బామ్మల నుంచి కథలు రికార్డ్ చేస్తున్న పిల్లలు
అవ్వలు, తాతలు గతించిపోతే వారికి తెలిసిన జానపద సంపద కూడా అంతరించిపోతుంది. మన పెద్దల నుంచి వినాల్సిన ఎన్నో కథలు, పాటలు, సామెతలు, ఉదంతాలు ఇప్పటికే మన నిర్లక్ష్యం వల్ల అందకుండా పోయాయి. కేరళలో చిన్నారులు ఇకపై ఇలా జరగడానికి వీల్లేదంటున్నారు. తల పండిన వృద్ధుల దగ్గర కూచుని వారికి తెలిసిన మౌఖిక జానపద కథలను రికార్డు చేస్తున్నారు. ‘ది లోర్ కీపర్స్’ పేరుతో పిల్లలు
ఇలా కథలు సేకరించేందుకు ఒక ఎన్.జి.ఓ. ప్రతి బడికి తిరిగి శిక్షణనిస్తోంది. ఇది చాలా మంచి ఆలోచన కదూ.
బహుశా ఇప్పుడున్న నానమ్మ, తాతయ్యల తరమే కొద్దోగొప్పో జానపద వారసత్వాన్ని కాపాడుకున్న తరం కావచ్చు. ఆ తర్వాతి తరమంతా సెల్‌ఫోన్‌ల తరం. టీవీల తరం. ఓటీటీల తరం. ఇప్పుడు పల్లెల్లో ఎవరూ గుంపుగా కూచుని కథలు చెప్పుకోవడం లేదు. తరం నుంచి తరానికి అందాల్సిన మాటలను చెప్పుకోవడం లేదు. పాటలను పంచుకోవడం లేదు. ఆటలను ఆడుకోవడం లేదు. ‘స్థానిక సంస్కృతి’, ‘జానపద వారసత్వం’ ప్రతి సమూహానికి ఉంటుంది.
అది ఉమ్మడి ఆస్తి. జాగ్రత్తగా తరం నుంచి తరానికి అందించాలి. తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు వరకూ ప్రతి సమూహంలోని ఎందరో వృద్ధులకు– చదవడం, రాయడం రాకపోయినా కథలూ గాథలూ పురాణాల స్థానిక ప్రక్షిప్తాలు చారిత్రక ఘటనలు తెలిసి ఉంటాయి. వారు గతించితే అవి అంతరించిపోతాయి. ఇప్పటికే ఎన్నో తరాల వద్ద నుంచి స్వీకరించి నిక్షిప్తం చేయాల్సిన మౌఖిక జానపద సంపదను రికార్డు చేయడంలో చాలా నిర్లక్ష్యం పాటించి ఉన్నాం.
ఇప్పటికీ అరకొరగా మాత్రమే ఆ పని జరుగుతూ ఉంది. ఈ తరం కూడా దాటిపోతే ఆ తర్వాత తెల్లముఖం వేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో కేరళ మేల్కొంది. ఇప్పటి వృద్ధతరం వెళ్లిపోక ముందే వారి నుంచి జానపద సంపదను అందుకోవాలనుకుంది. ‘ఆర్కయివల్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్’ (ఏ.ఆర్.పి.ఓ) అనే స్వచ్ఛంద సంస్థ ‘ది లోర్ కీపర్స్’ పేరుతో పిల్లల్నే సైనికులుగా రంగంలో దింపి జానపద కథలను రికార్డు చేయించి డిజిటల్ ఆర్కయివ్‌గా నిక్షిప్తం చేయనుంది.
► కరోనా సమయంలో ఆలోచన
‘ఆర్కయివల్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్’ వ్యవస్థాపకుల్లో ఒకడైన స్రుతిన్ లాల్ కేరళలో జర్నలిస్ట్. కరోనా సమయంలో లక్షలాదిగా ఇళ్లకు మళ్లిన వలస కార్మికుల వ్యధను రికార్డు చేయడానికి ఢిల్లీ నుంచి లక్నో వరకు వారితో పాటు 600 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేశాడు. వారి దీనాలాపనను రికార్డు చేశాడు. ఆ సమయంలో వారి మాటలను రికార్డు చేయకపోతే ఆ తర్వాత ఆ సందర్భం, ఆ మాటలు రెండూ మిస్ అయిపోతాయి.
భావితరాలకు ఆ వేదన అందదు. సరిగ్గా ఆ సమయంలోనే వృద్ధతరం దగ్గర ఉన్న జానపద సంపద అతనికి గుర్తుకొచ్చింది. ‘నా బాల్యంలో అమ్మమ్మ, నానమ్మలు చెప్పే కథలు ఇప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు చెప్పడం లేదు. ఏవో కొద్దిమంది దగ్గరే అలాంటివి మిగిలి ఉన్నాయి... వాటిని కాపాడుకోవాలి’ అనుకున్నాడతడు. ఆ ఆలోచన ఎన్.జి.ఓ. స్థాపనకు కారణమై మార్జినలైజ్డ్ సెక్షన్స్ దగ్గర వున్న కళారూపాలను నిక్షిప్తం చేసే పనికి అతణ్ణి పురిగొల్పింది.
► పిల్లలే సైనికులు
మౌఖిక జానపద కథకు వారసులు బాలలు. వారికే ఆ విలువైన జానపద సంపద అందాలి. అలా అందాలంటే వారే నేరుగా రంగంలోకి దిగాలి అనుకున్నాడు స్రుతిన్ పాల్. ‘ఇప్పుడు దాదాపు ప్రతి చిన్నారికి సెల్‌ఫోన్ అందుబాటులో ఉంది. వారు సెల్‌ఫోన్‌ను అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు. అన్నీ టక్కున నేర్చుకుంటారు. వారికి రికార్డు చేసి ఎడిట్ చేయడం నేర్పిస్తే వారే పెద్దవాళ్ల దగ్గర కూచుని అన్నీ చెప్పించుకుంటారు.
పైగా పిల్లలు అడిగితే చెప్పడానికి అవ్వలు, తాతలు ఇష్టపడతారు కూడా’ అంటాడు లాల్. అందుకోసం తన సంస్థ తరఫున కొందరు వాలంటీర్లను కేరళలోని వివిధ జిల్లాల స్కూళ్లకు పంపడం మొదలెట్టాడు. వారు స్కూల్లో పిల్లలకు మౌఖిక జానపద సంపద సేకరణ గురించి చెప్పి, సెల్‌ఫోన్‌తో పెద్దవాళ్లు చెప్పే కథలను ఎలా రికార్డు చేసి తమకు పంపాలో నేర్పుతారు. ఇక పిల్లలు ఊరుకుంటారా? రంగంలో దిగి వరదలా వీడియోలు పంపుతున్నారు. అవన్నీ నిక్షిప్తం అవుతున్నాయి.
► విన్నవీ కన్నవీ
కాశీమజిలీ కథలో, కాటమరాజు కథలో, మర్యాద రామన్న కథలో, పూటకూళ్లమ్మ కథలో... అడవి కథలో, వేట కథలో, వ్యవసాయ కథలో, ప్రకృతి కథలో, గొడ్డుగోదా కథలో, రాజు పేదా కథలో... ఏవో కథలు ఒకప్పుడు చెప్పుకోని, వినని వారు ఉండరు. అయితే అందరూ గుర్తు పెట్టుకుని మళ్లీ చెప్పే స్టోరీ టెల్లర్లు కారు. కొందరు మాత్రమే ‘కథల పుట్ట’గా ఉంటారు. వీరు స్థానిక జ్ఞానాన్ని కథల్లో దాచి ఉంటారు. అవి రికార్డు కావాలి. కేరళలో ఇప్పుడు ఆ పని జరుగుతూ ఉంది. నిజానికి ప్రతిచోటా ప్రభుత్వాలు పూనుకుని ఈ పని చేస్తే ప్రతి ప్రదేశంలోని విలువైన కథలు బయటికొస్తాయి. యూట్యూబ్‌లాంటి మాధ్యమాల వల్ల అందరికీ తెలుస్తాయి.
కేరళ మేల్కొంది. అందరూ మేల్కొనాలి.
Comments
Please login to add a commentAdd a comment