ఆశల పంటకు అగ్గి
ఆశల పంటకు అగ్గి
Published Mon, Jan 30 2017 10:14 PM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM
- నెరణికిలో అగ్ని ప్రమాదం
- 150 క్వింటాళ్ల పత్తి, రూ.3 లక్షల నగదు బూడిద
- కట్టుబట్టలతో మిగిలిన బాదితులు
హొళగుంద: కరువు కారణంగా పెట్టుబడులకు తగ్గట్టు కూడా దిగుబడులు రాక నష్టాలూ మూటగట్టుకుంటున్న క్రమంలో నెరణికి గ్రామానికి చెందిన ఓ ఇద్దరు రైతు ఇంట్లో నిల్వ ఉంచిన 30 ఎకరాల్లోని పత్తి దిగుబడి సోమవారం అగ్నికి ఆహుతైంది. దీంతోపాటు ఇంట్లో ఉన్న రూ.3లక్షల నగదు కూడా కాలిపోవడంతో బాధిత రైతులు కట్టుబట్టలతో మిగిలారు. గ్రామానికి చెందిన రైతులు కురువ బసవరాజు, శ్రీశైల.. 20 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశారు. బసవరాజు మరో 10 ఎకరాల్లో పత్తి, ఇతర పంటలు వేశాడు.
వర్షాభావం, చీడపీడల కారణంగా అంతంత మాత్రంగా వచ్చిన పంటను ఒకేసారి అమ్ముకుని అప్పులు తీర్చుకోవాలని భావించి సుమారు 150 క్వింటాళ్ల పత్తిని బసవరాజు ఇంట్లో నిల్వ చేశారు. సోమవారం కుటుంబ సభ్యులతో ఇంటికి తాళం వేసి పొలానికి వెళ్లారు. ఇదే సమయంలో ప్రమాదవశాత్తు ఇంట్లో మంటలు రేగి పత్తికి వ్యాపించాయి. ఒక్కసారిగా ఇళ్లు మొత్తం కాలి కూలిపోయింది. స్థానికుల సమాచారం మేరకు ఆలూరు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. పత్తితోపాటు ఇంట్లో దాచుకున్న రూ.3 లక్షల నగదు, 8 తులాల బంగారం, 10 క్వింటాళ్ల ఆశ్వగంధి, 20 క్వింటాళ్లు జొన్నలు, బియ్యం, సరుకులు, వంట సామగ్రి కాలి బూడిదయ్యాయి. ఫలితంగా రూ. 20లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని బాధిత రైతు బసవరాజు కన్నీరు పెట్టుకున్నారు.
పరిహారం వచ్చేలా చూస్తాం: ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
ప్రమాద విషయంపై ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. బాధిత రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరిహారం అందేందుకు తన వంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ షఫీవుల్లా, సర్పంచ్ మల్లికార్జున, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి గిరి బాధితులను పరామర్శించారు.
Advertisement
Advertisement