ఒక్క బ్యారెల్‌ = 60 కుండీలు! | Vortical Tower Garden is useful for home gardening | Sakshi
Sakshi News home page

ఒక్క బ్యారెల్‌ = 60 కుండీలు!

Published Tue, Mar 19 2019 5:41 AM | Last Updated on Tue, Mar 19 2019 5:41 AM

Vortical Tower Garden is useful for home gardening - Sakshi

వర్టికల్‌ టవర్‌ గార్డెన్‌ను మీరే తయారు చేసుకోవచ్చు.. వర్టికల్‌ టవర్‌ గార్డెన్‌ ఇంటిపంటల సాగుదారులకు చాలా ఉపయోగకరం. మేడ మీద లేదా బాల్కనీలో, ఇంటి పెరట్లో అతి తక్కువ స్థలంలో (కనీసం 4 గంటలు ఎండ తగిలే చోట) ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కో బారెల్‌లో 60 రకాల ఆకుకూరలు, కూరగాయలు, కషాయాల కోసం ఔషధ మొక్కలను పెంచుకోవచ్చు. బారెల్‌ మధ్యలో ఉండే పీవీసీ పైపులో వంటింటి వ్యర్థాలు వేస్తూ.. వర్మీ కంపోస్టును కూడా తయారు చేసుకోవచ్చు. ఈ టవర్‌ గార్డెన్లను సేంద్రియ ఇంటిపంటలపై ఆసక్తి, ఓపిక ఉన్న వారు తమంతట తాము తయారు చేసుకోవచ్చు. అదెలాగో వర్టికల్‌ టవర్‌ గార్డెన్‌ నిపుణులు రవి చంద్రకుమార్‌ వివరిస్తున్నారు.  


మార్కెట్‌లో దొరికే 300 లీటర్ల లేదా 250 లీటర్ల హెచ్‌.డి.పి.ఇ. బారెల్‌ తీసుకోవాలి. బారెల్‌ పొడవు 36 అంగుళాలు. బారెల్‌కు చుట్టూతా 5 అంగుళాలకు ఒక చోట కత్తిరిస్తే (దీన్నే పాకెట్‌ అని పిలుస్తున్నాం).. 7 వరుసల్లో పాకెట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అడ్డంగా ఒక్కొక్క పాకెట్‌ వెడల్పు 5 అంగుళాలు ఉండేలా కొలత స్కేల్‌తో మార్క్‌ చేసుకోవాలి.


రెండు పాకెట్ల మధ్య 4 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి. ఒక వరుసలో 8 పాకెట్లు వస్తాయి. 7 వరుసల్లో మొత్తం 56 పాకెట్లు వస్తాయి. బారెల్‌ పై భాగాన 4 మొక్కలు పెట్టవచ్చు. అన్నీ కలిపి 60 మొక్కలు పెట్టుకోవచ్చు. అంటే ఒక బారెల్‌ 60 కుండీలతో సమానం అన్నమాట!
 


పాకెట్లు ఎక్కడ పెట్టుకోవాలో మార్క్‌ చేసుకున్న తర్వాత మార్క్‌ చేసిన చోట బారెల్‌ను డ్రిల్‌ మెషిన్‌తో కత్తిరించి చిల్లు పెట్టాలి, జిగ్‌సా రంపం పట్టడం కోసం.


జిగ్‌సా తో వరుసల్లో మార్క్‌ చేసిన చోట్ల 5 అంగుళాల వెడల్పున కట్‌ చేయాలి.


పాకెట్‌ మౌల్డింగ్‌ చేసే విధానం.. హీట్‌ గన్‌తో కట్‌ చేసిన ప్రదేశంలో హీట్‌ చేయాలి. తగిన హీట్‌ అయిన తరువాత ఆ ప్రదేశంలో చిత్రంలో చూపిన విధంగా సిమెంటు దిమ్మె అమర్చాలి. అలా అన్ని పాకెట్లను తయారు చేయాలి.
 


బారెల్‌ అడుగు భాగంలో మధ్యన 4 అంగుళాల రంధ్రం చేయాలి. పక్కన అర అంగుళం రంధ్రం చేయాలి. అధిక నీరు బయటకు వెళ్లడానికి అక్కడ గ్రోమేట్‌ పెటి టేకాహ్‌ అమర్చాలి. మధ్యలో 4 అంగుళాల పీవీసీ గొట్టం అమర్చాలి. గొట్టం చుట్టూ చిల్లులు పెట్టాలి.



గొట్టం అమర్చే విధానం.. ఆ గొట్టాన్ని క్రింది భాగాన 6 అంగుళాలు బయటకు ఉండేలా అమర్చి.. అక్కడ ఎంసీల్‌తో అతకాలి. పై భాగాన జీయే వైరుతో కట్టాలి. 4 అంగుళాల గొట్టానికి పైన, కింద మూతలు అమర్చాలి.



ఈ బారెల్‌ను నిలబెట్టడానికి ఇనుప స్టాండ్‌ను తయారు చేసుకోవాలి. స్టాండ్‌ 18 అంగుళాల పొడవు, 18 అంగుళాల వెడల్పు, 10 అంగుళాల ఎత్తు ఉండాలి.



వర్టికల్‌ గార్డెన్‌లో కంపోస్టు తయారు చేసే విధానం– వర్మీ కంపోస్టు 30%, రంపపు పొట్టు 30%, పశువుల ఎరువు 30%, వేప గింజల చెక్క 10%.. ఇవన్నీ కలిపి బారెల్‌లో సరిపడినంత నింపుకోవాలి. బారెల్‌ మధ్యలో అమర్చిన గొట్టంలో వంటింటి వ్యర్థాలు వేయాలి. అందులో చక్కటి వర్మీకంపోస్టు తయారవుతుంది. స్టాండ్‌ మీద వర్టికల్‌ గార్డెన్‌ను అమర్చుకున్న తర్వాత.. అందులో కంపోస్టు మిశ్రమాన్ని నింపుకోవాలి. బారెల్‌ చుట్టూ ఉన్న అరలలో విత్తనాలు నాటుకోవాలి. ఒక్కో వర్టికల్‌ గార్డెన్‌ టవర్‌ను తయారు చేసుకోవడానికి (బారెల్, స్టాండ్, టవర్, కంపోస్టు, విత్తనాలు.. అన్నీ కలిపి) రూ. 5 వేలు ఖర్చవుతుంది.


వర్టికల్‌ టవర్‌కు రోజుకు కనీసం 4 గంటలు ఎండ తగిలే చోట పెట్టుకోవాలి. ఇందులో అన్ని రకాల ఆకుకూరలు, ఔషధ మొక్కలు చక్కగా పండించవచ్చని రవిచంద్ర కుమార్‌ (95812 42255) తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement