న్యూఢిల్లీ: భారత 75వ గణతంత్ర వేడుకల్లో నారీ శక్తి వెల్లివిరిసింది. శుక్రవారం ఢిల్లీలో కర్తవ్య పథ్‌లో జరిగిన వేడుకలు మన సైనిక పాటవ ప్రదర్శనకు కూడా వేదికగా నిలిచాయి. దేశ ఘన సాంస్కృతిక చరిత్రకు అద్దం పట్టాయి. ఆర్మీ మిలిటరీ పోలీస్ విభాగానికి చెందిన కెపె్టన్ సంధ్య సారథ్యంలో తొలిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితో జరిగిన త్రివిధ దళాల కవాతు అందరినీ ఆకట్టుకుంది.
నేవీ, డీఆర్‌డీఓ శకటాలతో పాటు మణిపూర్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, హరియాణా, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి పలు రాష్ట్రాల శకటాలు కూడా ఆసాంతం నారీ శక్తికి అద్దం పట్టేలా రూపొందాయి. 265 మంది మహిళా సిబ్బంది మోటార్ సైకిళ్లపై ఒళ్లు గగుర్పొడిచేలా డేర్‌డెవిల్ విన్యాసాలు చేశారు. సంప్రదాయ మిలిటరీ బ్యాండ్ స్థానంలో కూడా ఈసారి 112 మంది మహిళా కళాకారులు శంఖం, నాదస్వరాలతో పాటు గిరిజన తదితర సంగీత వాయిద్యాలతో అలరించారు.
బీఎస్‌ఎఫ్, సీఆరీ్ప ఎఫ్ మొదలుకుని ఢిల్లీ పోలీస్, ఎన్‌సీసీ వంటి పలు విభాగాల కవాతులన్నీ పూర్తిగా నారీమయంగా మారి అలరించాయి. వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వీటన్నింటినీ ఆసాంతం ఆస్వాదిస్తూ కని్పంచారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కలిసి ఆయన సంప్రదాయ గుర్రపు బగ్గీలో ఆయన వేడుకలకు విచ్చేయడం విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం జరిగిన పరేడ్‌లో ముర్ము, మేక్రాన్ త్రివిధ దళాల వందనం స్వీకరించారు.
90 నిమిషాలకు పైగా జరిగిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు సైనిక దళాల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. వణికించే చలిని, దట్టంగా కమ్మేసిన పొగ మంచును లెక్క చేయకుండా భారీ జనసందోహం వేడుకలను తిలకించింది. ఈసారి ఏకంగా 75 వేల మందికి పైగా గణతంత్ర వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు. మోదీ వారితో కలివిడిగా మాట్లాడుతూ గడిపారు. ఫొటోలు, సెలీ్ఫలకు పోజులిచ్చారు. ఆయన ధరించిన రంగురంగుల బంధనీ తలపాగా ఆహూతులను ఆకట్టుకుంది.
మోదీ రాక సందర్భంగా భారత్ మాతా కీ జై అంటూ వారు చేసిన నినాదాలతో కర్తవ్య పథ్ మారుమోగింది. ఫ్రాన్స్‌కు చెందిన 95 మంది సభ్యుల కవాతు దళం, 30 మందితో కూడిన సైనిక వాయిద్య బృందం కూడా వేడుకల్లో పాల్గొన్నాయి. చివరగా వాయుసేనకు చెందిన 29 యుద్ధ విమానాలు, ఏడు రవాణా విమానాలు, 9 హెలికాప్టర్లు, ఒక హెరిటేజ్ ప్లేన్‌తో పాటు ఫ్రాన్స్ వైమానిక దళానికి చెందిన ఎయిర్‌బస్ ఏ330 మల్టీ ట్యాంకర్ రావాణా విమానం, రెండు రాఫెల్ ఫైటర్ జెట్లు చేసిన ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ విన్యాసాల్లో కూడా 15 మంది మహిళా పైలట్లు పాల్గొనడం విశేషం.
అలరించిన నాగ్ మిసైల్ వ్యవస్థ
► వేడుకల్లో ప్రదర్శించిన టీ–90 భీష్మ ట్యాంకులు, నాగ్ మిసైల్ వ్యవస్థ, తేజస్ వంటి యుద్ధ వాహనాలు, ఆయుధాలను గుర్తించే రాడార్ వ్యవస్థ స్వాతి, డ్రోన్లను జామ్ చేసే వ్యవస్థ, అత్యాధునిక ఎల్రక్టానిక్ వార్‌ఫేర్ వ్యవస్థ, క్యూఆర్‌ఎస్‌ఏఎం తదితర క్షిపణులు అలరించాయి.
మోదీ నివాళులు
శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ తొలుత నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించారు. దేశమాత రక్షణలో ప్రాణాలొదిలిన సైనిక వీరులకు ఘనంగా నివాళులరి్పంచారు. అనంతరం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ముర్ము, మేక్రాన్ గుర్రపు బగ్గీలో వస్తున్న దృశ్యాలను కెమెరాలు, సెల్ ఫోన్లలో బంధించేందుకు జనం పోటీ పడ్డారు. అనంతరం జెండా వందనం, జాతీయ గీతాలాపన, 105 ఎంఎం దేశీయ శతఘ్నులతో 21 గన్ సెల్యూట్ అందరినీ ఆకట్టుకున్నాయి. భారత కీర్తి పతాకను వినువీధిలో ఘనంగా ఎగరేసిన చంద్రయాన్ థీమ్‌తో రూపొందిన శకటం అలరించింది.
దాంతోపాటు అయోధ్య రామాలయ ప్రారంభం నేపథ్యంలో కొలువుదీరిన బాలక్ రామ్ శకటం ప్రధానాకర్షణగా నిలిచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 16 శకటాలు, కేంద్ర శాఖలకు సంబంధించి 9 శకటాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. వేడుకలు ముగిశాక మోదీ కర్తవ్య పథ్ పొడవునా కాలినడకన సాగి ఆహూతులను అలరించారు. మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్లు, ముఖ్యమంత్రులు తదితరులు వాటిలో పాల్గొన్నారు.
గొప్ప గౌరవం: మేక్రాన్
‘‘గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం నాతో పాటు ఫ్రాన్స్‌కు కూడా గొప్ప గౌరవం. థాంక్యూ ఇండియా. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీతో పాటు భారత ప్రజలందరికీ గణతంత్ర దిన శుభాకాంక్షలు’’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ పేర్కొన్నారు. వేడుకల అనంతరం ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. గణతంత్ర వేడుకల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా పాల్గొనడం ఇది ఆరోసారి కావడం విశేషం! ఈ వేడుకలకు దేశాధినేతలను ముఖ్య అతిథిగా ఆహా్వనించడం ఆనవాయితీగా వస్తోంది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నెల్సన్ మండేలా (1995లో) మొదలుకుని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (2015లో) దాకా ఎందరో అధినేతలు వీటిలో భాగస్వాములయ్యారు.
దేశాధినేతల అభినందనలు
బ్రిటన్ రాజు చార్లెస్ 3 మొదలుకుని ఆ్రస్టేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు దాకా పలు దేశాల అధినేతలు భారత్‌కు 75వ గణతంత్ర దిన శుభాకాంక్షలు తెలిపారు. అభినందన సందేశాలతో సామాజిక వేదికల్లో పోస్టులు పెట్టారు. భారత్‌తో బ్రిటన్ సంబంధాలు నానాటికీ పటిష్టమవుతున్నాయని రాష్ట్రపతి ముర్ముకు పంపిన సందేశంలో కింగ్ చార్లెస్ హర్షం వెలిబుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment