స్త్రీజాతి అభివృద్ధి చెందుతుందన్నారు. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. బడిఈడు పిల్లలంతా బడిలో ఉండేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 72.36 అక్షరాస్యత ఉందన్నారు. పురుషుల అక్షరాస్యత 81.15 శాతం కాగా స్త్రీల అక్షరాస్యత 63.65 శాతం మాత్రమే ఉందని తెలిపారు. 2001 - 2011 మధ్య కాలంలో జిల్లా అక్షరాస్యత పెరుగుదల రేటు 5.59 శాతంగా నమోదైందన్నారు. అక్షరాస్యతలో రాష్ట్రంలో జిల్లా ఐదో స్థానంలో ఉందన్నారు. విశాఖలో సంభవించిన హుద్‌హుద్ తుపాను బాధితులకు జిల్లా తరఫున సత్వర సేవలు అందించిన జిల్లా అధికారులకు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ అభినందనలు తెలిపారు. చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ నారాయణభరత్‌గుప్త, జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి, ఎంపీ శివప్రసాద్, జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి, మేయర్ అనురాధ, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
26సీటీఆర్ 02 - జాతీయపతాకాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్
26సీటీఆర్03 గణతంత్ర దినోత్సవ ప్రసంగం చేస్తున్న కలెక్టర్
26సీటీఆర్ 06- హాజరైన అధికారులు