ముంబై: మహారాష్ట్ర... ఎప్పటినుంచో ఎన్నింటిలోనో అగ్రస్థానంలో నిలుస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా, వ్యాపార-వాణిజ్య రంగాల్లో తిరుగులేని రికార్డులను నమోదు చేస్తున్న రాష్ట్రంగా.. పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న మనరాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో కూడా అగ్రస్థానంలోనే నిలిచింది. 2013లోనే 3,146 మంది మహారాష్ట్ర రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని జాతీయ నేర గణాంకాల విభాగం(ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. ఈ విషయమై విదర్భ జనాందోళన్ సమితి(వీజేఏస్) అధ్యక్షుడు కిషోర్ తివారీ మాట్లాడుతూ... ‘1995 నుంచి 60,768 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
వీటన్నింటిని ఆత్మహత్యలుగా మాత్రమే చెప్పలేం. ఇవన్నీ తప్పుడు విధానాలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సామూహిక హత్యలే. ముఖ్యంగా గత పదిహేనేళ్లలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలుగా చెప్పవచ్చు. రైతుల ఆత్మహత్యలను పదిహేనేళ్లలో కూడా నివారించకపోవడం ఈ సర్కారు వైఫల్యంగా చెప్పుకోవచ్చు. నిజంగా ఇది సిగ్గుచేటయిన విషయం. రైతులు ఆత్మహత్యలు గత సంవత్సరం సగానికిపైగా తగ్గాయని సర్కారు చెబుతున్న మాటలు అబద్ధాలని ఎన్‌సీఆర్‌బీ వెల్లడించిన గణాంకాలతో తేలిపోయింది. 60,768 మంది ఆత్మహత్యలు చేసుకోవడంతో మహారాష్ట్ర మిగతా రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలిచింది.
ఇప్పటికైనా ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాల’ని తివారీ డిమాండ్ చేశారు. 1995 నుంచి రైతుల ఆత్మహత్యలకు సంబంధించి విదర్భ జనాందోళన్ సమితి ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది. దాని ప్రకారం... ఎన్‌సీఆర్‌బీ వెల్లడించిన రైతుల ఆత్మహత్యల సంఖ్య 3.00,000. అంటే దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రతి ఐదుగురిలో ఒకరు మహారాష్ట్రకు చెందిన రైతే. మహారాష్ట్రలో కూడా విదర్భ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అకాల వర్షాలు, వర్షాభావం, వ్యవసాయ ఖర్చులు పెరగడం, సంవత్సరమంతా కష్టపడినా ఒకే పంట చేతికి రావడం, పండించిన పంటకు సరైన మద్దతు ధర దక్కకపోవడం, వ్యవసాయంపై రైతులకు సరైన అవగాహన లేకపోవడం, ప్రభుత్వాల నుంచి సహాయ సహకారాలు కొరవడడం వంటివి రైతులు ఆత్మహత్యలకు కారణాలుగా నిపుణుల అధ్యయనాల్లో తేలింది.
అకాల వర్షాలు, వర్షాభావ పరిస్థితు లు వంటివి ఎవరి చేతుల్లో లేని విషయాలు. అయితే వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన కల్పించడం, మద్దతు ధర దక్కేలా చేయడం, వ్యవసాయ ఖర్చులను తగ్గించేందుకు సహాయ సహకారాలు అందించడం వంటివాటిపై ప్రభుత్వం కాస్త శ్రద్ధ పెడితే వందశాతం పూర్తయ్యే పనులు. అయినప్పటికీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టవు. 2006లో వీజేఏస్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ తిరిగి ఓ సర్వే చేసింది. 10,70,000 మందిని సర్వే చేయగా అందులో నాలుగోవంతు మంది పత్తి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు తేలింది. మిగతావారి పరిస్థితి కూడా ఏమంత బాగా లేకపోయినా ఇబ్బందులు పడుతూ కాలం వెళ్లదీస్తున్నట్లు స్పష్టమైంది. కేవలం 10 శాతం మంది రైతులు మాత్రమే కాస్త ఫరవాలేదన్నట్లుగా బతుకుతున్నారని సర్వే స్పష్టం చేసింది.
ఇదిలావుండగా ఈ ఏడాది కూడా వర్షాలు ముఖం చాటేయడంతో విదర్భ రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇక్కడి రైతులను ఆదుకోవాలని వీజేఏస్ డిమాండ్ చేసింది.
ఈ నేరమెవరిది?
Published Fri, Jul 4 2014 10:49 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement