ఫడ్నవిస్‌పై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ఫడ్నవిస్‌పై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Published Thu, Sep 14 2017 12:57 PM | Last Updated on Fri, Mar 29 2019 8:33 PM
సాక్షి, ముంబై: తన సొంత పార్టీపైనే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న బీజేపీ ఎంపీ నానా పటోలే మరోసారి అదే పని చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌పైనే సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హయాంలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా పెరిగిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘గత కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వ హయాంలో కంటే ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది. అన్నదాతల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యమంత్రి నేను ఒకే పార్టీకి చెందిన వారం కావొచ్చు. మంచి స్నేహితులమే అయి ఉండొచ్చు. అయినా తప్పు చేస్తే వెలెత్తి చూపి, అది సరిదిద్దుకునే దాకా ఫడ్నవిస్‌ను వదలను’’ అని పటోలే చెప్పుకొచ్చారు.
మహారాష్ట్రలో రైతుల రుణమాఫీ కోసం ఫడ్నవిస్ ప్రభుత్వం 34 వేల కోట్ల ప్యాకేజీని విడుదల చేసింది. అదే సమయంలో నిబంధనలను కఠిన తరం చేయటం, దరఖాస్తులు ఆన్ లైన్‌లోనే చేసుకోవాలని సూచించటం, పైగా ఒక కుటుంబానికి 1.5 లక్షల పరిమితి మాత్రమే విధించటంపై పలువురు మండిపడుతున్నారు. వారిలో భండారా-గోండియా ఎంపీ నానా పటోలే కూడా ఉన్నారు. ఇక నానాకి సొంత పార్టీనే విమర్శించటం కొత్తేం కాదు. గతంలోనూ చాలాసార్లు బహిరంగంగానే బీజేపీ విధానాలపై ఆయన విరుచుకుపడ్డారు. పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందన్న భయం లేదా? అన్న ప్రశ్నకు వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వకపోయినా ఫర్వాలేదని, ప్రజలు తనను ఎన్నుకున్నారు కాబట్టి వారు గురించి మాత్రమే ఆలోచిస్తానని పటోలే స్పష్టం చేశారు.
ఇప్పటిదాకా రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులలో 10 లక్షలు నకిలీవే ఉన్నాయంటూ మహారాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి చంద్రకాంత్ పాటిల్ చేసిన ఓ ప్రకటన తీవ్ర దుమారం రేపింది. వాటి వెరిఫికేషన్ ఇంకా పూర్తికాకముందే అవి ఫేక్ అని ఎలా తేల్చారంటూ నానా పటోలే ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రిని కలిసి చర్చించగా, పాటిల్ ప్రకటనను ఫడ్నవిస్ కూడా ఖండించారు.
Advertisement
Advertisement