52 ఏళ్లుగా అన్నం బంద్! | This 76 Years Old Man With Good Health Stopped Eating Rice From 52 Years, Know About His Story In Telugu | Sakshi
Sakshi News home page

52 ఏళ్లుగా అన్నం బంద్!

Published Thu, Nov 28 2024 7:38 AM | Last Updated on Thu, Nov 28 2024 1:46 PM

-

పాలు, పండ్లు ఆయన ఆహారం 

76 ఏళ్ల వయస్సులో సంపూర్ణ ఆరోగ్యంతో లొక్కిడి గంగారాం

ఆధ్యాత్మిక సేవలో తరిస్తున్న రిటైర్డు ఉపాధ్యాయుడు

జక్రాన్‌పల్లి: జక్రాన్‌పల్లి మండలంలోని కొలిప్యాక్‌ గ్రామానికి చెందిన రిటైర్డు ఉపాధ్యాయుడు లొక్కిడి గంగారాం యాభై రెండేళ్లుగా అన్నం తినడం బంద్‌ చేశారు. వేల్పూర్‌ మండలం పచ్చల నడ్కుడ గ్రామంలో 1948లో గంగారాం జన్మించారు. యాభై ఏళ్ల క్రితం ఆయన కొలిప్యాక్‌ గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. దైవ చింతన ఎక్కువగా ఉండడంతో అప్పటి నుంచి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద ఓ రెండు గదులలో నివాసం ఉంటున్నారు. గంగారాంకు భార్య సత్యగంగు ఉన్నారు. కుమారుడు గతంలోనే వాగులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. 

ప్రస్తుతం గంగారాం వయస్సు 76 ఏళ్లు. గంగారాంకు 1971లో టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. మొదటి పోస్టింగ్‌ కలిగోట్‌ యూపీఎస్‌ పాఠశాలలో రాగా, అక్కడే 18 ఏళ్లు పని చేశారు. అప్పుడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 1972 సంవత్సరం నుంచి గంగారాం అజీర్తి సమస్యతో అన్నం తినడం బంద్‌ చేశారు. దీంతో ఆహారంగా పల్లి పలుకులు, నీరు తీసుకోవడం ప్రారంభించారు. ఉపాధ్యాయుడిగా కలిగోట్‌, కొలిప్యాక్‌, మనోహరాబాద్‌, కొండాపూర్‌, మచ్చర్ల, సుర్బిర్యాల్‌, ఖుదావంద్‌పూర్‌, చేంగల్‌, వాడి, లింగాపూర్‌ గ్రామాల్లో పని చేశారు.

2004లో ఉపాధ్యాయ వృత్తి నుంచి రిటైర్‌ అయ్యారు. అప్పటి నుంచి పండ్లు జ్యూస్‌, అరటి, ఆపిల్‌, సీజనల్‌ పండ్లు తీసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. యాభై రెండు ఏళ్లుగా ఎలాంటి అనారోగ్యం రాలేదని గంగారాం తెలిపారు. ఒక్క మందు గోలి, ఇంజెక్షన్‌ తీసుకోలేదన్నారు. స్వచ్ఛమైన గాలి, సాత్విక ఆహారం తీసుకుంటే అనారోగ్యం దరి చేరదన్నారు. ప్రస్తుతం గంగారాం ఆధ్యాత్మిక సేవలో నిమగ్నమయ్యారు. గత యాభై ఏళ్లు గా ఊరూరా తిరుగుతూ ‘శ్రీరామ కోటి ’రాయిస్తున్నారు. వెయ్యి కోట్లు రామనామం రాయించాలని సంకల్పంతో ఉన్నట్లు తెలిపా రు. 

ప్రస్తుతం మనోహరాబాద్‌ గ్రామ రెవిన్యూ శివారులో పాండురంగ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు. లోక కల్యాణం, భక్తిభావం, మానవతా దృక్పథంతో భగవంతుని సన్నిధికి చేరుకోవాలని తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ అత్యంత శ్రేష్టమైనదని, ఈ జీవితం భగవంతునికి అంకితమని చెబుతున్నారు. ప్రతి ఒక్కరు మానవతా దృక్పథంతో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలన్నారు. 

ప్రస్తుతం 76 ఏళ్ల వయసులో బైక్‌పై తిరుగుతూ రామకోటి రాయిస్తున్నారు. ఆశ్రమానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తున్నారు. పాండురంగ ఆశ్రమం వద్ద అన్ని రకాల దేవత విగ్రహాలను, స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. పచ్చని చెట్లు, ఆహ్లాదాన్ని పంచే వాతావరణంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆశ్రమానికి వచ్చే వారికి దైవత్వాన్ని బోధిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement