Organic cultivation
-
హరిత భవనాలే రక్ష!
జనాభాతో పాటుగా ఇంటి నిర్మాణాలు పెరిగి పర్యావరణ సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యలను నివారించడానికి ఆహ్లాదకరమైన, ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూల జీవన శైలిని కొనసాగించడానికి హరిత భవనాలు ఎంతో ఉపయోగపడతాయి. పర్యావరణ అనుకూల మెటీరియల్, డిజైన్‌తో భవనాన్ని నిర్మించి, పర్యావరణ అనుకూలంగా ఏ భవనాలనైతే నిర్వహిస్తారో వాటిని ‘హరిత భవనాలు’ అంటారు.ఈ భవన నిర్మాణంలో స్థలం ఎంపికకూ ప్రాధాన్యం ఉంది. అంటే పర్యావరణ సున్నితమైన ప్రదేశాలలో హరిత భవనాలను నిర్మించరాదు. ఉదాహరణకు అధిక మొత్తంలో వ్యవసాయ దిగుబడిని ఇచ్చే సారవంతమైన వ్యవసాయ భూములను హరిత భవనాల నిర్మాణాల కోసం వాడరాదు. దీని వలన మనం ప్రకృతి సిద్ధంగా లభించిన విలువైన వ్యవసాయ భూమిని కోల్పోతాము. ఇది ఆహార ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది.సహజసిద్ధంగా గాలి, వెలుతురు వచ్చే విధంగా వీటి నిర్మాణాన్ని చేపడతారు. వెలుతురు బాగా ఉండే గదులలో చదివే విద్యార్థులు నేర్చుకునే సామర్థ్యం, వెలుతురు సరిగ్గా లేని గదిలో చదివే విద్యార్థుల కన్నా 20 నుండి 26 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలలో తేలింది. హానికర రసాయన పదార్థాలు కలిగిన లెడ్ పెయింట్లు భవనాల లోపల గాలి నాణ్యతను హానికరంగా మారుస్తాయి కావున వాటి స్థానంలో సహజ సిద్ధమైన రంగులను వాడతారు. ఇండోర్ ప్లాంట్స్ ఏర్పాటు కూడా ఈ భవనాలలో ఉంటుంది. దీనివలన భవనాల లోపల గాలి నాణ్యత పెరుగుతుంది.తక్కువ విద్యుత్‌ను వినియోగించే ఎల్ఈడీ బల్బ్‌లను, ఇతరత్రా తక్కువ విద్యుత్‌ను వినియోగించుకొనే ఎలక్ట్రానిక్ పరికరాలను వాడటం వలన ఈ భవనాలలో తక్కువగా విద్యుత్ ఖర్చవుతుంది. అదేవిధంగా సోలార్, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక విద్యుత్‌ను వాడటం వలన గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడంలో హరిత భవనాలు కీలక పాత్ర వహిస్తాయి. హరిత భవన పైకప్పులో కాంతిని రిఫ్లెక్ట్ చేసే పదార్థాలను వాడటం వల్ల ఇంటి పైకప్పు వేడి తగ్గుతుంది. పైకప్పు భాగంలో చిన్న, చిన్న మొక్కలను పెంచడం వలన వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ వాయువులను ఇవి గ్రహిస్తాయి. అదేవిధంగా ఇంటి పై కప్పు భాగంలో జీవ వైవిధ్యం పెరిగి సీతాకోకచిలుకలు, పక్షులు వంటి వాటిని ఆకర్షించడం వలన భవనం ఆకర్షణీయంగా మారుతుంది.ఈ భవనాలలో సేంద్రియ వ్యర్థ పదార్థాలను బయో గ్యాస్‌గా మార్చడం లేదా సేంద్రియ ఎరువుగా మార్చి ఉపయోగించే ఏర్పాట్లు ఉంటాయి. వాడిన నీటిని శుద్ధిచేసి తిరిగి గార్డెనింగ్, ఇతరత్రా పనులకు వినియోగించడం వలన నీరు వృథా కాదు. ఈ నిర్మాణాలలో వర్షపు నీరును పట్టి భూమిలోకి ఇంకిపోయేలా చేసే ఏర్పాట్లు ఉండడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న హరిత భవనాలు వాతావరణ మార్పుల నుండి మానవాళిని రక్షించగలుగుతాయి అనడం అతిశయోక్తి కాదు. – డా. శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, హైదరాబాద్ -
క్రమక్రమంగా పెరుగుతున్న సేంద్రియ రైతుల సంఖ్య...!
-
ఆర్గానిక్ పద్ధతిలో బొప్పాయి సాగు చేస్తే లాభం..!
-
క్రమంగా సేంద్రియ సాగుబాట పడుతున్న రైతన్నలు
-
రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయంపై విదేశీయుల ఆసక్తి
-
ఆరోగ్యకర జీవనానికి ఔషధ మొక్కలు
-
గత రెండేళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న యువరైతు
-
నేచర్ అర్బైన్.. అతిపెద్ద రూఫ్‌టాప్ పొలం!
పారిస్.. ఫ్రాన్స్ రాజధాని. అత్యంత జనసాంద్రత కలిగిన యూరోపియన్ రాజధానులలో ఒకటి. కాంక్రీటు అరణ్యంగా మారిపోవటంతో పచ్చని ప్రదేశాల విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. అన్నే హిడాల్గో అనే మహిళ 2014లో మేయర్‌గా ఎన్నికైన తర్వాత పారిస్ పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణ పచ్చదనంతో అన్నే సంతృప్తి చెందలేదు. విస్తారమైన వాణిజ్య సముదాయాల పైకప్పులను పచ్చని సేంద్రియ పంట పొలాలుగా మార్చాలని ఆమె సంకల్పించారు. అర్బన్ కిచెన్ గార్డెన్స్ నిర్మించే సంస్థలను ప్రోత్సహించడానికి నిర్మాణాత్మక కార్యాచరణ చేపట్టి సఫలీకృతులవుతున్నారు. పారిస్‌లో అర్బన్ అగ్రికల్చర్ విస్తీర్ణాన్ని 100 హెక్టార్లకు విస్తరించాలన్న లక్ష్యానికి చేరువలో ఉన్నారు మేయర్ అన్నే హిడాల్గో. పారిస్కల్చర్ రూఫ్టాప్లపైన, పాత రైల్వే ట్రాక్ పొడవునా, భూగర్భ కార్ల పార్కింగ్ ప్రదేశాల్లోనూ, ఖాళీ ప్రదేశాల్లో సేంద్రియ పంటలు, పుట్టగొడుగుల సాగును ప్రోత్సహిస్తు న్నారు. ‘ద పారిస్కల్చర్స్’ పేరిట అర్బన్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్‌లకు ప్రోత్సాహం ఇచ్చే పథకానికి మేయర్ శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి అత్యాధునిక మిద్దె (రూఫ్‌టాప్) పొలాలు నగరం అంతటా వెలుస్తున్నాయి. వాటిల్లో ‘నేచర్ అర్బైన్’ అతి పెద్దది. దక్షిణ పారిస్‌లో అద్భుతమైన కొత్త ఎగ్జిబిషన్ హాల్ భవనం పైన 14,000 చదరపు మీటర్ల (3.45 ఎకరాల) విస్తీర్ణంలో ఈ రూఫ్‌టాప్ ఫామ్ ఏర్పాటైంది. రోజుకు వెయ్యి కిలోల సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, సలాడ్ గ్రీన్స్, స్ట్రాబెర్రీ తదితర పండ్లను ఉత్పత్తి చేస్తున్న ‘నేచర్ అర్బైన్’లో 20 మంది పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రూఫ్‌టాప్ క్షేత్రంగా ఇది పేరుగాంచింది. పారిస్ వాసులకు లెట్యూస్, టొమాటోలు, స్ట్రాబెర్రీలు, దుంపలు, తులసి, పుదీనా, ఇతర తాజా 35 రకాల సేంద్రియ పండ్లు, కూరగాయ లతో పాటు ఔషధ, సుగంధ మొక్కలను ‘నేచర్ అర్బైన్’ అందిస్తోంది. కరోనా మహమ్మారి మొదటి దఫా లాక్డౌన్ ముగిసిన తర్వాత .. నగరాల్లోనే సాధ్యమైనంత వరకు సేంద్రియ ఆహారోత్పత్తుల ఆవశ్యకతను చాటిచెబుతూ ‘నేచర్ అర్బైన్’ ప్రారంభమైంది. ఆక్వాపోనిక్స్.. హైడ్రోపోనిక్స్.. రూఫ్‌టాప్ పొలంలో రసాయన ఎరువులు, పురుగుమందులు, శిలీంద్రనాశినులు వాడరు. ఆక్వాపోనిక్స్, హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పంటలను సాగు చేస్తున్నారు. మట్టిని వాడరు. పోషకాలు, ఖనిజాలు, జీవన ఎరువులతో కూడిన పోషక ద్రావణం కలిపిన నీటిని మొక్కల వేర్లకు అందిస్తూ పంటలను 10% నీటితోనే సాగు చేస్తున్నారు. నిలువు ప్లాస్టిక్ స్తంభాలలో లెట్యూస్, తులసి, పుదీనా మొక్కలు ఏరోపోనిక్స్ పద్ధతిలో ఏపుగా పెరుగుతుంటాయి. (క్లిక్ చేయండి: పేదల ఆకలి తీర్చే ఆర్గానిక్ గార్డెన్స్!) వీటికి ఎదురుగా, సన్నగా, అడ్డంగా ఉండే ట్రేలలో కొబ్బరి పొట్టులో నోరూరించే దేశవాళీ చెర్రీ టొమాటోలు, నాటు వంకాయలు, టొమాటోలు, కీర దోస తదితర కూరగాయలను పెంచుతున్నారు. పారిస్ వాసులు స్వయంగా తామే ఈ రూఫ్‌టాప్ పొలంలో పంటలు పండించుకోవడానికి ఎత్తు మడులతో కూడిన ప్లాట్లను ఏడాదికోసారి అద్దెకిస్తారు. 140 కూరగాయల ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. నగరవాసులకు సాగు నేర్పడానికి పారిస్ నగరపాలక సంస్థ ఒక ప్రత్యేకమైన స్కూల్‌ను కూడా ప్రారంభించింది. పారిస్ నగరపాలకుల ప్రయత్నాల వల్ల స్థానికుల ఆహారపు అవసరాలు తీరేది కొద్ది మేరకే అయినప్పటికీ, తద్వారా ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ఒనగూరే బహుళ ప్రయోజనాలు మాత్రం అమూల్యమైనవి! – పంతంగి రాంబాబు -
International Day of Rural Women: ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో రైతమ్మలు భేష్!
వ్యవసాయం, ఆహార శుద్ధి, వినియోగం, పంపిణీకి సంబంధిత పనులతోపాటు.. కుటుంబానికి/సమాజానికి ఆహారాన్ని సమకూర్చడంలో గ్రామీణ మహిళల పాత్ర అమోఘమైనది. పంటలు/తోటల సాగు, పశుపోషణ తదితర అనుబంధ పనుల్లో మహిళా రైతులు, కార్మికులు, బాలికల శ్రమ అంతా ఇంతా కాదు. యావత్ సమాజానికి ఆహార భద్రత కల్పించడంలో వీరిది కీలకపాత్ర. పురుషుల కన్నా అధిక గంటలు చాకిరీ చేసినా వీరి శ్రమకు తగినంత గుర్తింపు దొరకడంలేదన్నది వాస్తవం. అనుదినం గుర్తుచేసుకోవాల్సిన విశేష సేవలు అందిస్తున్న గ్రామీణ మహిళలు, బాలికలకు చేదోడుగా నిలవడం కోసం అక్టోబర్ 15వ తేదీని ‘అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం’ జరుపుకుంటున్నాం. పితృస్వామిక వ్యవస్థలో గ్రామీణ మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న అన్యాయాలను రూపుమాపే లక్ష్యంతో ప్రజాచైతన్య కార్యక్రమాలు నిర్వహించే పనికి స్వచ్ఛంద కార్యకర్తలు 1995లో శ్రీకారం చుట్టారు. 2007లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ దీనికి ఆమోద ముద్ర వేసింది. పర్యావరణ సంక్షోభానికి కరోనా మహమ్మారి తోడై ప్రాణాలు తోడేస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అర్థాకలితో జీవించే వారి సంఖ్య గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 20% పెరిగింది. 2021లో ‘మన కోసం ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని పండిస్తున్న గ్రామీణ మహిళల’ శ్రమకు గుర్తింపునివ్వాలని ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం పిలుపునిచ్చింది. ప్రపంచ జనాభాలో మహిళలు, పిల్లల సంఖ్య 75%. తాము నివశిస్తున్న సమాజంలో ఆర్థిక, సాంఘిక, రాజకీయ వాతావరణాన్ని రూపుదిద్దటంలో తమ ఆలోచనలు, దృష్టికోణం, నైపుణ్యాలు, అనుభవాలకు మరింత న్యాయమైన పాత్ర దక్కాలని వారు ఆశిస్తున్నారు. పొలాల్లో, పెరట్లో రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటల సాగు చేయటంలో ఏపీలో గ్రామీణ మహిళా రైతులు, భూమి లేని మహిళా కార్మికులు ముందంజలో ఉన్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఆరోగ్యదాకయమైన ఆహారాన్ని అందించడానికి అహరహం శ్రమిస్తున్న గ్రామీణ మహిళా రైతులకు వందనాలు. మన ఆకలి తీర్చి జవసత్వాలనిచ్చే ప్రతి ముద్దకూ మహిళా రైతులకు అందరం కృతజ్ఞులమై ఉండాలి. తొలి ఆర్గానిక్ గ్రీన్ స్టోర్‌ను నెలకొల్పుతున్న ఎఫ్.పి.ఓ.లు సేంద్రియ పద్ధతుల్లో పండించిన కూరగాయలను పూర్తిగా సంప్రదాయేతర ఇంధన వనరులతో నిల్వ చేసి, రవాణా చేసి ప్రజలకు అందించే లక్ష్యంతో రెండు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్.పి.ఓ.లు) ప.గో. జిల్లా ఏలూరు నగరం అమీనపేటలో రాష్ట్రంలోనే తొలి హరిత వెజ్జీస్ మార్టును నెలకొల్పుతున్నాయి. ‘నాబ్‌కిసాన్’ ఎం.డి.– సీఈఓ సుశీల చింతల ఈనెల 18న ప్రారంభించే ఈ ఎకోఫ్రెండ్లీ గ్రీన్ స్టోర్ ప్రత్యేకత ఏమిటంటే.. 3 స్టార్టప్ సంస్థలు రూపొందించిన పర్యావరణ హిత సాంకేతికతలను వినియోగిస్తున్నారు. రుకార్ట్ టెక్నాలజీస్ రూపొందించిన (ఏ విద్యుత్తూ అవసరం లేకుండా కొద్దిరోజుల పాటు కూరగాయలు, పండ్లను నిల్వ ఉంచే) ‘సబ్జీ కూలర్’ను, టాన్ 90 థర్మల్ సొల్యూషన్స్ వారి కోల్డ్‌స్టోరేజ్ సదుపాయాన్ని, ఎకో తేజాస్ గ్రీన్ ఫ్యూయల్ ఆల్టర్నేటివ్స్ వారి ఎలక్ట్రిక్ వెహికల్‌ను ఉపయోగిస్తున్నారు. పెదవేగికి చెందిన హరిత మిత్ర ఎఫ్.పి.సి., ఎం.నాగులపల్లి వెజిటబుల్ ప్రొడ్యూసర్ కంపెనీ ఈ గ్రీన్ స్టోర్‌ను ఏర్పాటు చేస్తుండటం విశేషం. చదవండి: షుగర్ వ్యాధిగ్రస్తులకు ‘తీపి’ కబురు.. పామ్ నీరా, బెల్లం! -
సేంద్రియ కూరగాయల సాగుకు ‘కదిలే పై కప్పు’ పాలిహౌస్! ప్రయోజనాలెన్నో..
కూరగాయ పంటలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడానికి అనువైన ప్రత్యేకమైన కదిలే పై కప్పు కలిగిన పాలిహౌస్‌లు త్వరలోనే మన రైతులకు అందుబాటులోకి రానున్నాయి. సాధారణ పాలిహౌస్ పైకప్పు స్థిరంగా ఉంటుంది. దీని వల్ల పాలిహౌస్‌లో సాగవుతున్న పంట (ఎన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ) అనివార్యంగా కొన్ని ప్రతికూలతలను ఎదుర్కోక తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. వేడి వాతావరణంలో పంటలుతీవ్ర వత్తిడికి గురై నష్టపోయే సందర్భాలుంటున్నాయి. అయితే, పాలీహౌస్ పై కప్పు కదిలే వెసులుబాటు ఉండి, అవసరమైతే నిమిషాల్లో పై కప్పును తాత్కాలికంగా పక్కకు జరపడానికి లేదా నిమిషాల్లో మూసేయడానికి వీలుంటే? ఈ వెసులుబాటు ఉంటే పంటల సాగుకు మరింత అనువుగా ఉంటుందని, ముఖ్యంగా సేంద్రియ కూరగాయ పంటలను ఏడాది పొడవునా సాగు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లోని కేంద్రీయ మెకానికల్ ఇంజనీరింగ్ పరిశోధనా సంస్థ (సి.ఎం.ఇ.ఆర్.ఐ.), హిమాచల్‌ప్రదేశ్ పాలంపూర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీ (సిఎస్ఐఆర్ అనుబంధ సంస్థలు) శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ వినూత్న పాలీహౌస్‌లను రూపొందించారు. ‘అధిక వేడి, చలి, వర్షం.. వంటి తీవ్రమైన వాతావరణ సంబంధమైన ఇబ్బందులతో సాధారణ పాలిహౌస్ రైతులు బాధలు పడుతూ ఉంటారు. ఈ సమస్యల నుంచి రక్షణ పొందడానికి పై కప్పు కదిలే పాలిహౌస్‌లు ఉపయోగపడతాయి. ముఖ్యంగా సేంద్రియ సాగుకు కూడా ఇవి అనువైనవి..’ అంటున్నారు సి.ఎం.ఇ.ఆర్.ఐ. సంచాలకులు డా. హరీష్ హిరాని. ఆయన ఆధ్వర్యంలో సీనియర్ శాస్త్రవేత్త జగదీశ్ మానిక్‌రావు ఈ కదిలే పై కప్పు పాలిహౌస్లపై పరిశోధనా ప్రాజెక్టుకు సారధ్యం వహిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రం లూధియానాలోని సి.ఎం.ఇ.ఆర్.ఐ. విస్తరణ కేంద్రం ఆవరణలో ప్రయోగాత్మకంగా ఈ పాలిహౌస్‌లను నిర్మిస్తున్నారు. ‘పంటలకు తగినంత గాలిలో తేమ, ఉష్ణోగ్రత వంటి వాతావరణ స్థితిగతులను ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం ఇచ్చే సాంకేతిక వ్యవస్థ ఈ పాలిహౌస్‌లలో ఉంటుంది. అందువల్ల సీజనల్, అన్‌సీజనల్ పంటలను కూడా సాగు చేయడానికి వీలవుతుంది’ అని డా. హిరాని వివరించారు. మరో ఆరు నెలల్లోనే ఈ సరికొత్త పాలిహౌస్ టెక్నాలజీలను రైతులకు అందించనున్నామన్నారు. ఏయే పంటలు సాగు చేయొచ్చు? ►పైకప్పు కదిలే పాలిహౌస్‌లలో కీరదోస, చెర్ర టమాటో, క్యాబేజి, కూరమిరప, బ్రకోలి, లెట్యూస్, కాకర, కాళిఫ్లవర్, కొత్తిమీర, పాలకూర వంటి కూరగాయలు, ఆకుకూరలతోపాటు కార్నేషన్, జెర్బర, ఆర్కిడ్స్ వంటి పూలను కూడా సాగు చేయవచ్చని సి.ఎం.ఇ.ఆర్.ఐ. చెబుతోంది. ►పాలిహౌస్‌లో పంట ఎదుగుదల అవసరాలను బట్టి రైతు స్వయంగా మీట నొక్కితే పనిచేసే రకం పాలిహౌస్ ఒకటి ఉంది. కృత్రిమ మేథ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెన్సార్ల వ్యవస్థ ఆధారంగా దానంతట అదే తెరచుకునే లేదా ముడుచుకునే మరో రకం పాలిహౌస్ కూడా ఉంది. ►మొదటి రకం కన్నా రెండో రకం ఖర్చుతో కూడిన పని. పైకప్పు కదిలే సదుపాయం ఉండే ఈ పాలిహౌస్ నిర్మాణానికి ఖర్చు చదరపు మీటరుకు ఆటోమేషన్ స్థాయిని బట్టి రూ. 1,500 నుంచి 3,000 వరకు ఉంటుందని సిఎంఇఆర్ఐ ప్రతినిధి అజయ్ రాయ్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. సాధారణ పాలిహౌస్ కన్నా ఏ విధంగా మెరుగైనది? సాధారణ పాలిహౌస్తో పోల్చితే పై కప్పు కదిలే సదుపాయం ఉన్న పాలిహౌస్ ప్రయోజనాలు ఇవి.. ►ఆరుబయట పొలాలు, నేచురల్లీ వెంటిలేటెడ్ పాలిహౌస్‌లతో పోల్చితే ఈ పాలిహౌస్ ద్వారా అధిక దిగుబడి వస్తుంది. పంట దిగుబడుల నిల్వ సామర్ధ్యం ఇనుమడిస్తుంది. ►ఇన్ఫ్రారెడ్ రేడియేషన్‌ను తగ్గించడం ద్వారా పంటను అధిక వేడి నుంచి కాపాడుతుంది. సాధారణ సాగు పద్ధతుల్లో కన్నా ఇందులో పండించే పంటలు ‘ఫొటోసింథటికల్లీ యాక్టివ్’గా ఉండే అవకాశం ఎక్కువ కాబట్టి మెరుగైన నాణ్యతతో అధిక దిగుబడిని పొందవచ్చువెంటిలేటర్లను సరిచేయడం ద్వారా పాలిహౌస్ లోపల గాలిలో తేమ పాలిహౌస్ అన్ని వైపులా ఒకేలా ఉండే విధంగా నియంత్రించవచ్చు ►వాతావరణం నుంచి గాలి, కార్బన్ డయాక్సయిడ్ల మార్పిడి పాలిహౌస్ అంతటా సరిసమానంగా ఉంటుంది ►గాలిలో తేమ, కాంతి బాగా అందుతుంది కాబట్టి పంటల ఎదుగుదల బాగుంటుంది ►సేంద్రియ వ్యవసాయానికి బాగా అనువైన సాంకేతికత ఇది సాధారణ పాలిహౌస్‌లలో మాదిరిగా కాకుండా అవసరం మేరకు నేరుగా ఎండ తగలటం వల్ల మొక్కలు దట్టంగా పెరుగుతాయి సాధారణ పాలిహౌస్ వల్ల ఎదురవుతున్న సమస్యలు సాధారణ పాలిహౌస్ పైకప్పు కదల్చడానికి వీల్లేకుండా, ఎప్పుడూ బలంగా బిగించి ఉంటుంది. శాశ్వత పైకప్పు వల్ల ఉన్న సమస్యలు.. ►పాలీహౌస్లో ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ►ఉదయం, సాయంత్రపు వేళల్లో సూర్యకాంతి పంటలకు సరిపడినంత అందదు. ►పంటలకు తగినంత కార్బన్ డయాక్సయిడ్ అందదు. పంట మొక్కల నుంచి తగినంతగా నీటి ఆవిరి విడుదల కాదు. నీటి వత్తిడి ఉంటుంది. అందువల్ల సాధారణ పాలిహౌస్‌లలో పెరిగే పంటలు మెతకబారి చీడపీడలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ‘కదిలే పై కప్పు పాలిహౌస్’ వల్ల రైతులకు ప్రయోజనాలు ►ఆయా కాలాల్లో సాగు చేయదగిన, సాధారణంగా ఆ కాలంలో సాగు చేయని పంటలను సైతం ఈ పాలిహౌస్‌లో సాగు చేసుకోవచ్చు ►పంటలకు తెగుళ్లు, పురుగుల బెడద తక్కువగా ఉంటుంది ►పంట కోత కాలం పెరుగుతుంది ►సాగు ఖర్చు తగ్గుతుంది ►ఏడాది పొడవునా రైతులు నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు పొందవచ్చు ►అర్బన్ అగ్రికల్చర్‌కు అనువైనది ఇతర వివరాలకు.. అజయ్ రాయ్, హెడ్, ఎంఎస్ఎంఇ గ్రూప్, సిఎస్ఐఆర్ – సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దుర్గాపూర్, పశ్చిమ బెంగాల్. ఫోన్ నంబర్లు: 094746 40064, 087590 39523 ajoy.roy@cmeri.res.in kumarajoy1962@gmail.com www.cmeri.res.in ఏపీ, తెలంగాణలో ప్రయోగాత్మక సాగు చేపడతాం.. కదిలే పై కప్పు గల పాలిహౌస్ రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. పాలిహౌస్‌లో పెరుగుతున్న పంటకు వర్షం/ఎండ ఎంతసేపు అవసరమో అంతసేపు తెరచి ఉంచుకోవచ్చు. వద్దనుకున్నప్పుడు మూసేయవచ్చు. చలి/కొండ ప్రాంతాల కోసం దీన్ని తొలుత డిజైన్ చేశాం. వర్షాధార వ్యవసాయానికి కూడా ఇది పనికొస్తుంది. దక్షిణాదిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాతావరణానికి ఇవి సరిపోతాయా? లేదా? అనే విషయం ఇంకా అధ్యయనం చేయలేదు. త్వరలో ప్రయోగాత్మకంగా సాగు చేసి చూడాలనుకుంటున్నాం. – డా. జగదీష్ మానిక్‌రావు, సీనియర్ శాస్త్రవేత్త, సిఎస్ఐఆర్ – సిఎంఇఆర్ఐ – సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ఫామ్ మెషినరీ, గిల్ రోడ్డు, లూధియానా– 141006 -
అవిసె గింజల పొడి, బాదాం, ఎండు ఖర్జూరంతో రాగి లడ్లు.. నెలకు లక్ష..
సుచేత భండారే 5 వేల రూపాయలతో రెండేళ్ల క్రితం రాగిలడ్లు చేయడం మొదలెట్టింది. ఇవాళ నెలకు లక్ష రూపాయల లడ్లు ఆన్లైన్లో అమ్ముతోంది. సేంద్రియ రాగులు.. అవిసె గింజల పొడి.. బాదాం, ఎండు ఖర్జూరం... వీటితో తయారు చేసే రాగిలడ్ల బలం ముందు జంక్ ఫుడ్ దిగదుడుపు. ‘భూమి నుంచి వచ్చేది తినండి పెనం నుంచి వచ్చేది కాదు’ అంటుంది సుచేత. ఈ లడ్డు లాంటి ఆలోచనను ఎవరైనా ఆచరణలో పెట్టొచ్చు. మీరు ఇంట్లో రాగి లడ్డు చేయాలంటే ఏమేమి ఉపయోగిస్తారు? సుచేత భండారే మాత్రం ఇవి ఉపయోగిస్తుంది. రాగి పిండి, బెల్లం, ఆవు నెయ్యి, అవిసె గింజల పొడి, బాదం పొడి, ఎండు ఖర్జూరం పొడి, ఏలకులు. వీటితో రాగిలడ్డూలు తయారు చేసి 16 లడ్డూలు ఒక మంచి అట్టపెట్టెలో పెడుతుంది. వాటిని ఎక్కడెక్కడి నుంచో రూ.439 రూపాయలు చెల్లించి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ఆమె ఈ పని కోసం ఏడు మంది గ్రామీణ మహిళలను పనిలోకి తీసుకుంది. అందరూ కలిసి ఇప్పుడు నెలకు దాదాపు 2,500 రాగి లడ్డూలు తయారు చేస్తారు. ఇంకా అటుకుల చిరుతిండి, బొరుగుల చిరుతిండి తయారు చేస్తారు. మొత్తం లక్ష రూపాయల బిజినెస్ జరుగుతుంది. పెద్ద కార్ఖానా లేదు. షాప్ లేదు. రెంట్ లేదు. ఏమీ లేదు. ఆన్లైన్ మీదే అన్నీ పార్శిల్ అయిపోతాయి. ఒకసారి సుచేత లడ్లు తెప్పించుకున్నవారు మళ్లీ మళ్లీ ఆర్డరు పెడుతుంటారు. ఆమె ఆలోచన సుచేత భండారేది పూణె సమీపంలో ఉన్న వడ్నేర్ భైరవ్ అనే గ్రామం. ‘నా బాల్యం అంతా బలవర్థకమైన చిరుతిండ్లతోనే గడిచింది. మా పొలంలో వరి, బంగాళ దుంపలు తప్ప దాదాపు అన్నీ పండించేవాళ్లం. ఇంట్లో నాకు పచ్చి కొబ్బరి, అటుకులు, రాగి లడ్లు, బొరుగులు, సున్ని ఉండలు, మేము పండించిన పండ్లు ఇవి పెట్టేవాళ్లు. బజారులో దొరికేది ఏదీ నేనే తినలేదు. అలాగే స్కూల్ అయిపోయిన వెంటనే మా పొలానికి వెళ్లేదాన్ని. ముఖ్యంగా కోత సమయాల్లో నేను చాలా ఉత్సాహంగా ఉండేదాన్ని. మట్టితో నాకు అప్పుడే అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు అది నా పనిలో కనిపిస్తోంది’ అంటుంది 35 ఏళ్ల సుచేత. వ్యవసాయం మీద ఆసక్తితో అగ్రికల్చర్ బిఎస్సీ చేయాలనుకుంది కాని కుదరక డిగ్రీలో కామర్స్ చదివింది. ఆ తర్వాత కొన్నాళ్లు పూణెలో కాల్ సెంటర్ నడిపింది. ‘నా కాల్‌సెంటర్ బాగా నడుస్తున్నా నేను చేయాల్సిన పని ఇది కాదే అనిపించేది’ అంది సుచేత. ఆలోచన మెరిసింది పూణెలో కాల్ సెంటర్ పని చేస్తున్నప్పుడు సుచేత తరచూ రకరకాల బృందాలతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లేది. ‘ఆ సమయంలో ఇష్షో బుష్షో అనకుండా చలాకీగా నేనొక్కదాన్నే ఉండేదాన్ని. మిగిలినవాళ్లు తొందరగా అలసిపోయేవాళ్లు. చమటలు కక్కేవాళ్లు. నేను హాయిగా ఎంత దూరమైనా నడిచేదాన్ని. ఎందుకిలా అని ఆలోచిస్తే చిన్నప్పటి నుంచి నేను తిన్న హెల్దీ తిండి అనిపించింది. నీ జీవితంలో జరిగేది నువ్వు ఎలాగూ మార్చలేవు... కానీ నీ కడుపులో పడేదాన్ని మార్చగలవు అనుకున్నాను. వెంటనే ఊరికి వచ్చి రాగి లడ్డూల తయారీ మొదలెట్టాను. ఆరోగ్యకరమైన చిరుతిండ్లు తయారు చేసి అమ్ముదామని నిశ్చయించుకున్నాను. పిల్లలు, స్త్రీలు ముఖ్యంగా వీటిని తినాలి’ అంది సుచేత. 2019లో మొదలు ఇంతా చేసి ఈ ఆలోచన వచ్చి ఎంతో కాలం కాలేదు. రెండేళ్ల క్రితమే. అయితే రసాయనాలు లేని పదార్థాలు వాడాలని సుచేత నిశ్చయించుకుంది. బజారులో రాగులు దొరుకుతాయి. అవి మందులు కొట్టి పండించినవి. కాని తనకు సేంద్రియంగా పండిన రాగులు కావాలి. అందుకు సుచేత కొంతమంది రైతులను సంప్రదించి వారిని సేంద్రియ పద్ధతిలో రాగులు పండించేలా ఒప్పించింది. పండాక మార్కెట్ రేటుకు కొంటామని హామీ ఇచ్చింది. ‘మొదలు రైతులకు నమ్మకం కుదరలేదు. నాక్కూడా శ్రమ అయ్యింది. కాని ఇప్పుడు ఐదారు మంది రైతులు నా కోసం పండిస్తున్నారు’ అంది సుచేత. రాగిలడ్లు మరింత బలవర్థకం కావాలంటే ఏం చేయాలని న్యూట్రిషనిస్ట్లను అడిగింది. వారు అవిసె గింజలను సూచించారు. సరే... బాదం, ఎండు ఖర్జూరం ఎలాగూ బలమే. వాటన్నింటిని కలిపి కొలతలు ఖరారు చేసి తన మార్కుతో 5 వేల రూపాయల పెట్టుబడితో లడ్లు తయారు చేసింది. మొదట బంధువులు, స్నేహితులు.. తర్వాత నోటి మాటగా, సోషల్ మీడియా ద్వారా ఆమె రాగి లడ్లు ఫేమస్ అయ్యాయి. ఎర్త్‌పూర్ణ సంస్థ సిబ్బ్బంది ఎర్త్‌పూర్ణ సుచేత భండారే ఈ బలవర్థకమైన తిండ్లను తయారు చేసేందుకు ‘ఎర్త్‌పూర్ణ’ అనే సంస్థను ప్రారంభించింది. అంటే ‘సంపూర్ణభూమి’ అని అర్థం. ‘భూమి నుంచి తీసుకున్నది తిరిగి భూమికి చేరితేనే భూమి సంపూర్ణంగా ఉంటుంది. సహజమైన పద్ధతిలో పండింది సహజమైన విధంగా ఆరగించి ఆ మిగిలిన వృధాను భూమిలో కలవనిస్తే ఆ భూచక్రం సజావుగా ఉంటుంది. కెమికల్స్ ప్రమేయం ఉన్న ప్రతి పని భూమిని అసంపూర్ణం చేస్తుంది’ అంటుంది సుచేత. పర్యావరణ హితమైన, ఆరోగ్యహితమైన ఆహార ప్రచారానికి పని చేస్తున్న సుచేత స్వలాభం భూమిలాభం కలిగేలా చూస్తున్నారు. ఇది చాలామంది గమనించదగ్గ ఫార్ములానే. చదవండి: Health Tips: వేరు శెనగలు, ఖర్జూరాలు, కిస్మిస్లు తరచుగా తింటే... -
Organic Farming: వాట్సప్ ‘చాట్ బాట్’ ద్వారా ప్రకృతి సేద్యంలో మిరప సాగుపై సూచనలు..
రసాయనిక ఎరువులు, పురుగుమందులు అసలు వాడకుండా పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో మిరప పంటను సాగు చేయటం ఎన్నో సవాళ్లతో కూడిన కష్టతరమైన విషయం. అయితే, అసాధ్యం కాదని నిరూపిస్తున్న అనుభవజ్ఞులైన రైతులు తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉన్నారు. అయితే, ఏ రైతైనా వ్యక్తిగతంగా తమకు ఫోన్ చేసే రైతులు కొద్ది మందికి మాత్రమే తమ జ్ఞానాన్ని అందించగలుగుతారే తప్ప.. వేలాది మందికి అందించలేరు. పంట కాలం పొడవునా ఎప్పుడంటే అప్పుడు చప్పున ఆయా రైతులకు సులువుగా అర్థమయ్యే మాటల్లో చెప్పగలగటమూ అసాధ్యమే. అయితే, అత్యాధునిక సాంకేతికత ‘కృత్రిమ మేథ’ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది. రైతు తన మొబైల్లోని ‘వాట్సప్’ ఆప్ ద్వారా ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చునని ‘డిజిటల్ గ్రీన్’ సంస్థ రుజువు చేస్తోంది. వాట్సప్‌లో ‘చాట్‌బాట్ టెక్నాలజీ’ని వినియోగించడం ద్వారా ఈ పనిని సంకల్పంతో సుసాధ్యం చేస్తోంది డిజిటల్ గ్రీన్. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మిరప సాగులో గుంటూరు జిల్లా కొప్పర్రు గ్రామానికి చెందిన రైతు దంపతులు కోటేశ్వరమ్మ, వెంకటేశ్వరరావు సిద్ధహస్తులు. ఎకరానికి 26 క్వింటాళ్ల ఎండు మిర్చి దిగుబడి తీస్తున్న వీరి సుసంపన్నమైన అనుభవాలను శాస్త్రీయ పద్ధతుల్లో రికార్డు చేసిన డిజిటల్ గ్రీన్ సంస్థ.. వీరి అనుభవాలను తెలుగు నాట వేలాది మంది మిరప రైతులకు అత్యంత సులువైన రీతిలో, అచ్చమైన తెలగులో, ఉచితంగా వాట్సప్ చాట్‌బాట్ ద్వారా అందిస్తోంది. ఇందుకు రైతు చేయాల్సిందేమిటి? చాలా సులభం.. డిజిటల్ గ్రీన్ వాట్సప్ నంబరు 75419 80276కు వాట్సప్ లో రైతు జిజీ అని మెసేజ్ పంపితే చాలు. డిజిటల్ గ్రీన్ వాట్సప్ చాట్ బాట్ సేవలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుపుతూ రైతు వాట్సప్ కు వెంటనే తెలుగులో మెసేజ్ రూపంలో వస్తుంది. అందులో పేర్కొన్న సూచనలతో పాటు రైతు తన మిరప పంట ఎన్ని రోజుల దశలో వుందో ఆయా ఐచ్చికాల (ఆప్షన్స్)ను మెసేజ్ రూపంలో చాట్ బాట్ పంపుతుంది. రైతు తన మిరప పంట ఐచ్చికాన్ని ఎంచుకొని పంపిన వెంటనే, ఆ రైతు మిరప పంట దశను సేవ్ చేసుకుంటుంది. రైతు మొదటిసారి తెలియజేసిన పంట దశ ఆధారంగా రాబోయే పంట దశను చాట్ బాటే స్వయంగా అంచనా వేసి.. ప్రతి దశ లో పాటించవలిసిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను లేదా తీసుకోవలసిన జాగ్రత్తలను వాట్సప్‌లో వీడియో రూపంలో పంపుతుంది. ఒక్క చెంచాడు రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా మిరప నారు పోసుకునే దగ్గర నుంచి ఎండు మిరప కాయలు అమ్ముకునే వరకు.. వేలాది మంది రైతులు ఏకకాలంలో, ఎప్పుడంటే అప్పుడు వాట్సప్ ద్వారా మేలైన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సేంద్రియ మిరప కాయలకు దేశ విదేశాల్లో గిరాకీ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో డిజిటల్ గ్రీన్ చొరవ రైతులకు ఎంతగానో తోడ్పడుతుందనటంలో సందేహం లేదు. ►మిరప రైతులు ప్రకృతి వ్యవసాయ సూచనల కోసం వాట్సప్ ద్వారా సంప్రదించాల్సిన మొబైల్ నంబరు : 75419 80276. అనంతపురం జిల్లాలో సెప్టెంబర్ 26, 27 తేదీల్లో డా. ఖాదర్ సదస్సులు స్వతంత్ర ఆహార, ఆరోగ్య శాస్త్రవేత్త డా. ఖాదర్ వలి అవగాహన సదస్సులు కరోనా అనంతరం మళ్లీ ప్రారంభమయ్యాయి. అనంతపురం జిల్లాలో ఈ నెల 26 (ఆది), 27 (సోమ) తేదీల్లో సదస్సులు జరగనున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం తోడ్పాటుతో అనంత ఆదరణ మిల్లెట్స్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఈ సదస్సులను నిర్వహిస్తున్నట్లు ‘ఆదరణ’ రామకృష్ణ, ప్రొఫెసర్ గంగిరెడ్డి తెలిపారు. సిరిధాన్యాల సాగులో మెలకువలు, సిరిధాన్యాలను రోజువారీ ఆహారంగా తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే మార్గాలపై డా. ఖాదర్ వలి అవగాహన కల్పిస్తారు. ►సెప్టెంబర్ 26న ఉ. 10 గంటకు రాప్తాడు మండలం హంపాపురంలోని ఆదరణ సమగ్ర పాడి పంట ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో, 26న మధ్యాహ్నం 3 గంటలకు సింగనమలలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో ఉచిత రైతు అవగాహన సదస్సులు జరుగుతాయి. ►సెప్టెంబర్ 27న ఉ. 10 గంటలకు పర్తిశాల పుట్టపర్తిలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్. జె. రత్నాకర్, ఎమ్మెల్యే శ్రీధరరెడ్డి ఆధ్వర్యంలో డా. ఖాదర్ వలి సదస్సు జరుగుతుంది. ►సెప్టెంబర్ 27న సా. 4 గంటలకు లేపాక్షిలోని ఆర్.జి.హెచ్. కల్యాణ మండపంలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కొండూరు మల్లికార్జున తదితరుల ఆధ్వర్యంలో సదస్సు జరుగుతుంది. ►ఇతర వివరాలకు.. ఆదరణ రామకృష్ణ – 98663 45715, ప్రొ. వై. గంగిరెడ్డి – 98483 87111. చదవండి: ఇళ్లు లేని విద్యార్థులకు ఏకంగా 150 ఇళ్లు కట్టించన టీచర్.. ఎక్కడంటే.. -
ఇంటి పంటల పూజారి!
మనసుంటే మార్గం లేకపోదు. ఇంటి పంటలకు మనసులో చోటిస్తే చాలు.. మనకున్న అతికొద్ది చోటులోనూ పచ్చని కూరల వనాన్నే పెంచవచ్చు అనడానికి ఈ రేకుల మిద్దె తోటే ప్రత్యక్ష సాక్ష్యం! పక్కా భవనాల్లో ఉంటున్న వారు కూడా ఇంటి పైన కుండీలు, మడులు పెట్టి మొక్కలు పెంచాలంటే శ్లాబ్ దెబ్బతింటుందేమో అని సందేహ పడి తటపటాయిస్తున్న రోజులివి. అయితే, పదేళ్ల క్రితం నుంచే రేకుల ఇంటిపైన సేంద్రియ ఇంటిపంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఓ యువ పూజారి. కరోనా లాక్డౌన్ ఎండా కాలంలో కూడా బయటకు వెళ్లి కొనకుండా పూర్తిగా తన ఇంటిపంటలే సరిపోయాయని అంటున్నారు. అతని పేరు పుట్టా ప్రవీణ్‌కుమార్. సికింద్రాబాద్‌లోనే పుట్టి పెరిగాడు. తన తల్లి కృష్ణవేణికి ఇంటి చుట్టూ మొక్కలు పెంచటం అంటే మహాఇష్టం. అలా చిన్నప్పటి నుంచే ప్రవీణ్‌కు సేంద్రియ ఇంటిపంటల సాగుపై ఆసక్తి కలిగింది. తల్లి మర ణించిన తర్వాత కూడా కొనసాగిస్తున్నారు. బన్సీలాల్‌పేట్ డివిజన్ బోయిగూడ ప్రాంతంలో శ్రీధనలక్ష్మీ ఉప్పలమ్మ ఆలయంలో ప్రవీణ్ పూజారిగా పనిచేస్తూ, అక్కడే నివాసం ఉంటున్నారు. అల్ల నేరేడు చెట్టు కింద ఈ గుడి ఉంటుంది. గుడిలో భాగంగానే (ఇనుప కమ్ముల మీద వేసిన) సిమెంటు రేకుల షెడ్డు ఉంది. దాని విస్తీర్ణం 60 గజాలు ఉంటుంది. ఆ రేకుల ఇంటిపైన పిట్టగోడల మీద ఒడుపుగా ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. రేకులకు ఇబ్బందేమీ లేదా అంటే.. పదేళ్ల క్రితం నుంచే తాను ఇలా కూరగాయలు, ఆకుకూరలు పండించుకొని వండుకు తింటున్నానని, ఎప్పుడూ ఏ ఇబ్బందీ రాలేదని ప్రవీణ్ తెలిపారు. పూలు, వంటింటి వ్యర్థాలకు ఆవు పేడ కలిపి తానే ఎరువు తయారు చేసుకొని వాడుతున్నారు. రేకుల ఇల్లు కాబట్టి చూట్టూతా పిట్ట గోడపైనే మడులు, కుండీలు, బాటిల్స్ పెట్టి సాగు చేస్తున్నారు. దూరం నుంచి చూస్తే చిన్న స్థలమే కదా అనిపిస్తుంది. కానీ, చిన్న కవర్లు, ట్రేలు, కుండీలు, టబ్‌లలో అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలను సాగు చేస్తుండటం విశేషం. మడుల్లో కన్నా బాటిల్స్‌లోనే తక్కువ నీటితో సాగు చేయవచ్చని అనుభవపూర్వకంగా చెబుతున్నారు ప్రవీణ్. అమ్మ చెప్పిందని బొగ్గులను నెలకోసారి ఎరువుగా వేస్తున్నానన్నారు. బచ్చలికూర, పాలకూర, తోటకూర, గోంగూర ఉన్నాయి. చిక్కుడు, గుమ్మడి, బీర, సొర తీగలను కట్టెల పందిరికి పాకించారు. 60–70 టమాటా, 30 స్వీట్‌కార్న్, 15 బెండ, 15 వంగ మొక్కలతోపాటు ఉల్లి, పచ్చిమిర్చి మొక్కలు కూడా ప్రవీణ్ రేకుల మిద్దె తోటలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. పదులకొద్దీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌కు అడుగు కత్తిరించి మొక్కలు పెంచుతున్నారు. పంటల మార్పిడి తప్పకుండా పాటిస్తున్నారు. తాను తినగా మిగిలిన కూరగాయలను ఇతరులకు పంచిపెడుతున్నారు. గత ఏడాది ఈ బాటిల్స్‌లో 5 కిలోల వరి ధాన్యం కూడా పండించారు. ఆ ధాన్యాన్ని పూజా కార్యక్రమాల్లో వాడుకున్నానని తెలిపారు. డ్రాగన్ ఫ్రూట్, అంజీర గింజలు విత్తి నర్సరీ పెంచుతున్నారు. మొక్కల మీద, అమృతాహారం మీద, శ్రమైకజీవనం మీద ప్రవీణ్‌కు ఉన్న ప్రేమ అవ్యాజమైనది. ఇంతకన్నా ఆనందం ఏముంది? మొక్కలు పెంచటం నాకెంతో ఆనందాన్ని, ఆత్మసంతృప్తిని కలిగిస్తుంది. ఇంటి పంటల మధ్య ఉంటే ఒత్తిడి పోతుంది. హాయిగా ఉంటుంది. ప్రతి రోజు రెండు గంటల సమాయాన్ని కేటాయిస్తున్నా. ఇతరత్రా ఏ పనుల్లోనూ ఈ ఆనందం లేదు. – పుట్టా ప్రవీణ్‌కుమార్ (86868 08194), బోయిగూడ, సికింద్రాబాద్ – ఇ.చంద్రశేఖర్, సాక్షి, బన్సీలాల్‌పేట్ (సికింద్రాబాద్) -
ఒకటికి పది పంటలు!
ప్రతాప్ వృత్తిరీత్యా న్యాయవాది. రసాయన ఎరువులతో పండించిన పంట తినడం వల్ల మానవాళి మనుగడకు ఏర్పడుతున్న ముప్పును గుర్తించారు. అందుకే సేంద్రియ సాగును తన ప్రవృత్తిగా ఎంచుకున్నారు. ప్రతాప్ ప్రకృతి వ్యవసాయం చేస్తూ విషతుల్యమైన ఆహార పదార్థాల బారి నుంచి తన కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నారు. తనకున్న పదెకరాల వ్యవసాయ క్షేత్రాన్ని పూర్తిగా ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దారు. మంచిర్యాల జిల్లా కేంద్ర శివారులోని హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలో ఆయన క్షేత్రం ఉంది. వరి, మొక్కజొన్న, సజ్జలతోపాటు దాదాపు 50 రకాల పండ్ల మొక్కలు, పప్పుదినుసులు, కూరగాయలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. సుభాష్ పాలేకర్ ప్రకృతివ్యవసాయ సూత్రాలు, ‘సాక్షి సాగుబడి’ కథనాల స్ఫూర్తితో గత ఏడేళ్లుగా పంటల సాగు చేస్తూ.. అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఎకరన్నర విస్తీర్ణంలో మామిడి బత్తాయి (మొసంబి), సంత్ర, సపోట, ఆపిల్ బెర్, దానిమ్మ, అంజీర, సీతాఫలం, జామ, అరటి, బొప్పాయి తదితర పండ్ల తోటలు... ఎకరన్నరలో చిరుధాన్యాలు... ఎకరన్నరలో వరి... ఎకరన్నరలో పప్పుదినుసులు... రెండు ఎకరాల్లో కూరగాయల పందిళ్లు... రెండు ఎకరాల్లో వాణిజ్య పంటలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో.. పది ఎకరాల నల్లరేగడి భూమిలో పూర్తి సొంత వనరులతో తయారు చేసుకునే సహజ ఎరువులు వాడుతూ ప్రతాప్ వ్యవసాయం చేస్తున్నారు. రెండు ఆవులు, నాలుగు ఎద్దులు, ఒక గేదెను పెంచుతున్నారు. పేడ, మూత్రంతో జీవామృతం, ఘనాజీవామృతం, వర్మీ కంపోస్టు తయారు చేసి పంటలకు వేస్తున్నారు. పచ్చిరొట్ట ఎరువులను వాడుతూ మంచి దిగుడులు సాధిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో మెళకువలను ఇతర రైతులకు తెలియజెప్పేందుకు ప్రతి జూన్ నెలలో రైతులకు తన సేంద్రియ క్షేత్రంలో ప్రదర్శన ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకం వల్ల కలిగే నష్టాలను వివరిస్తున్నారు. రసాయన ఎరువులతో ఇటు మనుషులకు తినే తిండిలో, అటు పండించే పంట భూమికి నష్టాలు వాటిల్లుతాయని విడమరుస్తున్నారు. కూరగాయల సాగులో దిగుబడి రెట్టింపు భూమిని పైపైన దున్ని మాగిన ఆవు పేడను వేస్తారు. ఎకరా పొలాన్ని మడులుగా విభిజించి, ఒక్కో మడిలో ఒక్కో రకం కూరగాయ పంటను సాగు చేస్తున్నారు. దేశవాళీ వంగడాలతో పాటు సంకర రకాలను సాగు చేస్తున్నారు. బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తారు. రెండు వారాలకోసారి ఎకరాకు 200 లీటర్ల జీవామృతాన్ని నీటి ద్వారా అందిస్తారు. చీడపీడల నివారణకు కషాయాలు వాడుతున్నారు. పురుగును గుడ్డుదశలోనే నివారించేందుకు నీమాస్త్రం, వేప పిండి వాడుతున్నారు. అయినా పురుగు ఆశిస్తే అగ్ని అస్త్రం ద్రావణం పిచికారీ చేస్తారు. లద్దె పురుగు నివారణకు బ్రహ్మాస్త్రం వాడుతున్నారు. 20 లీటర్ల కషాయాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేస్తున్నారు. వారానికి రెండు కోతలు తెగుతున్నాయి. కిలో రూ.20 నుంచి రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు. కూరగాయల సాగుకు ఎకరాకు రూ. 6 వేల నుంచి 8 వేల వరకు ఖర్చు అవుతుండగా, రూ. 60 నుంచి రూ. 70 వేల వరకు నికరాదాయం లభిస్తోంది. కూరగాయలు పండించిన చోట తర్వాత ఏడాది వరి పండిస్తున్నారు. వరి పండించిన చోట తర్వాత ఏడాది కూరగాయలు పండిస్తున్నారు. దీనివల్ల పంట దిగుబడులు బాగున్నాయని ప్రతాప్ చెబుతున్నారు. ప్రకృతి సేద్యం చేసిన తొలి నాళ్లతో పొల్చితే దిగుబడి రెండింతలైంది. అప్పట్లో కూరగాయలు వారానికో కోత తెగితే ఇప్పుడు రెండు కోతలు తెగుతున్నాయి. పూర్తి సొంతంగా తయారు చేసుకున్న ఎరువులతో సాగుచేయడంతో బియ్యం, పప్పుదినుసులు, కూరగాయలు, పండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందంటున్నారు. సేంద్రియ పంటను మంచిర్యాలలో విక్రయిస్తున్నారు. కొంత మంది ఫోన్ ద్వారా సంప్రదించి సీజన్ల వారీగా కొనుగోలు చేస్తున్నారు. ఆదాయం అధికం.. ప్రతాప్ సాగు చేస్తున్న ఎకరం మామిడి తోటలో 60 చెట్లున్నాయి. 15ఏళ్లపాటు రసాయనిక సేద్యంలో ఉన్న తోటను ప్రకృతి సేద్యంలోకి మార్చారు. చెట్ల మధ్య ఎటు చూసినా 45 అడుగుల స్థలం ఉంటుంది. గాలి, వెలుతురు పుష్కలంగా లభిస్తుంది. తొలకరిలో చెట్టుకు ఐదులీటర్ల జీవామృతం పోస్తారు. 10 కిలోల ఆవుపేడ వేసి చెట్ల చుట్టూ దున్నుతున్నారు. పూతదశలో బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం పిచికారీ చేస్తారు. ఫిబ్రవరిలో పిందెదశలో, పురుగుదశలో మరోసారి పిచికారీ చేస్తారు. రసాయనిక సేద్యంలో వచ్చే దిగుబడిలో కంటే ఎక్కువగానే దీని ద్వారా దిగుబడి వస్తోంది. రసాయనిక ఎరువులు, పురుగుల మందులకు ఎకరాకు రూ. 20 వేల వరకు ఖర్చువుతుంది. ప్రకృతి సేద్యంలో రూ. 5 వేల నుంచి 8 వేలకు మించి ఉండదు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చెట్లు బాగుంటే రసాయన సేద్యంలో కన్నా ప్రకృతి సేద్యంలో రెండురెట్లు అధికంగా దిగుబడి తీయవచ్చని ప్రతాప్ తెలిపారు. పాడికి దిగుల్లేదు.. ఎరువులూ కొనక్కర్లేదు! మా వ్యవసాయానికి రెండు ఆవులు, నాలుగు ఎద్దులు, ఒక గేదె పట్టుగొమ్మగా నిలుస్తున్నాయి. వీటికి పొలం నుంచే గడ్డి అందుతుంది. పాడికి దిగుల్లేదు. వీటి పేడ, మూత్రంతో జీవామృతం, ఘనాజీవామృతం, వర్మీ కంపోస్టు తయారు చేసి పంటలకు వేస్తున్నాం. ఎరువులు, పురుగుమందులు కొనాల్సిన అవసరం లేకుండా పోయింది. రసాయన ఎరువుల పంటలతో భూ సారం దెబ్బతినడమే కాకుండా, ఆ పంటలు ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నాయి. అందుకే ప్రకృతి సేద్యం చేస్తున్నా. నా క్షేత్రంలో జూన్‌లో రైతులకు శిక్షణ ఇస్తున్నా. జీవన ఎరువులు, పురుగుమందుల తయారీ లాబ్ పెట్టి రైతులకు స్వల్ప ధరకే ఇవ్వాలనుకుంటున్నా. ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం రాయితీలు ఇచ్చి, మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే, రసాయనాల్లేని పంటలతో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చు. – కే వీ ప్రతాప్ (98499 89117), గుడిపేట, హాజీపూర్ మం., మంచిర్యాల జిల్లా నువ్వు చేను, పందిరి బీర తోట, వ్యవసాయ క్షేత్రంలో..ఆవుతో ప్రతాప్ –ఆది వెంకట రమణారావు, సాక్షి, మంచిర్యాల ఫొటో జర్నలిస్టు: Vð ల్లు నర్సయ్య -
చెరై.. ఆక్వాపోనిక్స్ గ్రామం!
కేరళలోని చెరై అనే తీరప్రాంత గ్రామం తొలి పూర్తి ఆక్వాపోనిక్ వ్యవసాయ గ్రామంగా మారిపోయింది. ఆ గ్రామంలోని ప్రతి ఇల్లూ సేంద్రియ కూరగాయలతోపాటు చేపలను కూడా ఆక్వాపోనిక్స్ పద్ధతుల్లో సాగు చేసుకుంటున్నారు. రెండేళ్ల క్రితం కొద్ది మంది ప్రారంభించిన ఆక్వాపోనిక్స్ సాగు తామర తంపరగా గ్రామం మొత్తానికీ పాకింది. పల్లిపురం సర్వీసు కో–ఆపరేటివ్ బ్యాంక్ (పి.ఎస్.సి.బి.) చొరవ తీసుకొని రసాయనాల్లేని ఆహారాన్ని ఎవరికి వారు పండించుకోవడానికి ఆక్వాపోనిక్స్ యూనిట్లను ఏర్పాటు చేసుకోమని ప్రోత్సహించింది. తొలుత కొద్ది మందితో ప్రారంభమైంది. ఒకర్ని చూసి మరొకరు ఇప్పుడు దాదాపు ఆ చిన్న ఊళ్లో ఉన్న 200 పైచిలుకు కుటుంబాలన్నీ చేపలు, కూరగాయలను రసాయనాల్లేకుండా పండించుకొని తింటున్నారు. ఆక్వాపోనిక్స్ అంటే? ఆక్వాకల్చర్+హైడ్రోపోనిక్స్ కలిస్తే ఆక్వాపోనిక్స్ అవుతుంది. చెరువులు, మడుల్లో చేపల పెంపకాన్ని ఆక్వాకల్చర్ అంటారు. మట్టితో సంబంధం లేకుండా నీటిలో కరిగే మినరల్ సప్లిమెంట్లతో టబ్‌లు, బక్కెట్లలో కూరగాయలు / పండ్ల మొక్కలు పెంచడాన్ని హైడ్రోపోనిక్స్ అంటారు. చేపలు పెరుగుతున్న టబ్‌లో నుంచి నీటిని కూరగాయలు, పండ్ల మొక్కలు పెరిగే కుండీలు, మడుల్లోకి నిరంతరం చిన్న విద్యుత్తు పంపు ద్వారా రీసర్క్యులేట్ చేస్తూ ఉంటారు. తవుడు, నూనె తీసిన వేరుశనగ / కొబ్బరి తెలగపిండిని చేపలకు ఆహారంగా వేస్తారు. మిగిలినపోయిన మేత, చేపల విసర్జితాలలోని పోషకాలతో కూడిన నీరు కూరగాయలు / పండ్ల మొక్కలకు కావాల్సిన పోషకాలను అందిస్తాయి. గ్రోబాగ్స్, టబ్‌లు, కుండీల్లో రాతి చిప్స్‌ను పోసి వాటిలోనే కూరగాయలు, పండ్ల మొక్కలను నాటుతారు. ఈ టబ్‌లు, కుండీల పక్కనే ప్లాస్టిక్ షీట్లతో ఏర్పాటు చేసిన తొట్లలో చేపలు పెరుగుతూ ఉంటాయి. చేపల విసర్జితాలు మొక్కలకు ఆహారం అవుతుండగా.. మొక్కల వేళ్లు నీటిని శుద్ధి చేసి తిరిగి చేపలకు అందిస్తూ ఉండటం వల్ల పరస్పరాధారితంగా ఆక్వాపోనిక్స్ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. నీటి వృథా లేకుండా, రసాయనాలు లేకుండా సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపట్టునే చేపలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పెంచుకోవడానికి ఆక్వాపోనిక్స్ యూనిట్లు చెరై గ్రామ ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఖర్చు ఏడాదిలో తిరిగొస్తుంది! ‘మొదట్లో చాన్నాళ్లు బ్రతిమిలాడినా చాలా మంది రైతులు రుణం ఇస్తామన్నా ఆక్వాపోనిక్స్ యూనిట్లను తీసుకోలేదు. కొద్ది మందే తీసుకున్నారు. ఏర్పాటు చేసుకోవడానికి మొదట ఖర్చు బాగానే ఉంటుంది. అయితే, ఏడాదిలోనే ఆ ఖర్చు చేపలు, కూరగాయల రూపంలో తిరిగి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఒక్క గ్రామంలోనే 200 మందికిపై ఈ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు.’ అని కో–ఆపరేటివ్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు సత్యన మయ్యత్తిల్ అన్నారు. తొలిగా ఆక్వాపోనిక్స్ యూనిట్ పెట్టుకున్న రైతు శశిధరన్ చాలా సంతృప్తిగా ఉన్నారు. ‘14,000 లీటర్ల నీరు పట్టే చేపల ట్యాంకులో 1,500కు పైగా చేప పిల్లలను వేశాను. వందకు పైగా గ్రోబాగ్స్‌లో కూరగాయలు పెంచుకుంటున్నా. చేపలు, కూరగాయలు మా ఇంటిల్లపాదికీ సరిపోను అందుతున్నాయి..’ అన్నారాయన. రైతులే కాక దిలీప్ వంటి వ్యాపారులు, మాజీ అటవీ శాఖాధికారి కిషోర్ కుమార్ వంటి విశ్రాంత ఉద్యోగులు కూడా ఇళ్ల దగ్గర ఆక్వాపోనిక్స్ యూనిట్లు పెట్టుకున్నారు. అందువల్లనే చెరై గ్రామం సంపూర్ణ ఆక్వాపోనిక్స్ గ్రామంగా మారింది. నీటిని నిమిషం ఆగకుండా పంప్ చేయాల్సి ఉంటుంది. తక్కువ ఖర్చుతో నిరంతరాయంగా నీటిని రీసర్క్యులేట్ చేయడానికి సోలార్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కిషోర్ కుమార్ మిగతా వారికన్నా ఒక అడుగు ముందుకేయడం విశేషం. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ(ఎంపెడా) తోడ్పాటుతో పల్లిపురం సహకార బ్యాంకు తీసుకున్న చొరవే సేంద్రియ చేపలు, కూరగాయలను ఈ గ్రామస్తులందరూ పండించుకోగలుగుతున్నారు. ఏ విటమిన్ అధికంగా ఉండే ‘మోల’ / మెత్తళ్లు వంటి చిరు చేపలను ఈ పద్ధతుల్లో పెంచుకోవచ్చు. ఒక్కసారి పిల్లలను వేస్తే చాలు నిరంతరం తనంతట తానే సంతతిని పెంపొందించుకునే లక్షణం కలిగి ఉండటం ఈ చిరు చేపల ప్రత్యేకత. మనం కూడా ఇటువంటి ప్రయత్నాలు చేయలేమా? ఇంటిపట్టునే చేపలు, కూరగాయలు పండించుకుంటున్న మహిళ -
మిద్దెపైన ఆరోగ్య సిరుల పంట
కరీంనగర్ జిల్లా వేములవాడలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఉపాధ్యాయుల సాంబశివుడు వృత్తి రీత్యా రైల్వే ఉద్యోగి. ఉద్యోగ రీత్యా రైల్వే అనుబంధ సంస్థ రైల్‌టెల్ కార్పొరేషన్లో హ్యూమన్ రిసోర్సెస్ సీనియర్ మేనేజర్. హైదరాబాద్‌లో కాప్రా డివిజన్ పద్మారావునగర్ హైటెక్ కాలనీలో సొంత ఇల్లు నిర్మించుకున్నారు. ఇంటి టెర్రస్‌పై సేంద్రియ ఎరువులతో పండించుకున్న కూరగాయలు తింటూ ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉంటున్నారు. నలుగురు సభ్యులున్న చిన్న కుటుంబం వారిది. సుమారు 300 గజాల ఇంటి మిద్దెపై ఉన్న స్థలంలో గ్రోబాగ్స్, కుండీలలో సుమారు 20 రకాల కూరగాయలు పండిస్తున్నారు. వంటింటి నుంచి వచ్చే వ్యర్థాలు, రాలిన ఆకులతో తయారు చేసుకున్న వర్మీ కంపోస్ట్‌ను, ద్రవ రూప ఎరువు వర్మీ వాష్‌ను వాడుతూ పోషకాల లోపం, చీడపీడల బెడద లేకుండా ఇంటి పంటలను సాగు చేస్తున్నారు. ప్రతి 3 నెలలకు ఓ సారి పంటను మార్చుతూ, కాలాలకు అనుగుణమైన కూరగాయ మొక్కలు పెంచుతున్నారు. మిరప, కీర, సొర, చిక్కుడు, టమాట, క్యాబేజీ, వంగ, బెండ, ముల్లంగి వంటి కూరగాయలు పండిస్తున్నారు. కూరగాయల మొక్కలతో పాటు ఔషధ మొక్కలు పునర్నవ, నాగదాలి వంటి ఔషధ మొక్కలు కూడా పెంచుకుంటూ కాఫీ, టీకి బదులు కషాయాల తయారీ కోసం వినియోగిస్తున్నారు. ఇంటిపంటలకు సబ్సిడీ కిట్ల ద్వారా తెలంగాణ ఉద్యాన శాఖ అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమంటున్నారు సాంబశివుడు. అధికారులు వచ్చి సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు. సేంద్రియ ఇంటి పంటలు తింటూ తమ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉన్నామని సాంబశివుడు సంతృప్తిగా చెప్పారు. ఇంటిపంట సాగులో గృహిణుల సహాయం ఎంతో ముఖ్యమైనదని ఆయన అన్నారు. తన పిల్లలు, భార్య తోడ్పాటుతోనే తమ ఇంటిపైన పంటల సాగు విజయవంతంగా కొనసాగుతున్నదన్నారు. ‘ఇంటిపంటలు పెంచడం అందరికీ ఇష్టమే, కానీ కష్టమైన పని అనుకుంటారు. ఇష్టపడి చేస్తే చాలా సులువు, మనకు కావాల్సిన ఆహారం మన ఇంట్లోనే సమకూర్చుకోవటం చాలా మేలైన పని’ అంటారు సాంబశివుడు(97013 46949). తాము తినగా మిగిలిన కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఇరుగుపొరుగువారికి పంచుతుండటం ప్రశంసనీయం. ఇంటిపంటల సాగులో ఇతరులను ప్రోత్సహించడం కోసం వాట్సప్ గ్రూప్‌ను ఆయన నిర్వహిస్తుండటం విశేషం. – పలుగుల పవన్, సాక్షి, కాప్రా, హైదరాబాద్ -
సేంద్రియ ఇంటిపంటల ద్వారా సామాజిక మార్పు!
సేంద్రియ ఇంటిపంటల సాగు గౌరవప్రదమైన ఉపాధి పొందడమే కాకుండా.. సమాజంలో సానుకూల మార్పునకు దోహదపడవచ్చని నిరూపిస్తున్నారు ఉన్నత విద్యావంతులైన అనురాగ్, జయతి దంపతులు... వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన పంజాబ్‌లో యువత మాదకద్రవ్యాల ఉచ్చులో చిక్కుకుపోయి ఉండటం బహిరంగ రహస్యమే. ఈ ట్రెండ్‌కు ఫుల్ స్టాప్ పెట్టడానికి తన వంతుగా ఏదైనా నిర్మాణాత్మకంగా చేయాలనుకున్నాడు 28 ఏళ్ల అనురాగ్ అరోరా. జలంధర్ నగరంలో పుట్టిపెరిగిన అనురాగ్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకొని ఒక ప్రైవేటు కంపెనీలో హ్యూమన్ రిసోర్సెస్ విభాగాధిపతిగా పనిచేస్తూ.. ఉద్యోగానికి స్వస్తి చెప్పి సామాజిక మార్పు కోసం తపించే వ్యాపారవేత్తగా మారారు. గత ఏడాది తన భార్య జయతి అరోరాతో కలసి ‘మింక్ ఇండియా’ పేరుతో స్టార్టప్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ సంస్థలో రెండు విభాగాలున్నాయి. రసాయనిక అవశేషాల్లేని అధిక పోషక విలువలున్న ఆహారాన్ని మేడలపైన ఎవరికి వారు పండించుకొని తినేలా ప్రోత్సహించడానికి మింక్ ఆర్గానిక్స్ విభాగం పనిచేస్తోంది. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి మంచి ఉపాధి మార్గాలను అందిపుచ్చుకునే శిక్షణ ఇవ్వడానికి మింక్ ఎడ్యుకేషన్ విభాగం పనిచేస్తోంది. ఈ రెండు మార్గాల ద్వారా పక్కదారి పడుతున్న పంజాబ్ యువతకు సన్మార్గం చూపాలన్నది అనురాగ్ లక్ష్యం. సేంద్రియ వ్యవసాయంలో ఆధునిక పోకడలపై పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అనురాగ్ శిక్షణ పొందటం ద్వారా పని ప్రారంభించారు. ‘‘రసాయనాల్లేకుండా, వర్మీకంపోస్టు ద్వారా, మట్టి లేకుండా కొబ్బరి పొట్టుకు సహజ ద్రవ పోషకాలు జోడించడం ద్వారా టెర్రస్ పైన షేడ్ నెట్‌హౌస్‌లో సాగు చేస్తున్నాం. మైక్రోగ్రీన్స్, టమాటాలు, వంకాయలు, క్యాబేజి, కాలీఫ్లవర్, ఆనప, సొరకాయలు, ముల్లంగి, ఉల్లిపాయలు, పాక్చాయ్, బ్రకోలి వంటి ఆకుకూరలు, చెర్రీ టమాటాలు, సేంద్రియ మొలకలు, సేంద్రియ కూరగాయలు, ముత్యపుచిప్ప పుట్టగొడుగులు మింక్ ఆర్గానిక్స్ సాగు చేస్తున్నాం. ఆసక్తి ఉన్న వారికి నేర్పిస్తున్నాం.. తమ మేడపై కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి సేవలందిస్తున్నాం..’’ అని అనురాగ్ తెలిపారు. వీటితోపాటు సేంద్రియ గోధుమ నారుతో పొడి, ఎండబెట్టిన పుట్టగొడుగులను కూడా జలంధర్ నగరంలో 25 దుకాణాల్లో వీరి ఉత్పత్తులు అమ్మటంతోపాటు అమెజాన్ ద్వారా కూడా విక్రయిస్తున్నారు.మైక్రోగ్రీన్స్, పుట్టగొడుగులకు మంచి ఆదరణ లభిస్తోంది. వివిధ రకాల ఆకుకూరలు,నూనెగింజల విత్తనాలను విత్తుకున్న 6–8 రోజుల్లో 2 అంగుళాలు పెరుగుతాయి. మైక్రోగ్రీన్స్‌ను కత్తిరించి సలాడ్లు, పిజ్జాలు, శాండ్విచ్లు, సూపులలో వాడుకోవచ్చు. నెల రోజులు పెరిగిన ఆకుకూరల కన్నా ఈ మైక్రోగ్రీన్స్ ద్వారా 40 రెట్లు ఎక్కువగా పోషకాలు పొందవచ్చని అనురాగ్ తెలిపారు. మైక్రోగ్రీన్స్ చిన్న బాక్సుల్లో, లోతు తక్కువ టబ్లలోనూ విత్తుకోవచ్చు. రోజుకు రెండు సార్లు నీరు చిలకరిస్తే చాలు. కత్తిరించిన మైక్రోగ్రీన్స్‌ను ఫ్రిజ్‌లో పెట్టుకొని 5–8 రోజుల వరకు వాడుకోవచ్చు. అనురాగ్ స్టార్టప్ ఏడాదిలో మంచి ప్రగతి సాధించింది. 50 కిలోలతో ప్రారంభమైన పుట్టగొడుగుల పెంపకం ఇప్పుడు 4000 కిలోలకు పెరిగింది. మింక్ బృందం ఇద్దరి నుంచి ఏడాదిలో ఎనిమిదికి పెరిగింది. ఈ ఉత్సాహంతో పంజాబ్‌లోని అన్ని నగరాలకూ తమ కార్యకలాపాలను విస్తరింపజేయాలని అనురాగ్ భావిస్తున్నారు. ముందుచూపుతో అడుగేస్తే సేంద్రియ ఇంటిపంటల సర్వీస్ ప్రొవైడర్ వృత్తి ద్వారా కూడా గౌరవప్రదమైన ఆదాయాన్ని పొందవచ్చని నిరూపిస్తున్న అనురాగ్, జయతిలకు జేజేలు! పుట్టగొడుగులు, చెర్రీ టమాటాలు మేడపై షేడ్‌నెట్ హౌస్‌లో అనురాగ్ అనురాగ్, జయతిలతో సిబ్బంది -
కలుపుతోనే కలుపు నిర్మూలన!
ఏ పంటకైనా కలుపు సమస్యే. కలుపు నివారణకు సంప్రదాయకంగా కూలీలతో తీయించడం లేదా గుంటక తోలటం చేస్తుంటారు. అయితే, కొద్ది సంవత్సరాలుగా కూలీల కొరత నేపథ్యంలో కలుపు నిర్మూలనకు రసాయనిక కలుపు మందుల పిచికారీ పెరిగిపోయింది. గ్లైఫొసేట్ వంటి అత్యంత ప్రమాదకరమైన కలుపు మందుల వల్ల కేన్సర్ వ్యాధి ప్రబలుతోందని నిర్థారణ కావడంతో ప్రభుత్వాలు కూడా దీని వాడకంపై తీవ్ర ఆంక్షలు విధించడం మనకు తెలుసు. ఈ నేపథ్యంలో కొందరు ప్రకృతి వ్యవసాయదారులు సేంద్రియ కలుపు మందులపై దృష్టిసారిస్తున్నారు. కలుపుతోనే కలుపును నిర్మూలించవచ్చని ఈ రైతులు అనుభవపూర్వకంగా చెబుతుండటం రైతాంగంలో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ఒక పొలంలో ఏవైతే కలుపు రకాలు సమస్యగా ఉన్నాయో.. ఆ కలుపు మొక్కలు కొన్నిటిని వేర్లు, దుంపలతో సహా పీకి, ముక్కలు చేసి, పెనం మీద వేపి, బూడిద చేసి దానికి పంచదార, పాలు కలిపి మురగబెడితే తయారయ్యే ద్రావణాన్ని ‘గరళకంఠ ద్రావణం’ అని పిలుస్తున్నారు. ఈ ద్రావణాన్ని పొలం అంతటా పిచికారీ చేస్తే.. చల్లిన 12 రోజుల నుంచి 30 రోజుల్లో కలుపు మొక్కలు ఎండిపోతున్నాయని చెబుతున్నారు. ఈ ద్రావణంలో కలపని మొక్కలకు అంటే.. పంటలకు ఈ ద్రావణం వల్ల ఏమీ నష్టం జరగక పోవడం విశేషం. సీజన్లో రెండుసార్లు ఇలా కలుపు మొక్కల బూడిద నీటిని చల్లితే కలుపు తీయాల్సిన లేదా కలుపు మందులు చల్లాల్సిన అవసరమే ఉండదని ఈ రైతులు నొక్కి చెబుతున్నారు. ఇది తాము కనిపెట్టిన పద్ధతి కాదని, 6వ శతాబ్దం నాటి ‘వృక్షాయుర్వేదం’లో పేర్కొన్నదేనంటున్నారు. పర్యావరణానికి, ఆరోగ్యానికి, భూసారానికి హాని కలిగించని ‘కలుపుతోనే కలుపును నిర్మూలించే పద్ధతి’పై రైతుల అనుభవాలు వారి మాటల్లోనే.. ‘సాగుబడి’ పాఠకుల కోసం..! ఇరవై రోజుల్లో కలుపు మాడిపోతుంది! నా పేరు మర్కంటి దత్తాద్రి (దత్తు). ఎనిమిదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. ఎన్.ఐ.ఆర్.డి. ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్లి సేంద్రియ వ్యవసాయంపై రైతులకు శిక్షణ ఇచ్చి వస్తూనే.. నా వ్యవసాయం నేను చేసుకుంటున్నాను. ఈ ఏడాది పత్తి చేనులో కలుపు బాగా పెరిగింది. వృక్షాయుర్వేదంలో చెప్పినట్టు ఆచరించి ఫలితాలు పొంది సీనియర్ రైతులు మేకా రాధాకృష్ణమూర్తి, కొక్కు అశోక్ కుమార్ సూచించిన విధంగా నేను కలుపు మొక్కల బూడిద ద్రావణంతో నా ఎకరం పత్తి చేనులో కలుపును విజయవంతంగా నిర్మూలించుకుంటున్నాను. జూలై 15న ఈ ద్రావణాన్ని పత్తి పంటలో పిచికారీ చేశాను. నేలలో తేమ ఉన్నప్పుడు మాత్రమే పిచికారీ చేయాలి. అలాగే జూలై 15వ తేదీన పిచికారీ చేశాను. ఫలితాలు చాలా బాగున్నాయి. గడ్డి జాతి కలుపు మొక్కలు తొందరగా మాడిపోతున్నాయి. వెడల్పు ఆకులు/ వేరు వ్యవస్థ బలంగా ఉన్న మొక్కలు కొంచెం నెమ్మదిగా చనిపోతున్నాయి. మామూలుగా గరిక పీకినా రాదు. ఈ ద్రావణం చల్లిన ఆరో రోజు తర్వాత పట్టుకొని పీకగానే వస్తుంది. అప్పటికే దాని వేరు వ్యవస్థ మాడిపోయి ఉంది. 8–12 రోజుల నుంచి మొండి జాతుల కలుపు మొక్కలు చనిపోతాయి. కలుపు మొక్కల బూడిద ద్రావణం తయారీ ఇలా.. ఎకరం పత్తి చేను కోసం నేను ద్రావణం తయారు చేసుకున్న విధానం ఇది.. గరిక, బెండలం, వయ్యారిభామ, గూనుగ అనే నాలుగు రకాల కలుపు మొక్కలను.. రకానికి కిలో చొప్పున వేర్లు, దుంపలతో సహా పచ్చి మొక్కలను పీకి, మట్టిని కడిగేయాలి. నీటి తడి ఆరిపోయే వరకు కొద్దిసేపు ఆరబెట్టి.. ముక్కలు చేసి.. పెనం మీద వేసి.. బూడిద చేశాను. ఇలా తయారు చేసిన బూడిద 200 గ్రాములు, చక్కెర 200 గ్రాములు, లీటరు ఆవు పాలు కలిపితే.. నల్లటి ద్రావణం తయారవుతుంది. దీన్ని రెండు రోజులు బాగా, అనేకసార్లు కలియదిప్పాలి. మిక్సీలో పోసి.. తిప్పాలి. లేదా కవ్వంతో బాగా గిలకొట్టాలి. మూడో రోజు ఈ ద్రావణాన్ని.. ప్లాస్టిక్ డ్రమ్ములో 200 లీటర్ల నీటిలో ఈ ద్రావణాన్ని కలిపి.. 2 రోజులు బాగా కలియబెడుతూ మురగబెట్టాలి. నీరు నీలి రంగుకు మారుతుంది. 3వ రోజు ఈ నీటిని నేరుగా కలుపుతో నిండిన పొలంలో పవర్ స్ప్రేయర్‌తో కలుపు మొక్కలు నిలువెల్లా బాగా తడిచి వేర్లలోకి కూడా ద్రావణం నీరు చేరేలా పిచికారీ చేయాలి. దీన్ని పిచికారీ చేసేటప్పుడు కచ్చితంగా భూమిలో తేమ ఉండాలి. తేమ లేనప్పుడు పిచికారీ చేస్తే దీని ప్రభావం ఉండదు. పంట కాలంలో రెండు సార్లు పిచికారీ చేసుకుంటే.. ఏయే రకాల కలుపు మొక్కలను పీకి మసి చేసి ద్రావణం తయారు చేసి వాడామో.. ఆయా రకాల కలుపు జాతుల నిర్మూలన అవుతుంది. ఇంకా మిగిలిన రకాలేమైనా ఉంటే.. వాటితో మరోసారి ద్రావణం తయారు చేసి చల్లితే.. అవి కూడా పోతాయి. ఆ భూమిలో పంటలకు ఎటువంటి హానీ ఉండదు. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రధాన, అంతర పంటల మొక్కలను ఈ ద్రావణంలో వాడకూడదు. ఒక్కోసారి కలుపు మొక్కల విత్తనాలు గాలికి కొట్టుకు వచ్చి పడినప్పుడు, ఆ రకాల కలుపు మళ్లీ మొలవొచ్చు. అలాంటప్పుడు మరోసారి ద్రావణం తయారు చేసి వాడాలి. ప్రమాదకరమైన రసాయనిక కలుపు మందులు చల్లకుండానే కలుపు సమస్య నుంచి ఈ గరళకంఠ ద్రావణంతో నిస్సందేహంగా బయటపడొచ్చు. ఇది నా అనుభవం. ఒకసారి ఏవైనా తప్పులు జరిగితే, ఫలితాలు పూర్తిగా రావు.. అలాంటప్పుడు మళ్లీ ప్రయత్నించండి. చల్లిన తర్వాత ఫలితాలు పూర్తిగా కంటికి కనపడాలంటే.. కనీసం 20 రోజులు వేచి ఉండాలి. గరళకంఠ ద్రావణంతో కలుపు నిర్మూలన అద్భుతంగా జరుగుతుంది. లేత కలుపు మొక్కలను త్వరగా నిర్మూలించవచ్చు. ముదిరిన కలుపు మొక్కల నిర్మూలనకు ఎక్కువ రోజులు వేచి ఉండాల్సి వస్తుంది. బాగా ముదిరి విత్తనం వచ్చిన కలుపు మొక్కల నిర్మూలన కష్టం. – మర్కంటి దత్తాద్రి (దత్తు) (80084 84100), సేంద్రియ పత్తి రైతు, విఠోలి, ముదోల్ మండలం, నిర్మల్ జిల్లా (ఫొటోలు: బాతూరి కైలాష్, సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్) వయ్యారి భామ, తుంగ, గరిక నిర్మూలన! ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అరెకరంలో ఆకుకూరలు, తీగజాతి కూరగాయలు సాగు చేస్తూ.. కలుపు నిర్మూలనకు గరళకంఠ ద్రావణం పిచికారీ చేశాను. ఏ కలుపు రకాలను తీసుకొని, బూడిద చేసి చల్లానో ఆ రకాల కలుపు మొక్కలన్నీ నూటికి నూరు శాతం చనిపోయాయి. తుంగ, గరికతోపాటు వయ్యారిభామ కూడా చనిపోయాయి. అయితే, కలుపు మొక్కలను పీకి బూడిద చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పంటకు సంబంధించిన మొక్కలు కలవకుండా చూసుకోవాలి. అవి కూడా కలిస్తే ఈ ద్రావణం చల్లినప్పుడు పంట కూడా చనిపోతుంది. పిచికారీ చేసిన 48 గంటలు దాటాక.. వేర్ల దగ్గర నుంచి ప్రభావం కనిపించింది. కలుపు ఎదుగుదల అప్పటి నుంచే ఆగిపోయింది. 20–30 రోజుల్లో కలుపు మొక్కలు చనిపోయాయి. ఆ పంట కాలంలో ఆ కలుపు మళ్లీ పుట్టదు. – తుపాకుల భూమయ్య (96767 18709), జూలపల్లి, పెద్దపల్లి జిల్లా చిన్న, పెద్ద రైతులెవరైనా అనుసరించవచ్చు! కలుపు మొక్కలతో తయారు చేసిన గరళకంఠ ద్రావణంతో ప్రధాన పంట మొక్కలకు ఎటువంటి హానీ జరగదు. కలుపు మొక్కలు వేర్ల నుంచి మురిగిపోతాయి. కొద్ది రోజుల్లోనే పెరుగుదల ఆగిపోయి.. కలుపు మొక్కలు ముట్టుకుంటే ఊడిపోతాయి. తర్వాత కొద్ది రోజులకు ఎండిపోతాయి. ఎన్ని ఎకరాలకైనా బెల్లం వండే బాండీల్లో/పాత్రల్లో ఒకేసారి భారీ ఎత్తున కలుపు బూడిదను తయారు చేసుకొని.. దానితో ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. ఇది చిన్న, పెద్ద రైతులు ఎవరైనా ఆచరించదగిన ఖర్చులేని, పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హాని లేని కలుపు నిర్మూలన పద్ధతి అని అందరూ గుర్తించాలి. కలుపు మొక్కల బూడిదను ఎప్పటికప్పుడు వాడుకోవాలన్న నియమం ఏమీ లేదు. ఈ బూడిదను నిల్వ చేసుకొని.. ఆ తర్వాతయినా వాడుకోవచ్చు. – కొక్కు అశోక్‌కుమార్ (98661 92761), సేంద్రియ రైతు, జగిత్యాల తుంగ వేర్లు 3 రోజుల్లో మాడిపోతాయి! 2011 నుంచి ప్రకృతి వ్యవసాయంలో వరి, తదితర పంటలు పండిస్తున్నాను. వరిలో తుంగ కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. వృక్షాయుర్వేదంలో చెప్పిన ప్రకారం.. కలుపును కలుపుతోనే నిర్మూలించడం సాధ్యమేనని అనుభవపూర్వకంగా మేం తెలుసుకున్నాం. తుంగ, గరిక వంటి కలుపును సమర్థవంతంగా నిర్మూలించాను. కిలో తుంగ గడ్డలతో సహా వేర్లు, మొక్కలు మొత్తం పీకి.. వేర్ల మట్టిని కడిగి.. పెనం మీద కాల్చి బూడిద చేయాలి. 100 గ్రా. కలుపు మొక్కల బూడిద, 100 గ్రా. పంచదార, అర లీటరు నాటావు పాలు కలిపి.. రెండు రోజులు తరచూ కలియదిప్పుతూ ఉండాలి. 2 రోజుల తర్వాత ఆ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి మరో రెండు రోజులు పులియబెట్టాలి. తరచూ కలియదిప్పుతూ ఉండాలి. మూడో రోజున ఆ ద్రావణాన్ని వరి పొలంలో అంతటా పిచికారీ చేయాలి. ఈ ద్రావణం కలుపును దుంపను నాశనం చేస్తుంది. మొదట దుంపను, వేర్లను ఎండిపోయేలా చేస్తుంది. క్రమంగా మొక్క కాండం, ఆకులు కూడా ఎండిపోతాయి. తుంగ మొక్కను పట్టుకొని పీకితే తేలిగ్గా రాదు. నేను ద్రావణం చల్లిన తర్వాత మూడో రోజు తుంగ మొక్కను పట్టుకుంటే చాలు ఊడి వస్తుంది. దుంప, వేర్లు మాడిపోయాయి. ఇలా నిర్మూలించిన తర్వాత మా పొలంలో మళ్లీ ఇంత వరకు తుంగ రాలేదు. వరి మొక్కలకు ఎటువంటి హానీ జరగలేదు. గరికను పెనం మీద మాడ్చి ద్రావణం తయారు చేసి చల్లితే 10 రోజులకు వడపడింది. పీకి చూస్తే వేరు ఎండిపోయింది. సాధారణంగా రసాయనిక కలుపు మందులు పిచికారీ చేసిన తర్వాత 48 గంటల్లో మొదట ఆకులు, కొమ్మలు, కాండం, వేర్లు.. పై నుంచి కిందకు ఎండిపోతాయి. ఈ ద్రావణం చల్లితే ఇందుకు భిన్నంగా.. మొదట వేర్లు, గడ్డలు, కాండం, కొమ్మలు, ఆకులు చివరగా ఎండుతాయి. అయితే, భూమిలో తేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ కలుపు నిర్మూలన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. చల్లిన ద్రావణం వేరు ద్వారా కిందికి దిగాలంటే భూమిలో పదును ఉండాలి. అప్పుడే ఇది సక్సెస్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రైతులంతా రసాయనిక కలుపు మందులు వాడి భూములను నాశనం చేసుకోకుండా, స్వల్ప ఖర్చుతో ఈ ద్రావణం తయారు చేసుకొని వాడుతూ కలుపు నిర్మూలన చేసుకుంటున్నారు. – మేకా రాధాకృష్ణమూర్తి (84669 23952), మంత్రిపాలెం, నగరం మండలం, గుంటూరు జిల్లా. -
సెల్ఫ్ వాటరింగ్ బెడ్!
మేడల మీద కుండీలు, బ్యాగ్‌లలో సేంద్రియ ఇంటిపంటలు సాగు చేయడంపై కేరళవాసులు అధిక శ్రద్ధ చూపుతుంటారు. సృజనాత్మకతను జోడించి తక్కువ శ్రమతో చేసే మెలకువలను అనుసరిస్తూ ఉంటారు. తిరువనంతపురానికి చెందిన షాను మనోహర్ అనే యువకుడు సెల్ఫ్ వాటరింగ్ బ్యాగ్స్‌తో బెడ్‌ను ఏర్పాటు చేస్తున్నాడు. ఈ పద్ధతిలో ప్రతి బ్యాగ్/కుండీలోనూ నీరు పోయాల్సిన పనిలేదు. పీవీసీ పైపులో నీరు పోస్తే చాలు.. పైపుల్లో నుంచి వత్తి ద్వారా అనుసంధానమై ఉండే బాగ్స్‌లోని మొక్కల వేర్లకు తగినంత నీటి తేమ నిరంతరం అందుతూ ఉంటుంది. తక్కువ శ్రమతో చక్కగా ఇంటిపంటలు పండించుకోవచ్చు. షాను మనోహర్ ఇంటిపంటలను ఏర్పాటు చేసే సర్వీస్ ప్రొవైడర్‌గా స్వయం ఉపాధి పొందుతూ ఇంటిపంటల సాగుదారుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇంతకీ ఆయన చేస్తున్నదేమిటో ఫొటోలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది.. 1. పీవీసీ పైపులతో ఇలా మూడు వరుసల బెడ్‌ను ఏర్పాటు చేస్తున్నాడు. పైపుల చివరలను కూడా మూసేస్తారు. కేవలం పైనుంచి నీరు పోయడానికి ఒక చోట అవకాశం ఉంటుంది. ఇందులో పోసిన నీరు బయటకు పోదు. నీరు రోజూ పోయాల్సిన అవసరం లేదు. అయిపోయినప్పుడు మళ్లీ నీరు పోస్తే సరిపోతుంది. వాతావరణాన్ని బట్టి కొద్ది రోజులకోసారి నీరు పోస్తే సరిపోతుంది. 2. ఇది ఒక వత్తి. కిరసనాయిలు దీపంలోని వత్తి మాదిరిగా ఇది పనిచేస్తుంది. కింది పైపుల్లో నుంచి ఈ వత్తి ద్వారా గ్రోబ్యాగ్స్‌లోని మొక్కల వేళ్లు నీటి తేమను తీసుకుంటూ ఉంటాయి. పంటు మొక్కలు ఏపుగా పెరిగి ఫలసాయాన్నిస్తాయి. 3. గ్రోబ్యాగ్‌కు అడుగున బెజ్జం పెట్టి.. వత్తిని ఇలా అమర్చాలి.. 4. వత్తి గ్రోబ్యాగ్ లోపలకు సగం, కిందికి సగం ఉండేలా చూసుకోవాలి. 5. గ్రోబ్యాగ్‌లో ఎర్రమట్టి, కొబ్బరిపొట్టు, పశువుల ఎరువు/వర్మీకంపోస్టు/కంపోస్టు, కొంచెం వేపపిండి మిశ్రమంతో నింపాలి (నల్లమట్టిని వాడితే కొంచెం ఇసుకను కూడా కలుపుకోవాలి). వత్తి ఇలా మట్టి మిశ్రమం పై వరకూ ఉంటే పైపైనే ఉండే మొక్కల వేర్లకు కూడా నీటి తేమ అందుతూ ఉంటుంది. 6. ఇలా సిద్ధం చేసిన గ్రోబ్యాగ్‌లను పీవీసీ పైపులపై ఇలా ఉంచాలి. గ్రోబ్యాగ్ అడుగున ఉన్న వత్తిని పైపులోని బెజ్జంలోకి జొప్పించాలి. గ్రోబ్యాగ్స్ పడిపోకుండా అడుగున సరిపడా ఎత్తున్న ఇటుకలను కుదురుగా పెట్టాలి. పీవీసీ పైపులో నిండు నీరుపోసి, మూత బిగించాలి. రెండు, మూడు రోజులకోసారి మూత తీసి.. నీరు ఎంత ఉందో చూసుకుంటూ ఉండాలి. 7. ఇక అంతే.. గ్రోబ్యాగ్స్‌లో కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు విత్తుకోవచ్చు లేదా మొక్కలు నాటుకోవాలి. చక్కని రుచికరమైన రసాయనిక అవశేషాల్లేని సేంద్రియ ఇంటిపంటలను తక్కువ శ్రమతో ఇలా పండించుకోవచ్చు. ఈ పద్ధతిలో నీరు ఎక్కువ, తక్కువ కావడానికి అవకాశం ఉండదు. ఉష్ణోగ్రతలను బట్టి తగుమాత్రంగా నీటి తేమను వత్తి ద్వారా గ్రోబ్యాగ్స్‌లోని మట్టి పీల్చుకుంటూ మొక్కల వేర్లకు అందిస్తూ ఉంటుంది. బాగుంది కదూ.. మరి మనమూ ట్రై చేద్దామా? మీ అనుభవాలను మెయిల్ చేయండి.. sagubadi@sakshi.com. -
వేసవిలోనూ మేడపై పచ్చని కూరలు!
అతనో ఉపాధ్యాయుడు.. అయితేనేం, వ్యవసాయమంటే ఆసక్తి. ఆ ఆసక్తి తన ఇంటిపైనే కాయగూరలు, ఆకుకూరలు సాగు చేసేలా పురిగొల్పింది. దాంతో గడచిన నాలుగేళ్లగా వారంలో నాలుగు రోజులు చక్కని, రుచికరమైన, సొంతంగా పండించిన కూరలు తినగలుగుతున్నారు. ఆయన పేరు బిరుసు ఈశ్వరరావు. విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని బంగారమ్మ కాలనీలో సొంత ఇంటిలో ఈశ్వరరావు నివాసం ఉంటున్నారు. పాచిపెంట మండలంలోని పీ కోనవలస పాఠశాల ఉపాధ్యాయుడిగా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. తన ఇంటిమేడపైన నాలుగేళ్లుగా సేంద్రియ ఇంటిపంటలు సాగు చేస్తూ తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. చుక్కకూర, తోటకూర, పాలకూర, మెంతికూర, గోంగూర, కొత్తిమీరతోపాటు వంగ, టమాట, ఆనప, ముల్లంగి తదితర పంటలు సాగు చేస్తున్నారు. మండు వేసవిలోనూ ఆయన మేడపైన పచ్చని కూరగాయల తోట కొనసాగుతోంది. ప్రత్యేక మడులు.. మట్టి కుండీలు.. రకరకాల మొక్కలను పెంచేందుకు వీలుగా ప్రత్యేకంగా ఇటుకలు, సిమెంటుతో మడులను కట్టించుకున్నారు. అడుగు ఎత్తున దిమ్మెలపైన సిమెంట్ పలకలతో మడులను నిర్మించారు. వీటిలో పశువుల గెత్తం(పశువుల ఎరువు), చెరువుమట్టిని కలిపి పోశారు. ఆకుకూరలు, ఆనప వంటి తీగజాతి కూరగాయ పాదులను వీటిల్లో సాగు చేస్తున్నారు. వంగ, టమాట తదితరాల కోసం పూల మొక్కల గోళాల (మట్టి కుండీలు, ప్లాస్టిక్ డబ్బాల)నే వినియోగిస్తున్నారు. ఇంటిపంటల కోసం విజయనగరం మార్కెట్లో విత్తనాలను కొనుగోలు చేస్తూ, ఇంటి అవసరాలను బట్టి, కొద్ది కొద్దిగా విత్తుకుంటారు. ప్రతీ 15 రోజుల వ్యవధిలో ఆకుకూరల విత్తులు విత్తుతూ.. ఆరోగ్యకరమైన కూరలకు ఏడాది పొడవునా లోటు లేకుండా చూసుకుంటున్నారు. మేలైన హైబ్రిడ్ రకాలనే ఎన్నుకుంటున్నాని ఈశ్వరరావు తెలిపారు. తెగుళ్లు పెద్దగా రావన్నారు. పురుగులు ఏవైనా కనిపిస్తే చేతులతో ఏరి పారేస్తున్నామన్నారు. ఇలా చేయాలనుకునే వారు వచ్చి అడిగితే.. మొదటి నుంచి చివరి వరకు ఎలా చేయాలో, ఏమి చేయాలో పూర్తిగా చెప్పడానికి ఈశ్వరరావు సంసిద్ధంగా ఉన్నారు. నాలుగేళ్లుగా పండించుకుంటున్నా.. నాకు చిన్నతనం నుండి వ్యవసాయమంటే ఆసక్తి. దాంతోనే మేడపై కూరగాయల సాగుకు శ్రీకారం చుట్టాను. నాలుగేళ్లుగా క్రమం తప్పకుండా పెంచుతున్నాను. ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు, మంచి వ్యాపకం దొరుకుతోంది. రోజుకు 20 నిమిషాలు కేటాయిస్తే సరిపోతోంది. మండు వేసవిలో కూడా చాలా తక్కువ ఖర్చుతో ఆకుకూరల సాగు చేయగలుగుతున్నాను. – బిరుసు ఈశ్వరరావు (94411 71205), సాలూరు, విజయనగరం – కొల్లి రామకృష్ణ, సాక్షి, సాలూరు, విజయనగరం -
విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ
సిద్దిపేటరూరల్ : విద్యార్థులకు గురుకుల పాఠశాలలో సమ్మర్ క్లాసుల్లో భాగంగా సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం చాలా బాగుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కమీషన్ సభ్యులు అన్నారు. బుధవారం అర్బన్ మండల పరిధిలోని మిట్టపల్లి గ్రామంలోని సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో పాటుగా కమీషన్ సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించాలన్నా ఆలోచన చాలా గొప్పదని, దీనిని విద్యార్థులు ఉత్సాహంతో నేర్చుకోవడం చాలా మంచి విషయం అన్నారు. అదే విధంగా పచ్చని పర్యావరణంలో పిల్లలకు అన్ని రకాల అవగాహన సదస్సులు నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు. సేంద్రియ వ్యవసాయం గురించి విద్యార్థులు చాలా బాగా వివరించారని వారిని అభినందించారు. విద్యార్థులకు డిజిటల్ క్లాస్రూంలు, మిర్రర్ ప్రాజెక్టులు నిర్వహించడం పై ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు, ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు. -
విశ్రాంత జీవనం.. ఆకుపచ్చని లోకం!
వ్యవసాయంలో ఎమ్మెస్సీ చదువుకున్న గుడిపాటి జీవన్‌రెడ్డి 35 ఏళ్లు బ్యాంకు ఉద్యోగం చేసిన తర్వాత.. తన ఇంటిపైనే ఆధునిక వసతులతో సేంద్రియ ఇంటి పంటలను సాగు చేస్తున్నారు. ఇనుప చువ్వల పందిరిపై గ్రీన్ షేడ్‌నెట్ వేసి.. 250కి పైగా కుండీలు, డ్రమ్స్, గ్రోబాగ్స్‌లో 15 రకాల కూరగాయలు, ఆకుకూరలు పుష్కలంగా పండించుకొని తింటూ ఇంటిల్లపాదీ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సింగాపురానికి చెందిన జీవన్‌రెడ్డి ఆంధ్రా బ్యాంక్‌లో 35 ఏళ్లు సేవలందించి సీనియర్ మేనేజర్‌గా రిటైరైన తర్వాత.. హన్మకొండ బ్యాంక్ కాలనీలో 2012లో మూడంతస్థుల ఇల్లు నిర్మించుకున్నారు. తమ ఇంటిపైనే ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఆకుకూరలు, కూరగాయల సాగుకు రెండేళ్ళ క్రితం శ్రీకారం చుట్టారు. విశ్రాంత జీవితంలో పచ్చని మొక్కలతోనే సహచర్యం చేస్తున్నారు. ఇంటిపంటల సాగు చక్కని వ్యాపకంతో పాటు రోజుకు 3 గంటల పాటు ఆనందదాయకమైన వ్యాయామంగా కూడా మారిందని ఆనందంగా చెబుతున్నారు.. కాలనీ అభివృద్ధి కమిటీ సంయుక్త కార్యదర్శిగా ఉంటూ.. నలుగురిలోనూ సేంద్రియ ఇంటిపంటల సాగుపై ఆసక్తిని రేకెత్తిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 250కి పైగా కుండీలు, డ్రమ్ములు.. మొదట్లో కొంచెం ఎక్కువ ఖర్చయినా పుష్కలంగా నిరంతరం ఆకుకూరలు, కూరగాయల దిగుబడి వచ్చేలా అత్యంత ప్రణాళికాబద్ధంగా, శాస్త్రీయంగా ఇంటిపంటలను సాగు చేస్తుండడం జీవన్‌రెడ్డి ప్రత్యేకత. ఎత్తుల వారీగా ఇనుప బెంచీలను తయారు చేయించి, వాటిపైన కుండీలను, డ్రమ్ములను ఉంచి ఆకుకూరలు, కూరగాయలు పెంచుతున్నారు. 40 కుండీల్లో టమాటాలు, 10 కుండీల్లో మిరపకాయలు, 30 కుండీల్లో వంకాయలు, 20 కుండీల్లో గోరుచిక్కుడు, 4 కుండీల్లో బంగాళదుంపలు, రెండు కుండీల్లో అల్లం సాగు చేస్తున్నారు. చిన్న కంటెయినర్లు, గ్రోబాగ్స్‌లో క్యాబేజి, కాలీఫ్లవర్ వేశారు.మార్కెట్లో దొరికే వాటర్ డ్రమ్ములు 15 తెచ్చి.. వాటిని నిలువుగా కోసి 30 కుండీలుగా మార్చి.. ఆకుకూరలు వేశారు. నీరు నిలబడకుండా అదనపు నీరు కిందికి వెళ్లిపోవడం కోసం డ్రమ్ము అడుగున ఒక చిన్న బెజ్జం పెట్టి.. దానిపైన చిప్స్, గండ్ర ఇసుక వేసి దానిపైన ఎరువు కలిపిన మట్టి మిశ్రమాన్ని నింపారు. పాలకూర 4, మెంతికూర 3, గోంగూర 3, ఉల్లి కాడలు 4, కొత్తిమీర 3 డ్రమ్ముల్లో వేశారు. ఆకుకూరల విత్తనాలు వేసిన నెలరోజుల్లో కోతకు వస్తాయి. 12–15 రోజుల వ్యవధిలో విత్తనాలు వేస్తూఉండటం వల్ల ఆకుకూరలు, కూరగాయలు సంవత్సరం పొడవునా లోటు లేకుండా చేతికి అందివస్తున్నాయని జీవన్‌రెడ్డి తెలిపారు. ఉదాహరణకు.. గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు టమాటా నారు 3 దఫాలుగా పోసి, మొక్కలు నాటుకున్నారు. డ్రమ్ముల్లో ప్రతి సారీ ఆకుకూర పంటల మార్పిడి పాటించడం వల్ల చక్కని పంట దిగుబడులు వస్తున్నాయన్నారు. మట్టిలో రసాయనిక అవశేషాలతో తిప్పలు.. హైబ్రిడ్ విత్తనాల కన్నా సేంద్రియ సాగులో దేశీ విత్తనాలే మంచి దిగుబడినిస్తున్నాయన్నారు. రెండు ట్రాక్టర్ల ఎర్రమట్టి తెప్పించి.. సగం మట్టి, సగం వర్మీకంపోస్టు, కొబ్బరిపొట్టు, పెరిలైట్ కలిపి తయారు చేసుకున్న మట్టిమిశ్రమంలో జీవన్‌రెడ్డి ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. రసాయనిక ఎరువులు వాడిన పొలాల్లో మట్టి తేవడం వల్ల తొలి ఏడాది ఇంటిపంటలు సక్రమంగా రాక నీరసం వచ్చిందన్నారు. మట్టి ఆరోగ్యం బాగుపడిన తర్వాత రెండో ఏడాది పంటలు బాగా వస్తున్నాయని ఉత్సాహంగా చెప్పారు. రాలిన ఆకులు, వంటింటి వ్యర్థాలతో తయారు చేసుకునే కంపోస్టు, వేపపిండిని నెలకోసారి కొంచెం కొంచెంగా వేస్తున్నారు. 10–12 రోజులకోసారి వేపనూనె పిచికారీ చేస్తున్నారు. మొక్కలు నాటిన లేదా మొలిచిన 2–3 రోజుల్లోనే వేపనూనె చల్లితే చీడపీడల బెడద అంతగా ఉండదన్నది తన అనుభవమని తెలిపారు. మొదట్లోనే ఆకులు తెంపెయ్యాలి.. జీవన్‌రెడ్డి మొక్కలకు రోజూ ఉదయం వేళలో స్వయంగా నీరు పోస్తుంటారు. డ్రిప్ ద్వారా నీరిస్తే ఐదు నిమిషాల్లో పని పూర్తవుతుందని, అయితే ఏ మొక్క ఎలా ఉందో మనకు తెలియదన్నారు. గోరుముద్దలు తినిపించే తల్లికి, బిడ్డకు మధ్య పెరిగే అనుబంధం, ఆనందం వంటిదే ఇది కూడానని జీవన్‌రెడ్డి మురిపెంగా చెప్పారు. ఉదయపు నీరెండలో అదే వ్యాయామంగా భావిస్తున్నారు.పురుగూ పుట్రా కనిపిస్తే ఏరోజుకారోజు చేతులతో ఏరేయడమే ఇంటిపంటలకు ఉత్తమ మార్గమని ఆయన అంటున్నారు. టమాటాకు ఆకుమచ్చ(లీఫ్‌మైనర్) సమస్య కనిపించిన తొలిదశలోనే ఆకులను తెంపి, నాశనం చేయడం ఉత్తమం. బెండలో పేనుబంకను గమనించిన వెంటనే వేళ్లతో తీసి నేలమీద వేయాలి. గట్టి వత్తిడితో నీటిని పిచికారీ చేసినా పేనుబంక పోతుంది. అంతగా అయితే వేపనూనె పిచికారీ చేయాలన్నారు. పాలకూరను ఆశించే గొంగళిపురుగులు సాయంత్రం 5 గంటల తర్వాత మట్టిలో నుంచి బయటకు వస్తాయని, ఆ వేళలో కాచుకొని చూస్తూ పురుగులను ఏరేయాలని సూచిస్తున్నారు. హన్మకొండలో జీవన్‌రెడ్డి ఇంటిపైకనువిందు చేస్తున్న ఇంటిపంటలు ప్రతి ఆదివారం ఉచిత శిక్షణ ఇస్తా.. బెంగళూరుకు చెందిన సేంద్రియ ఇంటిపంటల నిపుణుడు డా. విశ్వనాథ్ స్ఫూర్తితో నేను ఇంటిపంటల సాగుకు శ్రీకారం చుట్టాను. నాకు ఇంటిపంటల పనులు, కాలనీ అభివృద్ధి తప్ప మరే వ్యాపకమూ లేదు. గాఢమైన ఆసక్తి ఉంటే ఇంటిపంటల సాగు కష్టమనిపించదు. నాలా అందరూ ఇంత ఖర్చు పెట్టనక్కరలేదు. తక్కువ ఖర్చుతోనూ ప్రారంభించవచ్చు. మా కాలనీవాళ్లకు కూడా ఇదే చెప్తున్నాను. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మా ఇంటితోటలోనే ఉచితంగా శిక్షణ ఇవ్వదలచాను. ఆసక్తి ఉన్న వారెవరైనా ముందు నాకు ఫోన్ చేసి రావచ్చు. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వడానికి వాట్సాప్ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేశాను. – గుడిపాటి జీవన్‌రెడ్డి (99630 99830), బ్యాంక్ కాలనీ, హన్మకొండ పాడితోనే బాగుపడ్డాం.. క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే కుటుంబ నికరాదాయాన్ని పెంచుకోవడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని మహిళా రైతు నాగిరెడ్డి విజయగౌరి అనుభవపూర్వకంగా చెబుతున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి రూరల్ మండలం రాజుపేట గ్రామానికి చెందిన విజయగౌరి పెద్దగా చదువుకోకపోయినా.. పాడి పశువుల పోషణకు సంబంధించి తెలుసుకున్న ప్రతి విషయాన్నీ ఆసక్తిగా నోట్స్ తయారు చేసుకుంటూ.. ఆ పనిని ప్రణాళికాయుతంగా చేపడుతూ ఉత్తమ పాడి రైతుగా పలు అవార్డులు, రివార్డులను అందుకున్నారు. 18 పాడి çపశువులను పెంచుతూ రోజూ విశాఖడైరీ పాలకేంద్రానికి 80 నుంచి 100 లీటర్ల పాలు పోస్తున్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి కుటుంబాన్ని ఆర్థికాభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. ఆమె మాటల్లోనే విందాం. ‘ఎనిమిదేళ్ల క్రితం కుటుంబం ఆర్థికంగా చితికిపోవడంతో పశువుల పెంపకంపై దృష్టిసారించాను. అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పశుక్రాంతి పథకం ద్వారా మూడు ఆవులతో డైరీ పెట్టాను. నా భర్త రామారావు సహకారంతో ప్రస్తుతం మొత్తం 15 ఆవులు 5 దూడలు పెంచుతూ పాల ఉత్పత్తి చేస్తున్నాను. రోజుకు సాధారణ స్థితిలో అయితే 80 నుంచి 100 లీటర్ల పాలు విశాఖ డైరీ పాలకేంద్రానికి అందిస్తున్నాం. పశువుల పేడతో గోబర్ గ్యాస్ తయారు చేసుకొని వాడుకుంటున్నాం. భర్తతో కలసి ఉదయం 3.30 గంటలకు నిద్ర లేచి రాత్రి 10 గంటల వరకు పనులు చేసుకుంటున్నాం. డైరీలో లీటరుకు రూ. 23, బయట రూ. 30 వస్తున్నది. పశువుల పెంపకం వలన మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. నా కుమారుడు నాగేంద్రకుమార్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కుమార్తె యశోద ఇంజనీరింగ్ చదువుతున్నది’ అన్నారామె. – రంపా రాజమోహనరావు, సాక్షి, బొబ్బిలి రూరల్ నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ – కొల్ల కృష్ణకుమార్, సాక్షి, హన్మకొండ -
మేడ మీద ము‘నగ’!
హైదరాబాద్ గుడిమల్కాపూర్ ఎస్.బి.ఐ. కాలనీలో రెండంతస్థుల సొంత భవనంలో నివాసం ఉంటున్న అర్చన, ఫార్మా ఉద్యోగి అరవింద్‌కుమార్ దంపతులు గత ఐదారేళ్లుగా సేంద్రియ ఇంటిపంటలు సాగు చేసుకుంటున్నారు. ఉద్యాన శాఖ నుంచి సబ్సిడీపై సిల్పాలిన్ బెడ్స్ తీసుకొని టమాటా, వంకాయలు, అల్లంతోపాటు మునగ, బొప్పాయి చెట్లను పెంచుతున్నారు. పార్స్లీ, ఆరెగానో, తులసి, లెమన్‌గ్రాస్, కలబంద తదితర ఔషధ మొక్కలను సాగు చేస్తున్నారు. పెద్ద సిల్పాలిన్ బెడ్లో నాలుగేళ్లుగా ఎత్తుగా పెరిగిన మునగ చెట్టు వీరి కిచెన్ గార్డెన్‌కు తలమానికంగా నిలిచింది. మునగ కాయలతోపాటు ఆకులను కూడా కూరవండుకుంటున్నామని అర్చన తెలిపారు. ఉల్లి, వెల్లుల్లి వాడకుండా పార్స్లీ, ఆరెగానో తదితర ఆకులను ఉపయోగించి ఇంట్లోనే పిజ్జాలు తయారుచేసుకొని తింటుండడం విశేషం. 30 ఏళ్ల నాటి ఈ రెండంతస్థుల భవనానికి పిల్లర్లు వేయలేదు. గోడలపైనే నిర్మించారు. అందువల్ల గోడలపైనే 8 సిల్పాలిన్ బెడ్స్, కుండీలను ఏర్పాటు చేసుకొని ఐదారేళ్లుగా ఇంటిపంటలను సాగు చేసుకుంటున్నారు. 15 రోజులకోసారి జీవామృతం మొక్కలకు మట్టి ద్వారా, పిచికారీ ద్వారా కూడా ఇస్తున్నారు. రోజూ దేశీ ఆవుపాలు సరఫరా చేసే వ్యక్తే జీవామృతాన్ని సైతం ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. మేడపైనే ఒక సిల్పాలిన్ బెడ్‌ను కంపోస్టు తయారీకి వాడుతున్నారు. టెర్రస్‌పైన ఇంటిపంటలు, షేడ్‌నెట్, ఇంటి చుట్టూ వెదురు తదితర మొక్కలు ఉండటం వల్ల తమ ఇంట్లో వేసవిలోనూ ఉష్ణోగ్రత 3–4 డిగ్రీల మేరకు సాధారణం కన్నా తక్కువగా ఉంటున్నదని అర్చన(98663 63723) సంతోషంగా చెప్పారు. అంటే.. ఇంటిపంటల కోసం శ్రద్ధతీసుకుంటే.. ఆరోగ్యంతోపాటు ఇంటి ఏసీ ఖర్చులు కూడా తగ్గాయన్నమాట! మునగాకు చిన్న – పోషకాలలో మిన్న మునగను తింటే అనేక పోషకాలను పుష్కలంగా తిన్నట్టే లెక్క. ఇదీ మునగ ఆకులో నిక్షిప్తమై ఉన్న పోషకాల జాబితా.. విటమిన్–సి: కమలాల్లో కన్నా 7 రెట్లు ఎక్కువ విటమిన్–ఎ: క్యారెట్లలో కన్నా 4 రెట్లు ఎక్కువ కాల్షియం: పాలలో కన్నా 4 రెట్లు ఎక్కువ పొటాషియం: అరటి పండ్లలో కన్నా 3 రెట్లు ఎక్కువ విటమిన్–ఇ: పాలకూరలో కన్నా 3 రెట్లు ఎక్కువ మాంసకృత్తులు: పెరుగులో కంటే 2 రెట్లు ఎక్కువ మునగాకును పప్పులో, సాంబారులో వేసి వండవచ్చు. మునగాకు వేపుడు చేయవచ్చు. మునగకాయలో కంటే ఆకుల్లో పోషకాలు ఎక్కువ మునగ పొడి చేసేదెలా? ► తయారు చేయటం తేలిక – వాడటం తేలిక ► లేత మునగాకును కడిగి, నీడలో ఆరబెట్టాలి ► గలగలలాడేలా ఆరిన మునగాకును పొడి చెయ్యాలి ► పొయ్యి మీద నుంచి దించిన తరువాత కూరలు, చారు వంటి వాటిల్లో వేయచ్చు. మునగలో ఉపయోగపడని భాగం లేదు ఆకులు – కూర, పోషకాల గని గింజ – మందు, నూనె, నీటి శుద్ధి కాయ – కూర పువ్వు – మందు, చట్నీ బెరడు – మందు బంక – మందు వేరు – మందు పెరటిలో మునగ చెట్టు ఉండగ – విటమిన్లు, టానిక్కులు కొనటం దండగ. మునగ చెట్లు పెంచుదాం – మునగాకు వాడకం పెంచుదాం. వివరాలకు.. కేరింగ్ సిటిజెన్స్ కలెక్టివ్(040–27610963) ఫొటోలు: ఇసుకపట్ల దేవేంద్ర, సాక్షి ఫొటో జర్నలిస్టు -
విదేశీ వనితలా.. మజాకా !
సాక్షి, తిరువళ్లూరు: మనం గొప్ప పనులు చేయలేకపోచ్చు.. కానీ చేసే పనులను మనసు పెట్టి చేస్తే అదే మనిషి ఔన్నత్యానికి కొలబద్దతగా మారుతుందన్న మదర్‌థెరిస్సా మాటలు వారిలో స్ఫూర్తి నింపాయి. ఇదే స్ఫూర్తితో కెనడాకు చెందిన క్లోవీఎలిజబెత్, స్కాట్లాండ్కు చెందిన హన్నారోస్ తిరువళ్లూరు సమీపం, సేవాలయ ఆశ్రమంలోని అనాథలకు సేవ, విద్యార్థులకు ఆంగ్లం బోధిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు ఎలిజబెత్, హన్నారోస్. ఈ సందర్భంగా వారిని పలుకరించిన సాక్షికి తెలిపిన వివరాలు వారి మాటల్లోనే.. సామాజిక సేవపై ఆసక్తి చిన్నప్పటి నుంచి సామాజిక సేవ చేయాలన్న ఆసక్తి ఉండేది. దీంతో భారతదేశానికి వెళ్లి ఏదైనా ఆశ్రమంలో సేవచేస్తూ.. సేంద్రియ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది ఎలిజబెత్. ఇంగ్లాండ్‌కు చెందిన క్లోవీఎలిజబెత్ తండ్రి జాన్ పర్యావరణ పరిరక్షణ అధికారి. తల్లి సారా ప్లేస్కూల్, స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నారు. ‘2016లో వ్యవసాయ సాగు– ఆహార పదార్థాల్లో విషతుల్యం అనే అంశంపై ప్రాజెక్టు చేయడానికి స్కాట్లాడ్కు వెళ్లా. అక్కడే నెదర్లాండ్‌కు చెందిన హన్నారోస్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి ఆసక్తి సేవచేయడమే కావడంతో ఇంటర్ పూర్తిచేశాక భారత్‌కు వెళ్లాలనుకున్నాం. అక్కడ ఏదైనా ఓ ఆశ్రమంలో సేవ చేస్తూనే సేంద్రియ వ్యవసాయం చేయాలని నిర్ణయించాం’ అని వివరించారు ఎలిజబెత్. తల్లిదండ్రులను ఒప్పించి మాకు అనువైన చెన్నై సమీపం, కసువ వద్ద ఉన్న సేవాలయ ఆశ్రమాన్ని ఎంచుకున్నామని హన్నారోస్, ఎలిజబెతు లు వివరించారు. ఉదయం వ్యవసాయం – సాయంత్రం సంప్రదాయం నవంబర్‌లో సేవాలయకు వచ్చాం. మాకు ఉన్న ఏడాది సమయంలో వ్యవసాయం, సనాతన భారతీయ సంప్రదాయాలను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం వ్యవసాయ పనులు, తొమ్మిదింటికి అవ్వతాతల బాగోగులు చూసుకోవడం, తరువాత మధ్యాహ్నం మూడు గంటల వరకు చిన్నపిల్లలకు స్పోకెన్ ఇంగ్లిష్ చెప్పడం మా దినచర్య. పాఠశాల ముగియగానే మళ్లి అరకపట్టి దున్నడం, కలుపుతీయడం, కూరగాయలను కోసి ఆశ్రమానికి పంపించడం చేస్తాం, మిగతా సమయంలో సంప్రదాయ వంటకాలు, భరతనాట్యం, వస్త్రధారణ నేర్చుకుంటున్నాం. తమిళం మాట్లాడడం, రాయడం నేర్చుకుంటున్నామన్నారు హన్నారోస్. పాఠశాల ముగిసే సమయానికి పిల్లల కోసం తల్లిదండ్రులు గేటు వద్దే వేచి ఉండడం, పిల్లలు రాగానే వారిని ప్రేమగా ముద్దాడడం చూస్తే ప్రేమకు దూరమయ్యామనే బాధ కలుగుతుందన్నారు క్లోవీఎలిజబెత్, హన్నారోస్. సేంద్రియ సాగుపై ఆసక్తి ఎందుకంటే: 2016లో వ్యవసాయ సాగు పద్ధతులు – ఆహార పదార్థాల విషతుల్యం అనే అంశంపై ప్రత్యేక ప్రాజెక్టును రూపొదించడానికి స్కాట్లాండ్కు వెళ్లాం. అక్కడ వివిధ వర్గాల ప్రజలు, ప్రముఖ వైద్యుల అభిప్రాయాల మేరకు మనిషి తినే ఆహరంలో ఉన్న రసాయనాలే అనారోగ్యానికి కారణమనే విషయం మాకు స్పష్టంగా అర్థమైంది. ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలన్న ఉద్దేశంతో సేంద్రియ సాగుపై ఆసక్తి ప్రదర్శిస్తున్నామన్నారు ఎలిజబెత్, హన్నారోస్. ప్రస్తుతం సేవాలయలో కూరగాయలు, పప్పుదినుసులు, వరి తదితర ఆహార«ధాన్యాలను సాగు చేస్తున్నాం. మొదట కొంచెం భూమిని చదును చేసి విత్తనాలను చల్లిన సమయంలో వర్షాలు పడడంతో వృథాగా పోయింది. అయినా నిరాశ చెందలేదు. అక్కడున్న రైతుల సూచనలు స్వీకరించి కూరగాయలు సాగు చేసాం. ప్రస్తుతం పంట భాగానే పండింది. సేఫ్ డ్రస్సింగ్ భారతదేశంలో మహిళలు ధరించే వస్త్రాలు చాలా సేఫ్‌గా ఉంటాయి. కట్టుబొట్టు, బంగారు అలంకరణ బాగుంది. అందుకే భారతీయ సంప్రదాయం బాగా నచ్చిందని వివరించారు హన్నారోస్. ఎప్పుడూ పీజా బర్గర్ తినే మాకు ఆరటి ఆకు భోజనాలు ఇష్టం. మొదట తాము సేంద్రియ వ్యవసాయ సాగు, ఆశ్రమంలో సేవ చేయడం, స్పోకెన్ ఇంగ్లిష్ బోధించడానికే వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చాక నేర్చుకోవాల్సింది చాలా ఉందని వివరించారు ఎలిజబెత్. విదేశాల మోజులో వ్యవసాయానికి స్వస్తి పలుకుతున్న ఇప్పటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు క్లోవీ ఎలిజబెత్, హన్నారోస్. -
‘సూరజ్’ సాగు సూపర్!
కరువుకు కేరాఫ్‌గా మారిన మెట్ట/చల్కా నేలల్లో రైతులు ఇప్పుడు దేశీ పత్తి వంగడాలతో తెల్ల బంగారం పండిస్తున్నారు. మూడేళ్ల నుంచి ఎలాంటి రసాయనిక ఎరువులను ముట్టుకోకుండా సిరుల పంటను సాగు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో, తక్కువ పెట్టుబడితో లాభాలు ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలో రైతులు సూరజ్ రకం నాన్ బీటీ – దేశీ పత్తి సాగుతో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు. నిత్యం కరువుతో కాలం వెళ్లదీసే జనగామ ప్రాంత చల్కా/మెట్ట భూముల రైతులు సేంద్రియ పద్ధతుల్లో దేశీ పత్తిని సాగు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం(సి.ఎస్.ఎ.) మార్గదర్శకత్వంలో లింగాల ఘనపురం రైతులు మూడేళ్ల నుంచి సేంద్రియ పద్ధతుల్లో సూరజ్ అనే సూటిరకం నాన్‌బీటీ పత్తిని సాగు చేస్తున్నారు. ఆదర్శ సేంద్రియ రైతు కో ఆపరేటివ్, ఏనబావి సేంద్రియ సహకార సంఘం ఆధ్వర్యంలో.. మాణిక్యపురం, ఎనబావి, కళ్లెం, సిరిపురం, జీడికల్, వనపర్తి గ్రామాల్లోని 32 మంది రైతులు 62 ఎకరాల్లో వర్షాధారంగానే నాన్‌బీటీ పత్తిని సాగు చేస్తున్నారు. లింగాల ఘనపురం మండలం సిరిపురానికి చెందిన రైతు కుబర్ల గిరిబాబు డిగ్రీ వరకు చదువుకొని, పది ఎకరాల భూమిలో కొంతకాలం బీటీ పత్తి సాగు చేశారు. బీటీ పత్తి విత్తనాల వల్లనే బొంతపురుగు వంటి కొత్త కీటకాలు పంటను ఆశించి నష్టం చేస్తున్నాయనే భావనతో గిరిబాబు సి.ఎస్.ఎ. తోడ్పాటుతో పదేళ్ల క్రితం నుంచే సేంద్రియ సాగు చేపట్టారు. ఈ ఖరీఫ్‌లో మూడు ఎకరాల్లో నాన్‌బీటీ పత్తితోపాటు వరి, కంది పంటలను కూడా సాగు చేశారు. బీటీ పత్తి రైతులు రసాయనాల కోసమే అధికంగా ఖర్చు చేస్తూ అప్పులపాలవుతున్నారన్నారు. సేంద్రియ సాగులో ప్రాణాంతకమైన సమస్యలేమీ లేవన్నారు. తక్కువ పెట్టుబడితోనే పంటలు పండిస్తున్నామని, తమ పంటకు మార్కెట్లో గిరాకీ ఉందని గిరిబాబు(99126 88157) అన్నారు. సేంద్రియ సాగుతో లాభాలు ఇవీ... ► ఎలాంటి రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కలుపు మందుల అవసరం లేదు. ► సూరజ్ వంటి నాన్ బీటీ, దేశీ పత్తి విత్తనాల వల్ల భూసారం దెబ్బతినదు. ► ఈ పత్తి నుంచి విత్తనాలు తీసి, మళ్లీ వాడుకోవచ్చు. ప్రతి ఏటా కంపెనీల నుంచి విత్తనాలు కొనక్కర్లేదు. ► చెరువు మట్టి, జీవామృతం, వర్మీ కంపోస్టు, పశువుల పేడ ద్వారా భూమిని సారవంతం చేస్తారు. ► వేపద్రావణం, వావిలాకు కషాయం, పచ్చిమిర్చి, వెల్లుల్లి ద్రావణం పిచికారీ చేస్తారు. నాన్ బీటీ పత్తి విత్తనాలతో రైతులకు మేలు.. ► బీటీ పత్తి విత్తనాల మాదిరిగా దేశీ పత్తి రకాల సాగులో రసాయనాల అవసరం ఉండదు. ► వర్షధారంగా ఎకరానికి 4–8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ► పత్తిని అమ్ముకోవడానికి దూరప్రాంతాలకు వెళ్లే అవసరం లేదు. దేశీ పత్తితో వస్త్రాలు నేసే సంస్థలే నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తాయి∙ ► ఎలాంటి కమీషన్లు ఉండవు. ► ప్రస్తుతం సీసీఐ క్వింటా పత్తికి రూ.4,000 చెల్లిస్తుంటే.. నాన్‌బీటీ పత్తికి రూ. 5,100 ధర పలుకుతున్నది. ప్రభుత్వం ప్రోత్సహించాలి! దేశీ పత్తి రకం సూరజ్ తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా తేలిక నేలల్లో సాగుకు అనుకూలమైనది. ఈ సంవత్సరం సహజాహారం ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో కొందరు రైతులతో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయించాం. చేనేత సంస్థలు మల్కా, అభిహార రైతుల నుంచి సూరజ్ దేశీ పత్తి(28–32 ఎం.ఎం. పింజ)ను అధిక ధరకు కొనుగోలు చేశాయి. సూరజ్ సూటి రకం కావడంతో విత్తనాలను తిరిగి వాడుకోవచ్చు. దీని సాగును ప్రభుత్వం ప్రోత్సహించాలి. తద్వారా మన చేనేత కార్మికులకు సేంద్రియ పత్తి స్థానికంగానే అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం 150 క్వింటాళ్ల వరకు సూరజ్ విత్తనాలు ఉన్నాయి. ఆసక్తిగల రైతులు సహజ ఆహారం ప్రొడ్యూసర్ కంపెనీ(85007 83300)ని గానీ, కిసాన్ కాల్ సెంటర్ (85009 83300)ను గానీ సంప్రదించవచ్చు. – డా. జీవీ రామాంజనేయులు, డైరెక్టర్ జనరల్, సుస్థిర వ్యవసాయ కేంద్రం ramoo@csa-india.org చేతి కష్టమే పెట్టుబడి! రెండు ఎకరాల్లో నాన్‌బీటీ పత్తిని సాగు చేస్తున్నా. మూడు సంవత్సరాల నుంచి ఇదే సాగు. వర్షం పడితేనే నీళ్లు. బోరు, బావి లేవు. డిసెంబర్ నాటికే పంట పూర్తిగా అయిపోతుంది. డిసెంబర్లో వర్షం పడితే మరో రెండు నెలలు పంట వస్తుంది. చేతుల కష్టమే పెట్టుబడి. ఇప్పటికైతే నష్టపోలేదు. డబ్బుల దగ్గర , ధర విషయంలో ఎలాంటి కిరికిరి లేదు. – మూటకోరు యాదగిరి (70324 64439), సేంద్రియ పత్తి రైతు, సిరిపురం, జనగామ జిల్లా మందులు కొనడం మానేశా! నాకు ఎకరం 20 సెంట్ల భూమి ఉంది. మూడేళ్ల నుంచి నాన్‌బీటీ పత్తిని వేస్తున్నా. విత్తనాల నుంచి మొదలుకొని ఎరువులు, కషాయాలు అన్నీ నావే. ఎకరానికి రూ.8 వేల వరకు పెట్టుబడి అవుతుంది. పత్తిని అమ్మితే మాత్రం రూ. 20 వేల వరకు వస్తున్నాయి. పురుగుల మందులు కొనడం పూర్తిగా మానేశాం. రవాణా ఖర్చులు, కటింగ్‌లు, కమీషన్లు లేవు. శరీరంపై ప్రభావం చూపే మందుల వాడకం లేదు. నీటి సౌలతి ఉంటే ఎక్కువ దిగుబడి వచ్చేది. నాన్బీటీతో లాభాలే తప్ప నష్టాలు లేవు. – చెన్నూరి ఉప్పలయ్య (95025 06186), సేంద్రియ నాన్‌బీటీ పత్తి రైతు, సిరిపురం, జనగామ జిల్లా – ఇల్లందుల వెంకటేశ్వర్లు, సాక్షి, జనగామ జిల్లా ఫొటోలు: గోవర్ధనం వేణుగోపాల్