సెల్ఫ్‌ వాటరింగ్‌ బెడ్‌! | Self-watering bed | Sakshi
Sakshi News home page

సెల్ఫ్‌ వాటరింగ్‌ బెడ్‌!

Published Tue, Jun 12 2018 3:45 AM | Last Updated on Tue, Jun 12 2018 3:45 AM

Self-watering bed - Sakshi

మేడల మీద కుండీలు, బ్యాగ్‌లలో సేంద్రియ ఇంటిపంటలు సాగు చేయడంపై  కేరళవాసులు అధిక శ్రద్ధ చూపుతుంటారు. సృజనాత్మకతను జోడించి తక్కువ శ్రమతో చేసే మెలకువలను అనుసరిస్తూ ఉంటారు. తిరువనంతపురానికి చెందిన షాను మనోహర్‌ అనే యువకుడు సెల్ఫ్‌ వాటరింగ్‌ బ్యాగ్స్‌తో బెడ్‌ను ఏర్పాటు చేస్తున్నాడు. ఈ పద్ధతిలో ప్రతి బ్యాగ్‌/కుండీలోనూ నీరు పోయాల్సిన పనిలేదు. పీవీసీ పైపులో నీరు పోస్తే చాలు.. పైపుల్లో నుంచి వత్తి ద్వారా అనుసంధానమై ఉండే బాగ్స్‌లోని మొక్కల వేర్లకు తగినంత నీటి తేమ నిరంతరం అందుతూ ఉంటుంది. తక్కువ శ్రమతో చక్కగా ఇంటిపంటలు పండించుకోవచ్చు. షాను మనోహర్‌ ఇంటిపంటలను ఏర్పాటు చేసే సర్వీస్‌ ప్రొవైడర్‌గా స్వయం ఉపాధి పొందుతూ ఇంటిపంటల సాగుదారుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇంతకీ ఆయన చేస్తున్నదేమిటో ఫొటోలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది..  

1. పీవీసీ పైపులతో ఇలా మూడు వరుసల బెడ్‌ను ఏర్పాటు చేస్తున్నాడు. పైపుల చివరలను కూడా మూసేస్తారు. కేవలం పైనుంచి నీరు పోయడానికి ఒక చోట అవకాశం ఉంటుంది. ఇందులో పోసిన నీరు బయటకు పోదు. నీరు రోజూ పోయాల్సిన అవసరం లేదు. అయిపోయినప్పుడు మళ్లీ నీరు పోస్తే సరిపోతుంది. వాతావరణాన్ని బట్టి కొద్ది రోజులకోసారి నీరు పోస్తే సరిపోతుంది.

2. ఇది ఒక వత్తి. కిరసనాయిలు దీపంలోని వత్తి మాదిరిగా ఇది పనిచేస్తుంది. కింది పైపుల్లో నుంచి ఈ వత్తి ద్వారా గ్రోబ్యాగ్స్‌లోని మొక్కల వేళ్లు నీటి తేమను తీసుకుంటూ ఉంటాయి. పంటు మొక్కలు ఏపుగా పెరిగి ఫలసాయాన్నిస్తాయి.

3. గ్రోబ్యాగ్‌కు అడుగున బెజ్జం పెట్టి.. వత్తిని ఇలా అమర్చాలి..

4. వత్తి గ్రోబ్యాగ్‌ లోపలకు సగం, కిందికి సగం ఉండేలా చూసుకోవాలి.

5. గ్రోబ్యాగ్‌లో ఎర్రమట్టి, కొబ్బరిపొట్టు, పశువుల ఎరువు/వర్మీకంపోస్టు/కంపోస్టు, కొంచెం వేపపిండి మిశ్రమంతో నింపాలి (నల్లమట్టిని వాడితే కొంచెం ఇసుకను కూడా కలుపుకోవాలి). వత్తి ఇలా మట్టి మిశ్రమం పై వరకూ ఉంటే పైపైనే ఉండే మొక్కల వేర్లకు కూడా నీటి తేమ అందుతూ ఉంటుంది.

6. ఇలా సిద్ధం చేసిన గ్రోబ్యాగ్‌లను పీవీసీ పైపులపై ఇలా ఉంచాలి. గ్రోబ్యాగ్‌ అడుగున ఉన్న వత్తిని పైపులోని బెజ్జంలోకి జొప్పించాలి. గ్రోబ్యాగ్స్‌ పడిపోకుండా అడుగున సరిపడా ఎత్తున్న ఇటుకలను కుదురుగా పెట్టాలి. పీవీసీ పైపులో నిండు నీరుపోసి, మూత బిగించాలి. రెండు, మూడు రోజులకోసారి మూత తీసి.. నీరు ఎంత ఉందో చూసుకుంటూ ఉండాలి.

7. ఇక అంతే.. గ్రోబ్యాగ్స్‌లో కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు విత్తుకోవచ్చు లేదా మొక్కలు నాటుకోవాలి. చక్కని రుచికరమైన రసాయనిక అవశేషాల్లేని సేంద్రియ ఇంటిపంటలను తక్కువ శ్రమతో ఇలా పండించుకోవచ్చు. ఈ పద్ధతిలో నీరు ఎక్కువ, తక్కువ కావడానికి అవకాశం ఉండదు. ఉష్ణోగ్రతలను బట్టి తగుమాత్రంగా నీటి తేమను వత్తి ద్వారా గ్రోబ్యాగ్స్‌లోని మట్టి పీల్చుకుంటూ మొక్కల వేర్లకు అందిస్తూ ఉంటుంది. బాగుంది కదూ.. మరి మనమూ ట్రై చేద్దామా? మీ అనుభవాలను మెయిల్‌ చేయండి.. sagubadi@sakshi.com.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement