హైటెక్‌ సేద్యానికి చిరునామా! | Address to High Tech Seed on home crops | Sakshi
Sakshi News home page

హైటెక్‌ సేద్యానికి చిరునామా!

Published Tue, Nov 6 2018 5:08 AM | Last Updated on Tue, Nov 6 2018 5:08 AM

Address to High Tech Seed on home crops - Sakshi

మల్టీ టైర్‌ డ్రమ్ములో ఇంటిపంటలు; మల్టీ టైర్‌ గ్రోబ్యాగ్‌లలో పంటలను పరిశీలిస్తున్న డా. సుశీల

పట్టణాలు, నగరాలలో నివసించే ప్రజలకు రసాయనిక పురుగుమందుల అవశేషాల్లేని సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను పుష్కలంగా అందుబాటులోకి తేవడానికి అత్యాధునిక పద్ధతుల్లో ఇంటిపంటలను సాగు చేసుకునే పద్ధతులను పట్టణ, నగర ప్రాంతవాసులకు నేర్పించడం తప్ప మరో మేలైన మార్గం లేదు. ఈ దిశగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విస్తృత పరిశోధనలు సాగుతున్నాయి.
 హైటెక్‌ పద్ధతుల్లో తక్కువ స్థలంలో ఇంటిపంటల సాగుపై పరిశోధనల కోసం కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం త్రిస్సూర్‌లో ఐదేళ్ల క్రితమే ప్రత్యేక పరిశోధన, శిక్షణ స్థానాన్నే ఏర్పాటు చేయటం విశేషం. డాక్టర్‌ పి. సుశీల ఈ కేంద్రానికి అధిపతిగా, ప్రొఫెసర్‌గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ ఇటీవల డాక్టర్‌ పి. సుశీలను హైదరాబాద్‌కు ఆహ్వానించి ఉద్యాన అధికారులకు, ఇంటిపంటల సాగుదారులకు శిక్షణ ఇప్పించింది. డా. సుశీలతో ‘సాక్షి’ ముచ్చటించింది. కొన్ని ముఖ్యాంశాలు..


► తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచుకునేందుకు వీలుకల్పించే పాలీకిచెన్‌ గార్డెన్, చిన్న పాలీహౌస్‌లలో ఇంటిపంటల సాగు, ఓపెన్‌ ప్రెసిషన్‌ ఫార్మింగ్, హైడ్రోపోనిక్స్, ఆక్వాపోనిక్స్, హైటెక్‌ కిచెన్‌ గార్డెన్‌ టెక్నిక్స్, వర్టికల్‌ గార్డెనింగ్, ఆర్గానిక్‌ ఫార్మింగ్, టైరు గార్డెన్స్, లాండ్‌ స్కేపింగ్‌ తదితర అంశాలపై డా. సుశీల పరిశోధనలు చేస్తూ వ్యక్తులకు, సంస్థలకు శిక్షణ ఇస్తున్నారు.

► అభ్యర్థుల ఆసక్తి, అవసరాలను బట్టి ఒక రోజు నుంచి నెల, ఆర్నెల్లు, ఏడాది వరకు కాలపరిమితి గల శిక్షణా శిబిరాలను డా. సుశీల నిర్వహిస్తున్నారు. ఈ ఐదేళ్లలో 200 శిక్షణా శిబిరాలను నిర్వహించడం అభినందనీయం. ఆమె ఇప్పటికి 35 పుస్తకాలు, 80 పరిశోధనా పత్రాలు, 500 పాపులర్‌ వ్యాసాలు రాశారు. 36 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు.

► ఈ కేంద్రంలో రూపొందించిన పాలీ కిచెన్‌ గార్డెన్‌ ప్రజాదరణ పొందుతున్నదని డా. సుశీల చెప్పారు. 10 చదరపు అడుగుల నుంచి 30 చదరపు అడుగుల చోటులోనే 160 నుంచి 350 మొక్కలు సాగు చేసుకోవడానికి పాలీకిచెన్‌ గార్డెన్‌లో వీలుంటుంది. 10 – 20 చదరపు అడుగుల విస్తీర్ణంలో పెరట్లో లేదా టెర్రస్‌ మీద ఓపెన్‌గా లేదా చిన్న సైజు పాలీహౌస్‌ నిర్మించుకొని ఆకుకూరలు, కూరగాయలు పెంచుకోవడానికి పాలీ కిచెన్‌ గార్డెన్‌ ఉపయోగపడుతుంది.  

► పాలీ కిచెన్‌ గార్డెన్‌లో ఫైబర్‌ డ్రమ్ములకు చుట్టూ మొక్కలు పెంచుకోవటం ఒకటైతే.. ప్లాస్టిక్‌ గ్రోబ్యాగ్‌ను కూడా డ్రమ్ము మాదిరిగానే మల్టీ టైర్‌ గ్రోబ్యాగ్‌గా ఉపయోగించుకునే పద్ధతి మరొకటి. డ్రమ్ము వాడుతున్నప్పుడు వంటింటి వ్యర్థాలను మధ్యలోని పైపులో వేస్తూ ఉంటే.. వర్మీ కంపోస్టుతోపాటు ద్రవ రూప ఎరువు అయిన వర్మీ వాష్‌ను కూడా పొందే వీలుంటుంది. 20 చదరపు అడుగుల పాలీ కిచెన్‌ గార్డెన్‌లో నిలువెత్తు మల్టీ టైర్‌ గ్రోబ్యాగ్స్‌ రెండిటిని ఏర్పాటు చేసుకుంటే.. వాటి చుట్టూ 250–260 రకాల మొక్కలను కూరగాయ, ఆకుకూర మొక్కలను సాగు చేసుకోవచ్చు.  నిలువెత్తు మల్టీ టైర్‌ గ్రోబ్యాగ్‌ మధ్యలో పీవీసీ పైపులో కంపోస్టు సదుపాయం ఏర్పాటు చేసుకుంటే, కంపోస్టు తయారు చేసుకుంటూనే దాంట్లో 35–52 మొక్కలు పెంచుకోవచ్చు.

► మల్టీ టైర్‌ గ్రోబ్యాగ్‌ / డ్రమ్ముల్లో తోటకూర, పాలకూర, లెట్యూస్, క్యాబేజి, కాళీఫ్లవర్, టమాటో, మిరప, క్యారట్, బీట్‌రూట్, వంగ వంటి పంటలు పండించుకోవచ్చు.
     ఇంటిపంటలతోపాటు మైక్రో గ్రీన్స్‌ను కూడా పెంచుకుంటే ఆరోగ్యం మరింత బాగుంటుంది. జానెడు లోతు, వెడల్పుగా ఉండే చిన్న ట్రేలలో వీటిని పెంచుకోవచ్చు.  ఈ ట్రేలను ఒక దాని కింద మరొకటి తాళ్లతో వేలాడదీస్తే.. అందులో మైక్రోగ్రీన్స్‌ను వత్తుగా నారు మాదిరిగా, గోధుమ గడ్డి మాదిరిగా పెంచుకోవచ్చు. రెండు వారాల్లో మూడు, నాలుగు అంగుళాలు పెరిగిన తర్వాత కత్తిరించి సలాడ్లలో వాడుకోవచ్చు.

► వీటిని ఏర్పాటు చేసుకోవడానికి కేరళ ప్రభుత్వం రాష్ట్రమంతటా 75% సబ్సిడీపై పట్టణ ప్రాంత ప్రజలకు, రైతులకు కూడా అందిస్తున్నది. పాలీ కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేసుకోవటం, నిర్వహించడంపై 3 రోజుల శిక్షణా శిబిరాన్ని డాక్టర్‌ సుశీల నిర్వహిస్తుంటారు. ఆగ్రో సర్వీస్‌ సెంటర్ల నిర్వాహకులకు, స్వచ్ఛంద సంస్థలకు పది రోజులు శిక్షణ ఇస్తుంటారు.

► మట్టి లేకుండా వట్టి కొబ్బరి పొట్టుతో సాగు (సబ్‌స్ట్రేట్‌ కల్టివేషన్‌)పై ఈ కేంద్రంలో శిక్షణ ఇస్తారు. మట్టి లేకుండా.. నీటిలో పోషకాల ద్రవాన్ని కలుపుతూ మొక్కల వేర్లకు అందించడం ద్వారా కూరగాయలు, ఆకుకూరలు పండించడంపై శిక్షణ ఇస్తారు. దీన్నే హైడ్రోపోనిక్స్‌ పద్ధతి అంటారు. ఇందులో మూడు రకాలు. న్యూట్రియంట్‌ ఫిల్మ్‌ టెక్నిక్, డీప్‌ వాటర్‌ కల్టివేషన్, డచ్‌ బక్కెట్‌ సిస్టం.. అనే 3 పద్ధతుల్లో హైడ్రోపోనిక్స్‌ సాగు చేపట్టడంపై డాక్టర్‌ సుశీల శిక్షణ ఇస్తారు.

► మొక్కలతోపాటు చేపలను కూడా కలిపి పెంచుకోవడమే ఆక్వాపోనిక్స్‌. ఇందులో మీడియా బెడ్‌ సిస్టం, డీప్‌ వాటర్‌ కల్చర్, న్యూట్రియంట్‌ ఫిల్మ్‌ టెక్నిక్‌పై శిక్షణ ఇస్తారు. హైడ్రోపోనిక్స్‌ పద్ధతిలో ట్రేలలో పశువుల మేత పెంచుకోవడంపై శిక్షణ ఇస్తున్నారు. విక్‌ ఇరిగేషన్, ఏరోపోనిక్స్, ఫాగోపోనిక్స్, ఇంటిగ్రేటెడ్‌ ఫార్మింగ్‌ తదితర పద్ధతులపై కూడా శిక్షణ ఇస్తారు.

► ఈ అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో తక్కువ చోటులో, తక్కువ శ్రమతో, తక్కువ నీటితో ఎక్కువ పరిమాణంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఆరోగ్యదాయకంగా పండించుకునేందుకు ఉపయోగపడతాయి. ఇంటిపంటల సాగుదారులకు, అదేవిధంగా రైతులకు కూడా ఈ పద్ధతులు అనుకూలంగా ఉంటాయని డా. సుశీల తెలిపారు.


ఈ అత్యాధునిక సాంకేతికతలపై శిక్షణ పొందే ఆసక్తి ఉన్నవారు సంప్రదించాల్సిన చిరునామా..
   డాక్టర్‌ పి. సుశీల, ప్రొఫెసర్‌ అండ్‌ ప్రాజెక్టు ఇన్‌చార్జ్, హైటెక్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ యూనిట్, కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కె.ఎ.యు. పోస్ట్, వెల్లనిక్కర, త్రిస్సూర్, కేరళ.
   మొబైల్‌ – 99615 33547, suseela1963palazhy@gmail.com


 మల్టీ టైర్‌ గ్రోబ్యాగ్‌లలో పాలకూర కనువిందు; వర్టికల్‌ ఫార్మింగ్‌లో సాగవుతున్న ఆకుకూరలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement