తెల్ల బంగారం.. మెరిసేనా!
తెల్ల బంగారం.. మెరిసేనా!
Published Mon, Aug 29 2016 5:06 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
రైతన్న ఆశలు నిలిచేనా!
ప్రస్తుత వర్షాలతో పత్తి మొక్కలకు జీవం
పంటలు ఎండుతున్న దశలో ఊరటనిచ్చిన వరుణుడు
నరసరావుపేట : జిల్లాలో కురుస్తున్న వర్షాలు పత్తికి జీవాన్నిచ్చాయి. రైతుల్లో ఆశలు రేపా యి. ప్రతి ఏడాదీ లాగానే పత్తి సాగుపై మమకారం చంపుకోలేని రైతులు ఈ ఏడాదీ సాగు చేపట్టారు. రెండేళ్ల క్రితం రైతులకు కాసులు కురిపించిన తెల్ల బంగా రం నిరుడు పెట్టుబడులతో సరిపెట్టింది. ఈ ఏడాది సాగు చేసిన పంట వర్షాభావంతో దెబ్బతింది. రెండు నెలలుగా మొక్కలు వర్షాభావంతో బెట్టకొచ్చాయి. ఎక్కడో ఆరుతడికి నీరు అందే బావుల కింద ఉన్న పంటలు తప్పించి చాలా ప్రాంతాల్లో పత్తి ఎండిపోయే దశకు చేరుకుంది. ఆ పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి కనిపించకపోవటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ తరుణంలో జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు పత్తి రైతుల్లో ఆశలు చిగురించేలా చేశాయి.
మొదటి కాపుపై ఆశలు...
జిల్లాలో రైతులు వేసిన మినుము, సజ్జ, మొక్కజొన్న పంటలు నాలుగు రోజుల క్రితం వరకు వర్షాభావంతో ఎండిపోయాయి. వేసిన పత్తి వాతావరణం బాగుంటే ఇప్పటికే నాలుగైదు అడుగుల మేర ఎదగాల్సి ఉంది. కానీ అడుగు, అడుగున్నర ఎత్తునే పెరిగి పువ్వు తొడిగింది. కొన్నిచోట్ల మొక్కలు వడలిపోయి ఎదుగుదలే కనిపించలేదు. అంతా సవ్యంగా ఉంటే మరో 20 రోజుల్లో మొదటి కాపు పత్తిని ఒలవాల్సి ఉంది. పత్తి మొక్కకు ఒకటీ రెండు పూలు తప్పించి కాయలు కూడా ఏర్పడలేదు. ప్రస్తుత వర్షాలతో పత్తి మొక్క నిలదొక్కుకొని పచ్చదనం వైపు తిరిగింది. వర్షాలు ఈ విధంగానే ఉండి పంటకు బలం మందు వేస్తే మరో నెల రోజుల్లో మొదటి కాపు పత్తి ఏర్పడవచ్చని రైతులు చెబుతున్నారు. వర్షాలు ఈ విధంగానే ఉంటే గతేడాది అంత దిగుబడి రాకపోయినా పెట్టుబడులైనా రాకపోతాయా అని కొందరు భావిస్తున్నారు. మరికొందరు రైతులు పత్తిపై ఆశలు వదులుకొని మిరపపై దృష్టిసారించారు.
Advertisement
Advertisement