భోపాల్: వలసజీవులు మరోసారి భగ్గుమన్నారు. తమ పట్ల పాలకులు చూపుతున్న అలసత్వానికి నిరసగా ఆందోళన బాటపట్టారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తమకు తిండి, రవాణా సౌకర్యాలు కల్పించలేదన్న ఆవేదనతో మధ్యప్రదేశ్-మహారాష్ట్ర సరిహద్దులోని సెంద్వా పట్టణంలో గురువారం వేలాది మంది వలస కార్మికులు నిరసనకు దిగారు. దీంతో మూడవ నంబరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. సహనం కోల్పోయిన బడుగుజీవులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్థానిక పోలీస్‌స్టేషన్‌పై రాళ్లు రువ్వారు.
‘పసిపిల్లలను చంకనేసుకుని మేమంతా ప్రయాణిస్తున్నాం. మహారాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపించింది. కానీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాకు ఎటువంటి సహాయం చేయలేదు. మేము గత రాత్రి నుంచి ఆకలి, దాహంతో ఇక్కడ ఉన్నాం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేద’ని పుణెలో పనిచేసే మధ్యప్రదేశ్ నివాసి సైలేష్ త్రిపాఠి ఆవేదన వ్యక్తం చేశారు. (వలస వెతలు: కంటతడి పెట్టించే వీడియోలు)
జిల్లా కలెక్టర్ అమిత్ తోమర్ మాట్లాడుతూ.. బస్సులు బయలుదేరిన తర్వాత మిగిలిన వారు తమకు వాహనాలు ఉండవని ఆందోళన చెందారని తెలిపారు. అందరిని వారి స్వస్థలాలకు పంపిస్తామని భరోసాయిచ్చి వారిని శాంతింపజేసినట్టు చెప్పారు. సరిహద్దు నుంచి 135 బస్సుల్లో వలసదారులను వివిధ జిల్లాల్లోని ట్రాన్సిట్ పాయింట్లకు పంపించామన్నారు. (ప్రధాని ప్రసంగం.. అర్థం ఏంటో!)
సంయమనం పాటించాలని కార్మికులకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. వైద్య పరీక్షలు, భోజనం తర్వాత బస్సుల ద్వారా ఉచితంగా తరలిస్తామని వారికి భరోసాయిచ్చారు. సెంధ్వా సరిహద్దులోని బీజాసన్ ఘాట్‌కు ప్రతిరోజూ 5,000 నుండి 6,000 మంది కార్మికులు చేరుకుంటున్నారు. దీంతో ఇక్కడ నుంచి కార్మికుల నుంచి తరలించడం అధికారులకు ప్రయాసగా మారుతోంది.
Comments
Please login to add a commentAdd a comment