పాలు ‘ప్రైవేటు’కే! | Farmers Not Interested To Pour Milk To Government Society | Sakshi
Sakshi News home page

పాలు ‘ప్రైవేటు’కే!

Published Tue, Dec 10 2019 10:40 AM | Last Updated on Tue, Dec 10 2019 10:40 AM

Farmers Not Interested To Pour Milk To Government Society - Sakshi

ఖమ్మంలోని ప్రభుత్వ డెయిరీ కార్యాలయం

సాక్షి, ఖమ్మం :ప్రభుత్వ సంస్థకు పాలు పోసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. ‘విజయ’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమను నిర్వహిస్తుండగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మినహా అన్ని జిల్లాల్లో మంచి ఫలితాలు ఇస్తోంది. ఉభయ జిల్లాల్లో విజయ పాల ఉత్పత్తులకు ఏటేటా డిమాండ్‌ పెరుగుతుండగా.. ఇక్కడ మాత్రం పాల సేకరణ ఏడాదికేడాది తగ్గుతోంది. ఉమ్మడి జిల్లాలో బల్క్‌ మిల్క్‌ సెంటర్లు 9 ఉన్నాయి. వీటిలో సత్తుపల్లి, మధిర సెంటర్లలో పాల సేకరణ పూర్తిగా నిలిచిపోగా.. కల్లూరులో నామమాత్రంగా సాగుతోంది. ఇదే బాటలో ఇల్లెందు, కామేపల్లి సెంటర్లు కూడా ఉన్నాయి. మొత్తంగా 9 సెంటర్ల నుంచి నెలలో రోజుకు 9,777 లీటర్ల పాల సేకరణ జరుగుతోంది. ఇవే సెంటర్ల నుంచి గత ఏడాది నవంబర్‌లో రోజుకు 13,515 లీటర్ల పాలను సేకరించారు.

మూడేళ్ల క్రితం ఉమ్మడి జిల్లాలో రోజుకు 24వేల లీటర్ల పాలను సేకరించిన సందర్భాలున్నాయి. అయితే ప్రభుత్వ పాల సేకరణ తగ్గి పోతున్నా.. ప్రజల్లో(వినియోగదారులు) మా త్రం విజయ పాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో నిత్యం విజయ పాల విక్రయాలు 11వేల లీటర్లకు పైగా ఉన్నాయి. 1,200 కిలోల పెరుగు రోజూ విక్రయం జరుగుతోంది. అంటే.. పాల సేకరణకన్నా దాదాపు ఉమ్మడి జిల్లాలో 3వేల లీటర్ల పాలు, పాల ఉత్పత్తుల వినియోగం ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. స్థానికంగా సేకరించే పాలు విక్రయించడానికి సరిపోకపోవడంతో జనగామ జిల్లా నుంచి నిత్యం 1,200 లీటర్ల పాలను తెప్పించి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పాడి పరిశ్రమ పాల సేకరణలో ఫలితాలను రాబట్టలేకపోయినా.. విజయ పాలను, పాల ఉత్పత్తుల వినియోగాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెంచుకోగలుగుతోంది. ఉమ్మడి జిల్లాలో నిత్యం 70వేల లీటర్ల వరకు వినియోగం అవుతుండగా.. ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీలు 50వేల లీటర్లను మాత్రమే సేకరిస్తున్నాయి. అంటే.. మరో 20వేల లీటర్లు ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రం(ఏపీ) నుంచి దిగుమతి అవుతున్నాయి. 

ప్రైవేటు డెయిరీలకు రైతుల ప్రాధాన్యం..
ఉమ్మడి జిల్లాలో పాల ఉత్పత్తిదారులు ప్రైవేటు డెయిరీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ డెయిరీతోపాటు సుమారు 14 ప్రైవేటు డెయిరీలు నిర్వహణలో ఉన్నాయి. ప్రభుత్వ డెయిరీకన్నా రైతులకు ప్రైవేటు డెయిరీలు కొంత ఎక్కువగా పాల ధర చెల్లిస్తున్నాయి. దీంతో రైతులు వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాక ఇటీవలి వరకు ప్రభుత్వ డెయిరీలో పాల బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరిగేది. దీంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రైవేటు డెయిరీలు క్రమం తప్పకుండా పాల బిల్లులు చెల్లింస్తుండడంతో రైతులు వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాక ఆంధ్ర రాష్ట్రానికి ఖమ్మం జిల్లా సరిహద్దున ఉండడంతో ప్రైవేటు డెయిరీల ప్రభావం ఎక్కువగా ఉంది. అక్కడ నిర్వహణలో ఉన్న డెయిరీలు కూడా ఇక్కడ పాల సేకరణ, విక్రయాలు నిర్వహిస్తున్నాయి. వాటి ప్రభావం కూడా ప్రభుత్వ డెయిరీపై పడుతోంది. 

ఫలించని ప్రభుత్వ చర్యలు..
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాల సేకరణ గణనీయంగా తగ్గుతోంది. జనగామ, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్‌ తదితర జిల్లాల్లో లక్ష్యాన్ని మించి పాల సేకరణ జరుగుతోంది. ఆ తరహాలోనే ఖమ్మం జిల్లాను కూడా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే లీటరుకు ప్రభుత్వం రూ.4 చొప్పున ప్రోత్సాహకంగా ఇస్తోంది. వాటితోపాటు రాయితీపై గేదెలు, దాణా, మందులు అందించే చర్యలు చేపట్టింది. పాడి పశువులకు, రైతులకు బీమా సౌకర్యాన్ని కూడా కల్పించింది. రైతుల పిల్లలు 9, 10, ఇంటర్‌ చదువుతున్న వారికి ఏడాదికి రూ.1,200 స్కాలర్‌షిప్‌ సౌకర్యాన్ని కూడా అందించే పథకాన్ని ముందుకు తెచ్చింది. ఇన్ని ప్రో త్సాహకాలు కల్పిస్తున్నప్పటికీ ఉమ్మడి జి ల్లాలో ప్రభుత్వం పాల సేకరణను రైతులు ఆదరించడం లేదు. దీంతో జిల్లా పాడి పరిశ్రమ పాల సేకరణలో ఫలితాన్ని సాధించలేకపోతోంది. 

పాల సేకరణను పెంచేందుకు కృషి..
పాల సేకరణలో ఉమ్మడి ఖమ్మం వెనుకబడి ఉంది. దీనిని అధిగవిుంచేందుకు కృషి చేస్తున్నాం. జిల్లాలో విజయ పాల పట్ల ప్రజల ఆదరణ బాగుంది. రైతుల నుంచి ఆదరణ పొందేందుకు కృషి జరుగుతోంది. ప్రభుత్వ డెయిరీ వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించే చర్యలు చేపట్టాం. ఖమ్మం పాల డెయిరీకి పూర్వ వైభవం తీసుకొస్తాం. 
– కె.శ్రావణ్‌కుమార్, డిప్యూటీ డైరెక్టర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement