మంజీరా తీరాన పాపన్నపేట మండలానికి మధ్యలో వెలసింది లక్ష్మీనగరం. అయిదారు దశాబ్దాల క్రితం తమ్ము చెట్లు రాళ్లూరప్పలతో కూడిన భూములు నేడు రతనాలు పండించే మాగాణిగా మారాయి. మగాళ్లంతా వ్యవసాయ పనులు చేస్తుండగా..మహిళలంతా పాడిపరిశ్రమతో స్వాలంబన సాధిస్తున్నారు. ఎకరాకు 35 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని పండిస్తూ..62 టన్నుల చెరకును ఉత్పత్తి చేస్తూ..నిత్యకృషీవలురుగా నిలుస్తుంటే...మహిళలు ఒక్కో గేదె నుంచి సుమారు పది లీటర్ల పాల దిగుబడిని సాధిస్తున్నారు.
పాలనురగల లోగిళ్లు
లక్ష్మీనగరం జనాభా 954. కాగా అక్కడ సుమారు 700 పాడి గేదెలున్నాయి. ప్రతి ఇంటికి పాడిగేదెలున్నాయి. వీటి పూర్తి బాధ్యతను మహిళలే తీసుకుంటారు. ఒక్కో గేదె నుంచి సుమారు 10 లీటర్ల పాలను పొందుతారు. కనీసం 400 గేదెలు పాలిచ్చినా..రోజుకు 4వేల లీటర్ల దిగుబడి వస్తుంది. లీటర్‌కు రూ.35ల చొప్పున రోజుకు రూ.1.40లక్షలు, నెలకు రూ.42లక్షలు ఆదాయాన్ని సాధిస్తున్నారు. పిల్లల చదువులు...ఇంటి నిర్వహణలో మహిళల సంపాదనే కీలకం.
హరితవనాల వాకిళ్లు
లక్ష్మీ నగరంలోని ఇళ్లు..ప్రకృతి రమణీయతకు ప్రతిరూపంగా నిలుస్తాయి. ఏ ఇంటి లోగిళ్లు చూసినా..పచ్చని చెట్లు..రంగు రంగుల పూల మొక్కలు, కూరగాయలు, పండ్ల చెట్లతో హరిత వనాలను తలపిస్తాయి. నిరుపేద గుడిసైనా..అద్దాల మేడయినా..ఆ ఇంటి ముందు పచ్చని చెట్ల తోరణాలతో ఆహ్వానం పలుకుతున్నట్లు కనిపిస్తాయి.
కృషితో..సుభిక్షం
ఆరు దశాబ్దాల క్రితం వలస వచ్చిన ఆ కుటుంబాలన్నీ అప్పట్లో అక్షర జ్ఞానానికి ఆమడ దూరంలో ఉండేవి. స్వేదాన్ని చిందించి..సిరులు పండిస్తూ...ఆర్థిక అభివృద్ధి సాధించారు. విద్యా ప్రాధాన్యతను గుర్తించి నాటితరం మహిళలంతా రాత్రిబడికి వెళ్లి..సంతకాలు నేర్చుకున్నారు. గ్రామంలో 21 డ్వాక్రా గ్రూప్‌లు ఉన్నాయి.
బ్యాంకులిచ్చే ఆర్థిక రుణాలతో పాడి గేదెలు కొనుగోలు చేసి పాల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో పిల్లలందర్నీ గొప్ప చదువులు చదివించారు. ప్రస్తుతం ఆ పల్లెలో 40 మంది ఇంజనీర్లు..నలుగురు డాక్టర్లు దేశ విదేశాల్లో పనిచేస్తున్నారు. ఒకప్పుడు ఆ పల్లెలో అన్నీ గుడిసెలే. కాని నేడు ఒక్కటి రెండు తప్పా..99 శాతం ఆర్‌సీసీ భవనాలే కనిపిస్తాయి. ఈ ఒక్క గ్రామంలోనే 42 వరికోత మెషిన్లు ఉన్నాయి.
కోలాటం...భజనలు
పొద్దంతా కష్టపడుతూ..స్వేదం చిందించే ఈ గ్రామ మహిళలు సాయంత్రం కోలాటం..భజన కార్యక్రమాలతో..సేదదీరుతుంటారు. 30 మంది మహిళలు కలిసి లక్ష్మీ కళా కోలాట భజన బృందంగా ఏర్పడ్డారు. శ్రీశైలం మహా శివరాత్రి ఉత్సవాలు, భద్రాచలంలో శ్రీరామ నవమి, విజయవాడ కనక దుర్గ ఆలయ ఉత్సవాల్లో, ఏడుపాయల, బిక్కనూర్ సిద్దిరామేశ్వరాలయ ఉత్సవాల్లో వీరు ప్రదర్శనలిచ్చి భళా అనిపించారు. ఏళ్ల క్రితం వలస వచ్చిన వారు స్థానికులతో కలిసి మెలసి ఉంటూ..వారి పండగలు, శుభకార్యాల్లో పాల్గొంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
లక్ష్మీనగరం.. క్షీరసాగరం
Published Sun, Nov 9 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM
Advertisement
Advertisement