సాక్షి, అమరావతి: అధిక దిగుబడినిచ్చే దేశవాళి ఆవులు, గేదెలు, విదేశీజాతి ఆవుల పునరుత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మేలుజాతి పశుపునరుత్పత్తి క్షేత్రాలను ఏర్పాటు చేస్తోంది. ఒక్కో యూనిట్ రూ.4 కోట్ల అంచనా వ్యయంతో ఈ క్షేత్రాల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో పాల ఉత్పత్తిని రెట్టింపు చేయాలని, మేలుజాతి పశుసంపదను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఆరోగ్యవంతమైన, అధిక పాల దిగుబడినిచ్చే పశుసంపద కోసం పాడిరైతులు మధ్యవర్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇప్పటివరకు దేశంలో వీటి పునరుత్పత్తికి సరైన వ్యవస్థ అందుబాటులో లేదు. ఈ పరిస్థితికి చెక్‌పెడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో మేలుజాతి పశుపునరుత్పత్తి క్షేత్రాల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
ఒక్కో యూనిట్‌కు అయ్యే రూ.4 కోట్ల వ్యయంలో రూ.2 కోట్లను సబ్సిడీ రూపంలో నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ) ద్వారా అందిస్తుంది. ఒక్కో క్షేత్రాన్ని 200కు తక్కువకాకుండా మేలుజాతి ఆవులు లేదా గేదెలతో ఏర్పాటు చేస్తారు. మినిమమ్ స్టాండర్స్ ప్రొటోకాల్స్ (ఎమ్మెస్పీ) ప్రకారం కనీసం రోజుకు 16 లీటర్ల పాలిచ్చే గేదెలు, 10 నుంచి 12 లీటర్ల పాలిచ్చే ఆవులు, 22 లీటర్లకుపైగా పాలిచ్చే సంకరజాతి ఆవులను ఎంపిక చేసుకోవాలి. ఒక ఈత అయిన ఆవులు, గేదెలను మాత్రమే కొనుగోలు చేయాలి. వీటివిలువ ఒక్కొక్కటి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది. వీటికోసం ప్రత్యేకంగా షెడ్లు, పోషణకు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయాలి. మేలుజాతి పశువుల వీర్యాన్ని ఐవీఎఫ్ సాంకేతికత ద్వారా వినియోగించి నాణ్యమైన దూడెలను పునరుత్పత్తి చేయాలి. ఇలా అభివృద్ధి చేసిన ఆడదూడల పునరుత్పత్తి ద్వారా బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫారాలను అభివృద్ధి చేయవచ్చు లేదా తోటి రైతులకు విక్రయించుకోవచ్చు. మగ దూడలనైతే సెమన్ బ్యాంకుల ద్వారా కొనుగోలు చేయిస్తారు.
ఎంపిక చేసే విధానం
► దరఖాస్తుదారులు.. వ్యాపారవేత్తలు, ప్రైవేట్ వ్యక్తులు, స్వయం సహాయక సంఘాలు/రైతు ఉత్పత్తి సంస్థలు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు, సెక్షన్–8 కింద నమోదైన కంపెనీలై ఉండాలి.
► పాడి పశువుల పెంపకంలో అనుభవం ఉండాలి.
► కనీసం 5 ఎకరాల సొంత భూమి లేదా లీజుకు తీసుకున్న భూమి ఉండాలి.
► ఫారంలో పశువులకు అవసరమైన మేతను సేకరించేందుకు తగిన ఏర్పాటు ఉండాలి.
► పశుసంవర్ధకశాఖ, ఎన్‌డీడీబీ, నిపుణుల కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది.
► దరఖాస్తు, ప్రెజంటేషన్, ఫీల్డ్ వెరిఫికేషన్ ఆధారంగా వారి ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. అవసరమైతే బ్యాంకు/ఆర్థికసంస్థకు రుణం కోసం సిఫారసు చేస్తుంది
► బ్యాంకుల నుంచి రుణమంజూరు లేఖ అందిన తర్వాత తొలుత ఎన్‌డీడీబీ, చివరగా డీఏహెచ్‌డీ ఆమోదముద్ర వేస్తాయి.
► ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ)ను buy@ nddb.coop అనే ఈ మెయిల్ ద్వారా నిర్దేశిత ఫార్మాట్‌లో సమర్పించాలి.
పశుక్షేత్రాల లక్ష్యాలు
► ఆవులు, గేదెల పెంపకంలో ఉత్తమ వ్యాపారవేత్తలను తయారు చేయటం.
► వ్యాధులు లేని, అధిక దిగుబడినిచ్చే దేశవాళి ఆవులు, గేదె జాతుల కోడెదూడలు, తొలిచూరు పడ్డలను అందుబాటులోకి తీసుకురావడం.
► పశుపోషణ, వ్యాధుల నివారణ, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులపై అవగాహన పెంపొందించడం.
► ఐవీఎఫ్ సాంకేతికత, విజయవంతమైన వీర్యోత్పత్తి ద్వారా అధిక దిగుబడినిచ్చే పాడి పశువులను ఉత్పత్తి చేయడం.
దరఖాస్తు గడువు నవంబర్ 30
రాష్ట్రంలో స్వదేశీ జాతి పశువుల కంటే వ్యాధిరహిత, అధిక దిగుబడినిచ్చే కోడెలు/గర్భిణి కోడెలు/ క్యూలను అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఈ క్షేత్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ఏర్పాటుకు ఆసక్తిచూపేవారు ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తు ఫారాలు
– ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్ధకశాఖ
Comments
Please login to add a commentAdd a comment