సేంద్రియ సాగుకు సాంకేతికత
- వ్యవసాయ శాఖ కమిషనర్ ధనుంజయరెడ్డి
- ఎన్‌జీ రంగా వర్సిటీ పరిశోధన, విస్తరణ మండలి సమావేశం
నంద్యాలరూరల్: సాంకేతిక పరిజ్ఞానంతో సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు, పాలక మండలి సభ్యులు కృషి చేయాలని ఆచార్య ఎంజీ రంగా వర్సిటీ డైరెక్టర్, వ్యవసాయశాఖ రాష్ట్ర కమిషనర్ ధనుంజయరెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ వైఎస్సార్ సెంటనరీ హాల్‌లో ఆదివారం ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ 46వ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరయ్యారు. వ్యవసాయ, వాటి అనుబంధ పంటలు, పశుసంవర్ధక, మత్స్య, అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే 13 ఏరువాక, 12 కృషి విజ్ఞాన, 5 ప్రాంతీయ పరిశోధన విభాగాలున్నాయని చెప్పిన ఆయన సాంకేతిక పరిజ్ఞాన పరిశీలన క్షేత్రాలు ఇంకా విస్తరించి నూతన వంగడాలను ఉత్పత్తి చేయాలన్నారు. కార్పొరేట్ సంస్థలకు «ధీటుగా పరిశోధన స్థానాల్లో నూతన వంగడాలను ఉత్పత్తి చేసి అంతర్జాతీయ స్థాయికి తీసుకొని రావాలన్నారు. అందుకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పరిశోధన, విస్తరణ సంచాలకులు డాక్టర్ ఎన్‌వీ నాయుడు, డాక్టర్ రాజారెడ్డి యూనివర్సిటీ పరి«ధిలో 2015-16లో చేపట్టిన అంశాలను సలహా మండలి సమావేశంలో వివరించారు. 2016-17లో పరిశోధనలు, విస్తరణలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన కార్యక్రమాలను ఈ సమావేశాల్లో నిర్ణయిస్తామన్నారు. సమావేశంలో పాలక మండలి సభ్యులు మేకల లక్ష్మినారాయణ, డాక్టర్ దామోదర్‌నాయుడు, మురళీధర్‌రెడ్డి, మీసాల గీత, భూదేవి, నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ గోపాల్‌రెడ్డి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, కృషి విజ్ఞాన కేంద్రాల పర్యవేక్షకులు పాల్గొన్నారు.