34వేల కోట్ల రైతు రుణాలు మాఫీ
ముంబై: తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన మహారాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ. 34వేల కోట్ల విలువైన రైతు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. రూ. 1.5 లక్షల వరకు ఉన్న రైతు రుణాలను పూర్తిగా మాఫి చేస్తున్నట్టు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు.
క్రమం తప్పకుండా రుణాన్ని తిరిగి చెల్లిస్తున్న రైతులకు కూడా ఈ పథకం కింద లబ్ధి చేకూర్చనున్నామని, ఇప్పటివరకు చెల్లించిన దానిలో 25శాతం రాయితీగా తిరిగి ఇవ్వనున్నట్టు తెలిపారు. రైతు రుణమాఫీ పథకం కింద 89 లక్షలమంది రైతులు లబ్ధి పొందనున్నట్టు చెప్పారు. ఈ రుణమాఫీ వల్ల ఖజానాపై ఎంత భారం పడుతుందో తమకు తెలుసునని, అయితే, తమ ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా కొంత భారాన్ని తగ్గిస్తామని సీఎం చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలందరూ తమ ఒక నెల జీతాన్ని రుణమాఫీ పథకానికి మద్దతుగా అందివ్వనున్నారని చెప్పారు.