cultural history
-
Republic Day 2024: నారీశక్తి విశ్వరూపం
న్యూఢిల్లీ: భారత 75వ గణతంత్ర వేడుకల్లో నారీ శక్తి వెల్లివిరిసింది. శుక్రవారం ఢిల్లీలో కర్తవ్య పథ్‌లో జరిగిన వేడుకలు మన సైనిక పాటవ ప్రదర్శనకు కూడా వేదికగా నిలిచాయి. దేశ ఘన సాంస్కృతిక చరిత్రకు అద్దం పట్టాయి. ఆర్మీ మిలిటరీ పోలీస్ విభాగానికి చెందిన కెపె్టన్ సంధ్య సారథ్యంలో తొలిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితో జరిగిన త్రివిధ దళాల కవాతు అందరినీ ఆకట్టుకుంది. నేవీ, డీఆర్డీఓ శకటాలతో పాటు మణిపూర్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, హరియాణా, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి పలు రాష్ట్రాల శకటాలు కూడా ఆసాంతం నారీ శక్తికి అద్దం పట్టేలా రూపొందాయి. 265 మంది మహిళా సిబ్బంది మోటార్ సైకిళ్లపై ఒళ్లు గగుర్పొడిచేలా డేర్‌డెవిల్ విన్యాసాలు చేశారు. సంప్రదాయ మిలిటరీ బ్యాండ్ స్థానంలో కూడా ఈసారి 112 మంది మహిళా కళాకారులు శంఖం, నాదస్వరాలతో పాటు గిరిజన తదితర సంగీత వాయిద్యాలతో అలరించారు. బీఎస్ఎఫ్, సీఆరీ్ప ఎఫ్ మొదలుకుని ఢిల్లీ పోలీస్, ఎన్సీసీ వంటి పలు విభాగాల కవాతులన్నీ పూర్తిగా నారీమయంగా మారి అలరించాయి. వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వీటన్నింటినీ ఆసాంతం ఆస్వాదిస్తూ కని్పంచారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కలిసి ఆయన సంప్రదాయ గుర్రపు బగ్గీలో ఆయన వేడుకలకు విచ్చేయడం విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం జరిగిన పరేడ్‌లో ముర్ము, మేక్రాన్ త్రివిధ దళాల వందనం స్వీకరించారు. 90 నిమిషాలకు పైగా జరిగిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు సైనిక దళాల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. వణికించే చలిని, దట్టంగా కమ్మేసిన పొగ మంచును లెక్క చేయకుండా భారీ జనసందోహం వేడుకలను తిలకించింది. ఈసారి ఏకంగా 75 వేల మందికి పైగా గణతంత్ర వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు. మోదీ వారితో కలివిడిగా మాట్లాడుతూ గడిపారు. ఫొటోలు, సెలీ్ఫలకు పోజులిచ్చారు. ఆయన ధరించిన రంగురంగుల బంధనీ తలపాగా ఆహూతులను ఆకట్టుకుంది. మోదీ రాక సందర్భంగా భారత్ మాతా కీ జై అంటూ వారు చేసిన నినాదాలతో కర్తవ్య పథ్ మారుమోగింది. ఫ్రాన్స్‌కు చెందిన 95 మంది సభ్యుల కవాతు దళం, 30 మందితో కూడిన సైనిక వాయిద్య బృందం కూడా వేడుకల్లో పాల్గొన్నాయి. చివరగా వాయుసేనకు చెందిన 29 యుద్ధ విమానాలు, ఏడు రవాణా విమానాలు, 9 హెలికాప్టర్లు, ఒక హెరిటేజ్ ప్లేన్‌తో పాటు ఫ్రాన్స్ వైమానిక దళానికి చెందిన ఎయిర్‌బస్ ఏ330 మల్టీ ట్యాంకర్ రావాణా విమానం, రెండు రాఫెల్ ఫైటర్ జెట్లు చేసిన ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ విన్యాసాల్లో కూడా 15 మంది మహిళా పైలట్లు పాల్గొనడం విశేషం. అలరించిన నాగ్ మిసైల్ వ్యవస్థ ► వేడుకల్లో ప్రదర్శించిన టీ–90 భీష్మ ట్యాంకులు, నాగ్ మిసైల్ వ్యవస్థ, తేజస్ వంటి యుద్ధ వాహనాలు, ఆయుధాలను గుర్తించే రాడార్ వ్యవస్థ స్వాతి, డ్రోన్లను జామ్ చేసే వ్యవస్థ, అత్యాధునిక ఎల్రక్టానిక్ వార్ఫేర్ వ్యవస్థ, క్యూఆర్ఎస్ఏఎం తదితర క్షిపణులు అలరించాయి. మోదీ నివాళులు శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ తొలుత నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించారు. దేశమాత రక్షణలో ప్రాణాలొదిలిన సైనిక వీరులకు ఘనంగా నివాళులరి్పంచారు. అనంతరం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ముర్ము, మేక్రాన్ గుర్రపు బగ్గీలో వస్తున్న దృశ్యాలను కెమెరాలు, సెల్ ఫోన్లలో బంధించేందుకు జనం పోటీ పడ్డారు. అనంతరం జెండా వందనం, జాతీయ గీతాలాపన, 105 ఎంఎం దేశీయ శతఘ్నులతో 21 గన్ సెల్యూట్ అందరినీ ఆకట్టుకున్నాయి. భారత కీర్తి పతాకను వినువీధిలో ఘనంగా ఎగరేసిన చంద్రయాన్ థీమ్‌తో రూపొందిన శకటం అలరించింది. దాంతోపాటు అయోధ్య రామాలయ ప్రారంభం నేపథ్యంలో కొలువుదీరిన బాలక్ రామ్ శకటం ప్రధానాకర్షణగా నిలిచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 16 శకటాలు, కేంద్ర శాఖలకు సంబంధించి 9 శకటాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. వేడుకలు ముగిశాక మోదీ కర్తవ్య పథ్ పొడవునా కాలినడకన సాగి ఆహూతులను అలరించారు. మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్లు, ముఖ్యమంత్రులు తదితరులు వాటిలో పాల్గొన్నారు. గొప్ప గౌరవం: మేక్రాన్ ‘‘గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం నాతో పాటు ఫ్రాన్స్‌కు కూడా గొప్ప గౌరవం. థాంక్యూ ఇండియా. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీతో పాటు భారత ప్రజలందరికీ గణతంత్ర దిన శుభాకాంక్షలు’’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ పేర్కొన్నారు. వేడుకల అనంతరం ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. గణతంత్ర వేడుకల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా పాల్గొనడం ఇది ఆరోసారి కావడం విశేషం! ఈ వేడుకలకు దేశాధినేతలను ముఖ్య అతిథిగా ఆహా్వనించడం ఆనవాయితీగా వస్తోంది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నెల్సన్ మండేలా (1995లో) మొదలుకుని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (2015లో) దాకా ఎందరో అధినేతలు వీటిలో భాగస్వాములయ్యారు. దేశాధినేతల అభినందనలు బ్రిటన్ రాజు చార్లెస్ 3 మొదలుకుని ఆ్రస్టేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు దాకా పలు దేశాల అధినేతలు భారత్‌కు 75వ గణతంత్ర దిన శుభాకాంక్షలు తెలిపారు. అభినందన సందేశాలతో సామాజిక వేదికల్లో పోస్టులు పెట్టారు. భారత్‌తో బ్రిటన్ సంబంధాలు నానాటికీ పటిష్టమవుతున్నాయని రాష్ట్రపతి ముర్ముకు పంపిన సందేశంలో కింగ్ చార్లెస్ హర్షం వెలిబుచ్చారు. -
LoreKeepers: మా కథలు మా సొంతం
అవ్వలు, తాతలు గతించిపోతే వారికి తెలిసిన జానపద సంపద కూడా అంతరించిపోతుంది. మన పెద్దల నుంచి వినాల్సిన ఎన్నో కథలు, పాటలు, సామెతలు, ఉదంతాలు ఇప్పటికే మన నిర్లక్ష్యం వల్ల అందకుండా పోయాయి. కేరళలో చిన్నారులు ఇకపై ఇలా జరగడానికి వీల్లేదంటున్నారు. తల పండిన వృద్ధుల దగ్గర కూచుని వారికి తెలిసిన మౌఖిక జానపద కథలను రికార్డు చేస్తున్నారు. ‘ది లోర్ కీపర్స్’ పేరుతో పిల్లలు ఇలా కథలు సేకరించేందుకు ఒక ఎన్.జి.ఓ. ప్రతి బడికి తిరిగి శిక్షణనిస్తోంది. ఇది చాలా మంచి ఆలోచన కదూ. బహుశా ఇప్పుడున్న నానమ్మ, తాతయ్యల తరమే కొద్దోగొప్పో జానపద వారసత్వాన్ని కాపాడుకున్న తరం కావచ్చు. ఆ తర్వాతి తరమంతా సెల్ఫోన్ల తరం. టీవీల తరం. ఓటీటీల తరం. ఇప్పుడు పల్లెల్లో ఎవరూ గుంపుగా కూచుని కథలు చెప్పుకోవడం లేదు. తరం నుంచి తరానికి అందాల్సిన మాటలను చెప్పుకోవడం లేదు. పాటలను పంచుకోవడం లేదు. ఆటలను ఆడుకోవడం లేదు. ‘స్థానిక సంస్కృతి’, ‘జానపద వారసత్వం’ ప్రతి సమూహానికి ఉంటుంది. అది ఉమ్మడి ఆస్తి. జాగ్రత్తగా తరం నుంచి తరానికి అందించాలి. తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు వరకూ ప్రతి సమూహంలోని ఎందరో వృద్ధులకు– చదవడం, రాయడం రాకపోయినా కథలూ గాథలూ పురాణాల స్థానిక ప్రక్షిప్తాలు చారిత్రక ఘటనలు తెలిసి ఉంటాయి. వారు గతించితే అవి అంతరించిపోతాయి. ఇప్పటికే ఎన్నో తరాల వద్ద నుంచి స్వీకరించి నిక్షిప్తం చేయాల్సిన మౌఖిక జానపద సంపదను రికార్డు చేయడంలో చాలా నిర్లక్ష్యం పాటించి ఉన్నాం. ఇప్పటికీ అరకొరగా మాత్రమే ఆ పని జరుగుతూ ఉంది. ఈ తరం కూడా దాటిపోతే ఆ తర్వాత తెల్లముఖం వేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో కేరళ మేల్కొంది. ఇప్పటి వృద్ధతరం వెళ్లిపోక ముందే వారి నుంచి జానపద సంపదను అందుకోవాలనుకుంది. ‘ఆర్కయివల్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్’ (ఏ.ఆర్.పి.ఓ) అనే స్వచ్ఛంద సంస్థ ‘ది లోర్ కీపర్స్’ పేరుతో పిల్లల్నే సైనికులుగా రంగంలో దింపి జానపద కథలను రికార్డు చేయించి డిజిటల్ ఆర్కయివ్గా నిక్షిప్తం చేయనుంది. ► కరోనా సమయంలో ఆలోచన ‘ఆర్కయివల్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్’ వ్యవస్థాపకుల్లో ఒకడైన స్రుతిన్ లాల్ కేరళలో జర్నలిస్ట్. కరోనా సమయంలో లక్షలాదిగా ఇళ్లకు మళ్లిన వలస కార్మికుల వ్యధను రికార్డు చేయడానికి ఢిల్లీ నుంచి లక్నో వరకు వారితో పాటు 600 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేశాడు. వారి దీనాలాపనను రికార్డు చేశాడు. ఆ సమయంలో వారి మాటలను రికార్డు చేయకపోతే ఆ తర్వాత ఆ సందర్భం, ఆ మాటలు రెండూ మిస్ అయిపోతాయి. భావితరాలకు ఆ వేదన అందదు. సరిగ్గా ఆ సమయంలోనే వృద్ధతరం దగ్గర ఉన్న జానపద సంపద అతనికి గుర్తుకొచ్చింది. ‘నా బాల్యంలో అమ్మమ్మ, నానమ్మలు చెప్పే కథలు ఇప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు చెప్పడం లేదు. ఏవో కొద్దిమంది దగ్గరే అలాంటివి మిగిలి ఉన్నాయి... వాటిని కాపాడుకోవాలి’ అనుకున్నాడతడు. ఆ ఆలోచన ఎన్.జి.ఓ. స్థాపనకు కారణమై మార్జినలైజ్డ్ సెక్షన్స్ దగ్గర వున్న కళారూపాలను నిక్షిప్తం చేసే పనికి అతణ్ణి పురిగొల్పింది. ► పిల్లలే సైనికులు మౌఖిక జానపద కథకు వారసులు బాలలు. వారికే ఆ విలువైన జానపద సంపద అందాలి. అలా అందాలంటే వారే నేరుగా రంగంలోకి దిగాలి అనుకున్నాడు స్రుతిన్ పాల్. ‘ఇప్పుడు దాదాపు ప్రతి చిన్నారికి సెల్‌ఫోన్ అందుబాటులో ఉంది. వారు సెల్‌ఫోన్‌ను అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు. అన్నీ టక్కున నేర్చుకుంటారు. వారికి రికార్డు చేసి ఎడిట్ చేయడం నేర్పిస్తే వారే పెద్దవాళ్ల దగ్గర కూచుని అన్నీ చెప్పించుకుంటారు. పైగా పిల్లలు అడిగితే చెప్పడానికి అవ్వలు, తాతలు ఇష్టపడతారు కూడా’ అంటాడు లాల్. అందుకోసం తన సంస్థ తరఫున కొందరు వాలంటీర్లను కేరళలోని వివిధ జిల్లాల స్కూళ్లకు పంపడం మొదలెట్టాడు. వారు స్కూల్లో పిల్లలకు మౌఖిక జానపద సంపద సేకరణ గురించి చెప్పి, సెల్‌ఫోన్‌తో పెద్దవాళ్లు చెప్పే కథలను ఎలా రికార్డు చేసి తమకు పంపాలో నేర్పుతారు. ఇక పిల్లలు ఊరుకుంటారా? రంగంలో దిగి వరదలా వీడియోలు పంపుతున్నారు. అవన్నీ నిక్షిప్తం అవుతున్నాయి. ► విన్నవీ కన్నవీ కాశీమజిలీ కథలో, కాటమరాజు కథలో, మర్యాద రామన్న కథలో, పూటకూళ్లమ్మ కథలో... అడవి కథలో, వేట కథలో, వ్యవసాయ కథలో, ప్రకృతి కథలో, గొడ్డుగోదా కథలో, రాజు పేదా కథలో... ఏవో కథలు ఒకప్పుడు చెప్పుకోని, వినని వారు ఉండరు. అయితే అందరూ గుర్తు పెట్టుకుని మళ్లీ చెప్పే స్టోరీ టెల్లర్లు కారు. కొందరు మాత్రమే ‘కథల పుట్ట’గా ఉంటారు. వీరు స్థానిక జ్ఞానాన్ని కథల్లో దాచి ఉంటారు. అవి రికార్డు కావాలి. కేరళలో ఇప్పుడు ఆ పని జరుగుతూ ఉంది. నిజానికి ప్రతిచోటా ప్రభుత్వాలు పూనుకుని ఈ పని చేస్తే ప్రతి ప్రదేశంలోని విలువైన కథలు బయటికొస్తాయి. యూట్యూబ్‌లాంటి మాధ్యమాల వల్ల అందరికీ తెలుస్తాయి. కేరళ మేల్కొంది. అందరూ మేల్కొనాలి. -
శాతవాహనులు.. సామాజిక, సాంస్కృతిక చరిత్ర
మత్స్యపురాణం ప్రకారం శాతవాహనులు 19 మంది రాజులు. ఈ రాజ్య స్థాపకుడు సిముకుడు తన నాణేలపై ఒక వైపు ఏనుగు బొమ్మ, మరోవైపు ఉజ్జయిని ముద్రలను ముద్రించాడు. ఇతని పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు తిరుగుబాటు చేసి చంపేశారని జైన మత గ్రంథాలు తెలుపుతున్నాయి. తర్వాత కన్వ లేదా కృష్ణుడు దక్షిణ భారతదేశంలో భాగవతం మతాన్ని స్థాపించాడు. ఇతను శ్రావణుల కోసం నాసిక్‌లో ఒక గుహాలయం నిర్మించాడు. మొదటి శాతకర్ణి: మత్స్యపురాణం మొదటి శాతకర్ణిని మల్లకర్ణిగా పేర్కొంది (మత్స్య పురాణానికి వ్యాఖ్యానం రాసింది- యజ్ఞశ్రీ శాతకర్ణి, 27వ రాజు). ఇతని కాలంలో మగధలో చివరి మౌర్య రాజు బృహద్రదుడుని అతని సేనాని పుష్యమిత్రుడు చంపి శుంగ రాజ్యాన్ని స్థాపించాడు. మొదటి శాతకర్ణి కాలంలో శాతవాహనులు స్వతంత్రులుగా మారారు. ఇతను.. మారాఠా రాజు ఖ్యాకైరో కుమార్తె దేవినాగానిని వివాహం చేసుకున్నాడు. తొలిసారి దక్కన్ రాజ్యంలో అశ్వమేధ యాగాలు నిర్వహించాడు. దీంతో అతణ్ని ‘దక్షిణాపథపతి’ అని పిలిచేవారు. మొదటి శాతకర్ణి తర్వాత వరుసగా పూర్ణోత్సంగ, స్కందస్తంబి పరిపాలించారు. తర్వాత రెండో శాతకర్ణి రాజ్యానికి వచ్చాడు. ఇతడు సుదీర్ఘ కాలం 56 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతడు ఒడిశా/కళింగ, పాటలీపుత్రం ప్రాంతాలను జయించినట్లుగా ఆనందుడు అనే కవి పేర్కొన్నాడు. ఇతని తర్వాత వరుసగా లంబోదరుడు, అప్పీలకుడు, మేఘస్వాతి, స్వాతి, స్కందస్వాతి, మృగేంద్రుడు రాజ్యానికి వచ్చారు. మృగేంద్రుడి కాలంలోనే బేత్లేహాంలో ఏసుక్రీస్తు జన్మించాడు (ఏసుక్రీస్తుకు సమకాలీకుడుగా మృగేంద్రుడు ప్రసిద్ధి). కుంతల శాతకర్ణి (13వ రాజు): కుంతల శాతాకర్ణి ఆస్థానంలోని వాత్సాయనుడు కామసూత్ర అనే గ్రంథాన్ని (దీన్ని ప్రపంచంలోని 57 భాషల్లోకి అనువాదం చేశారు) రాశాడు. ఈ గ్రంథంలో 64 కళలు ముఖ్యంగా సంగీతం, చిత్రలేఖనం గురించి వివరణ ఉంది. ఇతనితర్వాత పులోమావి-1 పాలనలోకి వచ్చాడు. ఇతనికి కవివత్సలుడు అనే బిరుదు ఉంది (ఈ బిరుదు హాలునికి కూడా ఉంది). ఇతడు పాటలీపుత్రంపై దాడిచేసి మగధ, తెలంగాణ, ఉత్తర మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మాళ్వ ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.పులోమావి-1 తర్వాత హాలుడు (ఇతనికి కవివత్సలుడు అనే బిరుదు కలదు) రాజ్యానికి వచ్చాడు. ఇతడు 17వ శాతవాహన రాజు. ఇతడు గొప్పకవి. గాథాసప్తశతి అనే గ్రంథాన్ని ప్రాకృత భాషలో రాశాడు. దీనిలో 700 కథలు ఉన్నాయి. ఇందులో తెలంగాణలోని గ్రామీణ కథల గురించి పూర్తి వివరాలను పేర్కొన్నాడు. హాలుని వివాహం లీలావతితో ద్రాక్షారామంలో జరిగిందని కుతూహాలుడు తన గ్రంథంలో పేర్కొన్నాడు. కాని ఇక్కడ గమనించాల్సిన అంశం.. ద్రాక్షారామం అంటే ప్రస్తుత రాజమండ్రి ప్రాంతాలోనిది కాదు. డాక్టర్ సంగన భట్ల నర్సయ్య చెప్పినట్లు కరీంనగర్ జిల్లాలోని ధర్మపురికి సమీపంలోని వేంపల్లి వెంకటరావు పేట దగ్గర గోదావరి తీరంలో ఉన్న భీమేశ్వరాలయం. ఇక్కడ గోదావరి ఏడు పాయలుగా చీలి ఉంటుంది. హాలుని తర్వాత వరుసగా మందూలక, పురేంద్ర సేన, సుందర శాతకర్ణి, చకోర శాతకర్ణి, శివస్వాతి పాలించారు. సుందర శాతకర్ణి కాలంలోనే క్షహారాట/క్షాత్రప/శక రాజ వంశీయులు భూమక నాయక త్వంలో సౌరాష్ట్ర, మాళ్వ, అజ్మీర్ భూభాగాలను ఆక్రమించి రాజ్య స్థాపన చేశారు. ఈ వంశంలో నహాపాణుడు గొప్పవాడు. గౌతమీపుత్ర శాతకర్ణి: గౌతమీ పుత్ర శాతకర్ణి విజయాలు గౌతమి బాలాశ్రీ నాసిక్ శాసనంలో ఉన్నాయి. సకూర రాజ్యం: రాజస్థాన్, శతగిరి: నాగార్జునకొండ. వైజయంతి: కర్నాటక రాజ్యాలను జయించినట్లుగా ఈ శాసనం పేర్కొంటుంది. ఏక బ్రాహ్మణ, క్షత్రీయ దర్పమాన, ద్విజకుల మర్దన మొదలైన బిరుదులు కూడా ఉన్నట్లు తెలుపుతుంది. తల్లి పేరుతో ‘మాతృసంజ’్ఞను ధరించాడు. బెనకటకంను నాసిక్ (మహారాష్ట్ర) ప్రాంతంలో నిర్మించి ‘గనబెనటక స్వామి’గా ప్రసిద్ధి చెందాడు. ‘జోగల్తంబి’ వద్ద ఇతని నాణేలు లభించాయి. నహాపాణుడుని ఓడించి అతని నాణేలను తిరిగి తన పేరుతో ముద్రించాడు. గౌతమీ పుత్రశాతకర్ణిని ‘పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ిసీ’ గ్రంథంలో గ్రీకు మాంబరస్గా ఒక గ్రీకు నావికుడు పేర్కొన్నాడు. తర్వాత రెండో పులోమావి (వశిష్ట పుత్ర పులోమావి-24వ రాజు), శివశ్రీ శాతకర్ణి (25వ రాజు), శివస్కంద శాతకర్ణి (26వ రాజు) పాలించారు. యజ్ఞశ్రీ శాతకర్ణి: 27వ శాతవాహన రాజు. చివరి శాతవాహనులలో గొప్పవాడు. ఇతనికి ‘త్రిసముద్రాధిపతి’,‘నవనగరస్వామి’ అనే బిరుదులు ఉన్నాయని హర్షుడి ఆస్థానంలోని బాణుడు అనే కవి తన ‘కాదంబరి’ గ్రంథంలో పేర్కొన్నాడు. కాకులం-థాయిలాండ్, త్రి లింగా-బర్మా, తామ్రపర్ణి-శ్రీలంక, రజతక దేశం-అరకాన్ దేశాలతో సంబంధాలు కలిగి ఉన్నాడు. ఇతడు మత్స్యపురాణాన్ని క్రోడీకరించి బౌద్ధ మత వ్యాప్తికి తోడ్పడ్డాడు. అమరావతి స్థూపాన్ని, నాగార్జునకొండలోని మహా చైత్యాన్ని నిర్మించాడు. ఇతని కాలంలో బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని నిరసిస్తూ ‘చిత్తశుద్ధి’ అనే గ్రంథాన్ని ఆర్య దేవుడు రాశాడు. శాతవాహనులలో చివరి రాజు మూడో పులోమావి. పాలనాంశాలు: శాతవాహనుల పాలనకు కౌటుల్యుని అర్థ్ధశాస్త్రం,ఆపస్తంభ శాస్త్రం మార్గదర్శకంగా నిలిచాయి. రాజరికం పితృస్వామంపై ఆధారపడి ఉండేది. రాజ్యాన్ని ఆహారాలుగా విభజించారు. ‘నిగమసభ (పట్టణ పాలన), గుల్మిక (గ్రామ పెద్ద), అక్షపటాల’ (రాజు ఆదేశాలను అమలుచేసే అధికారి) పాలనలో ముఖ్యులు. వ్యవసాయంపై 1/6 వంతు అంటే 18 శాతం పన్ను విధించే వారు. రజువాహాక భూమిని సర్వేచేసే అధికారి. నిష్టి శేద్య బానిసలు, ఆద్యాంతిక, వర్తక సంఘాలు కూడా ముఖ్యపాత్ర పోషించేవి. ‘సుహానక’ స్వర్ణకారులు రోమ్ నుంచి వచ్చే బంగారంతో అనేక ఆభరణాలు చేసేవారు. బరుకచ్చ, సోపార, కళ్యాణి, కోరంగి, అరికరుడు మొదలైన ఓడరేవు కేంద్రాలు ఉండేవి. రాజభాగం, దేయమేయం ప్రధానమైన పన్నులు. వీటితోపాటు వృత్తి పన్నులు (కారుకర) కూడా విధించే వారు. శాతవాహనులు కటక స్కందావారాన్ని (మిలటరీ క్యాంపులు) పోషించేవారు. వీరి కాలంలో అమరావతి ప్రసిద్ధ విద్యా కేంద్రం. నాగార్జున కొండలో విశ్వవిద్యాలయాన్ని నాగార్జునుడు స్థాపించాడు. నాగార్జునుడు రాసిన ‘ఆకుతోభయమనే’ వ్యాఖ్యానం ప్రసిద్ధి. సాంఖ్యశాస్త్రం, వైశేషిక శాస్త్రాలను ఖండిస్తూ ఆర్యదేవుడు చిత్తశుద్ది గ్రంథం రాశాడు. గుణాడ్యుడు తొలి తెలంగాణ కవి. ఇతడు బృహత్కథను పైశాచి ప్రాకృత భాషలో రాశాడు. దీనిలోని కథలు నైతిక విలువలతో కూడుకున్నవి. జైనం, బౌద్ధ్దం, శైవం, భాగవత మతాలను పోషించారు. బౌద్ధ్దంలో పూర్వ శైలులు, అపర శైలులు, ఉత్తర శైలులు, రాజగిరికలు, సిద్ధ్దార్దిక శైవులతోపాటు ప్రాజ్ఞావాదం, మోగాచార వాదం, జ్ఞానవాదం మొదలైన సిద్ధాంతాలు అభివృద్ధి చెందాయి. ప్రసిద్ధ ఫణిగిరి బౌద్ధ స్థూపం (నల్లగొండ జిల్లా) ఈ కాలం నాటిదే. శిల్పకళ - చిత్రకళ: శాతవాహనుల కాలంలో తెలంగాణాలో శిల్పకళ బాగా అభివృద్ధి చెందింది. నాగార్జున కొండ, కొండాపురం, గాజులబండతోపాటు, ఆంధ్రాలోని అమరావతి, జగ్గయ్యపేట, భట్టిప్రోలు, ఘంటసాల, గుడివాడ మొదలైన ప్రాంతాల్లో కూడా వీరి శిల్పకళ బాగా ప్రాచుర్యం పొందింది. శాతవాహనుల నిర్మాణాల్లో అనేక గదులు వరండాలతో కూడా ఉండేవి. నిద్రించడానికి వీలుగా రాతి బల్లలతో ‘విహారాలు’ నిర్మించారు. ఈ ‘విహారాలు’ (బౌద్ధ భిక్షువుల విశ్రాంతి మందిరాలు) చతురస్ర ఆకారంలో ఉంటాయి. వీటిలో గ్రీకు, రోమన్’ శిల్పకళ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా ‘పశు - పక్షాద్యులు’ చిత్రణ కూడా కనిపిస్తుంది. శాతవాహనుల కాలం నాటి బౌద్ధ శిల్పకళకు గౌతమీపుత్ర శాతకర్ణి ఎంతోసేవ చేశాడు. ‘సాంచీ’ స్థూపానికి ‘తోరణాలు’ చెక్కించాడు. తన తల్లి గౌతమి బాలాశ్రీ పేరిట ‘భదయ’నీయ గుహ విహారాన్ని బౌద్ధశాఖ సన్యాసుల కోసం చెక్కించాడు. అజంత గుహలో (పదో గుహ)ని శ్వేత గజం వీరి కాలం నాటిదే. వాస్తు కళ: ‘చైత్యాలయాలు (బౌద్ధ పూజా మందిరాలు)’ నిర్మాణం లోనూ శాతవాహనుల ‘వాస్తు కళ’ను గమనించవచ్చు. నాగార్జునకొండ, కొండాపూర్‌లలో నిర్మించిన చైత్యాలయాల్లో అద్భుత వాస్తుకళ ఉన్నట్లు ‘ఫెర్గూసన్’ వ్యాఖ్యానించాడు. ఖమ్మం జిల్లాలోని ‘నేలకొండపల్లి’లో బయటపడిన కాల్చిన ఇటుకలతో చేసిన బౌద్ధ స్థూపం అన్నిటి కంటే పెద్దది. శాతవాహనుల కాలానికి చెందిన దాదాపు ‘150’ శాసనాలు మెదక్ జిల్లాలోని జహీరాబాద్, ఆంధోల్, సంగారెడ్డి, రామాయంపేటలో లభించాయి. నల్లగొండ జిల్లాలోని ‘ఫణిగిరి’లో అనేక బౌద్ధ స్థూపాలు బయట పడ్డాయి. ‘ఫణిగిరి’లో లభించిన బౌద్ధ స్థూపాల లక్షణాలు: ప్రాకారంపై చెక్కిన జంతువుల శిల్పాలు ద్వార స్తంభాలపైన చెక్కిన చక్రాలు, అంగుళీకాలు ఉపరి భాగాన చెక్కిన తోరణాల మాదిరిగా కనిపించే యక్షులమూక స్థూపంపైన వృత్తాకార, అర్ధవృత్తాకార పళ్లాల్లో ఉన్న ‘పద్మాలు’ కొండాపూర్, కోటిలింగాల, ఫణిగిరిల్లో లభించిన వస్తువులను బట్టి ‘చేతి పనుల్లో వారి నైపుణ్యం తెలుస్తుంది. కొండాపూర్‌లో సీసం, కంచు నాణేలు లభించాయి. ఈ ప్రదేశం చైత్యాలయాలకు, ఆరామ, విహారాలకు నిలయంగా ఉండేది. ఒక ‘టంకశాల’ను కూడా ఇక్కడ నిర్మించారు. శాతవాహనుల అనంతర శిల్పకళ: శాతవాహనులు ప్రాచుర్యం కల్పించిన ‘బౌద్ధ శిల్పకళను ’ తర్వాత వచ్చిన ఇక్ష్వాకులు ఉన్నతస్థితికి తీసుకెళ్లి బౌద్ధులకు స్వర్ణయుగంగా చేశారు. వీరికాలం నాటి శిల్పకళకు‘విజయపురి’కి ఉన్న ప్రాకారాలు, ఆగడ్త, కోటలోపలి పలు భవనాలను నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఏహుంవల ఛాంతామూలుడు కాలంలోనే ‘దేవాలయ నిర్మాణాలు’ ముమ్మరంగా సాగాయి. నాగార్జునకొండలోని కార్తికేయ, పుష్పభద్ర, హారతి, అష్టభుజస్వామి, కుబేర, నవగ్రహాలయాలు ఇందుకు చక్కని ఉదాహరణలు. వీరపురుష దత్తుడు నాగార్జునకొండల్లో ‘ఐదు’ ప్రసిద్ధ శిల్పాలు నిర్మించాడు. అవి. 1.బుద్ధుడు స్వర్గం నుంచి కిందికి దిగుతున్నట్లు ఉంటుంది. రాజు బుద్ధుని వద్దకు వెళుతూ ఉంటాడు. ఐదుగురు రాణులు అతన్ని నివారిస్తూ ఉంటారు. 2.రాణులు ఆటంకాలను నివారిస్తూ రాజు బుద్ధునికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లు ప్రతిమ ఉంటుంది. 3.రాజు బుద్ధుడిని సమీపిస్తూ తన కుడికాలుతో పెక్కు పడగలతో రక్షితమైన శివలింగాన్ని అణగదొక్కే దృశ్యం ఉంది. అణగదొక్కిన మతం బ్రహ్మమతం. మహస్త్రశ్వర పూజ అయి ఉండొచ్చు. ఈ దృశ్యాన్ని తిలకించే వారిలో రాజదర్బారు సభ్యులందరూ ఉన్నారు. 9వ స్థూపం వద్ద ఇలాంటి శిల్పమే ఉంది. 4.రాజు సాధారణ వస్త్రాలతో ఎనిమిది మంది అనుచరులతో బౌద్ధ సన్యాస ఆశ్రమానికి వెళతాడు. 5.రాజు తన వద్ద ఉన్న ధనాన్ని ‘బౌద్ధ భిక్షువులకు’, పేదలకు దానం ఇస్తున్నట్లు శిల్పాలు ఉన్నాయి. ఇక్ష్వాకులు తమ శిల్ప నిర్మాణానికి లేత ఆకుపచ్చని పాలరాతిని వినియోగించే వారు. ఇక్కడ శిల్పాల్లో మరొకటి ‘కవచం, ఉష్ణీవం ధరించిన సిథియన్ సైనికుని’ శిల్పం ప్రసిద్ధి చెందింది. ‘సతీ సహగమనం’ ఆచారాన్ని తెలియజేసే ఏకైక శిల్పం ఇదే! (సతీసహగమనం’ గురించి వివరాలు అందిం చే ఏకైక శాసనం ‘ఎరాన్’. ఇది గుప్తుల కాలం నాటిది. సతీసహగమనాన్ని రద్దు చేసింది భారత తొలి గవర్నర్ జనరల్ అయిన విలియం బెంటింక్, 1829 డిసెంబర్ 4న). పుట్టు పూర్వోత్తర సిద్ధాంతాలు హన్మంత రావు: శాతవాహనులను ‘ఆర్యులు’ అని పేర్కొన్నాడు. అగస్త్యుడు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వైపు వచ్చి ‘దక్షిణ భారతదేశ వాస్కోడిగామా’ గా ప్రసిద్ధి చెందాడు అని తెలిపాడు. ‘ఐతరేయ బ్రహ్మణం’లో సంబంధించిన వివరాలు ఉన్నాయి.ఆర్.ఎస్. బ్రహ్మ: శాతవాహనులను ఆర్య మతం స్వీకరించిన ‘ద్రవిడులు’గా పేర్కొన్నాడు. ప్రొఫెసర్ వి.వి.మోరాశి: శాతవాహనులను మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన వారిగా పేర్కొన్నాడు. వి.ఏ.స్మిత్: శాతవాహనులను ‘తెలంగాణ’వారని పేర్కొన్నాడు. వీరి తొలి రాజధాని కోటిలింగాల(కరీనంగర్). -
తొలి సాంఘిక తెలుగు కావ్యం బసవ పురాణం
పూర్వ సాహిత్యం తెలుగువారి సాంస్కృతిక చరిత్రలో పాల్కురికి సోమనాథుడు సాధించ ప్రయత్నించిన సంస్కరణ చాలా ప్రభావపూరితమైనది. శక్తిమంతమైనది. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించిన ప్రథమాంధ్ర వీరశైవ కవిగా మాత్రమే కాక సామాజిక స్పృహతో సాహిత్యాన్ని సృష్టించిన భక్తి ఉద్యమకవిగా తెలంగాణ కవిగా కూడా అతడి స్థానం విశిష్టమైనది. పాల్కురికి (1160-1240) ‘శివకవి త్రయం’ అనబడే ముగ్గురు కవుల్లో మల్లికార్జున పండితారాధ్యుడు, నన్నెచోడుడుల కంటే కూడా ప్రధానమైనవాడు. వీరశైవాన్ని ప్రచారం చేసిన కవుల్లో ప్రథముడు. పాల్కురికి కాలానికి సాంస్కృతికంగా బౌద్ధం, జైనం బలహీన స్థితిలో ఉన్నాయి. జైనులు, బౌద్ధులు రంగం నుంచి తప్పుకున్న తర్వాత బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఎదిరించే కర్తవ్యాన్ని అందుకొని వీరశైవం ముందుకు వచ్చింది. ఇందుకు కర్నాటకలో కూడలి సంగమ క్షేత్రాన్ని స్థావరంగా చేసుకొని వీరశైవాన్ని ప్రచారం చేసిన బసవేశ్వరుడు (1134-1196) మూలపురుషుడిగా నిలిచాడు. బ్రాహ్మణుల ఇంట జన్మించిన బసవేశ్వరుడు బాల్యంలోనే వైదిక క్రతువులను, పుట్టుక ఆధారంగా మనుషులకు సిద్ధం చేసి పెట్టిన వివక్షను ఏవగించుకున్నాడు. ‘మనుషులంతా ఒక్కటే. కులాలు ఉపకులాలు లేవు’ అని ఆయన చేసిన తిరుగుబాటు ప్రజల గుండెలను తాకి ప్రతిధ్వనించడమే కాక తెలుగు నేలకి కూడా చేరి వరంగల్లు ప్రాంతంలో ఉన్న పాల్కురికి సోమనాథుడిని ప్రభావితం చేసింది. ఆయన బసవేశ్వరుడ్ని రెండవ శంకరుడన్నాడు. ఆ ఆరాధనతో బసవన్న కథను బసవపురాణం పేరుతో తెలుగులో మొట్టమొదటి దేశిపురాణంగా లిఖించాడు. బసవపురాణం- పురాణం మాత్రమేకాక ఏడు అశ్వాసాల స్వతంత్ర చారిత్రక కావ్యం కూడా. భక్తిరసం, వీరరసం ఇందులో ప్రధానమైనవి. బసవని అవతరణం, సంస్కారోత్సవాలు, ప్రబోధాలు, లింగైక్యం అనే ముఖ్య అశ్వాసాల్లో మనం తెలుసుకోవాల్సిన చరిత్ర కనిపిస్తుంది. నడుమ భక్తజన కథలు ఉంటాయి. పాల్కురికి వర్ణించిన భక్తుల్లో శిశుభక్తులు, స్త్రీ భక్తులు, ముగ్ధభక్తులు, మొండి భక్తులు, ప్రౌఢభక్తులు ఉన్నారు. వీరిలో వివిధ వర్ణాలకు చెందిన వారు ఉన్నారు. బసవనికి సమకాలికులైన అల్లమ ప్రభు, మడివాలు మాచయ్య, సిద్ధరామయ్య వంటి అనేకులున్నారు. రుద్ర పశుపతి, గొడగూచి, బెజ్జ మహాదేవి వంటి ముగ్ధభక్తులు ఉన్నారు. వీరశైవం ప్రబోధించి ఆచరించిన స్త్రీ పురుష సమానత్వాన్ని, కులరాహిత్యాన్ని పాల్కురికి తన రచనలో తీక్షణంగా చిత్రిక పట్టి ఆ దిశలో సంస్కరణ కోసం గట్టిగా కృషి చేశాడు. పాల్కురికి సామాజిక దృక్పథంలో ద్యోతకమయ్యే సంఘ సంస్కరణాభిలాష బసవేశ్వరుడు చెప్పిందే. బసవేశ్వరుడు ప్రతిపాదించిన విధుల్లో ముఖ్యమైనవి- వర్ణాశ్రమ ధర్మాల మీద తిరుగుబాటు; జంగమాపూజకు ప్రాధాన్యం; స్త్రీలకి పురుషులతో సమానంగా మోక్షసాధన మార్గాన్ని ఎన్నుకొనే స్వేచ్ఛ; స్థావర మూర్తుల పూజపట్ల వైముఖ్యం... జంగమ పూజకు ప్రాధాన్యం; పుట్టుక కారణంగా సంక్రమించిన అస్పృశ్యతని ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించడం; సమానత్వాన్ని పాటించడం; పంచవిధ సూతకాలలో నాలుగింటిని కూడా తిరస్కరించడం (ఇవి పురుడు, ఉచ్చిష్టం, బహిష్టూ, చావు సందర్భాలలో పాటించే అశౌచాలు); ఉపనయన సంస్కారాన్ని తిరస్కరించడం; మరణించినవారికి చేసే శ్రాద్ధ కర్మల నిరసన; మద్యమాంసాల విసర్జన.... పాల్కురికి తన కావ్యంలో ఈ విధివిధానాలకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చాడు. ఉదాహరణకి సిరియాళుడి కథలో శివుడు హలాయుధునితో సంవాదం చేస్తూ సుతుని చంపి ఆ మాంసంతో విందు చేశానని అంటే హలాయుధుడు వెటకారంగా- ‘శివ! శివ! యిది యేమి చెప్పెదవయ్య శివుడేమి నరుల భక్షింప రక్కసుడె? శిశువు సద్భక్తుని సిరియాళునంబి పశువరింపగ జంపభక్తి హీనుండె?!’ ఇది మాంసాహార విసర్జన అనే నిబంధనని గాఢంగా ప్రజల్లో నాటడానికి చెప్పిన విషయమని అర్థమవుతూనే ఉంది. బసవేశ్వరుడి ప్రబోధాలకు అనుగుణంగా ‘ఎట్టి దుర్గతిని బుట్టిననేమి యెట్లును శివభక్తుడిల పవిత్రుండు’ అన్నాడు. మత ప్రచారానికి సంస్కృత భాష వాడాలనే ఆచారాన్ని సోమనాథుడు బద్దలు కొట్టాడు. నన్నయ భారతాంధ్రీకరణలో అధిక శాతం సంస్కృత పదాలు కనిపిస్తే అందుకు పూర్తి విరుద్ధంగా పాల్కురికి బసవపురాణంలో దేశీ ఛందస్సు, నానుడులు, జాతీయాలు, పలుకుబళ్లు ప్రాధాన్యం వహిస్తాయి. ద్విపద, రగడలే కాకుండా సోమనాథుడు ఇంకా సీసం, త్రిభంగి, తరువోజ, క్రౌంచ పదం, మయూరం, చతుర్విధ కందం, తిపాస కందం వంటి స్థానిక ఛందోరీతుల ప్రయోగం చేశాడు. ‘రగడ’ అనే ఛందోరీతిని సోమనాథుడే ప్రారంభించాడు. సీస పద్యాల్లో సోమన ప్రయోగం చేశాడు. శ్రీనాథుడికి సీస పద్య రచనలో మార్గదర్శనం చేసింది సోమన సీస పద్యాలే. అలాగే బద్దెన సుమతీ శతకం కంద పద్యాలకు మార్గం చూపింది సోమనాథుడి కంద పద్యాలే. భాషలో, పద ప్రయోగాల్లో సోమనాథుడు స్వేచ్ఛగా ప్రయోగాలు చేశాడు. వైరి సమాసాలు విరివిగా వాడాడు. వస్తువు మారినప్పుడు శైలి విధానాలు కూడా మారుతాయని చెప్పడానికి బసవపురాణం మంచి ఉదాహరణ. అయితే సోమనాథుడి బసవపురాణానికి ముందు ఛందశ్శాస్త్రం ఏదీ లేదని, అతని రచన తర్వాత వచ్చిన ఛందశ్శాస్త్రాలతో దాన్ని బేరీజు వేయడం తగదని అంటారు. పాల్కురికి వాడిన మాటలు గమనించదగ్గవి. గ్రూపులు కట్టడాన్ని గుంపిడటం, తక్కువగా గౌరవించటాన్ని సోల, చాలాకొద్ది సమయాన్ని గోరంతపొద్దు అన్నాడు. ఇక అసాధ్యం అనడానికి ‘కుంచాలతో మంచు కొలవటం’ అనే చక్కని జాతీయాన్ని ప్రయోగిస్తాడు. పుష్పవిల్లు, భూమితీరు, వేడి పయోధార వంటి ప్రయోగాలు అలవోకగా చేసినట్టుగా కనిపిస్తాయి. ప్రజలకు సూటిగా తన భావాలను ప్రసరింపజేయడానికి అనువైన శైలి, అభివ్యక్తి తీరుతెన్నులను సోమనాథుడు ఎంచుకున్నాడు. అదే సమయంలో సృజనాత్మకతకు పట్టం కట్టాడు. ఆ రకంగా పాల్కురికి సోమనాథుడు కావ్యగౌరవం కలిగిన బసవపురాణాన్ని ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా రచించి ప్రజాకవిగా నిలిచాడు. తెలంగాణలోని ఎక్కువ శూద్రకులాలు శైవ మతాన్ని ఆలింగనం చేసుకున్నారని చెప్పడానికి అనువైన పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. ఆ రకంగా సామాజిక విప్లవకారుడిగా సోమనాథుడు కనిపిస్తాడు. బసవపురాణం తెలుగు సమాజంలో సంఘసంస్కరణోద్యమ గ్రంథంగా నిలిచిపోతుంది. - కాసుల ప్రతాపరెడ్డి (ఇటీవల మెదక్ జిల్లా జోగిపేట డిగ్రీ కళాశాలలో పాల్కురికి సోమనాథుడిపై జరిగిన సదస్సులో సమర్పించిన పత్రంలో కొంత భాగం)