భోపాల్: మధ్యప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతం రైతులు ఆందోళన చేయడానికి దారితీసిన కొన్ని ప్రత్యేక కారణాలు వెలుగులోకి వచ్చాయి. భారత్‌లో పండే మొత్తం సోయాబిన్ పంటలో 20 శాతం పంట ఇక్కడి మాల్వా ప్రాంతంలోనే పండుతుంది. ఈ పంట నేరుగా ఇండోర్‌లోని చమురు విత్తనాల క్రషింగ్ కంపెనీలకు వెళుతుంది. ఆ కంపెనీలు చమురు తీయగా మిగలిన సోయాబిన్ పొడిని సోయాబిన్ ఆహారం పేరిట అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఈ ఆహారాన్ని పశువుల దాణా కింద అమెరికా ఉపయోగిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా గత ఐదేళ్ల కాలంలో సోయాబిన్ ఉత్పత్తి 150 శాతం పెరగడం, భారత్‌కన్నా ఇతర దేశాల నుంచే సోయాబిన్ గింజలు చౌకగా లభిస్తుండడంతో అమెరికా ఎగుమతులు పడిపోవడం, భారత్ చమురు కంపెనీలు కూడా విదేశీ సోయాబిన్ గింజల దిగుమతికే ప్రాధాన్యం ఇవ్వడం, పర్వవసానాల కారణంగా దేశంలో సోయాబిన్ పంట ధర ఘోరంగా పడిపోయింది. 2012–2013 సంవత్సరంలో విదేశాల నుంచి సోయాబిన్ గింజల దిగుమతి 10.91 లక్షల టన్నులు ఉండగా, 2015–16 సంవత్సరానికి 42.35 లక్షల టన్నులకు చేరుకుంది. విదేశీ దిగుమతులను అరికట్టేందుకు వాటిపై 45 శాతం పన్ను విధించే అవకాశం భారత ప్రభుత్వానికి ఉన్నప్పటికీ 12.50 శాతానికే పన్నును పరిమితం చేయడంతో దిగుమతులు పెరుగుతున్నాయి.
2010–11 సంవత్సరంలో మన దేశం నుంచి అమెరికా లాంటి దేశాలకు దాదాపు 43 లక్షల టన్నుల సోయాబిన్ ఎగుమతి జరగ్గా అది 2015–16 సంవత్సరం నాటికి మూడు, నాలుగు లక్షల టన్నులకు పడిపోయింది. ప్రపంచంలో సోయాబిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న అర్జెంటీనా లాంటి దేశాలు భారత్ కన్నా అతి తక్కువ ధరకు ఎగుమతి చేస్తుండడంతో భారత్ మార్కెట్ పోటీని తట్టుకోలేక పోతోంది.
భారత్‌లో ఓ హెక్టార్ భూమిలో ఓ టన్ను సోయాబిన్‌ను దిగుబడి వస్తుండగా, అర్జెంటీనా ఓ హెక్టార్ భూమిలో మూడు టన్నుల సోయాబిన్ దిగుబడిని తీస్తోంది. అందుకు కారణం ఆధునిక సోయాబిన్ వంగడాలను వాడడమేనని వ్యవసాయ నిపుణలు తెలియజేస్తున్నారు. భారత్‌లో 23 ఏళ్ల క్రితం అభివద్ధి చేసిన సోయాబిన్ విత్తనాలనే నేటికి ఉపయోగిస్తున్నారు.
దేశంలో 2015 నాటి వరకు కూడా దాదాపు క్వింటాల్ సోయాబిన్‌కు ధర దాదాపు నాలుగువేల రూపాయలు ఉండగా, గత ఏడాదికి అది 3, 200 రూపాయలకు పడిపోయింది. ప్రస్తుతం 18,00 రూపాయలకు మించి పలకడం లేదు. అంటే ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (రూ.2,750) కన్నా చాలా తక్కువ. ఆ ధరకు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ముందుకు రావడం లేదు. తమకు మరో పంట వేయడం తెలియకుండా పోయిందని, గిట్టుబాటు ధర లేక గత సోయాబిన్ పంటను అలాగే గిడ్డంగుల్లో నిల్వచేసి ఉంచామని రైతులు వాపోతున్నారు.
1980లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చొరవ వల్ల రాష్ట్రంలో రైతులంతా సోయాబిన్ పంటవైపు మొగ్గుచూపారు. సోయాబిన్ పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘ఆయిల్‌ఫెడ్’ లాంటి సంస్థలను ఏర్పాటు చేసింది. కనీస మద్దతు ధరను నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల రైతులు దెబ్బతింటున్నారు.
ఈసారి ప్రపంచవ్యాప్తంగా 31.35 కోట్ల టన్నుల సోయాబిన్ గింజలు ఉత్పత్తి అవుతాయని అమెరికా వ్యవసాయ సంఘం తాజాగా అంచనా వేసింది. భారత్‌లో కూడా మరో మూడు నెలల్లో కొత్త పంట వస్తున్నందున సోయాబిన్ మార్కెట్ ధర ప్రస్తుతం కంటే మరింతగా పడిపోతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అదే కనుక జరిగితే మధ్యప్రదేశ్ రైతులకు కష్టాలు తప్పవు.