కరీంనగర్ జిల్లా వేములవాడలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఉపాధ్యాయుల సాంబశివుడు వృత్తి రీత్యా రైల్వే ఉద్యోగి. ఉద్యోగ రీత్యా రైల్వే అనుబంధ సంస్థ రైల్‌టెల్ కార్పొరేషన్‌లో హ్యూమన్ రిసోర్సెస్ సీనియర్ మేనేజర్. హైదరాబాద్‌లో కాప్రా డివిజన్ పద్మారావునగర్ హైటెక్ కాలనీలో సొంత ఇల్లు నిర్మించుకున్నారు. ఇంటి టెర్రస్‌పై సేంద్రియ ఎరువులతో పండించుకున్న కూరగాయలు తింటూ ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉంటున్నారు.
నలుగురు సభ్యులున్న చిన్న కుటుంబం వారిది. సుమారు 300 గజాల ఇంటి మిద్దెపై ఉన్న స్థలంలో గ్రోబాగ్స్, కుండీలలో సుమారు 20 రకాల కూరగాయలు పండిస్తున్నారు. వంటింటి నుంచి వచ్చే వ్యర్థాలు, రాలిన ఆకులతో తయారు చేసుకున్న వర్మీ కంపోస్ట్‌ను, ద్రవ రూప ఎరువు వర్మీ వాష్‌ను వాడుతూ పోషకాల లోపం, చీడపీడల బెడద లేకుండా ఇంటి పంటలను సాగు చేస్తున్నారు. ప్రతి 3 నెలలకు ఓ సారి పంటను మార్చుతూ, కాలాలకు అనుగుణమైన కూరగాయ మొక్కలు పెంచుతున్నారు.
మిరప, కీర, సొర, చిక్కుడు, టమాట, క్యాబేజీ, వంగ, బెండ, ముల్లంగి వంటి కూరగాయలు పండిస్తున్నారు. కూరగాయల మొక్కలతో పాటు ఔషధ మొక్కలు పునర్నవ, నాగదాలి వంటి ఔషధ మొక్కలు కూడా పెంచుకుంటూ కాఫీ, టీకి బదులు కషాయాల తయారీ కోసం వినియోగిస్తున్నారు. ఇంటిపంటలకు సబ్సిడీ కిట్ల ద్వారా తెలంగాణ ఉద్యాన శాఖ అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమంటున్నారు సాంబశివుడు. అధికారులు వచ్చి సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు. సేంద్రియ ఇంటి పంటలు తింటూ తమ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉన్నామని సాంబశివుడు సంతృప్తిగా చెప్పారు.
ఇంటిపంట సాగులో గృహిణుల సహాయం ఎంతో ముఖ్యమైనదని ఆయన అన్నారు. తన పిల్లలు, భార్య తోడ్పాటుతోనే తమ ఇంటిపైన పంటల సాగు విజయవంతంగా కొనసాగుతున్నదన్నారు. ‘ఇంటిపంటలు పెంచడం అందరికీ ఇష్టమే, కానీ కష్టమైన పని అనుకుంటారు. ఇష్టపడి చేస్తే చాలా సులువు, మనకు కావాల్సిన ఆహారం మన ఇంట్లోనే సమకూర్చుకోవటం చాలా మేలైన పని’ అంటారు సాంబశివుడు(97013 46949). తాము తినగా మిగిలిన కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఇరుగుపొరుగువారికి పంచుతుండటం ప్రశంసనీయం. ఇంటిపంటల సాగులో ఇతరులను ప్రోత్సహించడం కోసం వాట్సప్ గ్రూప్‌ను ఆయన నిర్వహిస్తుండటం విశేషం.
– పలుగుల పవన్, సాక్షి, కాప్రా, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment