మోదీ అనే నేను.. | Narendra Modi takes oath for third time as Prime Minister of India | Sakshi
Sakshi News home page

మోదీ అనే నేను..

Published Mon, Jun 10 2024 3:44 AM | Last Updated on Mon, Jun 10 2024 7:20 AM

Narendra Modi takes oath for third time as Prime Minister of India

ప్రధానిగా నరేంద్రుని ప్రమాణస్వీకారం  వరుసగా మూడోసారి, నెహ్రూ రికార్డు సమం

72 మందితో కొలువుదీరిన కేంద్ర మంత్రివర్గం 

షా, రాజ్‌నాథ్, నిర్మల, గడ్కరీ, జైశంకర్‌ కొనసాగింపు 

ఆంధ్రప్రదేశ్‌కు 3, తెలంగాణకు 2 పదవులు 

కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌లకు కేబినెట్‌ పదవులు 

బండి, పెమ్మసాని, వర్మలకు సహాయ బెర్తులు 

యూపీకి 9, బిహార్‌కు 8, మహారాష్ట్రకు 6 బెర్తులు 

గుజరాత్, మధ్రప్రదేశ్, రాజస్తాన్‌లకు ఐదేసి స్థానాలు 

30 కేబినెట్, 5 స్వతంత్ర, 36 మంది సహాయ మంత్రులు 

11 బెర్తులతో ఎన్డీఏ భాగస్వాములకు సముచిత ప్రాధాన్యం

న్యూఢిల్లీ: స్వతంత్ర భారత రాజకీయాల్లో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ ప్రధానిగా నరేంద్ర దామోదర్‌ దాస్‌ మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత ఈ ఘనత సాధించిన నాయకునిగా రికార్డులకెక్కారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 73 ఏళ్ల మోదీతో ప్రధానిగా ప్రమాణంచేయించారు. ఆయన దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం రాత్రి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అన్ని రంగాలకూ చెందిన అతిరథ మహారథుల సమక్షంలో కార్యక్రమం 155 నిమిషాల పాటు అత్యంత వేడుకగా జరిగింది.

మోదీ సహా 72 మందితో పూర్తిస్థాయి నూతన కేంద్ర మంత్రివర్గం కూడా ఈ సందర్భంగా కొలువుదీరింది. 30 మందితో కేబినెట్‌ మంత్రులుగా, ఐదుగురితో స్వతంత్ర, 36 మందితో సహాయ మంత్రులుగా రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయించారు. బీజేపీకి పూర్తి మెజారిటీ రాని నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన ఎన్డీఏ మిత్రపక్షాలకు మంత్రివర్గంలో 11 బెర్తులతో సముచిత ప్రాధాన్యం దక్కింది. బీజేపీ నుంచి రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, ఎస్‌.జైశంకర్‌ వంటి అతిరథులతో పాటు మిత్రపక్షాల నుంచి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు (టీడీపీ), లలన్‌సింగ్‌ (జేడీయూ), చిరాగ్‌ పాస్వాన్‌ (ఎల్జేపీ), హెచ్‌.డి.కుమారస్వామి (జేడీఎస్‌) తదితరులు ప్రమాణస్వీకారం చేసిన ప్రముఖుల్లో ఉన్నారు.

ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జేడీ(యూ) చీఫ్, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యక్రమంలో పాల్గొనగా తృణమూల్‌ కాంగ్రెస్, సమాజ్‌వాదీతో పాటు పలు విపక్షాలు గైర్హాజరవడం విశేషం. 140 కోట్ల మంది భారతీయులకు మరోసారి సేవ చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందని కార్యక్రమం అనంతరం మోదీ పేర్కొన్నారు.

‘‘నూతన మంత్రివర్గ సహచరులతో కలిసి ప్రగతి పథంలో దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పని చేస్తా. అనుభవం, యువత కలబోతగా కొత్త మంత్రివర్గం అలరారుతోంది. ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు నిరంతరం శ్రమిస్తాం’’ అంటూ ఎక్స్‌లో ఆయన పోస్ట్‌ చేశారు. నూతన మంత్రులకు శాఖల కేటాయింపు సోమవారం జరిగే అవకాశముంది. 

ఆరుగురు మాజీ సీఎంలు 
మోదీ 3.0 మంత్రివర్గం పలు విశేషాల సమాహారంగా రూపుదిద్దుకుంది. బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఐదేళ్ల విరామం తర్వాత కేంద్ర మంత్రివర్గంలోకి అడుగు పెట్టారు. మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్‌ చౌహాన్, కుమారస్వామిలకు తొలిసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. వారితో పాటు నూతన మంత్రివర్గంలో 33 మంది కొత్త ముఖాలున్నాయి. శివరాజ్, కుమారస్వామి, రాజ్‌నాథ్‌సింగ్, మనోహర్‌లాల్‌ ఖట్టర్, సర్బానంద సోనోవాల్, జితిన్‌రాం మాంఝీ రూపంలో నూతన మంత్రివర్గంలో ఆరుగురు మాజీ సీఎంలుండటం విశేషం! 43 మందికి మూడుసార్ల కంటే ఎక్కువగా కేంద్ర మంత్రులుగా చేసిన అనుభవముంది. 

యూపీకి అత్యధికంగా 9 బెర్తులు 
కేంద్ర మంత్రివర్గంలో ఉత్తరప్రదేశ్‌కు అత్యధికంగా 9 స్థానాలు దక్కాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్న కీలకమైన బిహార్‌కు ఏకంగా 8 బెర్తులు దక్కాయి! ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రకు కూడా ఆరు బెర్తులు లభించాయి. గుజరాత్‌కు ఐదు; మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లకు ఐదేసి; హరియాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులకు మూడేసి; ఒడిశా, అసోం, జార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, పశి్చమబెంగాల్‌కు రెండేసి చొప్పున స్థానాలు దక్కాయి.

అయితే యూపీకి ఒకే కేబినెట్‌ హోదా బెర్తు దక్కగా బిహార్‌కు ఏకంగా నాలుగు లభించడం విశేషం! గుజరాత్‌కు కూడా మోదీ, అమిత్‌ షా, మాండవీ, సీఆర్‌ పాటిల్‌ రూపంలో ఏకంగా నాలుగు కేబినెట్‌ హోదా బెర్తులు దక్కాయి! మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లకు మూడేసి; మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఒడిశాలకు రెండేసి కేబినెట్‌ మంత్రి పదవులు దక్కాయి. తెలంగాణ, ఏపీలతో పాటు హరియాణా, పంజాబ్‌లకు ఒక్కో కేబినెట్‌ హోదా బెర్తు దక్కాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి 13 మందికి మంత్రివర్గంలో చోటు దక్కింది. 

37 మందికి ఉద్వాసన 
మోదీ 2.0 మంత్రివర్గంలో పని చేసిన వారిలో స్మృతీ ఇరానీ, అనురాగ్‌ ఠాకూర్, నారాయణ్‌ రాణే సహా ఏకంగా 37 మందికి ఈసారి కేబినెట్లో చాన్స్‌ దొరకలేదు. వీరిలో పలువురు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 2.0 మంత్రివర్గంలోని 19 మంతి కేబినెట్‌ మంత్రులతో సహా మొత్తం 34 మంది తిరిగి చోటు దక్కించుకున్నారు. వీరిలో తమిళనాడుకు చెందిన ఎల్‌ మురుగన్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ఓడినా చాన్స్‌ దక్కడం విశేషం. ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. కొత్త మంత్రుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు చొప్పున 12 మంది రాజ్యసభ సభ్యులున్నారు. 58 మంది లోక్‌సభ సభ్యులు కాగా రవ్‌నీత్‌సింగ్‌ బిట్టూ, జార్జి కురియన్‌ ఏ సభలోనూ సభ్యలు కారు. వారు ఆర్నెల్లలోగా పార్లమెంటు సభ్యులుగా ఎన్నికవాల్సి ఉంటుంది. 

భాగస్వాములకు పెద్దపీట 
ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు నూతన మంత్రివర్గంలో సముచిత స్థానం దక్కింది. తాజా మాజీ మంత్రివర్గంలో వాటికి ఒక్క కేబినెట్‌ హోదా, స్వతంత్ర హోదా మంత్రి పదవి కూడా లేదు. ఈసారి మాత్రం కుమారస్వామి (జేడీఎస్‌), మాంఝి (హెచ్‌ఏఎల్‌), లలన్‌సింగ్‌ (జేడీయూ), రామ్మోహన్‌ నాయుడు (టీడీపీ), చిరాగ్‌ పాస్వాన్‌ (ఎల్జేపీ–ఆర్‌వీ) రూపంలో ఏకంగా ఐదు కేబినెట్‌ హోదా బెర్తులు దక్కాయి! ప్రతాప్‌రావ్‌ జాదవ్‌ (శివసేన), జయంత్‌ చౌదరి (ఆరెల్డీ)లకు స్వతంత్ర హోదా కూడిన పదవులు లభించాయి. 2.0 మంత్రివర్గంలో సహాయ మంత్రులైన అనుప్రియా పటేల్‌ (అప్నాదళ్‌–యూపీ), రామ్‌దాస్‌ అథవాలె (ఆర్‌పీఐఏ–మహారాష్ట్ర)లకు మళ్లీ చాన్సిచ్చారు. వారితో పాటు రామ్‌నాథ్‌ ఠాకూర్‌ (జేడీయూ), పెమ్మసాని చంద్రశేఖర్‌ (టీడీపీ)లకు సహాయ మంత్రి పదవులు దక్కాయి. 

కొత్త మంత్రులు 33 మంది 
మోదీ 3.0 మంత్రివర్గంలో 33 కొత్త ముఖాలకు చోటు దక్కింది. మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్, కుమారస్వామి, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తదితర దిగ్గజాలతో పాటు తొలిసారి ఎంపీలుగా నెగ్గిన సురేశ్‌ గోపి తదితరుల దాకా వీరిలో ఉన్నారు. 

24 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం 
కేంద్ర మంత్రివర్గంలో 24 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం దక్కింది. గోవా, అరుణాచల్‌ వంటి చిన్న రాష్ట్రాలను మినహాయిస్తే నలుగురు, అంతకంటే ఎక్కువ మంది లోక్‌సభ సభ్యులున్న ప్రతి రాష్ట్రం నుంచీ కనీసం ఒక్కరికి మంత్రివర్గంలో స్థానం లభించింది. 

ఏడుగురు మహిళలు 
నూతన మంత్రివర్గంలో మహిళలు 10 శాతం కంటే తక్కువే ఉన్నారు. మొత్తం ఏడుగురికి స్థానం దక్కింది. 

ఇదీ కులాల కూర్పు 
మోదీ 3.0 మంత్రివర్గంలో 27 మంది ఓబీసీ, 10 మంది ఎస్సీ, ఐదుగురు ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారు. కా>గా ఐదుగురు మైనారిటీలున్నారు. అయితే ముస్లింలు ఒక్కరు కూడా లేకపోవడం విశేషం. 

ఇంకో 8 మందికి అవకాశం 
కేంద్ర మంత్రివర్గ గరిష్ట పరిమాణం 81 (543 మంది లోక్‌సభ సభ్యుల్లో 15 శాతం). దాంతో మరో 9 మందికి మంత్రులుగా అవకాశముంది. అయితే 2019–24 మధ్య మోదీ 2.0 మంత్రివర్గంలో 78 మంది సభ్యులే ఉన్నారు. 

అత్యంత పిన్న వయసు్కలు రామ్మోహన్, ఖడ్సే 
నూతన కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి చెందిన కింజరాపు రామ్మోహన్‌ నాయుడు (టీడీపీ), మహారాష్ట్రకు చెందిన రక్షా ఖడ్సే (బీజేపీ) అత్యంత పిన్న వయసు్కలు. వారికి 37 ఏళ్లు. అత్యంత పెద్ద వయసు్కనిగా 79 ఏళ్ల హెచ్‌ఏఎల్‌ అధినేత జితిన్‌రాం మాంఝీ నిలిచారు. 

బాక్సు నేడు కేబినెట్‌ తొలి భేటీ 
మోదీ 3.0 మంత్రివర్గ తొలి సమావేశం సోమవారం జరగనుంది. లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని మోదీ నివాసంలో సాయంత్రం భేటీ ఉంటుందని సమాచారం. నూతన మంత్రివర్గ సభ్యులందరికీ బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆదివారం రాత్రి విందు ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement