కనికరించని చినుకు | farmers facing problems due to insufficient rains | Sakshi
Sakshi News home page

కనికరించని చినుకు

Published Mon, Jul 7 2014 11:12 PM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM

farmers facing problems due to insufficient rains

సాక్షి, ముంబై:  ప్రతి ఏడాది మాదిరిగానే వరుణుడు ఈసారి కూడా దోబూచులాడుతున్నాడు. ముంబైలో ఇటీవల వర్షాలు కురుస్తున్నా, ఇతర ప్రాంతాల్లో సకాలంలో వర్షాలు కురవక లక్షల హెక్టార్ల పత్తి పంటకు నష్టం వాటిల్లింది. అప్పు చేసి మరీ పత్తిపంటను సాగు చేసిన రైతులు వర్షాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చాలా మంది పత్తి రైతులు తమ పంటపై ఆశలు వదులుకున్నారు.

 దాదాపు 15 లక్షల హెక్టార్లలో నాటిన పత్తి విత్తనాలు వర్షాలు కురవకపోవడంతో ఎండిపోయాయి. మునుపటి మాదిరిగానే ఈసారి కూడా జూన్‌లో పత్తి విత్తనాలు నాటినట్లు రైతులు పేర్కొన్నారు. వర్షాలు కురవకపోవడంతో అవి మొలకెత్తడం లేదని వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో గతంలో వర్షాన్ని అంగుళాల పద్ధతిలో కొలిచేవారు. ఇప్పుడు సెంటీమీటర్లలో లెక్కించాల్సి వస్తుందని ‘విధర్భ జనాందోళన్ సమితి’ (వీజేఏఎస్) వ్యవస్థాపకుడు కిషోర్ తివారీ పేర్కొన్నారు. ప్రత్యేక విదర్భ రాష్ట్ర సాధన, ఇక్కడ వ్యవసాయ సంక్షోభంపై ఈ సంఘం పోరాటాలు చేస్తోంది.

 రాష్ట్రంలో పత్తి రైతులు ప్రతిసారి దాదాపు 44 లక్షల హెక్టార్లలో పత్తి విత్తనాలు నాటేవారు. మద్దతు ధర రాకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు, నకిలీ విత్తనాల వల్ల తీవ్ర నష్టాలు రావడంతో సాగు 20 లక్షల హెక్టార్లకు పడిపోయింది. వర్షాభావం వల్ల చాలాచోట్ల విత్తనాలు మొలకెత్తలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ ఉమాకాంత్ డాన్‌జెట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘వర్షాలు ఇప్పటికీ నెల రోజులు ఆలస్యం అయ్యాయి. విత్తనాలు ఆలస్యంగా నాటి ఉంటే పంటలకు తెగుళ్లు వచ్చేవి.

అయితే కొంత ఆలస్యం అయినా వర్షాలు కురుస్తాయి. ఆశించినస్థాయి దిగుబడులు వస్తాయి’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి పత్తిపై తమకు ఆశలు లేవని, ఇతర పంటలసాగుపై దృష్టి సారిస్తామని రైతులు చెబుతున్నారు. పత్తి విత్తనాలు నాటే సమయం ముగిసిపోయిందని కూడా తివారీ పేర్కొన్నారు. ప్రస్తుతం చాలా మంది పప్పుధాన్యాల సాగుపై ఆసక్తి చూపుతున్నందున, వారికి ప్రభుత్వం సహకరిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ‘ఇప్పటికే పత్తి విత్తనాలకు చేసిన వ్యయం వృథా అయింది. ప్రభుత్వం రాయితీపై పప్పుధాన్యాల విత్తనాలు ఇవ్వాలి. పత్తి పంట మంచి ఆదాయం తెచ్చి పెడుతున్నా, ఈసారి ప్రకృతి సహకరించడం లేదు’ అని తివారీ అన్నారు. ఈసారి పంట దిగుబడి 50 శాతం వరకు తగ్గే అవకాశం ఉందన్నారు.


 హెక్టారు భూమిలో పత్తి విత్తనాలు నాటేందుకు రైతులు రూ.30 వేల ఖర్చు చేసినందున, మరో పంటను తిరిగి సాగు చేయడానికి అయ్యే ఖర్చును భరించలేరని పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వ సాయం అనివార్యమని స్పష్టం చేశారు. చాలా ప్రాంతాల్లో పత్తిసాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నా, ఇప్పటికీ కొంత పంట మాత్రం సురక్షితంగా ఉందని ప్రభుత్వం వాదిస్తోంది. బిందుసేద్యం చేస్తున్న మూడు నుంచి నాలుగు లక్షల హెక్టార్ల రైతుల భూములకు ఎలాంటి భయమూ లేదని తెలిపింది. వర్షాధార భూముల్లో పంటలకు నష్టం జరుగుతున్న మాట నిజమేనని వ్యవసాయశాఖ పేర్కొంది. ఇలాంటి వారిని సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయని డాన్‌జెట్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement