గర్వించేలా గణతంత్రం  | India Celebrates 76th Republic Day With Military Parade On Kartavya Path | Sakshi
Sakshi News home page

గర్వించేలా గణతంత్రం 

Published Mon, Jan 27 2025 4:56 AM | Last Updated on Mon, Jan 27 2025 6:14 AM

India Celebrates 76th Republic Day With Military Parade On Kartavya Path

కన్నులపండువగా రిపబ్లిక్‌ డే వేడుకలు 

సైనిక పాటవం చాటిన అత్యా«ధునిక క్షిపణులు, యుద్ధ విమానాలు 

ఆకట్టుకున్న శకటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు  

సంప్రదాయ గుర్రపు బగ్గీలో విచ్చేసిన రాష్ట్రపతి, సుబియాంటో 

న్యూఢిల్లీ: భారత సైనిక శక్తిని, ఆయుధ పాటవాన్ని, సాంస్కృతి వైభవాన్ని ప్రదర్శిస్తూ 76వ గణతంత్ర వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. అత్యాధునిక క్షిపణులు, యుద్ధ విమానాల ప్రదర్శన, జవాన్ల కవాతు దేశమంతా గర్వంతో ఉప్పొంగేలా సాగాయి. ‘సశక్త్‌ ఔర్‌ సురక్షిత్‌’ పేరిట తొలిసారి ప్రదర్శించిన త్రివిధ దళాల ఉమ్మడి శకటం ఆకట్టుకుంది. 

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఆదివారం జరిగిన ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, త్రివిధ దళాధిపతులు, ప్రముఖుల పాల్గొన్నారు. ఇండొనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో కలిసి రాష్ట్రపతి సంప్రదాయ బగ్గీలో కర్తవ్యపథ్‌కు చేరుకున్నారు. 

త్రివిధ దళాల సైనికులు ఆమెకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పరేడ్‌ ప్రారంభమైంది. మొదట లెఫ్టినెంట్‌ అహన్‌కుమార్‌ నేతృత్వంలో 61 కావల్రీ సైనిక బృందం ముందుకు సాగింది. జాట్‌ రెజిమెంట్, గర్వాల్‌ రైఫిల్స్, మహర్‌ రెజిమెంట్, జమ్మూకశ్మీర్‌ రైఫిల్స్‌ రెజిమెంట్‌ వంటి దళాల కవాతు ఆకట్టుకుంది.

 దేశాభివృద్ధిని, ప్రజల సంక్షేమం, సాధికారతను కళ్లకు కడుతూ పలు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘స్వర్ణిమ్‌ భారత్‌: విరాసత్‌ ఔర్‌ వికాస్‌’ థీమ్‌తో 31 శకటాలను ప్రదర్శించారు. వైమానిక దళానికి చెందిన 40 యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు ఆహూతులను అలరించాయి. 

10 వేల మంది ప్రత్యేక అతిథులు  
రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ప్రముఖులు సహా 10 వేల మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. వీరిలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, విపత్తు సహాయక చర్యల సిబ్బంది, ఆశా వర్కర్లు, పారా ఒలింపిక్‌ అథ్లెట్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, కృషి సఖీలు, ఉద్యోగ్‌ సఖీలు తదితరులు ఉన్నారు. పలు ప్రభుత్వ పథకాల లబి్ధదారులు, రోడ్డు నిర్మాణ కార్మికులు, పేటెంట్‌ హోల్డర్లు, స్టార్టప్‌ కంపెనీల ప్రతినిధులను ఈసారి ప్రత్యేకంగా ఆహ్వానించారు. వీరంతా జాతీయ యుద్ధ స్మారకం, పీఎం సంగ్రహాలయ్‌ తదితర కట్టడాలను సైతం సందర్శించారు.  

నాలో ఇండియన్‌ డీఎన్‌ఏ 
సుబియాంటో సరదా వ్యాఖ్యలు 
ఆహ్లాదంగా  ‘ఎట్‌ హోమ్‌’
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి నిలయంలో ఆదివారం రాత్రి ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమం నిర్వహించారు. గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇండొనేసియా అధ్యక్షుడు సుబియాంటో గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విందు ఇచ్చారు. ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విందు ఆసాంతం సరదా సరదాగా సాగింది. తనకు భారతీయ మూలాలున్నాయని ఈ సందర్భంగా సుబియాంటో చెప్పారు. ‘‘కొన్ని వారాల క్రితమే జెనెటిక్‌ సీక్వెన్సింగ్, డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకున్నా. 

నాలో ఇండియన్‌ డీఎన్‌ఏ ఉన్నట్లు తేలింది. భారతీయ సంగీతం విన్నప్పుడల్లా నేను డ్యాన్స్‌ చేస్తానని అందరికీ తెలుసు. నాలోని ఇండియన్‌ జీన్స్‌లోనే భారతీయ సంగీతం, నృత్యం దాగున్నాయి’’ అని సుబియాంటో చెప్పడంతో అతిథులంతా హాయిగా నవ్వేశారు. తమ భాషలో చాలా భాగం సంస్కృతం నుంచే వచ్చిందిన సుబియాంటో ఈ సందర్భంగా అన్నారు. తమ దేశంలో పేర్లు చాలావరకు సంస్కృతంలోనే ఉంటాయని చెప్పారు. తమరోజువారీ జీవితాల్లో భారతీయ ప్రాచీన నాగరికత ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించారు. భారత్, ఇండొనేసియా మధ్య ఎన్నో సారూప్యతలున్నాయని ఆయన గుర్తు చేశారు.  

మోదీ తలపాగా 
గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ ఎరుపు, పసుపు రంగు గీతలతో కూడిన తలపాగా ‘సఫా’ను ధరించారు. దాంతోపాటు తెల్లరంగు కుర్తా–పైజామా, దానిపై ఊదారంగు బంద్‌గలా జాకెట్‌ ధరించారు. మోదీ ప్రతిఏటా స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర వేడుకల్లో రంగురంగుల తలపాగాలు ధరించడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది గణతంత్ర ఉత్సవాల్లో ఆయన బహుళ రంగులతో కూడిన బాంధానీ ప్రింట్‌ సఫా ధరించారు.  

గూగుల్‌ డూడుల్‌  
76వ గణతంత్ర వేడుకల సందర్భంగా గూగుల్‌ ఆదివారం తీసుకొచ్చిన ప్రత్యేక డూడుల్‌ అందరినీ ఆకట్టుకుంది. లద్దాఖీ దుస్తులు ధరించిన మంచు చిరుత, ధోతీ–కుర్తా ధరించిన పులి వంటి జంతువులు ఇందులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ వాయిద్యాలను ఇవి వాయిస్తున్నట్లుగా ఈ డూడుల్‌ను రూపొందించారు. ఇది జంతువుల పరేడ్‌లా ఉందని చెప్పొచ్చు. అంతర్లీనంగా గూగుల్‌ అనే అక్షరాలు పొందుపర్చారు.  

విదేశాల్లోనూ ఉప్పొంగిన దేశభక్తి  
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశా ల్లోనూ భారత గణతంత్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రవాస భారతీయులతోపాటు స్థానికులు వాటి లో ఉత్సాహంగా పా ల్గొన్నారు. భారతీ యులు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. భార తీయ నృత్యాలను ప్రదర్శించారు. నేపాల్, ఆ్రస్టేలియా, సింగపూర్, చైనా, శ్రీలంక, ఇజ్రాయెల్, జపాన్, ఇండొనేసియా, అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాల్లో రిపబ్లిక్‌ డే నిర్వహించారు. భారత రాయబార కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాలు ఎగురవేశారు.  

సాయుధ శక్తి
దేశీయంగా అభివృద్ధి చేసిన షార్ట్‌–రేంజ్‌ టాక్టికల్‌ మిస్సైల్‌ ‘ప్రళయ్‌’, టీ–90 భీష్మా యుద్ధ ట్యాంక్, నాగ్‌ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్‌ సూపర్‌సానిక్‌ క్రూయిజ్‌ మిస్సైల్, పినాక మల్టీ–లాంచర్‌ రాకెట్‌ సిస్టమ్, అగ్నిబన్‌ మల్టీ–బ్యారెల్‌ రాకెట్‌ లాంచర్, ఆకాశ్‌ ఆయుధ వ్యవస్థ వంటి వాటిని ప్రదర్శించారు. బజరంగ్‌ లైట్‌ స్పెషలిస్టు వాహనం, ఐరావత్‌ మోర్టర్‌ సిస్టమ్, నందిఘోష్, త్రిపురాంతక్‌ వాహనాలు సైతం దర్శనిమిచ్చాయి.  

హైలైట్స్‌  
→ రాజ్యాంగానికి 75 ఏళ్లయిన సందర్భంగా వేడుకలు మరింత వైభవంగా జరిగాయి.
→ గణతంత్ర వేడుకల్లో ఇండొనేసియా అధ్యక్షుడు పాల్గొనడం ఇది నాలుగోసారి. ఆ దేశ సైనిక బృందం కూడా పాలుపంచుకుంది.
→ పరేడ్‌లో పరమ్‌వీర్‌ చక్ర అవార్డు గ్రహీతలు సుబేదార్‌ మేజర్‌ యోగేంద్ర సింగ్‌ యాదవ్, సుబేదార్‌ మేజర్‌ సంజయ్‌ కుమార్,  అశోక చక్ర అవార్డు గ్రహీత లెఫ్టినెంట్‌ కల్నల్‌ జస్‌రామ్‌ సింగ్‌ పాల్గొన్నారు.

కర్తవ్య పథ్‌పై... మోదీ స్వచ్ఛభారత్‌ 
కర్తవ్యపథ్‌పై ప్రధాని మోదీ స్వచ్ఛభారత్‌ చేసి చూపించారు. ఆదివారం జరిగిన గణతంత్ర వేడుకలు ఇందుకు వేదికయ్యాయి. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ను స్వాగతించేందుకు వెళ్తుండగా దారిలో చెత్త కన్పించింది. దాంతో వేడుకల్లో పాల్గొన్న వేలాదిమంది చూస్తుండగా ఆయన కిందకు వంగి దాన్ని ఏరారు. డస్ట్‌బిన్‌లో పడేయాల్సిందిగా సెక్యూరిటీ సిబ్బందికి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మోదీ చర్యను నెటిజన్లంతా ప్రశంసిస్తున్నారు.  

సాయుధ శక్తిదేశీయంగా అభివృద్ధి చేసిన షార్ట్‌–రేంజ్‌ టాక్టికల్‌ మిస్సైల్‌ ‘ప్రళయ్‌’, టీ–90 భీష్మా యుద్ధ ట్యాంక్, నాగ్‌ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్‌ సూపర్‌సానిక్‌ క్రూయిజ్‌ మిస్సైల్, పినాక మల్టీ–లాంచర్‌ రాకెట్‌ సిస్టమ్, అగ్నిబన్‌ మల్టీ–బ్యారెల్‌ రాకెట్‌ లాంచర్, ఆకాశ్‌ ఆయుధ వ్యవస్థ వంటి వాటిని ప్రదర్శించారు. బజరంగ్‌ లైట్‌ స్పెషలిస్టు వాహనం, ఐరావత్‌ మోర్టర్‌ సిస్టమ్, నందిఘోష్, త్రిపురాంతక్‌ వాహనాలు సైతం దర్శనిమిచ్చాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement