kishore tiwari
-
ట్రాఫిక్ చలానాలు; పస్తులతో ఆత్మహత్యలు!
ముంబై : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోటారు వాహన సవరణ చట్టం-2019పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధిక జరిమానాలను విధించే ఈ చట్టం సామాన్యుడి నడ్డి విరిచేలా ఉందంటూ దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో కొత్త ట్రాఫిక్ జరిమానాలు సగానికి తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. బీజేపీ పాలిత రాష్ట్రంలోనే కొత్త చట్టంపై ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే తాము మాత్రం ఎందుకు దీనిని అమలు చేయాలని పలువురు నాయకులు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్లో జరిమానాలు తగ్గించడంపై రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రైతు సంఘం ప్యానెల్ చీఫ్ కిశోర్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త చట్టం పౌరులను ఆత్మహత్యలకు పురిగొల్పేలా ఉందని వ్యాఖ్యానించారు. ఈ చట్టం కారణంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నారు. బుధవారం ఓ కార్యక్రమంలో కిశోర్ తివారీ మాట్లాడుతూ...‘ ప్రధాని, హోం మంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్లో ట్రాఫిక్ చలానాలు తగ్గించారు. దీనిని బట్టి కొత్త చట్టానికి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయని అర్థమవుతోంది. కాబట్టి ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఈ చట్టంపై రెండో అభిప్రాయం ఉందని భావించవచ్చు. 10 వేల నుంచి 20 వేల వరకు జరిమానా విధిస్తున్నారు. అద్దెకు వాహనాలు నడుపుకొని జీవనం సాగించే నెల జీతానికి సమానంగా జరిమానాలు ఉండటం దారుణం. అటువంటి బడుగు జీవులకు ఒక్కసారి జరిమానా పడిందంటే వాళ్ల కుటుంబం మొత్తం పస్తులతో ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు. కాగా వసంతరావు నాయక్ శెట్టి స్వాలంబన్ మిషన్ చైర్మన్‌గా ఉన్న కిశోర్ తివారీ ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి హోదా అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మహారాష్ట్ర రవాణా శాఖా మంత్రి దివాకర్ రౌత్ కూడా కొత్త మోటారు వాహన సవరణ చట్టాన్ని విమర్శించారు. ఈ మేరకు...‘ కొత్త చట్టం సామాన్యుల పాలిట భారంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని మరోసారి సమీక్షించి.. సవరించాల్సిన అవసరం ఉంది అని నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. కాగా దివాకర్ శివసేన పార్టీకి చెందిన వారన్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా బీజేపీ ప్రభుత్వం ఆయనకు మంత్రి పదవినిచ్చింది. -
గడ్కరీ మాటలకు అర్థాలే వేరులే!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఎవరయితే ఇంటిని చక్కదిద్దు కోలేరో వారిక దేశాన్ని ఎలా చక్కదిద్దుతారు? కనుక మీరు ముందుగా మీ కుటుంబ బాధ్యతలపై దృష్టి పెట్టండి!’ అని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఫిబ్రవరి రెండవ తేదీన ఏబీవీపీ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘ప్రజలు తమను కలల్లోకి తీసుకెళ్లే నాయకులను ఇష్ట పడతారు. ఒకవేళ వారి కలలను నెరవేర్చడంలో నాయకులు విఫలమయితే వారిని పట్టుకొని ప్రజలు కొడతారు. కనుక మీరు నెరవేర్చగల హామీలను మాత్రమే ఇవ్వండి’ అని జనవరి 28వ తేదీన ముంబైలో బీజేపీ అనుబంధ రవాణా సంఘం ‘నవభారతీయ శివ్ వాహతుక్ సంఘటన’ సమావేశంలో గడ్కారీ వ్యాఖ్యానించారు. ‘సాంస్కృతిక కార్యక్రమాల్లో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోకూడదు. రాజకీయ నాయకులకు పరిమితులు ఉంటాయి. కనుక వారు విద్యా, సాహిత్య కార్యక్రమాల్లో జోక్యం చేసుకోరాదు’ అంటూ జనవరి 13వ తేదీన మహారాష్ట్రలోని యవత్మల్లో జరిగిన 92వ అఖిల భారతీయ మరాఠి సాహిత్య సమ్మేళనం’లో గడ్కారీ వ్యాఖ్యానించారు. ‘మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మహిళా సాధికారికతకు నిదర్శనం. మహిళలకు రిజర్వేషన్లు లేకపోయినప్పటికీ రాజకీయల్లో రాణించారు’ అని జనవరి ఏడవ తేదీన నాగపూర్‌లో జరిగిన స్వయం ఉపాధి మహిళా బృందాలను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అదే సమావేశంలో ఆయన కుల, మత రాజకీయాలను విమర్శించారు. ‘ఎవరైనా జ్ఞానం ప్రాతిపదికనే ఎదగాలి. సాయిబాబా, గజానన్ మహరాజ్ లేదా సంత్ తుక్దోజీ మహరాజ్‌ను మీది ఎమతమని అడుగుతామా? ఛత్రపతి శివాజీ మహరాజ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ లేదా జ్యోతీబా ఫూలేలను మీ కులం ఏమిటని అడుగుతామా?’ ‘నేనే పార్టీ అధ్యక్షుడిని అయితే నా ఎంపీలు, ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయక పోతే ఎవరిది బాధ్యత ? నాదే బాధ్యత’ అని డిసెంబర్ 25వ తేదీన ఢిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో మాట్లాడుతూ గడ్కరీ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఫలితాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సహనం పాటించడం భారత ప్రజలకున్న పెద్ద సంపద. భారత్ ఓ దేశం కాదు, ఓ జాతంటూ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చేసిన వ్యాఖ్యలు నాకిష్టం’ అని ఆయన అన్నారు. ‘ప్రజల జీవితాల్లో సామాజిక, ఆర్థిక అభివృద్ధిని తీసుకరాకపోతే నీవు అధికారంలోకి వచ్చినా ఒక్కటే అధికారం కోల్పోయినా ఒక్కటే’ అని అన్నారు. అంతకుముందు డిసెంబర్ 22వ తేదీన పుణెలో జరిగిన జిల్లా పట్టణ కోపరేటివ్ బ్యాంకుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘పరాజయాన్ని ఒప్పుకునే సంస్కారం పెరగాలి’ అని అన్నారు. అక్టోబర్‌లో బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌కు ఇచ్చిన ఓ టీవీ ఇంటర్వ్యూలో ‘బీజేపీ ఎన్నికలకు ముందు నెరవేర్చడం సాధ్యంకాని హామీలను ఇచ్చింది. రాజకీయాలనేవే తప్పనిసరి ఆడాల్సిన ఓ ఆట. దానికి పరిమితులుంటాయి. వైరుధ్యాలు కూడా ఉంటాయి. మేము ఎప్పటికీ అధికారంలోకి రామని గట్టిగా భావించాం. అయితే అసాధ్యమైన హామీలు ఇవ్వాల్సిందిగా మా వారు మాకు సూచించారు. ఎన్నికయినా వాటిని ఎలాగు నెరవేర్చలేం. అయితే సమస్య ఏమి వచ్చిందంటే, జనం ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించారు. డేట్లతో సహా మేమిచ్చిన హామీలను మాకు గుర్తు చేస్తున్నారు. చిద్విలాసంగా నవ్వుతూ ముందుకు పోతున్నాం అంతే’ అని వ్యాఖ్యానించారు. గడ్కరీ గతేడాది కాలంగా చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ పరమైనవని, ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాను ఉద్దేశించి చేసినవే ఎక్కువన్న విషయం స్పష్టం అవుతోంది. ‘ఇంటిని చక్కదిద్దుకోలేని వాడు దేశాన్ని ఏం చక్కదిద్దుతాడు’ అన్న వ్యాఖ్య భార్యను విడిచిపెట్టిన మోదీని ఉద్దేశించి చేసినట్లుగా కనిపిస్తోంది. ప్రజల జీవితాలను బాగు చేయలేని వాడు అధికారంలో ఉన్నా ఒకటే లేకున్నా ఒక్కటేనని అనడం, అసాధ్యమయ్యే హామీలను ఇవ్వడం (సబ్కే సాత్ సబ్కా వికాస్) తప్పని చెప్పడం, ఎన్నికల్లో ఓడిపోతే అందుకు బాధ్యత వహించాల్సిందనడం మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా కనిపిస్తాయి. ఓటమికి పార్టీ అధ్యక్షుడిగా తన బాధ్యత అనడం అమిత్ షాను ఉద్దేశించి చేసినట్లు కనిపిస్తోంది. ఇక కుల, మతాల గురించి, దేశ ప్రజల సహనం గురించి, ఇందిరా, నెహ్రూల గురించి మాట్లాడడం పార్టీ వైఖరిని దూషించినట్లుగా కనిపిస్తోంది. ఇక విద్యా, సాహిత్య కార్యక్రమాల్లో రాజకీయ నాయకుల జోక్యం అనవసరం అనడం మహారాష్ట్ర నవ నిర్మాణ సేన నాయకుడు రాజ్ థాక్రే అభ్యంతరం మేరకు ప్రముఖ సాహితీవేత్త నయన్‌తార సహగల్‌ను మహారాష్ట్ర సాహిత్య సమ్మేళనానికి నిర్వాహకులు ఆహ్వానించకపోవడంపై వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి మోదీని పరోక్షంగా విమర్శించడం ద్వారా పార్టీలో తాను ఆయనకు ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదగాలనుకోవడం, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే మిత్రపక్షాలను ఆకర్షించే ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా ఎదగాలనుకోవడం, ఇక ఇందిరా, నెహ్రూలు, ప్రజల సహనం గురించి మాట్లాడం అంటే తాను మోదీ లాంటి నియంతృత్వ వాదిని కాదని, ప్రజల మనిషినని, నిబద్ధత కలిగిన వ్యక్తిని అని చెప్పుకోవడం కావచ్చు. అయితే ఇలాంటి అన్వయింపులను గడ్కరీ కొట్టి వేస్తున్నారు. మీడియా అసందర్భంగా తన వ్యాఖ్యలకు ఉటంకిస్తోందని ఆరోపిస్తున్నారు. పార్టీ నాయకత్వానికి, తనకు మధ్య దూరం పెంచడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శిస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రభుత్వాలు పడిపోవడానికి పార్టీ నాయకులు నియంతృత్వ పోకడలే కారణమని, ప్రధాని పదవి నుంచి మోదీని తప్పించి గడ్కారీని నియమించాలంటూ ఆరెస్సెస్ నాయకుడు మోహన్ భగవత్, ప్రధాన కార్యదర్శి సురేశ్ జోషిలకు డిసెంబర్ నెలలో ‘వసంత్‌రావు నాయక్ సేథి స్వావలంబన్ మిషన్’ చైర్పర్సన్ కిషోర్ తివారీ మరి ఎందుకు లేఖ రాశారో? పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన గడ్కరీకి ఇప్పటికీ ఆరెస్సెస్ అండదండలున్న విషయం తెల్సిందే. -
మూడు రోజుల్లో 12 మంది విదర్భ రైతుల ఆత్మహత్య
నాగపూర్ : విదర్భ ప్రాంతంలో గత 72 గంటల్లో 12 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆదివారం విదర్భ జన్ ఆందోళన్ సమితి అధినేత కిషోర్ తివారి తెలిపారు. వీరందరూ పత్తిని ఎక్కువగా పండించే పశ్చిమ విదర్భ ప్రాంతానికి చెందినవారేనని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కరువు వల్ల పంటలు దారుణంగా దెబ్బతిన్నాయని, దాంతో చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక రైతులు ఆత్మహత్యను ఆశ్రయిస్తున్నారని తివారి ఆవేదన వ్యక్తం చేశారు. పత్తిరైతుకు మద్దతు ధరను పెంచేందుకు ప్రభుత్వం కృషిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
కనికరించని చినుకు
సాక్షి, ముంబై: ప్రతి ఏడాది మాదిరిగానే వరుణుడు ఈసారి కూడా దోబూచులాడుతున్నాడు. ముంబైలో ఇటీవల వర్షాలు కురుస్తున్నా, ఇతర ప్రాంతాల్లో సకాలంలో వర్షాలు కురవక లక్షల హెక్టార్ల పత్తి పంటకు నష్టం వాటిల్లింది. అప్పు చేసి మరీ పత్తిపంటను సాగు చేసిన రైతులు వర్షాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చాలా మంది పత్తి రైతులు తమ పంటపై ఆశలు వదులుకున్నారు. దాదాపు 15 లక్షల హెక్టార్లలో నాటిన పత్తి విత్తనాలు వర్షాలు కురవకపోవడంతో ఎండిపోయాయి. మునుపటి మాదిరిగానే ఈసారి కూడా జూన్‌లో పత్తి విత్తనాలు నాటినట్లు రైతులు పేర్కొన్నారు. వర్షాలు కురవకపోవడంతో అవి మొలకెత్తడం లేదని వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో గతంలో వర్షాన్ని అంగుళాల పద్ధతిలో కొలిచేవారు. ఇప్పుడు సెంటీమీటర్లలో లెక్కించాల్సి వస్తుందని ‘విధర్భ జనాందోళన్ సమితి’ (వీజేఏఎస్) వ్యవస్థాపకుడు కిషోర్ తివారీ పేర్కొన్నారు. ప్రత్యేక విదర్భ రాష్ట్ర సాధన, ఇక్కడ వ్యవసాయ సంక్షోభంపై ఈ సంఘం పోరాటాలు చేస్తోంది. రాష్ట్రంలో పత్తి రైతులు ప్రతిసారి దాదాపు 44 లక్షల హెక్టార్లలో పత్తి విత్తనాలు నాటేవారు. మద్దతు ధర రాకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు, నకిలీ విత్తనాల వల్ల తీవ్ర నష్టాలు రావడంతో సాగు 20 లక్షల హెక్టార్లకు పడిపోయింది. వర్షాభావం వల్ల చాలాచోట్ల విత్తనాలు మొలకెత్తలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ ఉమాకాంత్ డాన్జెట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘వర్షాలు ఇప్పటికీ నెల రోజులు ఆలస్యం అయ్యాయి. విత్తనాలు ఆలస్యంగా నాటి ఉంటే పంటలకు తెగుళ్లు వచ్చేవి. అయితే కొంత ఆలస్యం అయినా వర్షాలు కురుస్తాయి. ఆశించినస్థాయి దిగుబడులు వస్తాయి’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి పత్తిపై తమకు ఆశలు లేవని, ఇతర పంటలసాగుపై దృష్టి సారిస్తామని రైతులు చెబుతున్నారు. పత్తి విత్తనాలు నాటే సమయం ముగిసిపోయిందని కూడా తివారీ పేర్కొన్నారు. ప్రస్తుతం చాలా మంది పప్పుధాన్యాల సాగుపై ఆసక్తి చూపుతున్నందున, వారికి ప్రభుత్వం సహకరిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ‘ఇప్పటికే పత్తి విత్తనాలకు చేసిన వ్యయం వృథా అయింది. ప్రభుత్వం రాయితీపై పప్పుధాన్యాల విత్తనాలు ఇవ్వాలి. పత్తి పంట మంచి ఆదాయం తెచ్చి పెడుతున్నా, ఈసారి ప్రకృతి సహకరించడం లేదు’ అని తివారీ అన్నారు. ఈసారి పంట దిగుబడి 50 శాతం వరకు తగ్గే అవకాశం ఉందన్నారు. హెక్టారు భూమిలో పత్తి విత్తనాలు నాటేందుకు రైతులు రూ.30 వేల ఖర్చు చేసినందున, మరో పంటను తిరిగి సాగు చేయడానికి అయ్యే ఖర్చును భరించలేరని పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వ సాయం అనివార్యమని స్పష్టం చేశారు. చాలా ప్రాంతాల్లో పత్తిసాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నా, ఇప్పటికీ కొంత పంట మాత్రం సురక్షితంగా ఉందని ప్రభుత్వం వాదిస్తోంది. బిందుసేద్యం చేస్తున్న మూడు నుంచి నాలుగు లక్షల హెక్టార్ల రైతుల భూములకు ఎలాంటి భయమూ లేదని తెలిపింది. వర్షాధార భూముల్లో పంటలకు నష్టం జరుగుతున్న మాట నిజమేనని వ్యవసాయశాఖ పేర్కొంది. ఇలాంటి వారిని సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయని డాన్జెట్ తెలిపారు. -
ఈ నేరమెవరిది?
ముంబై: మహారాష్ట్ర... ఎప్పటినుంచో ఎన్నింటిలోనో అగ్రస్థానంలో నిలుస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా, వ్యాపార-వాణిజ్య రంగాల్లో తిరుగులేని రికార్డులను నమోదు చేస్తున్న రాష్ట్రంగా.. పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న మనరాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో కూడా అగ్రస్థానంలోనే నిలిచింది. 2013లోనే 3,146 మంది మహారాష్ట్ర రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని జాతీయ నేర గణాంకాల విభాగం(ఎన్సీఆర్బీ) వెల్లడించింది. ఈ విషయమై విదర్భ జనాందోళన్ సమితి(వీజేఏస్) అధ్యక్షుడు కిషోర్ తివారీ మాట్లాడుతూ... ‘1995 నుంచి 60,768 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటన్నింటిని ఆత్మహత్యలుగా మాత్రమే చెప్పలేం. ఇవన్నీ తప్పుడు విధానాలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సామూహిక హత్యలే. ముఖ్యంగా గత పదిహేనేళ్లలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలుగా చెప్పవచ్చు. రైతుల ఆత్మహత్యలను పదిహేనేళ్లలో కూడా నివారించకపోవడం ఈ సర్కారు వైఫల్యంగా చెప్పుకోవచ్చు. నిజంగా ఇది సిగ్గుచేటయిన విషయం. రైతులు ఆత్మహత్యలు గత సంవత్సరం సగానికిపైగా తగ్గాయని సర్కారు చెబుతున్న మాటలు అబద్ధాలని ఎన్సీఆర్బీ వెల్లడించిన గణాంకాలతో తేలిపోయింది. 60,768 మంది ఆత్మహత్యలు చేసుకోవడంతో మహారాష్ట్ర మిగతా రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలిచింది. ఇప్పటికైనా ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాల’ని తివారీ డిమాండ్ చేశారు. 1995 నుంచి రైతుల ఆత్మహత్యలకు సంబంధించి విదర్భ జనాందోళన్ సమితి ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది. దాని ప్రకారం... ఎన్సీఆర్బీ వెల్లడించిన రైతుల ఆత్మహత్యల సంఖ్య 3.00,000. అంటే దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రతి ఐదుగురిలో ఒకరు మహారాష్ట్రకు చెందిన రైతే. మహారాష్ట్రలో కూడా విదర్భ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అకాల వర్షాలు, వర్షాభావం, వ్యవసాయ ఖర్చులు పెరగడం, సంవత్సరమంతా కష్టపడినా ఒకే పంట చేతికి రావడం, పండించిన పంటకు సరైన మద్దతు ధర దక్కకపోవడం, వ్యవసాయంపై రైతులకు సరైన అవగాహన లేకపోవడం, ప్రభుత్వాల నుంచి సహాయ సహకారాలు కొరవడడం వంటివి రైతులు ఆత్మహత్యలకు కారణాలుగా నిపుణుల అధ్యయనాల్లో తేలింది. అకాల వర్షాలు, వర్షాభావ పరిస్థితు లు వంటివి ఎవరి చేతుల్లో లేని విషయాలు. అయితే వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన కల్పించడం, మద్దతు ధర దక్కేలా చేయడం, వ్యవసాయ ఖర్చులను తగ్గించేందుకు సహాయ సహకారాలు అందించడం వంటివాటిపై ప్రభుత్వం కాస్త శ్రద్ధ పెడితే వందశాతం పూర్తయ్యే పనులు. అయినప్పటికీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టవు. 2006లో వీజేఏస్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ తిరిగి ఓ సర్వే చేసింది. 10,70,000 మందిని సర్వే చేయగా అందులో నాలుగోవంతు మంది పత్తి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు తేలింది. మిగతావారి పరిస్థితి కూడా ఏమంత బాగా లేకపోయినా ఇబ్బందులు పడుతూ కాలం వెళ్లదీస్తున్నట్లు స్పష్టమైంది. కేవలం 10 శాతం మంది రైతులు మాత్రమే కాస్త ఫరవాలేదన్నట్లుగా బతుకుతున్నారని సర్వే స్పష్టం చేసింది. ఇదిలావుండగా ఈ ఏడాది కూడా వర్షాలు ముఖం చాటేయడంతో విదర్భ రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇక్కడి రైతులను ఆదుకోవాలని వీజేఏస్ డిమాండ్ చేసింది. -
కరువుతో కాపురమే!
ఈసారీ విదర్భ రైతుకు కష్టకాలమే నాగపూర్: కరువుతో కాపురం చేసే విదర్భ రైతు పరిస్థితి ఈ ఏడాది కూడా మారేలా కనిపించడంలేదు. పైగా మరిన్ని కష్టాలను ఎదుర్కోవాల్సిన దుస్థితి ఎదురు కానుంది. పత్తి, సోయా పంటలపై ఎక్కువగా ఆధారపడే ఈ ప్రాంత రైతులు వర్షాలు కురుస్తాయన్న ఆశతో విత్తనాలను వేలాది ఎకరాల్లో నాటి చినుకు కోసం ఎదురు చూస్తున్నారు. జూన్ మొదటి వారంలోనే వర్షాలు కురవాల్సి ఉన్నా ఇప్పటిదాకా చినుకు జాడే లేదు. విత్తనాలు నాటి దాదాపు నెల గడుస్తున్నా చినుకు పడలేదు. మొక్క మొలవలేదు. భూమిలో నాటిన విత్తనాలు పాడైపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో విత్తనాలు మళ్లీ మొలకెత్తే పరిస్థితి కనిపించడంలేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్షాలు కురవకపోతే నాటిన విత్తనాలతోపాటు ఎరువుల ఖర్చు భారం కూడా రైతన్న మోయాల్సి వస్తుందంటున్నారు. మరో పక్షం రోజుల్లో వర్షాలు సమృద్ధిగా కురిసినా పంటకాలం దాటిపోవడంతో ఆశించినమేర దిగుబడి రావడం కష్టమేనంటున్నారు. పెట్టుబడి మట్టిపాలు... ‘విదర్భ రైతులు వేలాది రూపాయలు బ్యాంకుల నుంచి రుణంగా తీసుకొని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశారు. మట్టి సారం పెరిగేందుకు ఇప్పటికే వేలాది రూపాయల ఎరువులను పొలంలో చల్లారు. విత్తనాలను కూడా నాటుకున్నారు. వర్షాలు ఆలస్యం కావడంతో ఈసారీ కరువు తప్పదేమోనన్న బెంగలో రైతులున్నారు. రైతులు తీవ్ర నిర్ణయాలు తీసుకోకముందే ప్రభుత్వం వారిని ఆదుకోవాలి. ఇప్పటికే తీసుకున్న బ్యాంకు రుణాలను మాఫీ చేసి, ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతును ప్రోత్సహించాలి.అందుకు అవసరమైన విత్తనాల సరఫరా వంటివి చేయాల’ని విదర్భ జనాందోళన్ సమితి అధ్యక్షుడు కిశోర్ తివారీ డిమాండ్ చేశారు. విదర్భ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితి నెలకొనడం ఇది వరుసగా రెండో ఏడాది. గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఫరవాలేదనిపించిన వర్షాలు విదర్భ రైతులపై మాత్రం కనికరం చూపలేదు. అయినా కష్టపడి రైతులు పండించిన పంటను అకాల వర్షాలు ఊడ్చుకొని పోయాయి. దీంతో చెమటోడ్చి కూడా రైతన్న కరువుతో కాపురమే చేయాల్సి వచ్చింది. అయితే ఈ ఏడాది కూడా దాదాపు అదే పరిస్థితి నెలకొనే అవకాశముందని వాతావరణ నిపుణులు కూడా చెబుతున్నారు. ఠాణేలో కాంగ్రెస్ యాగం... వరుణుడి జాడ లేకపోవడంతో వర్షాలు కురవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోమవారం యాగం చేశారు. రాష్ట్రాన్ని కరువు కాటు నుంచి తప్పించాలని కోరుతూ వరుణ దేవుడిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతల తోపాటు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో యజ్ఞం జరుగుతున్న పరిసరాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కుంభాదేవి ఆలయంలో బీజేపీ... భారతీయ జనతా పార్టీ కూడా ఆదివారం వరుణ యాగం చేసింది. నగరంలోని కుంభాదేవి ఆలయంలో నిర్వహించిన ఈ యజ్ఞంలో బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు ఆశిష్ శేలార్, పార్టీ నేత రాజ్‌పురోహిత్ తదితరులు పాల్గొన్నారు. యజ్ఞ గుండంలో స్వయంగా నెయ్యిని పోసి వరుణ దేవుడిని ఆహ్వా నించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొనకుండా చూడాలని వేడుకున్నారు. ప్రచార ఆర్భాటాలే... త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు యజ్ఞయగాలను ఓ ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. కరువు కోరల్లో చిక్కుకుంటున్న రైతులను ఆదుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని, మూగజీవాలకు గడ్డిని, నీటిని అందించే ఏర్పాట్లు చేయాని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా యజ్ఞయాగాల పేరుతో ప్రజల ఓట్లను కొల్లగొట్టేందుకు పార్టీలు ప్రయత్నించడం సరికాదంటున్నారు.