నిర్మల్, న్యూస్‌లైన్ : వరుణుడు కరుణించాడని ఆనందపడాలో.. అధిక వర్షాలతో పంటలు తెగుళ్ల బారి న పడుతున్నాయని బాధపడాలో తెలియని పరిస్థితి రైతన్నది. గతేడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురియక రైతులు నష్టపోయారు. జిల్లాలో ఈ ఏడాది జూలై నెలాఖరు నాటికి సరాసరిగా 558.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది 1056.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అంటే సాధారణం కంటే 90 శాతం అధికం. అధిక వర్షాలతో చేలలో నీరు నిలిచి రైతులు నష్టపోయారు. జిల్లాలో ఈ ఏడాది 5,23,273 హెక్టార్లలో వివిధ పంటలను సాగు చేయగా అందులో వర్షాల కారణంగా 1.14 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక అంచనా రూపొందించారు. తెగుళ్లను నివారించడానికి రైతులు ఆర్థిక కష్టాలు పడే అవకాశం ఉంది. అయితే ఆశించిన తెగుళ్లను ఎలా నివారించాలో నిర్మల్ ఏడీఏ వినయ్‌బాబు ‘న్యూస్‌లైన్’కు వివరించారు.
దుంప తెగుళ్ల బారిన పసుపు
పసుపు సాగు రైతన్నకు ఆదిలోనే కష్టాలు తెచ్చిపెట్టింది. జిల్లాలో పసుపు 5,028 హెక్టార్లలో సాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు పసుపు చేనులో నీరు నిల్వ ఉండటంతో దుంప తెగులు సోకింది. ఈ దుంప తెగులు నివారించడానికి చేనులో నీరు నిలువ లేకుండా చూడాలి. రిడోమిల్ ఒక గ్రాము లేదా క్రాప్టాన్ రెండు గ్రాముల మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. పక్షం రోజుల్లో రెండు సార్లు చేసినట్లయితే తెగుళ్లను నివారించవచ్చు.
పత్తికి కుళ్లు
జిల్లావ్యాప్తంగా పత్తి 3,10,500 హెక్టార్లలో సాగైంది. అధిక వర్షాలతో కుళ్లు తెగుళ్లు ఆశిస్తుండడంతో పంట ఎదుగుదల లోపిస్తోంది. దీనిని నివారించడానికి మొదటగా చేనులోని నీటిని బయటకు పంపించాలి. అనంతరం ఎకరానికి 25 నుంచి 30 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ కలిపి వేయాలి. కుళ్లు తెగుళ్లు రాకుండా ఉండేందుకు కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాముల మందును ఒక లీటరు నీటిలో కలిపి పంటపైన, మొక్క మొదళ్లలో 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. పంట వేసి 40 రోజుల నంచి 45 రోజుల సమయం అయితే దానిపై రసం పీల్చే పురుగులు ప్రభావం పడే అవకాశం ఉంది. దీనికి ప్రధానంగా కాండం పూత పద్ధతి పాటించాలి. ఇందుకోసం పావు లీటరు మోనోక్రోటోఫాస్‌ను లీటరు నీటిలో కలిపి కాండంపై పూత పూయాలి. ఇది రెండు నుంచి మూడు ఎకరాలకు సరిపోతుంది. అయితే పిచికారి చేస్తే మిత్ర పురుగులు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే కాండం పూత పూయాలి. ఇది 20 రోజుల వ్యవధిలో రెండు సార్లు చేస్తే రసం పీల్చే పురుగులను నివారించవచ్చు.
సోయాబీన్‌కు లద్దె పురుగు
జిల్లాలో సోయా పంట 1,19,907 హెక్టార్లలో సాగైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లద్దె పురుగు ఆశించే ప్రమాదం ఉంది. లద్దె పురుగు ప్రధానంగా ఆకు అడుగున పెట్టే గుడ్ల నుంచి పిల్ల పురుగులు వందల సంఖ్యలో పెరిగి ఆకులను తినడంతో ఆకులు పూర్తిగా పోయి ఈనెలు మాత్రమే మిగులుతాయి. ప్రధానంగా ఈ ప్రభావం అధిక వర్షాల వల్లే ఉంటుంది. దీనికి ప్రధానంగా 2.5 మిల్లీలీటర్ల క్లోరోఫైరిపాస్‌ను లీటరు నీటిలో కలిపి పిచికారి చేస్తే లద్దె పెరుగు ప్రభావం ఉండదు. అలాగే లద్దె పురుగులు పంట పొలంలోని సాళ్లలో రాత్రివేళలో నివాసం ఉంటాయి. వాటిని అరికట్టేందుకు తౌడు, బెల్లం, మంచినూనె, మోనోక్రోటోఫాస్, క్లోరోఫైరిపాస్‌ను గానీ కలిపి సాళ్లలో వేస్తే అవి చనిపోతాయి. వర్షం లేని సమయాన్ని చూసి వేయాలి.
నీరు పట్టిన మొక్కజొన్న
జిల్లాలో మొక్కజొన్న 8,200 హెక్టార్లలో సాగైంది. ప్రధానంగా మోగి పురుగు ఆశిస్తోంది. మోగి పురుగు ఆశిస్తే దానికి కార్బొఫ్యూరాన్ గుళికలు రెండు నుంచి మూడు గ్రామాలు వేయాలి. ముందుగా మొక్కజొన్న పంట పొలంలో ఉన్న నీటిని తీసివేయాలి. ఆ తర్వాత ఈ గుళికలు వేస్తే మోగిపురుగును నివారించవచ్చు.
నెల రోజులుగా పంట నీళ్లలోనే..
- సల్ల ప్రకాశ్‌రెడ్డి, రైతు, దిలావర్‌పూర్
నేను రెండు ఎకరాల్లో పత్తి పంట వేశాను. అయితే కురిసిన వర్షాలకు పత్తి పంటలో పూర్తిగా నీళ్లు వచ్చి చేరాయి. దీంతో పంట అంతా నీళ్లలో మునిగింది. ఆ నీళ్లు పోయాయో లేదో మళ్లీ వర్షాలు కురస్తుండడంతో నెల రోజులుగా పంటంతా నీళ్లలోనే ఉంది. దీంతో తెగుళ్లు ఆశించాయి. నేను ఇప్పటిదాక రూ.25వేల పైనే ఖర్చు పెట్టాను. ఈ తెగుళ్ల కోసం మరింత ఖర్చు పెట్టే పరిస్థితి ఏర్పడింది.
ఆందోళనలో అన్నదాతలు
Published Tue, Aug 20 2013 5:51 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement