కరువుతో కాపురమే! | vidarbha farmers situation in this season | Sakshi
Sakshi News home page

కరువుతో కాపురమే!

Published Mon, Jun 30 2014 10:34 PM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM

కరువుతో కాపురమే!

కరువుతో కాపురమే!

ఈసారీ విదర్భ రైతుకు కష్టకాలమే

నాగపూర్: కరువుతో కాపురం చేసే విదర్భ రైతు పరిస్థితి ఈ ఏడాది కూడా మారేలా కనిపించడంలేదు. పైగా మరిన్ని కష్టాలను ఎదుర్కోవాల్సిన దుస్థితి ఎదురు కానుంది. పత్తి, సోయా పంటలపై ఎక్కువగా ఆధారపడే ఈ ప్రాంత రైతులు వర్షాలు కురుస్తాయన్న ఆశతో విత్తనాలను వేలాది ఎకరాల్లో నాటి చినుకు కోసం ఎదురు చూస్తున్నారు. జూన్ మొదటి వారంలోనే వర్షాలు కురవాల్సి ఉన్నా ఇప్పటిదాకా చినుకు జాడే లేదు. విత్తనాలు నాటి దాదాపు నెల గడుస్తున్నా చినుకు పడలేదు.

మొక్క మొలవలేదు. భూమిలో నాటిన విత్తనాలు పాడైపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో విత్తనాలు మళ్లీ మొలకెత్తే పరిస్థితి కనిపించడంలేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్షాలు కురవకపోతే నాటిన విత్తనాలతోపాటు ఎరువుల ఖర్చు భారం కూడా రైతన్న మోయాల్సి వస్తుందంటున్నారు. మరో పక్షం రోజుల్లో వర్షాలు సమృద్ధిగా కురిసినా పంటకాలం దాటిపోవడంతో ఆశించినమేర దిగుబడి రావడం కష్టమేనంటున్నారు.
 
 పెట్టుబడి మట్టిపాలు...

‘విదర్భ రైతులు వేలాది రూపాయలు బ్యాంకుల నుంచి రుణంగా తీసుకొని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశారు. మట్టి సారం పెరిగేందుకు ఇప్పటికే వేలాది రూపాయల ఎరువులను పొలంలో చల్లారు. విత్తనాలను కూడా నాటుకున్నారు. వర్షాలు ఆలస్యం కావడంతో ఈసారీ కరువు తప్పదేమోనన్న బెంగలో రైతులున్నారు. రైతులు తీవ్ర నిర్ణయాలు తీసుకోకముందే ప్రభుత్వం వారిని ఆదుకోవాలి. ఇప్పటికే తీసుకున్న బ్యాంకు రుణాలను మాఫీ చేసి, ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతును ప్రోత్సహించాలి.అందుకు అవసరమైన విత్తనాల సరఫరా వంటివి చేయాల’ని విదర్భ జనాందోళన్ సమితి అధ్యక్షుడు కిశోర్ తివారీ డిమాండ్ చేశారు.

విదర్భ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితి నెలకొనడం ఇది వరుసగా రెండో ఏడాది. గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఫరవాలేదనిపించిన వర్షాలు విదర్భ రైతులపై మాత్రం కనికరం చూపలేదు. అయినా కష్టపడి రైతులు పండించిన పంటను అకాల వర్షాలు ఊడ్చుకొని పోయాయి. దీంతో చెమటోడ్చి కూడా రైతన్న కరువుతో కాపురమే చేయాల్సి వచ్చింది. అయితే ఈ ఏడాది కూడా దాదాపు అదే పరిస్థితి నెలకొనే అవకాశముందని వాతావరణ నిపుణులు కూడా చెబుతున్నారు.
 
ఠాణేలో కాంగ్రెస్ యాగం...

వరుణుడి జాడ లేకపోవడంతో వర్షాలు కురవాలని కోరుతూ  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోమవారం యాగం చేశారు. రాష్ట్రాన్ని కరువు కాటు నుంచి తప్పించాలని కోరుతూ వరుణ దేవుడిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతల తోపాటు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో యజ్ఞం జరుగుతున్న పరిసరాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

కుంభాదేవి ఆలయంలో బీజేపీ...
భారతీయ జనతా పార్టీ కూడా ఆదివారం వరుణ యాగం చేసింది. నగరంలోని కుంభాదేవి ఆలయంలో నిర్వహించిన ఈ యజ్ఞంలో బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు ఆశిష్ శేలార్, పార్టీ నేత రాజ్‌పురోహిత్ తదితరులు పాల్గొన్నారు. యజ్ఞ గుండంలో స్వయంగా నెయ్యిని పోసి వరుణ దేవుడిని ఆహ్వా నించారు.  రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొనకుండా చూడాలని వేడుకున్నారు.
 
ప్రచార ఆర్భాటాలే...
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు యజ్ఞయగాలను ఓ ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. కరువు కోరల్లో చిక్కుకుంటున్న రైతులను ఆదుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని, మూగజీవాలకు గడ్డిని, నీటిని అందించే ఏర్పాట్లు చేయాని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా యజ్ఞయాగాల పేరుతో ప్రజల ఓట్లను కొల్లగొట్టేందుకు పార్టీలు ప్రయత్నించడం సరికాదంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement